2 సమూయేలు 7
7
1యెహోవా నలుదిక్కుల అతని శత్రువులమీద అతనికి విజయమిచ్చి అతనికి నెమ్మది కలుగజేసిన తరువాత రాజు తన నగరియందు కాపురముండి నాతానను ప్రవక్తను పిలువనంపి 2–నేను దేవదారుమ్రానుతో కట్టిన నగరియందు వాసము చేయుచుండగా దేవుని మందసము డేరాలో నిలిచియున్నదనగా 3నాతాను–యెహోవా నీకు తోడుగా నున్నాడు, నీకు తోచినదంతయు నెరవేర్చుమనెను. 4అయితే ఆ రాత్రి యెహోవా వాక్కు నాతానునకు ప్రత్యక్షమై సెలవిచ్చినదేమనగా 5–నీవు పోయి నా సేవకుడగు దావీదుతో ఇట్లనుము–యెహోవా నీకాజ్ఞ ఇచ్చునదేమనగా–నాకు నివాసముగా ఒక మందిరమును కట్టింతువా? 6ఐగుప్తులోనుండి నేను ఇశ్రాయేలీయులను రప్పించిన నాటనుండి నేటివరకు మందిరములో నివసింపక డేరాలోను గుడారములోను నివసించుచు సంచరించితిని. 7ఇశ్రాయేలీయులతోకూడ నేను సంచరించిన కాల మంతయు నా జనులను పోషించుడని నేను ఆజ్ఞాపించిన ఇశ్రాయేలీయుల గోత్రములలో ఎవరితోనైనను దేవదారుమయమైన మందిరమొకటి మీరు నాకు కట్టింపక పోతిరే అని నేనెన్నడైనను అనియుంటినా? 8కాబట్టి నీవు నా సేవకుడగు దావీదుతో ఈలాగు చెప్పుము–సైన్యములకధిపతియగు యెహోవా నీకు సెలవిచ్చునదేమనగా– గొఱ్ఱెల కాపులోనున్న నిన్ను గొఱ్ఱెలదొడ్డిలోనుండి తీసి ఇశ్రాయేలీయులను నా జనులమీద అధిపతిగా నియమించితిని. 9నీవు పోవు చోట్లనెల్లను నీకు తోడుగానుండి నీ శత్రువులనందరిని నీ యెదుట నిలువకుండ నిర్మూలముచేసి, లోకములోని ఘనులైన వారికి కలుగు పేరు నీకు కలుగజేసి యున్నాను. 10మరియు ఇశ్రాయేలీయులను నా జనులు ఇకను కదిలింపబడకుండ తమ స్వస్థలమందు నివసించునట్లు దానియందు వారిని నాటి, పూర్వము ఇశ్రాయేలీయులను నా జనులమీద నేను న్యాయాధిపతులను నియమించిన తరువాత జరుగుచు వచ్చినట్లు దుర్బుద్ధిగల జనులు ఇకను వారిని కష్టపట్టకయుండునట్లుగా చేసి 11నీ శత్రువులమీద నీకు జయమిచ్చి నీకు నెమ్మది కలుగజేసియున్నాను. మరియు యెహోవానగు నేను నీకు తెలియజేయు నదేమనగా–నేను నీకు సంతానము కలుగజేయుదును. 12నీ దినములు సంపూర్ణములగునప్పుడు నీవు నీ పితరులతోకూడ నిద్రించిన తరువాత నీ గర్భములోనుండి వచ్చిన నీ సంతతిని హెచ్చించి, రాజ్యమును అతనికి స్థిరపరచెదను. 13అతడు నా నామఘనతకొరకు ఒక మందిరమును కట్టించును; అతని రాజ్యసింహాసనమును నేను నిత్యముగా స్థిరపరచెదను; 14నేనతనికి తండ్రినై యుందును. అతడు నాకు కుమారుడైయుండును; అతడు పాపముచేసినయెడల నరులదండముతోను మనుష్యులకు తగులు దెబ్బలతోను అతని శిక్షింతునుగాని 15నిన్ను స్థాపించుటకై నేను కొట్టి వేసిన సౌలునకు నా కృప దూరమైనట్లు అతనికి నా కృప దూరము చేయను. 16నీ మట్టుకు నీ సంతానమును నీ రాజ్యమును నిత్యము స్థిరమగును, నీ సింహాసనము నిత్యము స్థిరపరచబడును అనెను. 17తనకు కలిగిన దర్శన మంతటినిబట్టి యీ మాటలన్నిటి చొప్పున నాతాను దావీదునకు వర్తమానము తెలియ జెప్పెను.
