YouVersion 標識
搜索圖示

లూకా సువార్త 20

20
యేసు అధికారాన్ని ప్రశ్నించుట
1ఒకనాడు యేసు దేవాలయ ఆవరణంలో ప్రజలకు బోధిస్తూ సువార్తను ప్రకటిస్తూ ఉండగా, ముఖ్య యాజకులు, ధర్మశాస్త్ర ఉపదేశకులు, నాయకులతో కలసి ఆయన దగ్గరకు వచ్చారు. 2వారు, “నీవు ఏ అధికారంతో ఈ కార్యాలను చేస్తున్నావో మాకు చెప్పు, నీకు ఈ అధికారం ఎవరిచ్చారు?” అని అడిగారు.
3అందుకు యేసు, “నేను మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతాను: 4యోహానుకు ఇచ్చిన బాప్తిస్మం పరలోకం నుండి కలిగిందా? లేదా మానవుల నుండి కలిగిందా?”
5వారు తమలో తాము చర్చించుకొంటూ, “ఒకవేళ మనం ‘పరలోకం నుండి కలిగింది’ అని చెప్పితే ‘మరి మీరు ఎందుకు అతన్ని నమ్మలేదు?’ 6ఒకవేళ మనం, ‘మనుష్యుల వలన’ అని చెప్తే ప్రజలు రాళ్లతో కొడతారు, ఎందుకంటే వారికి యోహాను ఒక ప్రవక్త అని గట్టి నమ్మకం” అని అనుకున్నారు.
7అందుకు వారు, “అది ఎక్కడ నుండి వచ్చిందో మాకు తెలియదు” అని జవాబిచ్చారు.
8అందుకు యేసు, “నేను కూడా ఏ అధికారంతో వీటిని చేస్తున్నానో చెప్పను” అన్నారు.
కౌలు రైతుల ఉపమానం
9ఆయన ప్రజల వైపు తిరిగి ఈ ఉపమానం చెప్పడం మొదలుపెట్టారు: “ఒక మనుష్యుడు ద్రాక్షతోటను నాటించి, దానిని కొందరు కౌలురైతులకు అద్దెకు ఇచ్చి, దూర దేశానికి వెళ్లి చాలా కాలం అక్కడే ఉన్నాడు. 10కోతకాలం వచ్చినప్పుడు అతడు ఒక పనివానిని ఆ ద్రాక్షతోటకు వెళ్లి దానిలోని తన భాగం తెమ్మని ఆ రైతుల దగ్గరకు పంపాడు, కాని ఆ రైతులు వానిని కొట్టి వట్టి చేతులతో పంపివేశారు. 11మళ్ళీ అతడు మరొక పనివానిని పంపించాడు. వారు వానిని కూడా కొట్టి అవమానపరచి, వట్టి చేతులతో పంపారు. 12మళ్ళీ అతడు మూడవ వానిని పంపించాడు. వారు వానిని గాయపరచి బయటకు తోసివేసారు.
13“అప్పుడా ద్రాక్షతోట యజమాని ‘నేనేమి చేయాలి? నేను ప్రేమించే నా కుమారున్ని పంపిస్తాను, వారు ఒకవేళ అతన్ని గౌరవిస్తారేమో’ అని అనుకున్నాడు.
14“కాని ఆ కౌలు రైతులు అతన్ని చూసి, ‘ఇతడే వారసుడు, ఇతన్ని చంపుదాం, అప్పుడు ఈ వారసత్వం మనదైపోతుంది’ అని ఒకనితో ఒకరు చెప్పుకొని, 15కాబట్టి వారు అతన్ని బయటకు తీసుకెళ్లి, చంపి, అతని శరీరాన్ని ద్రాక్షతోట బయట పడవేశారు.
