1 దినవృత్తాంతములు 18
18
1ఇదియైన తరువాత దావీదు ఫిలిష్తీయులను జయించి, వారిని లోపరచి, గాతు పట్టణమును దాని గ్రామములును ఫిలిష్తీయుల వశమున నుండకుండ వాటిని పట్టుకొనెను. 2అతడు మోయాబీయులను జయించగా వారు దావీదునకు కప్పముకట్టు దాసులైరి. 3సోబా రాజైన హదదెజెరు యూఫ్రటీసునదివరకు తన రాజ్యమును వ్యాపించుటకై బయలుదేరగా హమాతునొద్ద దావీదు అతనిని ఓడించి 4అతని యొద్దనుండి వెయ్యి రథములను ఏడువేల గుఱ్ఱపు రౌతులను ఇరువదివేల కాల్బలమును పట్టుకొనెను. దావీదు ఆ రథములలో నూరింటికి కావలసిన గుఱ్ఱములను ఉంచుకొని కడమవాటికన్నిటికి చీలమండ నరములు తెగవేయించెను. 5సోబారాజైన హదదెజెరునకు సహాయము చేయవలెనని దమస్కులోని సిరియనులురాగా దావీదు ఆ సిరియనులలో ఇరువదిరెండువేలమందిని హతముచేసెను. 6తరువాత దావీదు సిరియా సంబంధమైన దమస్కులో కావలి సైన్యమును ఉంచెను; సిరియనులు దావీదునకు కప్పముకట్టు సేవకులైరి. ఈ ప్రకారము దావీదు పోయిన చోట్లనెల్ల యెహోవా అతనికి సహాయముచేయుచు వచ్చెను. 7మరియు హదదెజెరు సేవకులు పట్టుకొనియున్న బంగారు డాళ్లను దావీదు తీసికొని యెరూషలేమునకు చేర్చెను. 8హదదెజెరుయొక్క పట్టణములైన టిబ్హతులోనుండియు, కూనులోనుండియు దావీదు బహువిస్తారమైన యిత్తడిని తీసికొని వచ్చెను. దానితో సొలొమోను ఇత్తడి సముద్రమును స్తంభములను ఇత్తడి వస్తువులను చేయించెను. 9దావీదు సోబారాజైన హదదెజెరుయొక్క సైన్యమంతటిని ఓడించిన వర్తమానము హమాతురాజైన తోహూకు వినబడెను. 10హదదెజెరునకును తోహూకును విరోధము కలిగియుండెను గనుక రాజైన దావీదు హదదెజెరుతో యుద్ధముచేసి అతని నోడించినందుకై దావీదుయొక్క క్షేమము తెలిసికొనుటకును, అతనితో శుభవచనములు పలుకుటకును, బంగారముతోను వెండితోను ఇత్తడితోను చేయబడిన సకల విధములైన పాత్రలనిచ్చి, తోహూ తన కుమారుడైన హదోరమును అతనియొద్దకు పంపెను. 11ఈ వస్తువులను కూడ రాజైన దావీదు తాను ఎదో మీయులయొద్ద నుండియు, మోయాబీయులయొద్ద నుండియు, అమ్మోనీయులయొద్ద నుండియు, ఫిలిష్తీయుల యొద్దనుండియు, అమాలేకీయులయొద్ద నుండియు తీసికొని పచ్చిన వెండి బంగారములతో పాటుగా యెహోవాకు ప్రతిష్ఠించెను. 12మరియు సెరూయా కుమారుడైన అబీషై ఉప్పులోయలో ఎదోమీయులలో పదునెనిమిది వేలమందిని హతము చేసెను. 13దావీదు ఎదోములో కావలి సైన్యమును ఉంచెను, ఎదోమీయులందరును అతనికి సేవకులైరి, దావీదు పోయిన చోట్లనెల్ల యెహోవా అతని రక్షించెను.
14ఈ ప్రకారము దావీదు ఇశ్రాయేలీయులందరిమీదను రాజైయుండి తన జనులందరికిని నీతిన్యాయములను జరిగించెను. 15సెరూయా కుమారుడైన యోవాబు సైన్యాధి పతియైయుండెను; అహీలూదు కుమారుడైన యెహోషాపాతు రాజ్యపుదస్తావేజులమీద నుండెను; 16అహీటూబు కుమారుడైన సాదోకును అబ్యాతారు కుమారుడైన అబీమెలెకును యాజకులు, షవ్షా శాస్త్రి; 17యెహోయాదా కుమారుడైన బెనాయా కెరేతీయులకును పెలేతీయులకును అధిపతియైయుండెను; మరియు దావీదుయొక్క కుమారులు రాజునకు సహాయులై యుండిరి.
Currently Selected:
1 దినవృత్తాంతములు 18: TELUBSI
Highlight
Share
Copy
Want to have your highlights saved across all your devices? Sign up or sign in
Telugu Old Version Bible - పరిశుద్ధ గ్రంథము O.V. Bible
Copyright © 2016 by The Bible Society of India
Used by permission. All rights reserved worldwide.