YouVersion Logo
Search Icon

అపొస్తలుల కార్యములు 27

27
1మేము ఓడయెక్కి ఇటలీ వెళ్లవలెనని నిర్ణయమై నప్పుడు, వారు పౌలును మరికొందరు ఖైదీలను ఔగుస్తు పటాలములో శతాధిపతియైన యూలి అను వానికి అప్పగించిరి. 2ఆసియ దరివెంబడినున్న పట్టణములకు ప్రయాణము చేయబోవు అద్రముత్తియ పట్టణపు ఓడనెక్కి మేము బయలుదేరితిమి; మాసిదోనీయుడును థెస్సలొనీక పట్టణస్థుడునైన అరిస్తార్కు మాతోకూడ ఉండెను. 3మరునాడు సీదోనుకు వచ్చితిమి. అప్పుడు యూలి పౌలు మీద దయగా ఉండి, అతడు తన స్నేహితులయొద్దకు వెళ్లి పరామరిక పొందుటకు అతనికి సెలవిచ్చెను. 4అక్కడనుండి బయలుదేరిన తరువాత ఎదురుగాలి కొట్టుచున్నందున కుప్రచాటున ఓడ నడిపించితిమి. 5మరియు కిలికియకును పంఫూలియకును ఎదురుగా ఉన్న సముద్రము దాటి లుకియలో ఉన్న మూరకు చేరితిమి. 6అక్కడ శతాధిపతి ఇటలీవెళ్లనైయున్న అలెక్సంద్రియ పట్టణపు ఓడ కనుగొని అందులో మమ్మును ఎక్కించెను. 7అనేక దినములు మెల్లగా నడచి, యెంతో కష్టపడి క్నీదుకు ఎదురుగా వచ్చినప్పుడు గాలి మమ్మును పోనియ్యకున్నందున క్రేతు చాటున సల్మోనే దరిని ఓడ నడిపించితిమి. 8బహు కష్టపడి దాని దాటి, మంచిరేవులు అను ఒక స్థలమునకు చేరితిమి. దానిదగ్గర లసైయ పట్టణముండెను.
9చాల కాలమైన తరువాత ఉపవాసదినము కూడ అప్పటికి గతించినందున ప్రయాణముచేయుట అపాయ కరమై యుండెను. 10అప్పుడు పౌలు–అయ్యలారా, యీ ప్రయాణమువలన సరకులకును ఓడకును మాత్రమే కాక మన ప్రాణములకు కూడ హానియు బహు నష్టమును కలుగునట్లు నాకు తోచుచున్నదని చెప్పి వారిని హెచ్చరించెను. 11అయినను శతాధిపతి పౌలు చెప్పినది నమ్మక నావికుడును ఓడ యజమానుడును చెప్పినదే నమ్మెను. 12మరియు శీతకాలము గడుపుటకు ఆ రేవు అనుకూలమైనది కానందున అక్కడనుండి బయలుదేరి యొకవేళ శక్యమైతే ఫీనిక్సునకుచేరి అక్కడ శీతకాలము గడపవలెనని యెక్కువ మంది ఆలోచన చెప్పిరి. అది నైరుతి వాయవ్యదిక్కులతట్టుననున్న క్రేతురేవై యున్నది. 13మరియు దక్షిణపు గాలి మెల్లగా విసరుచుండగా వారు తమ ఆలోచన సమ కూడినదని తలంచి లంగరెత్తి, క్రేతు దరిని ఓడ నడిపించిరి. 14కొంచెము సేపైన తరువాత ఊరకులోను అను పెనుగాలి క్రేతు మీదనుండి విసరెను. 15దానిలో ఓడ చిక్కుకొని గాలికి ఎదురు నడువలేక పోయినందున ఎదురు నడిపించుట మాని గాలికి కొట్టుకొనిపోతిమి. 16తరువాత కౌద అన బడిన యొక చిన్న ద్వీపము చాటున దాని నడిపింపగా పడవను భద్రపరచుకొనుట బహు కష్ట తరమాయెను. 17దానిని పైకెత్తి కట్టిన తరువాత త్రాళ్లు మొదలైనవి తీసి కొని ఓడచుట్టు బిగించి కట్టిరి. మరియు సూర్తిసను ఇసుకతిప్పమీద పడుదుమేమో అని భయపడి, ఓడ చాపలు దింపివేసి, కొట్టుకొనిపోయిరి. 18మిక్కిలి పెద్ద గాలి కొట్టుచున్నందున మరునాడు సరకులు పారవేయ సాగిరి. 19మూడవ దినమందు తమ చేతులార ఓడసామగ్రి పారవేసిరి. 20-21కొన్ని దినములు సూర్యుడైనను నక్షత్రములైనను కనబడక పెద్దగాలి మామీద కొట్టినందున ప్రాణములతో తప్పించు కొందుమను ఆశ బొత్తిగ పోయెను. వారు బహు కాలము భోజనము లేక యున్నందున పౌలు వారిమధ్యను నిలిచి–అయ్యలారా, మీరు నా మాట విని క్రేతునుండి బయలుదేరకయే యుండవలసినది. అప్పుడీ హానియు నష్టమును కలుగకపోవును. 22ఇప్పుడైనను ధైర్యము తెచ్చుకొనుడని మిమ్మును వేడుకొనుచున్నాను; ఓడకేగాని మీలో ఎవని ప్రాణమునకును హానికలుగదు. 