ఆది 40
40
పాత్ర అందించేవాడు, రొట్టెలు చేసేవాడు
1కొంతకాలం తర్వాత ఈజిప్టు రాజుకు గిన్నె అందించేవాడు రొట్టెలు చేసేవాడు తమ యజమాని పట్ల తప్పు చేశారు. 2కాబట్టి ఫరో తన ఇద్దరి అధికారులపై అనగా గిన్నె అందించేవారి నాయకునిపై, రొట్టెలు కాల్చేవారి నాయకునిపై కోప్పడి, 3వారిని అంగరక్షకుల అధికారి ఆధీనంలో, అతని ఇంట్లో ఉంచాడు, అదే చెరసాలలో యోసేపు బంధించబడి ఉన్నాడు. 4అంగరక్షకుల అధికారి వీరిద్దరిని యోసేపుకు అప్పగించాడు, అతడు వారిని చూసుకున్నాడు.
వారు కొంతకాలం వరకు చెరసాలలో ఉన్నప్పుడు, 5ఈజిప్టు రాజుకు గిన్నె అందించేవాడు, రొట్టెలు చేసేవాడు చెరలో ఉన్నప్పుడు ఇద్దరూ ఒకే రాత్రి కలగన్నారు. ఇద్దరి కలలకు దేని భావం దానికే ఉంది.
6మరుసటిరోజు ప్రొద్దున్నే యోసేపు వారి దగ్గరకు వచ్చినప్పుడు, వారు దిగులుగా ఉన్నట్లు గమనించాడు. 7కాబట్టి అతడు తన యజమాని ఇంట్లో నిర్బంధంలో ఉన్న అధికారులను, “మీరు ఎందుకు ఈ రోజు విచారంగా ఉన్నారు?” అని అడిగాడు.
8“మా ఇద్దరికి కలలు వచ్చాయి కానీ వాటి భావం చెప్పడానికి ఎవరు లేరు” అని వారు జవాబిచ్చారు.
అప్పుడు యోసేపు వారితో, “భావాలు చెప్పడం దేవుని వశం కాదా? మీ కలలు నాకు చెప్పండి” అని అన్నాడు.
9కాబట్టి గిన్నె అందించేవారి నాయకుడు యోసేపుకు తన కలను చెప్పాడు. అతడు, “నా కలలో నా ఎదుట ఒక ద్రాక్షచెట్టు ఉంది, 10ఆ ద్రాక్షచెట్టుకు మూడు తీగెలున్నాయి. అది చిగురించి, పూలు పూసింది, దాని గెలలు ద్రాక్షపండ్లతో ఉన్నాయి. 11ఫరో గిన్నె నా చేతిలో ఉంది, నేను ద్రాక్షపండ్లు తీసుకుని ఫరో గిన్నెలో వాటిని పిండి అతని చేతికి ఆ గిన్నెను ఇచ్చాను” అని చెప్పాడు.
12యోసేపు అతనితో, “దాని అర్థం ఇది. మూడు తీగెలు మూడు రోజులు. 13మూడు రోజుల్లో ఫరో నీ తల పైకెత్తి నీ స్థానం నీకు మరలా ఇస్తాడు, గతంలో నీవు గిన్నె అందించే వానిగా ఉన్నప్పుడు చేసినట్టు, ఫరో గిన్నెను అతనికి చేతికి అందిస్తావు. 14నీకు అంతా మంచి జరిగినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకుని నాకు దయ చూపించు; ఫరోతో నా గురించి మాట్లాడి నన్ను ఈ చెరసాల నుండి బయటకు రప్పించు. 15హెబ్రీ దేశం నుండి బలవంతంగా నన్ను దొంగిలించి తీసుకువచ్చారు, నేను చెరసాలలో ఉండడానికి చేసిన నేరం ఏమి లేదు” అని చెప్పాడు.
16యోసేపు అనుకూలంగా భావం చెప్పాడు అని గమనించిన రొట్టెలు కాల్చేవాడు యోసేపుతో, “నాకు కూడా కల వచ్చింది: నా తలమీద రొట్టెలు ఉన్న మూడు గంపలు ఉన్నాయి. 17పై గంపలో ఫరో కోసం అన్ని రకాల మంచి వంటకాలున్నాయి, కానీ పక్షులు వచ్చి, నా తలమీద ఉన్న గంపలో నుండి తింటున్నాయి” అని చెప్పాడు.
18యోసేపు అన్నాడు, “దాని అర్థం ఇది. మూడు గంపలు మూడు రోజులు. 19మూడు రోజుల్లో ఫరో నీ తలను తీసివేసి, నీ శరీరాన్ని స్తంభానికి వ్రేలాడదీస్తాడు. పక్షులు నీ మాంసం తినివేస్తాయి.”
20మూడవ రోజు ఫరో పుట్టిన రోజు, అతడు తన అధికారులందరికి విందు ఏర్పాటు చేశాడు. అధికారులందరి ఎదుట గిన్నె అందించేవారి నాయకుడి, రొట్టెలు కాల్చేవాని నాయకుడి తలలను పైకెత్తాడు: 21గిన్నె అందించేవారి నాయకున్ని అతని స్థానం తిరిగి ఇచ్చాడు కాబట్టి మరలా అతడు ఫరో చేతికి గిన్నె అందించాడు. 22కానీ యోసేపు కల భావం చెప్పినట్టే, అతడు రొట్టెలు కాల్చేవారి నాయకున్ని వ్రేలాడదీశాడు.
23అయితే గిన్నె అందించేవారి నాయకుడు యోసేపును జ్ఞాపకం చేసుకోలేదు; అతన్ని మరచిపోయాడు.
Okuqokiwe okwamanje:
ఆది 40: OTSA
Qhakambisa
Dlulisela
Kopisha

Ufuna ukuthi okuvelele kwakho kugcinwe kuwo wonke amadivayisi akho? Bhalisa noma ngena ngemvume
Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం™
ప్రచురణ హక్కులు © 1976, 1990, 2022, 2024 by Biblica, Inc.
Biblica® Open Telugu Contemporary Version™
Copyright © 1976, 1990, 2022, 2024 by Biblica, Inc.