YouVersion Logo
Search Icon

ద్వితీయోపదేశకాండము 10

10
1ఆ కాలమందు యెహోవా–మునుపటి వాటి వంటి రెండు రాతిపలకలను నీవు చెక్కుకొని కొండ యెక్కి నా యొద్దకు రమ్ము. మరియు నీవు ఒక కఱ్ఱమందసమును చేసికొనవలెను. 2నీవు పగులగొట్టిన మొదటి పలకలమీదనున్న మాటలను నేను ఈ పలకలమీద వ్రాసిన తరువాత నీవు ఆ మందసములో వాటిని ఉంచవలెనని నాతో చెప్పెను. 3కాబట్టి నేను తుమ్మకఱ్ఱతో ఒక మందసమును చేయించిమునుపటివాటివంటి రెండు రాతి పలకలను చెక్కి ఆ రెండు పలకలను చేతపట్టుకొని కొండ యెక్కితిని. 4ఆ సమాజదినమున ఆ కొండమీద అగ్ని మధ్యనుండి తాను మీతో పలికిన పది ఆజ్ఞలనుమునుపు వ్రాసినట్టు యెహోవా ఆ పలకలమీద వ్రాసెను. యెహోవా వాటిని నాకిచ్చిన తరువాత నేను తిరిగి కొండ దిగివచ్చి 5నేను చేసిన మందసములో ఆ పలకలను ఉంచితిని. యెహోవా నాకాజ్ఞాపించినట్లు వాటిని దానిలో నుంచితిని. 6ఇశ్రాయేలీయులు యహకానీయులదైన బెయేరోతునుండి బయలుదేరి మోసేరుకు వచ్చినప్పుడు అక్కడ అహరోను చనిపోయి పాతిపెట్టబడెను. అతని కుమారుడైన ఎలియాజరు అతనికి ప్రతిగా యాజకు డాయెను. 7అక్కడనుండి వారు గుద్గోదకును గుద్గోద నుండి నీటివాగులుగల దేశమైన యొత్బాతాకును ప్రయాణము చేసిరి. 8నేటివరకు జరుగునట్లు యెహోవా నిబంధనమందసమును మోయుటకు, యెహోవా సన్నిధిని నిలు చుటకును, ఆయనను సేవించి ఆయన నామమునుబట్టి దీవించుటకును, లేవి గోత్రపువారిని ఆ కాలమున యెహోవా ఏర్పరచుకొనెను. 9కాబట్టి తమ సహోదరులతోపాటు లేవీయులు స్వాస్థ్యమునైనను పొందలేదు. నీ దేవుడైన యెహోవావారితో చెప్పినట్లు యెహోవాయే వారికి స్వాస్థ్యము. 10నేనుమునుపటివలె నలువది పగళ్లును నలువది రాత్రులును కొండమీద ఉండగా యెహోవా ఆ కాలమున నా మనవి ఆలకించి నిన్ను నశింప జేయుట మానివేసెను. 11మరియు యెహోవా నాతో ఇట్లనెను–ఈ ప్రజలు నేను వారికిచ్చెదనని వారి పితరులతో ప్రమాణము చేసిన దేశమున ప్రవేశించి స్వాధీన పరచుకొనునట్లు నీవు లేచి వారి ముందర సాగుమని చెప్పెను.
12కాబట్టి ఇశ్రాయేలూ, నీ దేవుడైన యెహోవాకు భయపడి ఆయన మార్గములన్నిటిలో నడుచుచు, ఆయనను ప్రేమించి, నీ దేవుడైన యెహోవాను నీ పూర్ణ మనస్సుతోను నీ పూర్ణాత్మతోను సేవించి, 13నీ మేలుకొరకు నేడు నేను నీకాజ్ఞాపించు యెహోవా ఆజ్ఞలను కట్టడలను అనుసరించి నడుచుకొందునను మాట కాక నీ దేవుడైన యెహోవా నిన్ను మరి ఏమి అడుగుచున్నాడు? 14చూడుము; ఆకాశము, మహాకాశము, భూమియు, అందున్నదంతయు నీ దేవుడైన యెహోవావే. 15అయితే యెహోవా నీ పితరులను ప్రేమించి వారియందు ఆనందపడి సమస్త జనములలో వారి సంతానమైన మిమ్మును నేటి వలె ఏర్పరచుకొనెను. 16కాబట్టి మీరు సున్నతిలేని మీ హృదయమునకు సున్నతి చేసికొని యికమీదట ముష్క రులుకాకుండుడి 17ఏలయనగా నీ దేవుడైన యెహోవా పరమదేవుడును పరమప్రభువునై యున్నాడు. ఆయనే మహాదేవుడు పరాక్రమవంతుడు భయంకరుడైన దేవుడు. ఆయన నరులముఖమును లక్ష్యపెట్టనివాడు, లంచము పుచ్చుకొననివాడు. 18ఆయన తలిదండ్రులు లేనివానికిని విధవరాలికిని న్యాయము తీర్చి, పరదేశియందు దయయుంచి అన్నవస్త్రముల ననుగ్రహించువాడు. 19మీరు ఐగుప్తు దేశములో పరదేశులై యుంటిరి గనుక పరదేశిని జాలి తలచుడి. 20నీ దేవుడైన యెహోవాకు భయపడి ఆయనను సేవించి ఆయనను హత్తుకొని ఆయన నామమున ప్రమాణము చేయవలెను. 21ఆయనే నీకు కీర్తనీయుడు. నీవు కన్నులార చూచుచుండగా భీకరమైన ఆ గొప్ప కార్యములను నీ కొరకు చేసిన నీ దేవుడు ఆయనే. 22నీ పితరులు డెబ్బదిమందియై ఐగుప్తునకు వెళ్లిరి. ఇప్పుడు నీ దేవుడైన యెహోవా ఆకాశనక్షత్రములవలె నిన్ను విస్తరింపజేసి యున్నాడు.

Highlight

Share

Copy

None

Want to have your highlights saved across all your devices? Sign up or sign in

Videos for ద్వితీయోపదేశకాండము 10