నిర్గమ 6
6
1అప్పుడు యెహోవా మోషేతో, “ఇప్పుడు నేను ఫరోకు ఏం చేయబోతున్నానో నీవు చూస్తావు: నా బలమైన హస్తాన్ని బట్టి అతడు వారిని వెళ్లనిస్తాడు; నా బలమైన హస్తాన్ని బట్టి అతడు వారిని తన దేశం నుండి తరిమివేస్తాడు” అన్నారు.
2దేవుడు మోషేతో అన్నారు, “నేను యెహోవాను. 3నేను సర్వశక్తిగల#6:3 హెబ్రీలో ఎల్-షద్దాయ్ దేవునిగా అబ్రాహాము, ఇస్సాకు, యాకోబులకు ప్రత్యక్షమయ్యాను, కాని యెహోవా#6:3 3:15 నోట్ చూడండి అనే నా పేరుతో నన్ను నేను వారికి తెలియపరచుకోలేదు. 4వారు విదేశీయులుగా ఉండిన కనాను దేశాన్ని వారికి ఇస్తాననే నా నిబంధనతో నేను వారిని స్థిరపరిచాను. 5అంతేకాక, ఈజిప్టు వారిచేత బానిసలుగా చేయబడిన ఇశ్రాయేలీయుల మూలుగును నేను విన్నాను, నా నిబంధనను జ్ఞాపకం చేసుకున్నాను.
6“కాబట్టి, ఇశ్రాయేలీయులతో ఇలా చెప్పు: ‘నేను యెహోవాను, ఈజిప్టువారి వెట్టిచాకిరి నుండి నేను మిమ్మల్ని బయటకు తీసుకువస్తాను. మీరు వారికి బానిసలుగా ఉండకుండ నేను మిమ్మల్ని స్వతంత్రులను చేస్తాను, చాపబడిన బాహువుతో, గొప్ప తీర్పు చర్యలతో నేను మిమ్మల్ని విమోచిస్తాను. 7నేను మిమ్మల్ని నా సొంత ప్రజలుగా చేసుకుని, మీకు దేవుడనై ఉంటాను. అప్పుడు ఈజిప్టువారి కాడి క్రిందనుండి మిమ్మల్ని బయటకు తీసుకువచ్చిన మీ దేవుడైన యెహోవాను నేనే అని మీరు తెలుసుకుంటారు. 8నేను అబ్రాహాము, ఇస్సాకు, యాకోబులకు చేయెత్తి ప్రమాణం చేసిన దేశానికి మిమ్మల్ని తీసుకెళ్తాను. దానిని మీకు స్వాస్థ్యంగా ఇస్తాను. నేను యెహోవాను.’ ”
9మోషే ఇశ్రాయేలీయులకు ఈ విషయాన్ని తెలియజేశాడు, కాని వారి కఠినమైన శ్రమను బట్టి, నిరుత్సాహాన్ని బట్టి వారు అతని మాట వినలేదు.
10అప్పుడు యెహోవా మోషేతో ఇలా అన్నారు, 11“వెళ్లు, ఇశ్రాయేలీయులను తన దేశం నుండి బయటకు వెళ్లనివ్వమని ఈజిప్టు రాజైన ఫరోకు చెప్పు.”
12అయితే మోషే యెహోవాతో, “ఇశ్రాయేలీయులే నా మాట వినకపోతే స్పష్టంగా మాట్లాడలేని నా మాట ఫరో ఎందుకు వింటాడు?#6:12 హెబ్రీలో సున్నతి చేయబడని పెదవులు గలవాడను నిర్గమ 6:30 లో కూడా” అని అన్నాడు.
మోషే అహరోనుల కుటుంబ వివరాలు
13అప్పుడు యెహోవా మోషే అహరోనులతో ఇశ్రాయేలీయులను గురించి ఈజిప్టు రాజైన ఫరోను గురించి మాట్లాడి, ఇశ్రాయేలీయులను ఈజిప్టులో నుండి బయటకు తీసుకురమ్మని వారిని ఆదేశించారు.
