ఆది 21

21
ఇస్సాకు పుట్టుక
1యెహోవా తాను చెప్పినట్టే శారా పట్ల కృప చూపించారు, శారాకు వాగ్దానం చేసినట్టే యెహోవా చేశారు. 2సరిగ్గా దేవుడు వాగ్దానం చేసిన నిర్ణీత కాలంలో శారా గర్భవతియై, వృద్ధాప్యంలో ఉన్న అబ్రాహాముకు కుమారున్ని కన్నది. 3అబ్రాహాము, శారా తన కోసం కన్న కుమారునికి ఇస్సాకు#21:3 ఇస్సాకు అంటే అతడు నవ్వుతాడు. అని పేరు పెట్టాడు. 4దేవుని ఆజ్ఞమేరకు తన కుమారుడైన ఇస్సాకుకు ఎనిమిదో రోజున అబ్రాహాము సున్నతి చేశాడు. 5ఇస్సాకు పుట్టినప్పుడు అబ్రాహాము నూరు సంవత్సరాల వృద్ధుడు.
6శారా, “నాకు దేవుడు నవ్వు తెప్పించారు, ఇది వినే ప్రతివారు నాతో నవ్వుతారు, 7శారా పిల్లలకు పాలిస్తుందని అబ్రాహాముతో ఎవరు అంటారు? అయినా నా భర్తకు వృద్ధాప్యంలో కుమారున్ని కన్నాను” అని అన్నది.
హాగరు, ఇష్మాయేలు పంపివేయబడుట
8ఇస్సాకు పాలు విడిచిన రోజు అబ్రాహాము పెద్ద విందు చేశాడు. 9అయితే ఈజిప్టు దాసి హాగరు ద్వార అబ్రాహాముకు పుట్టిన కుమారుడు శారాను హేళన చేయడం చూసి, 10ఆమె అబ్రాహాముతో, “ఆ దాసిని దాని కుమారున్ని పంపివేయండి, దాని కుమారుడు ఎప్పటికీ నా కుమారునితో వారసత్వం పంచుకోలేడు” అని శారా చెప్పింది.
11తన కుమారునికి సంబంధించిన విషయం కాబట్టి అబ్రాహాము చాలా బాధపడ్డాడు. 12అయితే దేవుడు అబ్రాహాముతో, “ఈ బాలుని గురించి, నీ దాసి గురించి నీవు బాధపడకు. శారా చెప్పినట్టు నీవు చేయి, ఎందుకంటే ఇస్సాకు మూలంగానే నీ సంతానం#21:12 లేదా విత్తనం లెక్కించబడుతుంది. 13అయితే దాసి కుమారుడు కూడా నీ సంతానమే కాబట్టి అతన్ని కూడా గొప్ప జనంగా చేస్తాను.”
14మర్నాడు వేకువజామున అబ్రాహాము లేచి కొంత ఆహారం, నీళ్ల తిత్తి హాగరుకు ఇచ్చాడు. వాటిని ఆమె భుజం మీద పెట్టి, ఆమెను తన కుమారునితో పంపివేశాడు. ఆమె వెళ్లి బెయేర్షేబ ఎడారిలో తిరుగుతూ ఉంది.
15తిత్తిలో నీళ్లు అయిపోయినప్పుడు ఆమె ఆ పిల్లవాన్ని ఒక పొద క్రింద ఉంచింది. 16తర్వాత ఆమె కొంత దూరం వెళ్లి కూర్చుంది, ఎందుకంటే, “బాలుడు చావడం నేను చూడలేను” అని అనుకుంది. అక్కడ కూర్చుని అదుపు లేకుండ ఏడవసాగింది.
17దేవుడు చిన్నవాని మొర విన్నారు, దేవదూత పరలోకం నుండి హాగరును పిలిచి, “హాగరూ! ఏమైంది? భయపడకు; బాలుడు అక్కడ పడి ఏడ్వడం దేవుడు విన్నారు. 18ఆ పిల్లవాన్ని లేపి నీ చేతితో పట్టుకో, నేను అతన్ని గొప్ప జనంగా చేస్తాను” అని అన్నాడు.
