నిర్గమ 13
13
మొదటి సంతానాన్ని ప్రతిష్ఠించడం
1యెహోవా మోషేతో ఇలా చెప్పారు, 2“ప్రతీ మొదటి మగ సంతానాన్ని నాకు ప్రతిష్ఠించండి. ఇశ్రాయేలీయుల మనుష్యుల్లోనైనా పశువుల్లోనైనా ప్రతి గర్భం యొక్క మొదటి సంతానం నాదే.”
3అప్పుడు మోషే ప్రజలతో ఇలా అన్నాడు, “మీరు బానిసలుగా ఉన్న ఈజిప్టు నుండి మీరు బయటకు వచ్చిన ఈ రోజును మీరు స్మారకోత్సవంగా జరుపుకోండి, ఎందుకంటే యెహోవా తన బలమైన హస్తంతో దాని నుండి మిమ్మల్ని బయటకు రప్పించారు. పులిసిన దేన్ని తినకూడదు. 4అబీబు#13:4 అబీబు పురాతన హెబ్రీ క్యాలెండర్ ప్రకారం మొదటి నెల మార్చి ఏప్రిల్ నెలల్లో వస్తుంది. అనే ఈ నెలలో ఈ రోజున మీరు బయలుదేరారు. 5యెహోవా కనానీయుల హిత్తీయుల అమోరీయుల హివ్వీయుల యెబూసీయుల దేశం మీకు ఇస్తానని మీ పూర్వికులకు ప్రమాణం చేసిన పాలు తేనెలు ప్రవహించే దేశానికి మిమ్మల్ని రప్పించినప్పుడు ఈ నెలలో మీరు ఈ సేవలు జరిగించాలి. 6ఏడు రోజులు మీరు పులియని రొట్టెలు తినాలి, ఏడవ రోజున యెహోవాకు పండుగ చేయాలి. 7ఈ ఏడు రోజులు పులియని రొట్టెలు తినాలి; పులిసినదేది మీ మధ్య కనపడకూడదు. మీ సరిహద్దుల లోపల ఎక్కడా పులిసినది కనపడకూడదు. 8ఆ రోజున, ‘నేను ఈజిప్టు నుండి బయటకు వచ్చినప్పుడు యెహోవా నాకు చేసిన దానిని బట్టి నేను ఇది చేస్తున్నాను’ అని నీ కుమారునితో చెప్పాలి. 9యెహోవా తన బలమైన హస్తంతో మిమ్మల్ని ఈజిప్టులో నుండి బయటకు రప్పించారు కాబట్టి యెహోవా ధర్మశాస్త్రం మీ నోటిలో ఉండేలా ఈ సంస్కారం మీ చేతి మీద ఒక గుర్తుగా మీ నుదుటి మీద ఒక జ్ఞాపకంగా ఉంటుంది. 10ప్రతి సంవత్సరం నిర్ణయ కాలంలో మీరు ఈ సంస్కారాన్ని ఆచరించాలి.
11“యెహోవా మీకు మీ పూర్వికులకు ప్రమాణంతో వాగ్దానం చేసిన ప్రకారం కనాను దేశంలోనికి మిమ్మల్ని తీసుకువచ్చి దానిని మీకు ఇచ్చిన తర్వాత, 12ప్రతి గర్భం యొక్క మొదటి సంతానాన్ని మీరు యెహోవాకు వేరుగా ఉంచాలి. మీ పశువుల మొదటి మగపిల్లలు యెహోవాకు చెందుతాయి. 13ప్రతి మొదటి సంతానమైన గాడిదను గొర్రెపిల్లతో విడిపించాలి, కాని ఒకవేళ దానిని విడిపించకపోతే, దాని మెడ విరిచివేయాలి. మీ కుమారులలో మనుష్యుల ప్రతి మొదటి మగ సంతానాన్ని విడిపించుకోవాలి.
