నిర్గమ 9

9
అయిదవ తెగులు: పశువులకు వ్యాధి
1ఆ తర్వాత యెహోవా మోషేతో, “నీవు ఫరో దగ్గరకు వెళ్లి అతనితో, ‘హెబ్రీయుల దేవుడైన యెహోవా ఇలా చెప్తున్నారు: “నా ప్రజలు నన్ను సేవించేలా, వారిని వెళ్లనివ్వు.” 2నీవు వారిని వెళ్లనివ్వకుండా వారిని ఇంకా నిర్బంధించి ఉంచితే, 3యెహోవా హస్తం పొలంలో ఉన్న నీ పశువుల మీదికి అంటే గుర్రాలు, గాడిదలు, ఒంటెలు, పశువులు, గొర్రెలు మేకల మీదకు భయానకమైన వ్యాధిని తెస్తుంది. 4అయితే యెహోవా ఇశ్రాయేలీయుల పశువులకు ఈజిప్టువారి పశువులకు మధ్య భేదాన్ని చూపిస్తారు. ఇశ్రాయేలీయుల పశువుల్లో ఏ ఒక్కటి చనిపోదు’ అని చెప్పు” అన్నారు.
5యెహోవా సమయాన్ని నిర్ణయించి, “రేపు యెహోవా దీనిని ఈ దేశంలో జరిగిస్తారు” అన్నారు. 6మరునాడు యెహోవా దానిని జరిగించారు: ఈజిప్టువారి పశువులన్నీ చనిపోయాయి కాని, ఇశ్రాయేలీయులకు చెందిన పశువుల్లో ఒకటి కూడా చావలేదు. 7ఫరో దాని గురించి విచారణకు పంపగా ఇశ్రాయేలీయులకు చెందిన పశువుల్లో ఒకటి కూడా చావలేదని తెలిసింది. అయినప్పటికీ ఫరో హృదయం కఠినంగా ఉంది కాబట్టి అతడు ప్రజలను వెళ్లనివ్వలేదు.
ఆరవ తెగులు: కురుపులు
8అయితే యెహోవా మోషే అహరోనులతో, “కొలిమి నుండి చేతి పిడికిలి నిండ బూడిద తీసుకుని, ఫరో ఎదుట మోషే దానిని గాలిలో చల్లాలి. 9అది సన్నని ధూళిగా మారి ఈజిప్టు దేశమంతా వ్యాపించి, దేశంలోని మనుష్యుల మీద జంతువుల మీద చీముపట్టిన కురుపులు పుడతాయి” అన్నారు.
10కాబట్టి వారు కొలిమిలోని బూడిద తీసుకుని ఫరో ఎదుట నిలబడ్డారు. మోషే దానిని గాలిలో చల్లినప్పుడు మనుష్యుల మీద జంతువుల మీద చీముపట్టిన కురుపులు పుట్టాయి. 11ఈజిప్టు వారందరి మీద, తమ మీద ఆ కురుపులు ఉండడం వల్ల మంత్రగాళ్ళు మోషే ఎదుట నిలబడలేకపోయారు. 12అయితే యెహోవా మోషేకు చెప్పినట్లే, మోషే అహరోనుల మాట వినకుండ యెహోవా ఫరో హృదయాన్ని కఠినపరిచారు.
ఏడవ తెగులు: వడగండ్లు
13అప్పుడు యెహోవా మోషేతో, “నీవు ప్రొద్దున లేచి ఫరో ఎదుటకు వెళ్లి అతనితో, ‘హెబ్రీయుల దేవుడైన యెహోవా చెప్పే మాట ఇదే: నన్ను సేవించడానికి నా ప్రజలను వెళ్లనివ్వు. 14లేకపోతే భూమి అంతటి మీద నా వంటి వారెవరు లేరని నీవు తెలుసుకునేలా ఈసారి నేను నీ అధికారుల పైకి నీ ప్రజలమీదికి నా తెగుళ్ళ యొక్క పూర్తి శక్తిని పంపుతాను. 15ఈపాటికి నేను నా చేయిని చాచి, నిన్ను నీ ప్రజలను తెగులుతో మొత్తగలిగేవాన్ని, అది మిమ్మల్ని భూమి నుండి తుడిచిపెట్టేది. 16కాని నేను నా బలాన్ని నీకు చూపించాలని భూలోకమంతా నా నామం ప్రకటించబడాలనే ఉద్దేశంతో నేను నిన్ను లేవనెత్తాను. 17నీవింకా నా ప్రజలకు వ్యతిరేకంగా ఉంటూ వారిని వెళ్లనివ్వడం లేదు. 18కాబట్టి రేపు ఈ సమయానికి నేను ఈజిప్టు ఏర్పడిన రోజు నుండి ఇప్పటివరకు ఎన్నడు పడని భయంకరమైన వడగండ్ల తుఫాను పంపుతాను. 19కాబట్టి ఇప్పుడే నీ పశువులను నీ పొలంలో ఉన్న సమస్తాన్ని సురక్షితమైన చోటుకు తీసుకురమ్మని ఆజ్ఞాపించు, ఎందుకంటే ఇంటికి రప్పింపబడక పొలంలోనే ఉన్న ప్రతి మనిషి మీద జంతువుల మీద వడగండ్లు పడతాయి, అప్పుడు మనుష్యులు చనిపోతారు, జంతువులు చనిపోతాయి’ అని చెప్పు” అన్నారు.