19అప్పుడు దేవుడు ఆమె కళ్లు తెరిచారు, ఆమె నీళ్ల ఊటను చూసింది. ఆమె వెళ్లి తిత్తిని నీళ్లతో నింపి బాలునికి త్రాగడానికి ఇచ్చింది.
20ఆ పిల్లవాడు ఎదుగుతుండగా దేవుడు అతనితో ఉన్నారు. అతడు ఎడారిలో నివసిస్తూ విలుకాడయ్యాడు. 21అతడు పారాను ఎడారిలో నివసిస్తున్నప్పుడు అతని తల్లి ఈజిప్టు నుండి అతనికి భార్యను తీసుకువచ్చింది.
బెయేర్షేబా దగ్గర ఒప్పందం
22ఆ సమయంలో అబీమెలెకు, అతని సేనాధిపతి ఫీకోలు వచ్చి, అబ్రాహాముతో ఇలా అన్నారు, “నీవు చేసే పనులన్నిటిలో దేవుడు నీతో ఉన్నారు. 23కాబట్టి నీవు నాతో గాని నా పిల్లలతో గాని నా వారసులతో గాని మోసపూరితంగా వ్యవహరించవని దేవుని ఎదుట నాతో ప్రమాణం చేయి. నీవు పరదేశిగా ఉంటున్న ఈ దేశంలో నేను చూపించిన దయ నాకు, ఈ దేశానికి చూపించు.”
24అబ్రాహాము, “నేను ప్రమాణం చేస్తున్నా” అన్నాడు.
25అప్పుడు అబీమెలెకు దాసులు అంతకుముందు ఒక బావిని ఆక్రమించుకున్న విషయాన్ని అబ్రాహాము అబీమెలెకుకు చెప్పాడు. 26అయితే అబీమెలెకు, “ఇది ఎవరు చేశారో నాకు తెలియదు. నీవు నాకు చెప్పలేదు, ఈ రోజే ఈ సంగతి వింటున్నాను” అని అన్నాడు.
27అబ్రాహాము గొర్రెలు పశువులు తీసుకువచ్చి అబీమెలెకుకు ఇచ్చాడు, ఆ ఇద్దరు ఒక ఒప్పందం చేసుకున్నారు. 28అబ్రాహాము తన మంద నుండి ఏడు ఆడ గొర్రెపిల్లలను వేరు చేశాడు. 29అబీమెలెకు, “నీవు స్వయంగా వేరు చేసిన ఈ ఏడు ఆడ గొర్రెపిల్లలకు అర్థం ఏంటి?” అని అబ్రాహామును అడిగాడు.
30అందుకు అతడు, “నేను ఈ బావిని త్రవ్వించాను అనడానికి సాక్ష్యంగా ఈ ఏడు ఆడ గొర్రెపిల్లలను నా చేతి నుండి అంగీకరించు” అని చెప్పాడు.
31అక్కడ వారిద్దరు ఒప్పందం చేసుకున్నారు. కాబట్టి ఆ స్థలానికి బెయేర్షేబ#21:31 బెయేర్షేబ అంటే ఏడింటి బావి అలాగే ఒప్పంద బావి. అని పేరు పెట్టారు.
32బెయేర్షేబ దగ్గర ఒప్పందం చేసుకున్న తర్వాత అబీమెలెకు, సేనాధిపతియైన ఫీకోలు ఫిలిష్తీయుల దేశానికి తిరిగి వెళ్లారు. 33అబ్రాహాము బెయేర్షేబలో ఒక పిచుల వృక్షం నాటాడు, అక్కడ నిత్య దేవుడైన యెహోవా నామాన్ని ఆరాధించాడు. 34అబ్రాహాము ఫిలిష్తీయుల దేశంలో చాలా కాలం పరదేశిగా ఉన్నాడు.

Okuqokiwe okwamanje:

ఆది 21: OTSA

Qhakambisa

Dlulisela

Kopisha

None

Ufuna ukuthi okuvelele kwakho kugcinwe kuwo wonke amadivayisi akho? Bhalisa noma ngena ngemvume