ఆది 18

18
ముగ్గురు సందర్శకులు
1అబ్రాహాము మమ్రేలో ఉన్న సింధూర వృక్షాల దగ్గర తన గుడార ద్వారం దగ్గర ఎండలో కూర్చుని ఉన్నప్పుడు యెహోవా అతనికి ప్రత్యక్షమయ్యారు. 2అబ్రాహాము కళ్ళెత్తి చూసినప్పుడు అతని ఎదుట ముగ్గురు మనుష్యులు నిలిచి ఉన్నారు. వారిని చూసిన వెంటనే తన గుడార ద్వారం నుండి వారిని కలవడానికి త్వరపడి వెళ్లి సాష్టాంగపడ్డాడు.
3అబ్రాహాము వారితో, “నా ప్రభువా, మీ దృష్టిలో నేను దయ పొందినట్లైతే, మీ దాసున్ని విడిచి వెళ్లకండి. 4నీళ్లు తెప్పిస్తాను, కాళ్లు కడుక్కుని ఈ చెట్టు క్రింద విశ్రాంతి తీసుకోండి. 5మీరు మీ సేవకుని దగ్గరకు వచ్చారు కాబట్టి మీరు తినడానికి ఆహారం తీసుకువస్తాను, మీ ఆకలి తీరిన తర్వాత వెళ్లవచ్చు” అని అన్నాడు.
“మంచిది, అలాగే చేయి” అని వారు జవాబిచ్చారు.
6కాబట్టి అబ్రాహాము శారా గుడారంలోకి త్వరపడి వెళ్లి, “త్వరగా మూడు మానికెలు#18:6 సుమారు 16 కి. గ్రా. లు నాణ్యమైన పిండి తెచ్చి, బాగా పిసికి రొట్టెలు చేయి” అని చెప్పాడు.
7తర్వాత అబ్రాహాము పశువుల మంద దగ్గరకు పరుగెత్తి వెళ్లి, లేగదూడను తెచ్చి తన పనివానికి ఇచ్చాడు, ఆ పనివాడు త్వరగా దానిని వండి పెట్టాడు. 8తర్వాత అతడు కొంచెం వెన్న, పాలు, వండిన దూడ మాంసాన్ని వారి ముందు ఉంచాడు. వారు భోజనం చేస్తుండగా, వారి దగ్గర చెట్టు క్రింద అతడు నిలబడ్డాడు.
9“నీ భార్య శారా ఎక్కడ?” అని వారు అడిగారు.
“అదిగో ఆ గుడారంలో ఉంది” అని అబ్రాహాము జవాబిచ్చాడు.
10అప్పుడు వారిలో ఒకరు, “వచ్చే సంవత్సరం ఈ సమయానికి తప్పకుండా నేను నీ దగ్గరకు తిరిగి వస్తాను, అప్పటికి నీ భార్య శారా ఒక కుమారున్ని కలిగి ఉంటుంది” అని అన్నారు.
శారా అతని వెనుక ఉన్న గుడార ద్వారం దగ్గర నిలబడి వింటుంది. 11అబ్రాహాము శారా అప్పటికే చాలా వృద్ధులు, శారా పిల్లలు కనే వయస్సు దాటిపోయింది. 12శారా తనలో తాను నవ్వుకుని, “నేను బలం ఉడిగిన దానిని, నా భర్త కూడా వృద్ధుడు కదా ఇప్పుడు నాకు ఈ భాగ్యం ఉంటుందా?” అని అనుకుంది.
13అప్పుడు యెహోవా అబ్రాహాముతో, “శారా ఎందుకలా నవ్వుకుంది, ‘ముసలిదాన్ని నేను కనగలనా అని ఎందుకు అనుకుంది?’ 14యెహోవాకు అసాధ్యమైనది ఏమైనా ఉందా? వచ్చే సంవత్సరం నియమించబడిన సమయానికి నేను నీ దగ్గరకు తిరిగి వస్తాను, అప్పటికి శారా ఒక కుమారున్ని కంటుంది” అని అన్నారు.
15శారా భయపడి, “నేను నవ్వలేదు” అని అబద్ధమాడింది.
“లేదు, నీవు నవ్వావు” అని ఆయన అన్నారు.
అబ్రాహాము సొదొమ కోసం విజ్ఞప్తి చేస్తాడు
16ఆ మనుష్యులు వెళ్లడానికి లేచి సొదొమ, గొమొర్రాల వైపు చూశారు, అబ్రాహాము వారిని పంపించడానికి వారితో పాటు వెళ్లాడు. 17అప్పుడు యెహోవా ఇలా అన్నారు, “నేను చేయబోతున్న దానిని అబ్రాహాముకు చెప్పకుండ ఎలా దాచగలను? 18అబ్రాహాము ఖచ్చితంగా గొప్ప శక్తిగల దేశం అవుతాడు, అతని ద్వారా భూమి మీద ఉన్న సర్వ దేశాలు#18:18 లేదా దీవించేటప్పుడు అతని పేరు వాడబడుతుంది (48:20 చూడండి) దీవించబడతాయి. 19ఎందుకంటే నేను అతన్ని ఎంచుకున్నాను, అతడు తన పిల్లలను తన తర్వాత తన ఇంటివారిని యెహోవా మార్గంలో నీతి న్యాయాలు జరిగిస్తూ జీవించేలా నడిపిస్తాడు, తద్వారా యెహోవా అబ్రాహాముకు చేసిన వాగ్దానాన్ని జరిగిస్తారు.”
