నిర్గమ 11

11
పదవ తెగులు: మొదటి సంతానం చంపబడడం
1అప్పుడు యెహోవా మోషేతో ఇలా అన్నారు, “ఫరో మీదికి ఈజిప్టు మీదికి నేను మరొక తెగులును తీసుకువస్తాను. దాని తర్వాత అతడు మిమ్మల్ని వెళ్లనిస్తాడు. అతడు మిమ్మల్ని వెళ్లనిచ్చినప్పుడు అతడు ఇక్కడినుండి మిమ్మల్ని పూర్తిగా వెళ్లగొడతాడు. 2పురుషులు స్త్రీలు తమ పొరుగువారి నుండి వెండి బంగారు వస్తువులను అడిగి తీసుకోవాలని ప్రజలకు చెప్పు.” 3యెహోవా ఇశ్రాయేలు ప్రజల పట్ల ఈజిప్టువారికి కనికరం కలిగేలా చేశారు, అంతేకాక మోషే ఈజిప్టు దేశంలో ఫరో అధికారులచేత ప్రజలచేత గొప్పగా గౌరవించబడ్డాడు.
4మోషే ఫరోతో, “యెహోవా చెప్పిన మాట ఇదే: ‘మధ్యరాత్రి నేను ఈజిప్టు దేశం గుండా వెళ్తాను. 5అప్పుడు ఈజిప్టులోని ప్రతి మొదటి సంతానం చస్తారు, సింహాసనం మీద కూర్చునే ఫరో మొదటి సంతానం మొదలుకొని తిరగలి విసిరే దాసి మొదటి సంతానం వరకు, పశువుల్లో కూడా మొదట పుట్టినవి చస్తాయి. 6అప్పుడు ఈజిప్టు దేశమంతటా పెద్ద రోదన ఉంటుంది. అటువంటి రోదన గతంలో ఎప్పుడూ లేదు ఇకముందు ఉండదు. 7అయితే ఇశ్రాయేలీయులలో ఏ వ్యక్తిని చూసి కానీ లేదా జంతువును చూసి గాని ఒక కుక్క కూడా మొరుగదు.’ అప్పుడు యెహోవా ఈజిప్టు, ఇశ్రాయేలు మధ్య భేదం చూపించారని మీకు తెలుస్తుంది. 8అప్పుడు మీ అధికారులైన వీరందరు నా దగ్గరకు వచ్చి నా ఎదుట తలవంచి, ‘నీవు, నిన్ను అనుసరించే ప్రజలందరు వెళ్లండి’ అని చెప్తారు. అప్పుడు నేను వెళ్తాను” అని చెప్పి మోషే తీవ్రమైన కోపంతో ఫరో దగ్గర నుండి వెళ్లిపోయాడు.
9అప్పుడు యెహోవా మోషేతో, “ఈజిప్టు దేశంలో నా అద్భుతాలు అధికమయ్యేలా ఫరో నీ మాట వినడం తృణీకరిస్తాడు” అన్నారు. 10మోషే అహరోనులు ఫరో ఎదుట ఈ అద్భుతాలన్నిటిని చేశారు, కాని యెహోవా ఫరో హృదయాన్ని కఠినపరిచారు కాబట్టి అతడు ఇశ్రాయేలు ప్రజలను తన దేశం నుండి బయటకు వెళ్లనివ్వలేదు.

Okuqokiwe okwamanje:

నిర్గమ 11: OTSA

Qhakambisa

Dlulisela

Kopisha

None

Ufuna ukuthi okuvelele kwakho kugcinwe kuwo wonke amadivayisi akho? Bhalisa noma ngena ngemvume