YouVersion Logo
Search Icon

నిర్గమకాండము 18

18
1దేవుడు మోషేకును తన ప్రజలైన ఇశ్రాయేలీయులకును చేసినదంతయు, యెహోవా ఇశ్రాయేలీయులను ఐగుప్తునుండి వెలుపలికి రప్పించిన సంగతియు, మిద్యాను యాజకుడును మోషేమామయునైన యిత్రో వినినప్పుడు 2మోషే మామయైన ఆ యిత్రో తనయొద్దకు పంపబడిన మోషే భార్యయైన సిప్పోరాను ఆమె యిద్దరి కుమారులను తోడుకొని వచ్చెను. 3అతడు–అన్యదేశములో నేను పర దేశిననుకొని వారిలో ఒకనికి గేర్షోము అని పేరుపెట్టెను. 4–నా తండ్రి దేవుడు నాకు సహాయమై ఫరో కత్తివాతనుండి నన్ను తప్పించెననుకొని రెండవవానికి ఎలీయెజెరని#18:4 దేవసహాయము. పేరు పెట్టెను. 5మోషే మామయైన యిత్రో అతని కుమారులనిద్దరిని అతని భార్యను తోడుకొని అరణ్యములో దేవుని పర్వతము దగ్గర దిగిన మోషేయొద్దకు వచ్చెను. 6–యిత్రో అను నీ మామనైన నేనును నీ భార్యయు ఆమెతోకూడ ఆమె యిద్దరు కుమారులును నీయొద్దకు వచ్చియున్నామని మోషేకు వర్తమానము పంపగా 7మోషే తన మామను ఎదుర్కొనపోయి వందనము చేసి అతని ముద్దుపెట్టుకొనెను. వారు ఒకరి క్షేమము ఒకరు తెలిసికొని గుడారములోనికి వచ్చిరి. 8తరువాత మోషే యెహోవా ఇశ్రాయేలీయులకొరకు ఫరోకును ఐగుప్తీయులకును చేసిన దంతయు, త్రోవలో తమకు వచ్చిన కష్టము యావత్తును, యెహోవా తమ్మును విడిపించిన సంగతియు తన మామతో వివరించి చెప్పెను. 9యెహోవా ఐగుప్తీయుల చేతిలోనుండి విడిపించి ఇశ్రాయేలీయులకు చేసిన మేలంతటిని గూర్చి యిత్రో సంతోషించెను. 10మరియు యిత్రో– ఐగుప్తీయుల చేతిలోనుండియు ఫరో చేతిలోనుండియు మిమ్మును విడిపించి, ఐగుప్తీయుల చేతిక్రిందనుండి ఈ ప్రజలను విడిపించిన యెహోవా స్తుతింపబడునుగాక. 11ఐగుప్తీయులు గర్వించి ఇశ్రాయేలీయులమీద చేసిన దౌర్జన్యమునుబట్టి ఆయన చేసినదాని చూచి, యెహోవా సమస్త దేవతలకంటె గొప్పవాడని యిప్పుడు నాకు తెలిసిన దనెను. 12మరియు మోషే మామయైన యిత్రో ఒక దహనబలిని బలులను దేవునికర్పింపగా అహరోనును ఇశ్రాయేలీయుల పెద్దలందరును మోషే మామతో దేవుని సన్నిధిని భోజనము చేయవచ్చిరి. 13మరునాడు మోషే ప్రజలకు న్యాయము తీర్చుటకు కూర్చుండగా, ఉదయము మొదలుకొని సాయంకాలమువరకు ప్రజలు మోషేయొద్ద నిలిచియుండిరి. 14మోషే ప్రజలకు చేసినదంతయు అతని మామ చూచి–నీవు ఈ ప్రజలకు చేయుచున్న యీ పని ఏమిటి? ఉదయము మొదలుకొని సాయంకాలమువరకు నీవు మాత్రము కూర్చుండగా ప్రజలందరు నీయొద్ద నిలిచి యుండనేల అని అడుగగా 15మోషే–దేవుని తీర్పు తెలిసి కొనుటకు ప్రజలు నా యొద్దకు వచ్చెదరు. 16వారికి వ్యాజ్యెము ఏదైనను కలిగినయెడల నా యొద్దకు వచ్చెదరు. నేను వారి విషయము న్యాయము తీర్చి, దేవుని కట్టడలను ఆయన ధర్మశాస్త్రవిధులను వారికి తెలుపుచున్నానని తన మామతో చెప్పెను. 17అందుకు మోషే మామ అతనితో నీవు చేయుచున్న పని మంచిది కాదు; 18నీవును నీతో నున్న యీ ప్రజలును నిశ్చయముగా నలిగిపోవుదురు; ఈ పని నీకు మిక్కిలి భారము, అది నీవు ఒక్కడవే చేయచాలవు. 19కాబట్టి నా మాట వినుము. నేను నీకొక ఆలోచన చెప్పెదను. దేవుడు నీకు తోడై యుండును, ప్రజల పక్షమున నీవు దేవుని సముఖమందు ఉండి వారి వ్యాజ్యెములను దేవుని యొద్దకు తేవలెను. 20నీవు వారికి ఆయన కట్టడలను ధర్మశాస్త్రవిధులను బోధించి, వారు నడవవలసిన త్రోవను వారు చేయవలసిన కార్యములను వారికి తెలుపవలెను. 21మరియు నీవు ప్రజలందరిలో సామర్థ్యము దైవభక్తి సత్యాసక్తి కలిగి, లంచగొండులుకాని మనుష్యులను ఏర్పరచుకొని, వేయిమందికి ఒకనిగాను, నూరుమందికి ఒకనిగాను, ఏబదిమందికి ఒకనిగాను, పదిమందికి ఒకనిగాను, వారిమీద న్యాయాధిపతులను నియమింపవలెను. 22వారు ఎల్లప్పుడును ప్రజలకు న్యాయము తీర్చవలెను. అయితే గొప్ప వ్యాజ్యెములన్నిటిని నీయొద్దకు తేవలెను. ప్రతి అల్పవిషయమును వారే తీర్చవచ్చును. అట్లువారు నీతోకూడ ఈ భారమును మోసినయెడల నీకు సుళువుగా ఉండును. 23దేవుడు ఈలాగు చేయుటకు నీకు సెలవిచ్చినయెడల నీవు ఈ పని చేయుచు దాని భారమును సహింపగలవు. మరియు ఈ ప్రజలందరు తమతమ చోట్లకు సమాధానముగా వెళ్లుదురని చెప్పెను. 24మోషే తన మామమాట విని అతడు చెప్పినదంతయు చేసెను. 25ఇశ్రాయేలీయులందరిలో సామర్థ్యముగల మనుష్యులను ఏర్పరచుకొని, వెయ్యిమందికి ఒకనిగాను, నూరు మందికి ఒకనిగాను, ఏబదిమందికి ఒకనిగాను, పదిమందికి ఒకనిగాను, న్యాయాధిపతులను ఏర్పాటు చేసి వారిని ప్రజలమీద ప్రధానులనుగా నియమించెను. 26వారెల్ల ప్పుడును ప్రజలకు న్యాయము తీర్చువారు. వారు కఠిన వ్యాజ్యెములను మోషేయొద్దకు తెచ్చుచు, స్వల్పవ్యాజ్యెములను తామే తీర్చుచువచ్చిరి. 27తరువాత మోషే తన మామను పంపివేయగా అతడు తన స్వదేశమునకు వెళ్లెను.

Highlight

Share

Copy

None

Want to have your highlights saved across all your devices? Sign up or sign in