YouVersion Logo
Search Icon

ద్వితీయోపదేశకాండము 11

11
1కాబట్టి నీవు నీ దేవుడైన యెహోవాను ప్రేమించి ఆయన విధించినవాటిని అనుసరించి ఆయన కట్టడలను విధులను ఆజ్ఞలను ఎల్లప్పుడు గైకొనవలెను. 2నీ దేవుడైన యెహోవా చేసిన శిక్షను ఆయన మిహమను ఆయన బాహుబలమును ఆయన చాపిన చేతిని 3ఐగుప్తులో ఐగుప్తు రాజైన ఫరోకును అతని సమస్త దేశమునకును ఆయనచేసిన సూచక క్రియలను కార్యములను 4ఆయన ఐగుప్తుదండు నకును దాని గుఱ్ఱములకును రథములకును చేసిన దానిని, వారు మిమ్మును తరుముచుండగా ఆయన ఎఱ్ఱసముద్రజలమును వారిమీద ప్రవహింపజేసిన దానిని 5యెహోవా నేటివరకు వారిని నశింపజేసినరీతిని, మీరు ఈ స్థలమునకు వచ్చువరకు ఎడారిలో మీకొరకు చేసిన దానిని 6రూబేనీయుడైన ఏలీయాబు కుమారులైన దాతాను అబీరాములకు చేసిన పనిని, భూమి నోరు తెరచి వారిని వారి ఇండ్లను గుడారములను వారియొద్దనున్న సమస్త జీవరాసులను ఇశ్రాయేలీయులందరిమధ్యను మ్రింగివేసిన రీతిని, చూడకయు ఎరుగకయునున్న మీ కుమారులతో నేను మాటలాడుట లేదని నేడు తెలిసికొనుడి. 7యెహోవా చేసిన ఆ గొప్ప కార్యమంతయు మీ కన్నులే చూచినవి గదా. 8మీరు బలముగలిగి స్వాధీనపరచుకొనుటకై నది దాటి వెళ్లుచున్న ఆ దేశమందు ప్రవేశించి దాని స్వాధీన పరచుకొనునట్లును 9యెహోవావారికిని వారి సంతానమునకును దయచేసెదనని మీపితరులతో ప్రమాణము చేసిన దేశమున, అనగా పాలు తేనెలు ప్రవహించు దేశమున మీరు దీర్ఘాయుష్మంతులగునట్లును నేను ఈ దినమున మీకాజ్ఞాపించు ఆజ్ఞలనన్నిటిని మీరు గైకొనవలెను. 10మీరు స్వాధీనపరచుకొనబోవు దేశము మీరు బయలుదేరి వచ్చిన ఐగుప్తుదేశము వంటిది కాదు. అక్కడ నీవు విత్తనములు విత్తి కూరతోటకు నీరు కట్టినట్లు నీ కాళ్లతో నీ చేలకు నీరు కట్టితివి. 11మీరు నది దాటి స్వాధీన పరచుకొనుటకు వెళ్లుచున్న దేశము కొండలు లోయలు గల దేశము. 12అది ఆకాశవర్షజలము త్రాగును. అది నీ దేవుడైన యెహోవా లక్ష్యపెట్టు దేశము. నీ దేవుడైన యెహోవా కన్నులు సంవత్సరాది మొదలుకొని సంవత్సరాంతమువరకు ఎల్లప్పుడు దానిమీద ఉండును.
13కాబట్టి మీ పూర్ణహృదయముతోను మీ పూర్ణాత్మతోను మీ దేవుడైన యెహోవాను ప్రేమించి ఆయనను సేవింపవలెనని నేడు నేను మీకిచ్చు ఆజ్ఞలను మీరు జాగ్రత్తగా వినినయెడల 14మీ దేశమునకు వర్షము, అనగా తొలకరివానను కడవరివానను దాని దాని కాలమున కురి పించెదను. అందువలన నీవు నీ ధాన్యమును నీ ద్రాక్షారసమును నీ నూనెను కూర్చుకొందువు. 15మరియు నీవుతిని తృప్తిపొందునట్లు నీ పశువులకొరకు నీ చేలయందు గడ్డి మొలిపించెదను. 16మీ హృదయము మాయలలో చిక్కి త్రోవవిడిచి యితర దేవతలను పూజించి వాటికి నమస్కరింపకుండ మీరు జాగ్రత్త పడుడి. 