YouVersion Logo
Search Icon

1 దినవృత్తాంతములు 19

19
1ఇదియైన తరువాత అమ్మోనీయుల రాజైన నాహాషు చనిపోగా అతని కుమారుడు అతనికి మారుగా రాజాయెను. 2అప్పుడు దావీదు–హానూను తండ్రియైన నాహాషు నా యెడల దయ చూపించెను గనుక నేను అతనికుమారుని యెడల దయ చూపెదనని యనుకొని, అతని తండ్రి నిమిత్తము అతని పరామర్శించుటకు దూతలను పంపెను. దావీదు సేవకులు హానూనును పరామర్శించుటకై అమ్మోనీయుల దేశమునకు వచ్చినప్పుడు 3అమ్మోనీయుల యధిపతులు హానూనుతో–నిన్ను పరామర్శించుటకై నీ యొద్దకు దావీదు దూతలను పంపుట నీ తండ్రిని ఘనపర చుటకే అని నీవనుకొనుచున్నావా? దేశమును తరచి చూచి దాని నాశనము చేయుటకేగదా అతని సేవకులు నీయొద్దకు వచ్చియున్నారు అని మనవిచేయగా 4హానూను దావీదు సేవకులను పట్టుకొని, వారిని గొరిగించి, వారి వస్త్రములు పిరుదులు దిగకుండునట్లు నడిమికి కత్తిరించి వారిని పంపివేసెను. 5ఆ మనుష్యులు ఇంటికి వచ్చుచుండగా కొందరువచ్చి వారిని గూర్చిన వార్త దావీదునకు తెలియజేసిరి; వారు బహు లజ్జాక్రాంతులై యుండిరి గనుక వారికి ఎదురుగా మనుష్యులను పంపి–మీ గడ్డములు పెరుగుదనుక మీరు యెరికోలో ఉండి తరువాత రండని రాజు వారికి వర్తమాన మంపెను. 6అమ్మోనీయులు దావీదునకు తమయందు అసహ్యము పుట్టించితిమని తెలిసికొనినప్పుడు హానూనును అమ్మోనీయులును అరామ్నహరాయిము నుండియు, సిరియా మయకానుండియు సోబానుండియు రథములను గుఱ్ఱపురౌతులను రెండువేల మణుగుల వెండి ఇచ్చి బాడిగెకు కుదుర్చుకొనిరి. 7ముప్పది రెండువేల రథములతో వచ్చునట్లు జీతమిచ్చి మయకారాజును అతని జనులను కుదుర్చుకొనిరి; వీరు వచ్చి మేదెబా ముందరితట్టున దిగిరి, అమ్మోనీయులు తమతమ పట్టణములలోనుండి కూడుకొని యుద్ధముచేయుటకు వచ్చిరి. 8దావీదు ఈ సంగతి విని యోవాబును సైన్యములోని పరాక్రమశాలుల నందరిని పంపెను. 9అమ్మోనీయులు బయలుదేరి పట్టణపు గవిని యొద్ద యుద్ధపంక్తులు తీర్చిరి, వచ్చిన రాజులు ప్రత్యేకముగా బయట భూమిలో యుద్ధమునకు సిద్ధముగా నిలిచిరి. 10తాను రెండు సైన్యములమధ్యను చిక్కుబడి యుండుట చూచి, యోవాబు ఇశ్రాయేలీయులలోని శ్రేష్ఠులలో పరాక్రమశాలులను ఏర్పరచుకొని, సిరియనులకు ఎదురుగా వారిని పంక్తులు తీర్చి, 11కడమ జనులను అమ్మోనీయులకు ఎదురుగా వ్యూహపరచి, తన సహోదరుడైన అబీషైకి అప్పగించి యిట్లనెను 12సిరియనుల బలమునకు నేను నిలువలేకపోయినయెడల నీవు నాకు సహాయము చేయవలెను, అమ్మోనీయుల బలమునకు నీవు నిలువలేకపోయినయెడల నేను నీకు సహాయము చేయుదును. 13ధైర్యము కలిగి యుండుము, మనము మన జనుల నిమిత్తమును మన దేవుని పట్టణముల నిమిత్తమును ధీరత్వము చూపుదము; యెహోవా తన దృష్టికి ఏది మంచిదో దాని చేయునుగాక. 14ఆప్రకారము యోవాబును అతనితోకూడ నున్న జనమును సిరియనులతో యుద్ధము కలుపుటకై చేరపోగా వారు నిలువలేక అతని యెదుటనుండి తిరిగి పారిపోయిరి. 15సిరియనులు తిరిగి పారిపోవుట అమ్మోనీయులు చూచినప్పుడు వారును అతని సహోదరుడైన అబీషైముందర నిలువలేక తిరిగి పారిపోయి పట్టణములో చొచ్చిరి, యోవాబు మరలి యెరూషలేమునకు వచ్చెను. 16తాము ఇశ్రాయేలీయుల చేతిలో ఓడిపోతిమని సిరియనులు తెలిసికొనినప్పుడు వారు దూతలను పంపి, యేటి ఆవలి సిరియనులను పిలిపించుకొనిరి, హదదెజెరుయొక్క సైన్యాధిపతియైన షోపకు వారికి నాయకుడాయెను. 17దావీదు ఆ సంగతి తెలిసికొని ఇశ్రాయేలీయులనందరిని సమకూర్చి యొర్దాను దాటి వారికి ఎదురుపడి వారియెదుట సైన్యములను వ్యూహపరచెను, దావీదు సిరియనులకు ఎదురుగా సైన్యములను పంక్తులు తీర్చినప్పుడు వారు అతనితో యుద్ధము చేసిరి. 18అయితే సిరియనులు ఇశ్రాయేలీయుల యెదుట నిలువక తిరిగి పారిపోయిరి; దావీదు సిరియనులలో ఏడువేల రథికులను నలుబది వేలకాల్బలమును హతముచేసి సైన్యాధిపతియైన షోపకును చంపి వేసెను. 19తాము ఇశ్రాయేలీయుల చేతిలో ఓడిపోతిమని హదదెజెరుయొక్క సేవకులు తెలిసికొనినప్పుడు వారు దావీదుతో సమాధానపడి అతనికి సేవకులైరి. అంతటి నుండి సిరియనులు అమ్మోనీయులకు సహాయము చేయుటకు మనస్సులేక యుండిరి.

Highlight

Share

Copy

None

Want to have your highlights saved across all your devices? Sign up or sign in

Video for 1 దినవృత్తాంతములు 19