18దావీదు రాజు లోపల ప్రవేశించి యెహోవా సన్నిధిని కూర్చుండి ఈలాగున మనవి చేసెను–నా ప్రభువా యెహోవా, ఇంతగా నీవు నన్ను హెచ్చించుటకు నే నెంతటివాడను? నా కుటుంబము ఏ పాటిది? 19ఇంత హెచ్చుగా చేసినదంతయు నీ దృష్టికి కొంచెమై, మానవుల పద్ధతినిబట్టి, బహుకాలము జరిగిన తరువాత నీ దాసుడనైన నా సంతానమునకు కలుగబోవుదానిని గూర్చి నీవు సెలవిచ్చియున్నావు. యెహోవా నా ప్రభువా, దావీదు అను నేను ఇక నీతో ఏమి చెప్పుకొందును? 20యెహోవా నా ప్రభువా, నీ దాసుడనైన నన్ను నీవు ఎరిగియున్నావు. 21నీ వాక్కునుబట్టి నీ యిష్టానుసారముగా ఈ ఘనకార్యములను జరిగించి నీ దాసుడనగు నాకు దీని తెలియజేసితివి. 22కాబట్టి దేవా యెహోవా, నీవు అత్యంతమైన ఘనతగలవాడవు, నీవంటి దేవుడొకడును లేడు; మేము వినిన దానినంతటిని బట్టి చూడగా నీవు తప్ప దేవుడెవడును లేడు. 23నీకు జనులగుటకై వారిని నీవు విమోచించునట్లును, నీకు ఖ్యాతి కలుగునట్లును, నీ జనులనుబట్టి నీ దేశమునకు భీకరమైన మహాకార్యములను చేయునట్లును దేవుడవైన నీవు ఐగుప్తుదేశములోనుండియు, ఆ జనుల వశములోనుండియు, వారి దేవతల వశములోనుండియు నీవు విమోచించిన ఇశ్రాయేలీయులనునట్టి నీ జనులవంటి జనము లోకమునందు మరి ఎక్కడనున్నది. 24మరియు యెహోవావైన నీవు వారికి దేవుడవైయుండి, వారు నిత్యము నీకు ఇశ్రాయేలీయులను పేరుగల జనులై యుండునట్లుగా వారిని నిర్ధారణ చేసితివి. 25దేవా యెహోవా, నీ దాసుడనగునన్నుగూర్చియు నా కుటుంబమునుగూర్చియు నీవు సెలవిచ్చినమాట యెన్నటికి నిలుచునట్లు దృఢపరచి 26సైన్యములకధిపతియగు యెహోవా ఇశ్రాయేలీయులకు దేవుడై యున్నాడను మాటచేత నీ నామమునకు శాశ్వత మహిమ కలుగునట్లును, నీ దాసుడనైన నా కుటుంబము నీ సన్నిధిని స్థిరపరచబడునట్లును నీవు సెలవిచ్చినమాట నెరవేర్చుము. 27ఇశ్రాయేలీయుల దేవా సైన్యములకధిపతియగు యెహోవా–నీకు సంతానము కలుగజేయుదునని నీవు నీ దాసుడనైన నాకు తెలియపరచితివి గనుక ఈలాగున నీతో మనవి చేయుటకై నీ దాసుడనైన నాకు ధైర్యము కలిగెను. 28యెహోవా నా ప్రభువా, మేలు దయచేయుదునని నీవు నీ దాసుడనైన నాకు సెలవిచ్చుచున్నావే; నీవు దేవుడవు గనుక నీ మాట సత్యము. 29దయచేసి నీ దాసుడనైన నా కుటుంబము నిత్యము నీ సన్నిధిని ఉండునట్లుగా దానిని ఆశీర్వదించుము; యెహోవా నా ప్రభువా, నీవు సెలవిచ్చియున్నావు; నీ ఆశీర్వాదమునొంది నా కుటుంబము నిత్యము ఆశీర్వదింపబడును గాక.
Currently Selected:
2 సమూయేలు 7: TELUBSI
Highlight
Share
Copy
Want to have your highlights saved across all your devices? Sign up or sign in
Telugu Old Version Bible - పరిశుద్ధ గ్రంథము O.V. Bible
Copyright © 2016 by The Bible Society of India
Used by permission. All rights reserved worldwide.