17లేనియెడల యెహోవా మీమీద కోపపడి ఆకాశమును మూసివేయును; అప్పుడు వాన కురియదు, భూమిపండదు, యెహోవా మీకిచ్చుచున్న ఆ మంచి దేశమున ఉండకుండ మీరు శీఘ్రముగా నశించెదరు. 18కాబట్టి మీరు ఈ నామాటలను మీ హృదయములోను మీ మనస్సులోను ఉంచుకొని వాటిని మీ చేతులమీద సూచనలుగా కట్టుకొనవలెను. అవి మీ కన్నులనడుమ బాసికములుగా ఉండవలెను. 19నీవు నీ యింట కూర్చుండునప్పుడు త్రోవను నడుచునప్పుడు పండుకొనునప్పుడు లేచునప్పుడు వాటిని గూర్చి మాటలాడుచు వాటిని మీ పిల్లలకు నేర్పి 20నీ యింటి ద్వారబంధములమీదను నీ గవునులమీదను వాటిని వ్రాయవలెను. 21ఆలాగు చేసినయెడల యెహోవా మీపితరులకిచ్చెదనని ప్రమాణము చేసిన దేశమున మీ దినములును మీ సంతతివారి దినములును భూమికి పైగా ఆకాశము నిలుచునంతకాలము విస్తరించును. 22మీరు మీ దేవుడైన యెహోవాను ప్రేమించి, ఆయన మార్గములన్నిటిలోను నడుచుచు, ఆయనను హత్తుకొని, మీరు చేయవలెనని నేను మీకాజ్ఞాపించు ఈ ఆజ్ఞలన్నిటిని అనుసరించి జాగ్రత్తగా నడుచు కొనవలెను. 23అప్పుడు యెహోవా మీ యెదుటనుండి ఈ సమస్త జనములను వెళ్లగొట్టును; మీరు మీకంటె బలిష్ఠు లైన గొప్ప జనముల దేశములను స్వాధీనపరచుకొందురు. 24మీరు అడుగుపెట్టు ప్రతి స్థలము మీది అగును; అరణ్యము మొదలుకొని లెబానోనువరకును యూఫ్రటీసునది#11:24 ఫరాతు. మొదలుకొని పడమటి సముద్రమువరకును మీ సరిహద్దు వ్యాపించును. 25ఏ మనుష్యుడును మీ యెదుట నిలువడు. తాను మీతో చెప్పినట్లు మీ దేవుడైన యెహోవా మీరు అడుగుపెట్టు దేశమంతటిమీద మీ బెదురు మీ భయము పుట్టించును. 26చూడుడి; నేడు నేను మీ యెదుట దీవెనను శాపమును పెట్టుచున్నాను. 27నేడు నేను మీకాజ్ఞాపించు మీ దేవుడైన యెహోవా ఆజ్ఞలను మీరు వినినయెడల దీవెనయు, మీరు మీ దేవుడైన యెహోవా ఆజ్ఞలను వినక 28నేడు నేను మీకాజ్ఞాపించు మార్గమును విడిచి మీరెరుగని యితర దేవతలను అనుసరించినయెడల శాపమును మీకు కలుగును.
29కాబట్టి నీవు స్వాధీనపరచుకొనబోవు దేశమున నీ దేవుడైన యెహోవా నిన్ను చేర్చిన తరువాత గెరిజీమను కొండమీద ఆ దీవెన వచనమును, ఏబాలుకొండమీద ఆ శాపవచనమును ప్రకటింపవలెను. 30అవి యొర్దాను అవతల సూర్యుడు అస్తమించు మార్గము వెనుక మోరేలోని సింధూరవృక్షములకు దాపున గిల్గాలునకు ఎదురుగానున్న అరాబాలో నివసించు కనానీయుల దేశమందున్నవి గదా. 31మీరు చేరి మీ దేవుడైన యెహోవా మీకిచ్చు చున్న దేశమును స్వాధీనపరచుకొనుటకు ఈ యొర్దానును దాటబోవుచున్నారు. మీరు దాని స్వాధీనపరచుకొని దానిలో నివసించెదరు. 32అప్పుడు నేడు నేను మీకు నియమించుచున్న కట్టడలన్నిటిని విధులన్నిటిని మీరు అనుసరించి గైకొనవలెను.

Highlight

Share

Copy

None

Want to have your highlights saved across all your devices? Sign up or sign in

Videos for ద్వితీయోపదేశకాండము 11