20అప్పుడు యెహోవా, “సొదొమ, గొమొర్రాల గురించిన మొర చాలా గొప్పది, వారి పాపం ఘోరమైనది. 21నేను అక్కడికి వెళ్లి నాకు చేరిన ఫిర్యాదు వలె వారి క్రియలు ఎంత చెడ్డగా ఉన్నాయో చూసి తెలుసుకుంటాను” అని అన్నారు.
22ఆ మనుష్యులు అక్కడినుండి సొదొమ వైపు వెళ్లారు, అయితే అబ్రాహాము యెహోవా సన్నిధిలో నిలిచి#18:22 కొ.ప్రా.ప్ర. లలో; ప్రాచీన హెబ్రీ శాస్త్రుల ఆచారం ఉన్నాడు. 23అప్పుడు అబ్రాహాము ఆయనను సమీపించి, “దుష్టులతో పాటు నీతిమంతులను నిర్మూలం చేస్తారా? 24ఒకవేళ ఆ పట్టణంలో యాభైమంది నీతిమంతులుంటే ఎలా? ఆ యాభైమంది కోసమన్నా ఆ పట్టణాన్ని కాపాడకుండా#18:24 లేదా క్షమించుట; 26 వచనంలో కూడా నిజంగా దానిని నాశనం చేస్తారా? 25అలా నాశనం చేయడం మీకు దూరమవును గాక! దుష్టులతో పాటు నీతిమంతులను చంపడం, దుష్టులను నీతిమంతులను ఒకేలా చూడడము. మీ నుండి ఆ తలంపు దూరమవును గాక! సర్వలోక న్యాయాధిపతి న్యాయం చేయరా?” అని అన్నాడు.
26యెహోవా జవాబిస్తూ, “సొదొమలో యాభైమంది నీతిమంతులను నేను కనుగొంటే, వారిని బట్టి ఆ స్థలం అంతటిని కాపాడతాను” అని అన్నారు.
27అబ్రాహాము మరలా మాట్లాడాడు: “నేను ధూళిని బూడిదను, అయినాసరే నేను ప్రారంభించాను కాబట్టి నేను ప్రభువుతో ఇంకా మాట్లాడతాను. 28ఒకవేళ యాభైమందిలో నీతిమంతులు అయిదుగురు తక్కువైతే అప్పుడు పట్టణం అంతటిని అయిదుగురు తక్కువ ఉన్నందుకు నాశనం చేస్తారా?”
ఆయన, “నేను అక్కడ నలభై అయిదుగురు చూస్తే అప్పుడు దానిని నాశనం చేయను” అన్నారు.
29అబ్రాహాము, “ఒకవేళ నలభైమంది నీతిమంతులు ఉంటే?” అని మరలా అడిగాడు.
“ఆ నలభైమంది కోసం దానిని నాశనం చేయను” అని దేవుడు అన్నారు.
30అప్పుడు అతడు, “ప్రభువు కోప్పడకండి, నన్ను మాట్లాడనివ్వండి. ఒకవేళ అక్కడ ముప్పైమంది నీతిమంతులు మాత్రమే ఉంటే?” అని అడిగాడు.
ఆయన, “ముప్పైమందిని నేను కనుగొంటే నేను నాశనం చేయను” అని జవాబిచ్చారు.
31అబ్రాహాము, “నేను ప్రభువుతో మాట్లాడడానికి తెగించాను; ఒకవేళ అక్కడ ఇరవైమందే మాత్రమే ఉంటే?” అని అన్నాడు.
ఆయన, “ఆ ఇరవైమంది కోసం దానిని నాశనం చేయను” అన్నారు.
32అప్పుడతడు, “ప్రభువా, కోప్పడకండి, నేను ఇంకొక్కసారి మాట్లాడతాను. ఒకవేళ అక్కడ పదిమందే ఉంటే?” అని అడిగాడు.
ఆయన, “ఆ పదిమంది కోసం దానిని నాశనం చేయను” అని జవాబిచ్చారు.
33యెహోవా అబ్రాహాముతో సంభాషణ ముగించిన తర్వాత, ఆయన వెళ్లిపోయారు, అబ్రాహాము తన ఇంటికి తిరిగి వెళ్లాడు.

Okuqokiwe okwamanje:

ఆది 18: OTSA

Qhakambisa

Dlulisela

Kopisha

None

Ufuna ukuthi okuvelele kwakho kugcinwe kuwo wonke amadivayisi akho? Bhalisa noma ngena ngemvume