“అప్పుడు ఆ ద్రాక్షతోట యజమాని ఏమి చేస్తాడు? 16అతడు వచ్చి ఆ కౌలురైతులను చంపి తన ద్రాక్షతోటను ఇతరులకు అప్పగిస్తాడు” అని చెప్పారు.
అది విన్న వారు, “అలా ఎన్నటికి కాకూడదు” అన్నారు.
17యేసు సూటిగా వారిని చూసి, “అలాగైతే లేఖనాల్లో,
“ ‘ఇల్లు కట్టేవారు నిషేధించిన రాయి
మూలరాయి అయ్యింది’#20:17 కీర్తన 118:22 అని వ్రాయబడిన మాటకు అర్థం ఏమిటి?
18ఈ రాయి మీద పడిన ప్రతివారు ముక్కలైపోతారు, కాని ఎవరి మీద రాయి పడుతుందో వారు దాని క్రింద నలిగిపోతారు” అని చెప్పారు.
19ఇది విన్న ముఖ్య యాజకులు, ధర్మశాస్త్ర ఉపదేశకులు ఆయన తమ గురించే ఆయన ఈ ఉపమానం చెప్పారని గ్రహించి, ఎలాగైనా ఆయనను త్వరగా బంధించడానికి అవకాశం కోసం చూస్తూ ఉన్నారు. కాని ప్రజలకు భయపడ్డారు.
కైసరుకు పన్ను కట్టుట
20ఆయనపై నిఘా వేసి ఉంచడానికి, వారు యథార్థంగా ఉన్నట్లు నటించగల వేగులవారిని పంపారు. యేసు మాట్లాడే దాంట్లో ఏదో తప్పు పట్టి ఆయనను పట్టుకుని, ఆయనను అధిపతి యొక్క అధికారానికి, ప్రభావానికి అప్పగించవచ్చని వారు ఆశించారు. 21అయితే ఆ వేగులవారు వచ్చి, “బోధకుడా, నీవు న్యాయంగా మాట్లాడుతూ బోధిస్తావని మాకు తెలుసు. నీవు ఏ పక్షపాతం చూపకుండ, దేవుని మార్గాన్ని సత్యం ఆధారంగా బోధిస్తావు. 22అయితే మనం కైసరుకు పన్ను చెల్లించడం న్యాయమా కాదా?” అని యేసును అడిగారు.
23ఆయన వారి కుయుక్తిని ఎరిగి, వారితో, 24“నాకు ఒక దేనారాన్ని చూపించండి, దీనిపై ఉన్న బొమ్మ ఎవరిది? ఈ వ్రాయబడిన ముద్ర ఎవరిది?” అని అడిగారు.
అందుకు వారు, “కైసరువి” అన్నారు.
25అప్పుడు ఆయన, “అలాగైతే కైసరువి కైసరుకు, దేవునివి దేవునికి చెల్లించండి” అని వారితో చెప్పారు.
26మాటల్లో చిక్కులు పెట్టాలని చూసినవారు ప్రజల ముందు ఆయన మాటలను తప్పు పట్టలేక ఆయన జవాబుకు ఆశ్చర్యపడి నిశ్శబ్దమై పోయారు.
పునరుత్థానం పెళ్ళి
27పునరుత్థానం లేదని చెప్పే సద్దూకయ్యులు కొందరు, యేసు దగ్గరకు ఒక ప్రశ్నతో వచ్చారు, 28“బోధకుడా, పెళ్ళి చేసుకున్న ఒక వ్యక్తి సంతానం లేకుండా చనిపోతే, వాని సోదరుడు ఆ విధవరాలిని పెళ్ళి చేసికొని చనిపోయిన తన సోదరునికి సంతానం కలిగించాలని మోషే మాకోసం వ్రాశాడు. 29అయితే ఒక కుటుంబంలో ఏడుగురు సహోదరులు ఉన్నారు. మొదటివాడు ఒక స్త్రీని పెళ్ళి చేసుకుని సంతానం లేకుండానే చనిపోయాడు. 30రెండవవాడు, 31అదే విధంగా మూడవవాడు కూడా ఆమెను పెళ్ళి చేసుకున్నాడు, ఆ విధంగా ఏడుగురు సంతానం లేకుండానే చనిపోయారు. 32చివరికి ఆ స్త్రీ కూడా చనిపోయింది. 33ఆమెను ఏడుగురు పెళ్ళి చేసుకున్నారు కాబట్టి పునరుత్థానంలో ఆమె ఎవరికి భార్యగా ఉంటుంది?” అని అడిగారు.