23నేను ఎవనివాడనో, యెవనిని సేవించుచున్నానో, ఆ దేవుని దూత గడచిన రాత్రి నాయొద్ద నిలిచి–పౌలా, భయపడకుము; 24నీవు కైసరు ఎదుట నిలువవలసియున్నది; ఇదిగో నీతోకూడ ఓడలో ప్రయాణమై పోవుచున్న వారందరిని దేవుడు నీకు అనుగ్రహించియున్నాడని నాతో చెప్పెను. 25కాబట్టి అయ్యలారా, ధైర్యము తెచ్చుకొనుడి; నాతో దూత చెప్పిన ప్రకారము జరుగునని నేను దేవుని నమ్ముచున్నాను. 26అయినను మనము కొట్టుకొనిపోయి యేదైన ఒక ద్వీపముమీద పడవలసి యుండునని చెప్పెను.
27పదునాలుగవ రాత్రి వచ్చినప్పుడు మేము అద్రియ సముద్రములో ఇటు అటు కొట్టుకొనిపోవుచుండగా అర్ధరాత్రివేళ ఓడవారు ఏదో యొక దేశము దగ్గర పడు చున్నదని యూహించి 28బుడుదువేసి చూచి యిరువది బారల లోతని తెలిసికొనిరి. ఇంకను కొంతదూరము వెళ్లిన తరువాత, మరల బుడుదువేసి చూచి పదునైదు బారల లోతని తెలిసికొనిరి. 29అప్పుడు రాతి తిప్పలుగల చోట్ల పడుదుమేమో అని భయపడి, వారు ఓడ అమరములోనుండి నాలుగు లంగరులువేసి యెప్పుడు తెల్ల వారునా అని కాచుకొని యుండిరి. 30అయితే ఓడవారు ఓడ విడిచి పారిపోవలెనని చూచి, తాము అనివిలోనుండి లంగరులు వేయబోవునట్లుగా సముద్రములో పడవ దింపి వేసిరి. 31అందుకు పౌలు–వీరు ఓడలో ఉంటేనేగాని మీరు తప్పించుకొనలేరని శతాధిపతితోను సైనికులతోను చెప్పెను. 32వెంటనే సైనికులు పడవ త్రాళ్లు కోసి దాని కొట్టుకొని పోనిచ్చిరి. 33-34తెల్లవారుచుండగా పౌలు– పదునాలుగు దినములనుండి మీరేమియు పుచ్చుకొనక ఉపవాసముతో కనిపెట్టుకొని యున్నారు గనుక ఆహా రము పుచ్చుకొనుడని మిమ్మును వేడుకొనుచున్నాను; ఇది మీ ప్రాణరక్షణకు సహాయమగును. మీలో ఎవని తల నుండియు ఒక వెండ్రుకయైనను నశింపదని చెప్పుచు, ఆహారము పుచ్చుకొనుడని అందరిని బతిమాలెను. 35ఈ మాటలు చెప్పి, యొక రొట్టె పట్టుకొని అందరి యెదుట దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దాని విరిచి తిన సాగెను. 36అప్పుడందరు ధైర్యము తెచ్చుకొని ఆహారము పుచ్చుకొనిరి. 37ఓడలో ఉన్న మేమందరము రెండువందల డెబ్బది ఆరుగురము. 38వారు తిని తృప్తిపొందిన తరువాత, గోధుమలను సముద్రములో పారబోసి ఓడ తేలికచేసిరి. 39ఉదయమైనప్పుడు అది ఏ దేశమో వారు గుర్తుపట్టలేదు గాని, దరిగల యొక సముద్రపు పాయను చూచి, సాధ్యమైనయెడల అందులోనికి ఓడను త్రోయవలెనని ఆలో చించిరి 40గనుక లంగరుల త్రాళ్లుకోసి వాటిని సముద్రములో విడిచిపెట్టి చుక్కానుల కట్లు విప్పి ముందటి తెరచాప గాలికెత్తి సరిగా దరికి నడిపించిరి గాని 41రెండు ప్రవాహములు కలిసిన#27:41 మూలభాషలో–రెండు సముద్రములు కలిసిన. స్థలమందు చిక్కుకొని ఓడను మెట్ట పెట్టించిరి. అందువలన అనివి కూరుకొనిపోయి కదలక యుండెను, అమరము ఆ దెబ్బకు బద్దలై పోసాగెను. 42ఖైదీలలో ఎవడును ఈదుకొని పారిపోకుండునట్లు వారిని చంపవలెనని సైనికులకు ఆలోచన పుట్టెను గాని 43శతాధిపతి పౌలును రక్షింప నుద్దేశించి వారి ఆలోచన కొనసాగనియ్యక, మొదట ఈదగలవారు సముద్రములో దుమికి దరికి పోవలెననియు 44కడమ వారిలో కొందరు పలకలమీదను, కొందరు ఓడ చెక్కలమీదను, పోవలెననియు ఆజ్ఞాపించెను. ఈలాగు అందరు తప్పించుకొని దరిచేరిరి.

Highlight

Share

Copy

None

Want to have your highlights saved across all your devices? Sign up or sign in