14“భవిష్యత్తులో మీ కుమారుడు, ‘దీని అర్థమేంటి?’ అని మిమ్మల్ని అడిగినప్పుడు, మీరు వానితో ఇలా చెప్పాలి, ‘బలమైన హస్తంతో యెహోవా బానిస దేశమైన ఈజిప్టు నుండి మమ్మల్ని బయటకు రప్పించారు. 15ఫరో మమ్మల్ని వెళ్లనివ్వకుండా తన మనస్సు కఠినం చేసుకుని నిరాకరించినప్పుడు, యెహోవా ఈజిప్టులో ఉన్న మనుష్యుల, పశువుల మొదటి సంతానమంతటిని చంపేశారు. ఆ కారణంగానే ప్రతి గర్భం యొక్క మొదటి మగ పిల్లను యెహోవాకు బలి ఇచ్చి, నా కుమారులలో ప్రతి మొదటి సంతానాన్ని విడిపించుకుంటాను.’ 16యెహోవా తన బలమైన హస్తంతో మమ్మల్ని ఈజిప్టులో నుండి బయటకు రప్పించారు అనడానికి ఇది మీ చేతి మీద ఒక గుర్తుగా మీ నుదుటి మీద ఒక ముద్రగా ఉంటుంది.”
సముద్రాన్ని దాటడం
17ఫరో ప్రజలను వెళ్లనిచ్చినప్పుడు, ఫిలిష్తీయుల దేశం గుండా దగ్గర మార్గం ఉన్నప్పటికీ దేవుడు వారిని ఆ మార్గంలో నడిపించలేదు. ఎందుకంటే, “ఒకవేళ ఈ ప్రజలు యుద్ధాన్ని చూసి, వారు మనస్సు మార్చుకొని తిరిగి ఈజిప్టుకు వెళ్తారేమో” అని దేవుడు అనుకున్నారు. 18కాబట్టి దేవుడు వారిని చుట్టూ త్రిప్పి అరణ్యమార్గంలో ఎర్ర సముద్రం వైపు నడిపించారు. ఇశ్రాయేలీయులు యుద్ధానికి సిద్ధపడి ఈజిప్టు నుండి బయటకు వచ్చారు.
19యోసేపు ఇశ్రాయేలీయులతో, “దేవుడు ఖచ్చితంగా మిమ్మల్ని దర్శించడానికి వస్తారు, అప్పుడు మీరు నా ఎముకలను ఈ ప్రదేశం నుండి మీతో తీసుకెళ్లాలి” అని ప్రమాణం చేయించుకున్నాడు. కాబట్టి మోషే యోసేపు ఎముకలను తనతో తీసుకున్నాడు.#13:19 ఆది 50:25 చూడండి
20వారు సుక్కోతు నుండి బయలుదేరి ఏతాము ఎడారి అంచున గుడారాలు వేసుకున్నారు. 21వారు పగలు రాత్రి ప్రయాణం చేయగలిగేలా యెహోవా పగటివేళ మేఘస్తంభంలో రాత్రివేళ వారికి వెలుగివ్వడానికి అగ్నిస్తంభంలో ఉండి వారికి ముందుగా నడిచారు. 22పగటివేళ మేఘస్తంభం గాని, రాత్రివేళ అగ్నిస్తంభం గాని ప్రజల ఎదుట నుండి వాటి స్థలం వదిలిపోలేదు.
Okuqokiwe okwamanje:
నిర్గమ 13: OTSA
Qhakambisa
Dlulisela
Kopisha

Ufuna ukuthi okuvelele kwakho kugcinwe kuwo wonke amadivayisi akho? Bhalisa noma ngena ngemvume
Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం™
ప్రచురణ హక్కులు © 1976, 1990, 2022, 2024 by Biblica, Inc.
Biblica® Open Telugu Contemporary Version™
Copyright © 1976, 1990, 2022, 2024 by Biblica, Inc.