YouVersion Logo
Search Icon

1 సమూయేలు 28

28
1ఆ దినములలో ఫిలిష్తీయులు ఇశ్రాయేలీయులతో యుద్ధము చేయవలెనని సైన్యములను సమకూర్చి యుద్ధమునకు సిద్ధపడగా, ఆకీషు దావీదును పిలిచి–నేను దండెత్తగా నీవును నీ జనులును నాతోకూడ యుద్ధమునకు బయలుదేరి రావలెనని పరిష్కారముగా తెలిసికొనుమనగా 2దావీదు–నీ దాసుడనైన నేను చేయబోవు కార్యము ఏదో అది నీవు ఇప్పుడు తెలిసికొందువనెను. అందుకు ఆకీషు–ఆలాగైతే నిన్ను ఎప్పటికి నాకు సంరక్షకుడుగా నిర్ణయింతుననెను.
3సమూయేలు మృతిబొందగా ఇశ్రాయేలీయులు అతని గురించి విలాపము చేసి రామా అను అతని పట్టణములో అతని పాతిపెట్టియుండిరి. మరియు సౌలు కర్ణపిశాచము గలవారిని చిల్లంగివారిని దేశములోనుండి వెళ్లగొట్టి యుండెను. 4ఫిలిష్తీయులు దండెత్తి వచ్చి షూనేములో దిగగా, సౌలు ఇశ్రాయేలీయులందరిని సమకూర్చెను; వారు గిల్బోవలో దిగిరి. 5సౌలు ఫిలిష్తీయుల దండును చూచి మనస్సునందు భయకంపము నొంది 6యెహోవా యొద్ద విచారణచేయగా యెహోవా స్వప్నముద్వారానైనను ఊరీముద్వారానైనను ప్రవక్తలద్వారానైనను ఏమియు సెలవియ్యకుండెను. 7అప్పుడు సౌలు–నా కొరకు మీరు కర్ణపిశాచముగల యొక స్త్రీని కనుగొనుడి; నేను పోయి దానిచేత విచారణ చేతునని తన సేవకులకు ఆజ్ఞ ఇయ్యగా వారు–చిత్తము, ఏన్దోరులో కర్ణపిశాచము గల యొకతె యున్నదని అతనితో చెప్పిరి. 8కాబట్టి సౌలు మారు వేషము ధరించి వేరు బట్టలు తొడుగుకొని యిద్దరు మనుష్యులను వెంటబెట్టుకొనిపోయి రాత్రివేళ ఆ స్త్రీయొద్దకు వచ్చి–కర్ణపిశాచముద్వారా నాకు శకునము చెప్పి నాతో మాటలాడుటకై నేను నీతో చెప్పువాని రప్పించుమని కోరగా 9ఆ స్త్రీ– ఇదిగో, సౌలు చేయించినది నీకు తెలిసినది కాదా? కర్ణపిశాచము గలవారిని చిల్లంగివారిని అతడు దేశములో ఉండకుండ నిర్మూలముచేసెను గదా. నీవు నా ప్రాణముకొరకు ఉరి యొగ్గి నాకు మరణమేల రప్పింతువు అని అతనితో అనెను. 10అందుకు సౌలు–యెహోవా జీవముతోడు దీనినిబట్టి నీకు శిక్ష యెంతమాత్రమును రాదని యెహోవా నామమున ప్రమాణముచేయగా 11ఆ స్త్రీ–నీతో మాటలాడుటకై నేనెవని రప్పింపవలెనని యడుగగా అతడు –సమూయేలును రప్పింపవలెననెను. 12ఆ స్త్రీ సమూయేలును చూచి నప్పుడు బిగ్గరగా కేకవేసి–నీవు సౌలువే; నీవు నన్నెందుకు మోసపుచ్చితివని సౌలుతో చెప్పగా 13రాజు–నీవు భయపడవద్దు, నీకు ఏమి కనబడినదని ఆమె నడుగగా ఆమె–దేవతలలో ఒకడు భూమిలోనుండి పైకి వచ్చుట నేను చూచుచున్నాననెను. 