YouVersion Logo
Search Icon

1 దినవృత్తాంతములు 23

23
1దావీదు ఏండ్లు నిండిన వృద్ధుడాయెను గనుక అతడు తన కుమారుడైన సొలొమోనును ఇశ్రాయేలీయులమీద రాజుగా నియమించెను. 2మరియు అతడు ఇశ్రాయేలీయుల యధిపతులందరిని యాజకులను లేవీయులను సమకూర్చెను. 3అప్పుడు లేవీయులు ముప్పది సంవత్సరములు మొదలుకొని అంతకు పైవయస్సుగలవారు కవిలెలో చేర్చబడిరి; వారి సంఖ్య ముప్పది యెనిమిది వేల పురు షులు. 4వీరిలో ఇరువది నాలుగువేలమంది యెహోవా మందిరపు పని విచారించువారుగాను, ఆరు వేలమంది అధిపతులుగాను, న్యాయాధిపతులుగాను ఉండిరి. 5నాలుగు వేలమంది ద్వారపాలకులుగా నియమింపబడిరి. మరి నాలుగు వేలమంది స్తుతిచేయు నిమిత్తమై దావీదు చేయించిన వాద్యవిశేషములతో యెహోవాను స్తుతించువారుగా నియమింపబడిరి. 6గెర్షోను కహాతు మెరారీయులు అను లేవీయులలో దావీదు వారిని వరుసలుగా విభాగించెను. గెర్షోనీయులలో లద్దాను షిమీ అనువారుండిరి. 7-8లద్దాను కుమారులు ముగ్గురు; పెద్దవాడగు యెహీయేలు, జేతాము యోవేలు 9షిమీ కుమారులు ముగ్గురు, షెలోమీతు హజీయేలు హారాను, వీరు లద్దాను వంశముయొక్క పితరుల పెద్దలు. 10యహతు జీనా యూషు బెరీయా అను నలుగురును షిమీ కుమారులు. 11యహతు పెద్దవాడు జీనా రెండవవాడు. యూషునకును బెరీయాకును కుమారులు అనేకులు లేకపోయిరి గనుక తమపితరుల యింటి వారిలో వారు ఒక్కవంశముగా ఎంచబడిరి. 12కహాతు కుమారులు నలుగురు, అమ్రాము ఇస్హారు హెబ్రోను ఉజ్జీయేలు. 13అమ్రాము కుమారులు అహరోను మోషే; అహరోనును అతని కుమారులును నిత్యము అతి పరిశుద్ధమైన వస్తువులను ప్రతిష్ఠించుటకును, యెహోవా సన్నిధిని ధూపము వేయుటకును, ఆయన సేవ జరిగించుటకును, ఆయన నామమునుబట్టి జనులను దీవించుటకును ప్రత్యేకింపబడిరి. 14దైవజనుడగు మోషే సంతతివారు లేవి గోత్రపువారిలో ఎంచబడిరి. 15మోషే కుమారులు గెర్షోము ఎలీయెజెరు. 16గెర్షోము కుమారులలో షెబూయేలు పెద్దవాడు. 17ఎలీయెజెరు కుమారులలో రెహబ్యా అను పెద్దవాడుతప్ప ఇక కుమారులు అతనికి లేకపోయిరి, అయితే రెహబ్యాకు అనేకమంది కుమారులుండిరి. 18ఇస్హారు కుమారులలో షెలోమీతు పెద్దవాడు. 19హెబ్రోను కుమారులలో యెరీయా పెద్దవాడు, అమర్యా రెండవవాడు, యహజీయేలు మూడవవాడు, యెక్మెయాము నాలుగవవాడు. 20ఉజ్జీయేలు కుమారులలో మీకా పెద్ద వాడు యెషీయా రెండవవాడు. 21మెరారి కుమారులు మహలి మూషి; మహలి కుమారులు ఎలియాజరు కీషు. 22ఎలియాజరు చనిపోయినప్పుడు వానికి కుమార్తెలుండిరి కాని కుమారులు లేకపోయిరి. కీషు కుమారులైన వారి సహోదరులు వారిని వివాహము చేసికొనిరి. 23మూషి కుమారులు ముగ్గురు, మహలి ఏదెరు యెరీమోతు. 24వీరు తమపితరుల యింటివారినిబట్టి లేవీయులుగా ఎంచబడిరి; పితరులయిండ్లకు పెద్దలైన వీరు ఇరువది సంవత్సరములు మొదలుకొని అంతకు పైవయస్సుగలవారై తమతమ పేరుల లెక్కప్రకారము ఒక్కొక్కరుగా నెంచబడి యెహోవా మందిరపు సేవచేయుపనివారైయుండిరి. 25–ఇశ్రాయేలీయులదేవుడైన యెహోవా తన జనులకు నెమ్మది దయచేసియున్నాడు గనుక వారు నిత్యము యెరూషలేములో నివాసము చేయుదురనియు 26లేవీయులు కూడ ఇక మీదట గుడారమునైనను దాని సేవకొరకైన ఉపకరణములనైనను మోయ పనిలేదనియు దావీదు సెలవిచ్చెను. 27దావీదు ఇచ్చిన కడవరి యాజ్ఞనుబట్టి లేవీయులలో ఇరువది సంవత్సరములు మొదలుకొని అంతకు పైవయస్సుగలవారు ఎంచబడిరి. 28వీరు అహరోను సంతతివారి చేతిక్రింద పనిచూచుటకును, వారి వశముననున్న యెహోవామందిర సేవకొరకై సాలలలోను గదులలోను ఉంచబడిన సకలమైన ప్రతిష్ఠితవస్తువులను శుద్ధిచేయుటకును, దేవుని మందిర సేవకొరకైన పనిని విచారించుటకును, 29సన్నిధి రొట్టెను నైవేద్యమునకు తగిన సన్నపు పిండిని పులుసులేని భోజ్యములను పెనములో కాల్చుదానిని పేల్చుదానిని నానావిధమైన పరిమాణములుగలవాటిని కొలతగలవాటిని విచారించుటకును, 30అనుదినము ఉదయ సాయంకాలములయందు యెహోవానుగూర్చిన స్తుతి పాటలు పాడు టకును, విశ్రాంతిదినములలోను, అమావాస్యలలోను పండుగలలోను యెహోవాకు దహనబలులను అర్పింప వలసిన సమయములన్నిటిలోను, లెక్కకు సరియైనవారు వంతు ప్రకారము నిత్యము యెహోవా సన్నిధిని సేవ జరిగించుటకును నియమింపబడిరి. 31సమాజపు గుడారమును కాపాడుటయు, పరిశుద్ధస్థలమును కాపాడుటయు, యెహోవా మందిరపు సేవతో సంబంధించిన పనులలో వారి సహోదరులగు అహరోను సంతతివారికి సహాయము చేయుటయు వారికి నియమింపబడిన పనియైయుండెను.

Highlight

Share

Copy

None

Want to have your highlights saved across all your devices? Sign up or sign in

Video for 1 దినవృత్తాంతములు 23