14వారి కుటుంబాలకు మూలపురుషులు వీరే:
ఇశ్రాయేలు మొదటి కుమారుడైన రూబేను కుమారులు:
హనోకు, పల్లు, హెస్రోను, కర్మీ;
ఇవి రూబేను వంశాలు.
15షిమ్యోను కుమారులు:
యెమూయేలు, యామీను, ఓహదు, యాకీను, సోహరు, కనాను స్త్రీకి పుట్టిన షావూలు;
ఇవి షిమ్యోను వంశాలు.
16కుటుంబ వివరాల ప్రకారం లేవీ కుమారుల పేర్లు:
గెర్షోను, కహాతు, మెరారి.
(లేవీ 137 సంవత్సరాలు బ్రతికాడు.)
17వంశాల ప్రకారం గెర్షోను కుమారులు:
లిబ్నీ, షిమీ.
18కహాతు కుమారులు:
అమ్రాము, ఇస్హారు, హెబ్రోను, ఉజ్జీయేలు.
(కహాతు 133 సంవత్సరాలు బ్రతికాడు.)
19మెరారి కుమారులు:
మహలి, మూషి.
వారి కుటుంబ వివరాల ప్రకారం ఇవి లేవీ వంశాలు.
20అమ్రాము తన మేనత్తయైన యోకెబెదును పెళ్ళి చేసుకున్నాడు. వారికి అహరోను మోషేలు పుట్టారు.
(అమ్రాము 137 సంవత్సరాలు బ్రతికాడు.)
21ఇస్హారు కుమారులు:
కోరహు, నెఫెగు, జిఖ్రీ.
22ఉజ్జీయేలు కుమారులు:
మిషాయేలు, ఎల్సాఫాను, సిత్రీ.
23అహరోను అమ్మీనాదాబు కుమార్తె నయస్సోను సహోదరియైన ఎలీషేబను పెళ్ళి చేసుకున్నాడు. ఆమె అతనికి నాదాబు, అబీహు, ఎలియాజరు, ఈతామారులను కన్నది.
24కోరహు కుమారులు:
అస్సీరు, ఎల్కానా, అబీయాసాపు.
ఇవి కోరహు వంశాలు.
25అహరోను కుమారుడైన ఎలియాజరు పుతీయేలు కుమార్తెలలో ఒకరిని పెళ్ళి చేసుకున్నాడు, ఆమె అతనికి ఫీనెహాసును కన్నది.
వీరు వంశాల ప్రకారం, లేవీ కుటుంబాల పెద్దలు.
26“ఇశ్రాయేలీయులను వారి విభజనల ప్రకారం ఈజిప్టులో నుండి బయటకు తీసుకురండి” అని యెహోవా ఆజ్ఞాపించిన అహరోను మోషేలు వీరే. 27ఇశ్రాయేలీయులను ఈజిప్టులో నుండి బయటకు తీసుకురావడం గురించి ఈజిప్టు రాజైన ఫరోతో మాట్లాడిన అహరోను మోషేలు వీరే.
మోషే కోసం అహరోను మాట్లాడుట
28ఇక ఈజిప్టు దేశంలో యెహోవా మోషేతో మాట్లాడినప్పుడు, 29ఆయన మోషేతో, “నేను యెహోవానై ఉన్నాను. నేను నీకు ఆజ్ఞాపించిన వాటన్నిటిని ఈజిప్టు రాజైన ఫరోతో చెప్పు” అన్నారు.
30కాని మోషే యెహోవాతో, “తడబడే పెదవులతో మాట్లాడే నా మాటను ఫరో ఎందుకు వింటాడు?” అని అన్నాడు.
Okuqokiwe okwamanje:
నిర్గమ 6: OTSA
Qhakambisa
Dlulisela
Kopisha

Ufuna ukuthi okuvelele kwakho kugcinwe kuwo wonke amadivayisi akho? Bhalisa noma ngena ngemvume
Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం™
ప్రచురణ హక్కులు © 1976, 1990, 2022, 2024 by Biblica, Inc.
Biblica® Open Telugu Contemporary Version™
Copyright © 1976, 1990, 2022, 2024 by Biblica, Inc.