ఆది 50

50
1యోసేపు తన తండ్రి మీద పడి ఏడ్చి ముద్దు పెట్టుకున్నాడు. 2తర్వాత తన తండ్రి ఇశ్రాయేలు శవాన్ని సుగంధ ద్రవ్యాలతో భద్రపరచమని వైద్యులకు ఆదేశించాడు. 3కాబట్టి వైద్యులు పూర్తి నలభై రోజులు తీసుకుని భద్రపరిచారు, ఎందుకంటే భద్రపరచడానికి అవసరమయ్యే సమయం అది. ఈజిప్టువారు అతని కోసం డెబ్బై రోజులు దుఃఖించారు.
4సంతాప దినాలు గడిచాక, యోసేపు ఫరో ఇంటివారితో, “నేను మీ దృష్టిలో దయ పొందితే, నా పక్షాన ఫరోతో మాట్లాడండి. అతనితో, 5‘నా తండ్రి నా చేత ప్రమాణం చేయించుకుని, “నేను చనిపోబోతున్నాను; కనాను దేశంలో నా కోసం నేను త్రవ్వించుకున్న సమాధిలో నన్ను పాతిపెట్టండి” అని చెప్పాడు. కాబట్టి నాకు సెలవిస్తే నేను వెళ్లి నా తండ్రిని పాతిపెట్టి తిరిగి వస్తాను’ అని చెప్పండి” అని అన్నాడు.
6అప్పుడు ఫరో, “నీవు వెళ్లి, అతడు నీతో ప్రమాణం చేయించినట్టు నీ తండ్రిని పాతిపెట్టు” అన్నాడు.
7కాబట్టి యోసేపు తన తండ్రిని పాతిపెట్టడానికి వెళ్లినప్పుడు అతనితో ఫరో అధికారులందరు, అతని ఇంటి పెద్దలు, ఈజిప్టు ఉన్నతాధికారులందరు, 8యోసేపు ఇంటివారందరు, అతని సోదరులు, అతని తండ్రి ఇంటివారితో వెళ్లారు. కేవలం వారి పిల్లలను, వారి మందలను, పశువులను గోషేనులో విడిచిపెట్టారు. 9రథాలు, రథసారధులు కూడా అతనితో వెళ్లారు. అది చాలా పెద్ద గుంపు.
10వారు యొర్దాను దగ్గర ఉన్న ఆటదు నూర్పిడి కళ్లం దగ్గర చేరినప్పుడు, వారు బిగ్గరగా, ఘోరంగా ఏడ్చారు; అక్కడ తన తండ్రి కోసం యోసేపు ఏడు రోజుల సంతాప కాలం పాటించాడు. 11అక్కడ నివసించే కనానీయులు ఆటదు నూర్పిడి కళ్లం దగ్గర ఏడ్వడం చూసి, “ఈజిప్టువారు శోకంతో సంతాప వేడుకను జరుపుకుంటున్నారు” అని అన్నారు. అందుకే యొర్దాను దగ్గర ఉన్న ఆ స్థలం ఆబేల్-మిస్రాయిము అని పిలువబడింది.
12కాబట్టి యాకోబు ఆజ్ఞాపించినట్టు అతని కుమారులు చేశారు: 13అతన్ని కనాను దేశానికి మోసుకెళ్లి, అబ్రాహాము సమాధి స్థలంగా హిత్తీయుడైన ఎఫ్రోను దగ్గర పొలంతో పాటు కొన్న మమ్రే దగ్గర ఉన్న మక్పేలా పొలంలో ఉన్న గుహలో సమాధి చేశారు. 14తన తండ్రిని పాతిపెట్టిన తర్వాత యోసేపు తన సోదరులతో, సమాధి కార్యక్రమానికి వచ్చిన వారందరితో ఈజిప్టుకు తిరిగి వెళ్లాడు.
యోసేపు సోదరులకు మళ్ళీ అభయమిస్తాడు
15తమ తండ్రి చనిపోయాడని యోసేపు సోదరులు చూసి, “ఒకవేళ యోసేపు మనపై కక్ష పెట్టుకుని మనం చేసిన తప్పులకు ప్రతి కీడు చేస్తే ఎలా?” అని అనుకున్నారు. 16కాబట్టి వారు యోసేపుకు ఇలా కబురు పంపారు, “నీ తండ్రి చనిపోకముందు ఇలా ఈ సూచనలు ఇచ్చాడు: 17‘యోసేపుతో ఇలా మీరు చెప్పాలి: నీ సోదరులు నిన్ను హీనంగా చూస్తూ నీ పట్ల చేసిన పాపాలను తప్పులను క్షమించమని చెప్తున్నాను.’ కాబట్టి దయచేసి నీ తండ్రి యొక్క దేవుని సేవకుల పాపాలను క్షమించు.” వారి కబురు అందిన తర్వాత యోసేపు ఏడ్చాడు.
18అప్పుడు తన సోదరులు అతని దగ్గరకు వచ్చి సాష్టాంగపడి, “మేము నీ బానిసలం” అన్నారు.
19అయితే యోసేపు వారితో, “భయపడకండి, నేనేమైన దేవుని స్థానంలో ఉన్నానా? 20మీరు నాకు హాని చేయాలనుకున్నారు కానీ ఎంతోమంది జీవితాలను కాపాడడానికి, ఇప్పుడు ఏదైతే జరుగుతుందో దానిని సాధించడానికి దేవుడు దానిని మేలుకే మార్చారు. 21కాబట్టి ఇప్పుడు భయపడకండి. నేను మీకు, మీ పిల్లలకు సమకూరుస్తాను” అని అన్నాడు. అతడు వారికి మళ్ళీ అభయమిచ్చి దయతో మాట్లాడాడు.
యోసేపు మరణం
22యోసేపు తన తండ్రి కుటుంబంతో కలిసి ఈజిప్టులో నివసించాడు. అతడు నూటపది సంవత్సరాలు జీవించాడు, 23ఎఫ్రాయిం పిల్లల మూడవ తరాన్ని చూశాడు. మనష్షే కుమారుడైన మాకీరుకు పుట్టిన పిల్లలు కూడా యోసేపు సొంతవారిగా పెరిగారు.#50:23 హెబ్రీలో పుట్టినప్పుడు అతని మోకాళ్లమీద పెట్టారు
24యోసేపు తన సోదరులతో, “నేను చనిపోబోతున్నాను. అయితే దేవుడు తప్పకుండా మిమ్మల్ని దర్శించి, ఈ దేశం నుండి ఆయన అబ్రాహాముకు, ఇస్సాకుకు, యాకోబుకు ప్రమాణం చేసిన దేశానికి మిమ్మల్ని తీసుకెళ్తారు” అని చెప్పాడు. 25యోసేపు ఇశ్రాయేలు కుమారులతో ప్రమాణం చేయించుకుని, “దేవుడు ఖచ్చితంగా మిమ్మల్ని దర్శిస్తారు, అప్పుడు మీరు ఈ స్థలం నుండి నా ఎముకలను తీసుకెళ్లండి” అని చెప్పాడు.
26యోసేపు నూటపది సంవత్సరాల వయస్సులో చనిపోయాడు. అతని శవాన్ని సుగంధ ద్రవ్యాలతో భద్రపరిచాక, ఈజిప్టులో అతని శరీరాన్ని ఒక శవపేటికలో ఉంచారు.

Okuqokiwe okwamanje:

ఆది 50: OTSA

Qhakambisa

Dlulisela

Kopisha

None

Ufuna ukuthi okuvelele kwakho kugcinwe kuwo wonke amadivayisi akho? Bhalisa noma ngena ngemvume