YouVersion Logo
Search Icon

1 సమూయేలు 29

29
1అంతలో ఫిలిష్తీయులు దండెత్తి పోయి ఆఫెకులో. దిగియుండిరి; ఇశ్రాయేలీయులు యెజ్రెయేలులోని జెల దగ్గర దిగియుండిరి. 2ఫిలిష్తీయుల సర్దారులు తమ సైన్యమును నూరేసిమందిగాను వెయ్యేసిమందిగాను వ్యూహ పరచి వచ్చుచుండగా దావీదును అతని జనులును ఆకీషుతో కలిసి దండు వెనుకతట్టున వచ్చుచుండిరి. 3ఫిలిష్తీయుల సర్దారులు–ఈ హెబ్రీయులు ఏల రావలెను అని ఆకీషును అడుగగా అతడు–ఇన్ని దినములు ఇన్ని సంవత్సరములు నాయొద్దనుండిన ఇశ్రాయేలీయుల రాజైన సౌలునకు సేవకుడగు దావీదు ఇతడే కాడా? ఇతడు నా యొద్ద చేరిన నాటనుండి నేటివరకు ఇతనియందు తప్పే మియు నాకు కనబడలేదని ఫిలిష్తీయుల సర్దారులతో అనెను. 4అందుకు ఫిలిష్తీయుల సర్దారులు అతనిమీద కోపపడి–ఈ మనుష్యుని నీవు నిర్ణయించిన స్థలమునకు తిరిగి పోనిమ్ము, అతడు మనతో కలిసి యుద్ధమునకు రాకూడదు, యుద్ధమందు అతడు మనకు విరోధియవు నేమో, దేనిచేత అతడు తన యజమానునితో సమాధాన పడును? మనవారి తలలను ఛేదించి తీసికొని పోవుటచేతనే గదా తన యజమానునితో సమాధానపడును.
5సౌలు వేలకొలదిగాను
దావీదు పదివేలకొలదిగాను
హతముచేసిరని
వారు నాట్యమాడుచు గాన ప్రతిగానములు చేయుచు పాడిన దావీదు ఇతడే కాడా అని అతనితో చెప్పిరి. 6కాబట్టి ఆకీషు దావీదును పిలిచి–యెహోవా జీవముతోడు నీవు నిజముగా యథార్థపరుడవై యున్నావు; దండులో నీవు నాతోకూడ సంచరించుట నా దృష్టికి అనుకూలమే; నీవు నాయొద్దకు వచ్చిన దినమునుండి నేటివరకు నీయందు ఏ దోషమును నాకు కనబడలేదుగాని సర్దారులు నీయందు ఇష్టములేక యున్నారు. 7ఫిలిష్తీయుల సర్దారుల దృష్టికి నీవు ప్రతికూలమైన దాని చేయకుండునట్లు నీవు తిరిగి నీ స్థలమునకు సుఖముగా వెళ్లుమని చెప్పగా 8దావీదు–నేనేమి చేసితిని? నా యేలినవాడవగు రాజా, నీ శత్రువులతో యుద్ధముచేయుటకై నేను రాకుండునట్లు నీయొద్దకు వచ్చిన దినమునుండి నేటివరకు నీ దాసుడనైన నాయందు తప్పేమి కనబడెనని ఆకీషు నడిగెను. 9అందుకు ఆకీషు–దైవదూతవలె నీవు నా దృష్టికి కనబడుచున్నావని నేనెరుగుదునుగాని ఫిలిష్తీయుల సర్దారులు–ఇతడు మనతోకూడ యుద్ధమునకు రాకూడదని చెప్పుచున్నారు. 10కాబట్టి ఉదయమున నీవును నీతోకూడ వచ్చిన నీ యజమానుని సేవకులును త్వరగా లేవవలెను; ఉదయమున లేచి తెల్లవారగానే బయలుదేరి పోవలెనని దావీదునకు ఆజ్ఞ ఇచ్చెను. 11కావున దావీదును అతని జనులును ఉదయమున త్వరగా లేచి ఫిలిష్తీయుల దేశమునకు పోవలెనని ప్రయాణమైరి; ఫిలిష్తీయులు దండెత్తి యెజ్రెయేలునకు పోయిరి.

Highlight

Share

Copy

None

Want to have your highlights saved across all your devices? Sign up or sign in