14అందుకతడు–ఏ రూపముగా ఉన్నాడని దాని నడిగినందుకు అది–దుప్పటి కప్పుకొనిన ముసలివాడొకడు పైకి వచ్చుచున్నాడనగా సౌలు–అతడు సమూయేలు అని తెలిసికొని సాగిలపడి నమస్కారము చేసెను. 15సమూయేలు–నన్ను పైకిరమ్మని నీ వెందుకు తొందరపెట్టితివని సౌలు నడుగగా సౌలు– నేను బహు శ్రమలోనున్నాను; ఫిలిష్తీయులు నా మీదికి యుద్ధమునకు రాగా దేవుడు నన్ను ఎడబాసి ప్రవక్తల ద్వారానైనను స్వప్నములద్వారానైనను నా కేమియు సెలవియ్యకయున్నాడు. కాబట్టి నేను చేయవలసిన దానిని నాతో తెలియజెప్పుటకై నిన్ను పిలిపించితిననెను. 16అందుకు సమూయేలు–యెహోవా నిన్ను ఎడ బాసి నీకు పగవాడు కాగా నన్ను అడుగుటవలన ప్రయోజనమేమి? 17యెహోవా తన మాట తన పక్షముగానే నెరవేర్చుచున్నాడు. నా ద్వారా ఆయన సెలవిచ్చియున్నట్టు నీ చేతినుండి రాజ్యమును తీసివేసి నీ పొరుగువాడైన దావీదునకు దాని నిచ్చియున్నాడు. 18యెహోవా ఆజ్ఞకు నీవు లోబడక, అమాలేకీయుల విషయములో ఆయన తీక్షణమైన కోపము నెరవేర్చక పోయిన దానినిబట్టి యెహోవా నీకు ఈవేళ ఈ ప్రకారముగా చేయుచున్నాడు. 19యెహోవా నిన్నును ఇశ్రాయేలీయులను ఫిలిష్తీయుల చేతికి అప్పగించును; యెహోవా ఇశ్రాయేలీయుల దండును ఫిలిష్తీయుల చేతికి అప్పగించును; రేపు నీవును నీ కుమారులును నాతోకూడ ఉందురు అని సౌలుతో చెప్పగా 20సమూయేలు మాటలకు సౌలు బహు భయమొంది వెంటనే నేలను సాష్టాంగపడి దివారాత్రము భోజన మేమియు చేయక యుండినందున బలహీను డాయెను. 21అప్పుడు ఆ స్త్రీ సౌలు దగ్గరకువచ్చి, అతడు బహుగా కలవరపడుట చూచి–నా యేలినవాడా, నీ దాసినైన నేను నీ ఆజ్ఞకు లోబడి నా ప్రాణము నా చేతిలో పెట్టుకొని నీవు నాతో సెలవిచ్చిన మాటలను విని అట్లు చేసితిని. 22ఇప్పుడు నీ దాసినైన నేను చెప్పు మాటలను ఆలకించుము, నేను నీకు ఇంత ఆహారము వడ్డించుదును, నీవు భోజనముచేసి ప్రయాణమై పోవుటకు బలము తెచ్చుకొనుమని అతనితో చెప్పగా 23అతడు ఒప్పక భోజనము చేయననెను; అయితే అతని సేవకులు ఆ స్త్రీతో ఏకమై యతని బలవంతముచేయగా అతడు వారు చెప్పిన మాట ఆలకించి నేలనుండి లేచి మంచముమీద కూర్చుండెను. 24తన యింటిలో క్రొవ్విన పెయ్య ఒకటి యుండగా ఆ స్త్రీ దాని తీసికొని త్వరగా వధించి పిండి తెచ్చి పిసికి పులుసులేని రొట్టెలు కాల్చి 25తీసికొని వచ్చి సౌలునకును అతని సేవకులకును వడ్డించగా వారు భోజనముచేసి లేచి ఆ రాత్రి వెళ్లిపోయిరి.

Highlight

Share

Copy

None

Want to have your highlights saved across all your devices? Sign up or sign in