20ఫరో సేవకులలో యెహోవా మాట విని భయపడినవారు తమ బానిసలను తమ పశువులను తమ ఇళ్ళకు త్వరపడి రప్పించారు. 21అయితే యెహోవా మాటను లక్ష్యపెట్టనివారు తమ బానిసలను తమ పశువులను పొలంలోనే విడిచిపెట్టారు.
22అప్పుడు యెహోవా మోషేతో, “నీ చేయి ఆకాశం వైపు చాపు అప్పుడు ఈజిప్టు అంతా మనుష్యుల మీద జంతువుల మీద ఈజిప్టు పొలాల్లో పెరిగే ప్రతి దాని మీద వడగండ్లు పడతాయి” అని చెప్పారు. 23మోషే తన కర్రను ఆకాశం వైపు చాచినప్పుడు, యెహోవా ఉరుములను వడగండ్లను పంపినప్పుడు మెరుపులు వేగంగా నేలను తాకాయి. ఈజిప్టు దేశమంతటా యెహోవా వడగండ్లు కురిపించారు. 24వడగండ్లు పడ్డాయి, మెరుపులు ఇటు అటు మెరిసాయి. ఈజిప్టు దేశమంతా ఒక దేశంగా ఏర్పడిన తర్వాత ఇది అత్యంత భయంకరమైన తుఫాను. 25ఆ వడగండ్లు ఈజిప్టు దేశమంతటా, పొలాల్లో ఉన్న మనుష్యులను జంతువులను నాశనం చేశాయి; పొలాల్లో పెరుగుతున్నవన్నీ పాడయ్యాయి, ప్రతి చెట్టు విరిగిపోయింది. 26అయితే ఇశ్రాయేలీయులు ఉన్న గోషేను దేశంలో మాత్రమే వడగండ్లు పడలేదు.
27అప్పుడు ఫరో మోషే అహరోనులను పిలిపించి, “ఈసారి నేను పాపం చేశాను, యెహోవా న్యాయవంతుడు, నేను నా ప్రజలు దోషులము. 28యెహోవాకు ప్రార్థించండి, ఎందుకంటే ఇంతవరకు పడిన ఉరుములు వడగండ్లు చాలు. నేను మిమ్మల్ని వెళ్లనిస్తాను; మీరు ఇక ఇక్కడ ఉండనవసరం లేదు” అని అన్నాడు.
29అందుకు మోషే, “నేను పట్టణంలో నుండి బయటకు వెళ్లగానే, నా చేతులు చాపి యెహోవాకు ప్రార్థిస్తాను. అప్పుడు ఉరుములు ఆగిపోతాయి, ఇక వడగండ్లు ఉండవు, కాబట్టి భూమి యెహోవాదే అని నీవు తెలుసుకుంటావు. 30అయినప్పటికీ నీవు నీ అధికారులు ఇంకా యెహోవాకు భయపడడంలేదని నాకు తెలుసు” అన్నాడు.
31అప్పుడు యవలు వెన్నులు వేశాయి అవిసె పూలు పూసాయి కాబట్టి అవి నాశనం చేయబడ్డాయి. 32గోధుమలు, మరో రకం గోధుమలు ఇంకా ఎదగలేదు, అవి తర్వాత ఎదుగుతాయి కాబట్టి అవి నాశనం చేయబడలేదు.
33అప్పుడు మోషే ఫరో దగ్గరనుండి బయలుదేరి పట్టణం నుండి బయటకు వెళ్లి యెహోవా వైపు చేతులు చాపినప్పుడు ఉరుములు వడగండ్లు ఆగిపోయాయి. నేలపై వర్షం కురవడం ఆగిపోయింది. 34వర్షం వడగండ్లు ఉరుములు ఆగిపోవడం ఫరో చూసినప్పుడు, అతడు మరలా పాపం చేశాడు: అతడు అతని అధికారులు తమ హృదయాలను కఠినం చేసుకున్నారు. 35యెహోవా మోషే ద్వారా చెప్పినట్లే ఫరో హృదయం కఠినపరచబడింది; అతడు ఇశ్రాయేలీయులను వెళ్లనివ్వలేదు.

Okuqokiwe okwamanje:

నిర్గమ 9: OTSA

Qhakambisa

Dlulisela

Kopisha

None

Ufuna ukuthi okuvelele kwakho kugcinwe kuwo wonke amadivayisi akho? Bhalisa noma ngena ngemvume