34అందుకు యేసు, “ఈ యుగానికి చెందినవారు పెళ్ళి చేసుకొంటారు, పెళ్ళికి ఇవ్వబడతారు గాని 35మృతుల పునరుత్థానం పొంది రానున్న యుగానికి యోగ్యులుగా ఎంచబడేవారు పెళ్ళి చేసుకోరు, పెళ్ళికివ్వబడరు. 36వారు ఎన్నడు చావనే చావరు. దూతల్లా ఉంటారు. వారు పునరుత్థాన సంతానంగా దేవుని పిల్లలు అవుతారు. 37అయితే మృతులు తిరిగి లేచే విషయం చెప్తూ ఇలా అన్నారు: మండుతున్న పొద సంఘటనలో మోషే, ‘అబ్రాహాము దేవుడు ఇస్సాకు దేవుడు యాకోబు దేవుడు’#20:37 నిర్గమ 3:6 అని చెప్తూ మృతులు లేస్తారని సూచించాడు. 38ఆయన దృష్టిలో అందరు జీవించే ఉన్నారు కాబట్టి ఆయన మృతులకు దేవుడు కాడు, సజీవులకే దేవుడు” అని వారికి జవాబిచ్చారు.
39ధర్మశాస్త్ర ఉపదేశకులలో కొందరు, “బోధకుడా, నీవు చాలా బాగా చెప్పావు” అని అన్నారు. 40ఆ తర్వాత ఎవరు కూడా ఆయనను ప్రశ్నలు అడగడానికి ధైర్యం చేయలేదు.
క్రీస్తు ఎవరి కుమారుడు?
41యేసు వారితో, “క్రీస్తు దావీదు కుమారుడని ఎందుకు చెప్పబడింది? 42దావీదే స్వయంగా కీర్తనల గ్రంథంలో ఈ విధంగా వ్రాశాడు:
“ ‘నేను నీ శత్రువులను
నీ పాదాలకు పాదపీఠంగా చేసే వరకు
43“నీవు నా కుడి వైపున కూర్చోమని
ప్రభువు నా ప్రభువుతో చెప్పారు.” ’#20:43 కీర్తన 110:1
44దావీదే ఆయనను, ‘ప్రభువు’ అని పిలిచినప్పుడు ఆయన అతనికి కుమారుడెలా అవుతాడు?”
ధర్మశాస్త్ర ఉపదేశకులను గురించి హెచ్చరించిన యేసు
45ప్రజలందరు వింటూ ఉండగా, యేసు తన శిష్యులతో, 46“ధర్మశాస్త్ర ఉపదేశకులను గురించి జాగ్రత్తగా ఉండండి. వారు పొడుగు అంగీలు వేసుకుని సంత వీధుల్లో తిరుగుతూ ప్రజల నుండి గౌరవం అందుకోవడానికి ఇష్టపడతారు. వారు సమాజమందిరాల్లో ముఖ్యమైన స్థానాలను విందుల్లో గౌరవ స్థలాలను పొందాలని కోరుకుంటారు. 47వారు విధవరాండ్ర గృహాలను దోచుకుంటూ, ప్రజల ముందు చూపించుకోడానికి ఎక్కువసేపు ప్రార్థనలు చేస్తారు. ఇలాంటివారు తీవ్రంగా శిక్షింపబడతారు” అని చెప్పారు.

醒目顯示

分享

複製

None

想要在所有設備上保存你的醒目顯示嗎? 註冊或登入