YouVersion 標識
搜索圖示

లూకా 19

19
1ఆయన సంచరించుచు యెరికో పట్టణములో ప్రవేశించి 2దానిగుండా పోవుచుండెను. ఇదిగో సుంకపు గుత్తదారుడును ధనవంతుడునైన జక్కయ్య అను పేరుగల ఒకడు 3యేసు ఎవరోయని చూడగోరెనుగాని, పొట్టివాడైనందున జనులు గుంపుకూడి యుండుటవలన చూడ లేకపోయెను. 4అప్పుడు యేసు ఆ త్రోవను రానై యుండెను గనుక అతడు ముందుగా పరుగెత్తి, ఆయనను చూచుటకు ఒక మేడి చెట్టెక్కెను. 5యేసు ఆ చోటికి వచ్చినప్పుడు, కన్నులెత్తి చూచి–జక్కయ్యా త్వరగా దిగుము, నేడు నేను నీ యింట నుండవలసియున్నదని అతనితో చెప్పగా 6అతడు త్వరగా దిగి సంతోషముతో ఆయనను చేర్చుకొనెను. 7అందరు అది చూచి–ఈయన పాపియైన మనుష్యునియొద్ద బసచేయ వెళ్లెనని చాల సణుగుకొనిరి. 8జక్కయ్య నిలువబడి–ఇదిగో ప్రభువా, నా ఆస్తిలో సగము బీదలకిచ్చుచున్నాను; నేనెవనియొద్దనైనను అన్యాయముగా దేనినైనను తీసికొనినయెడల అతనికి నాలుగంతలు మరల చెల్లింతునని ప్రభువుతో చెప్పెను. 9అందుకు యేసు–ఇతడును అబ్రాహాము కుమారుడే; ఎందుకనగా నేడు ఈ యింటికి రక్షణ వచ్చియున్నది. 10నశించినదానిని వెదకి రక్షించుటకు మనుష్యకుమారుడు వచ్చెనని అతనితో చెప్పెను.
11వారు ఈ మాటలు వినుచుండగా తాను యెరూషలేమునకు సమీపమున ఉండుటవలనను, దేవుని రాజ్యము వెంటనే అగుపడునని వారు తలంచుటవలనను, ఆయన మరియొక ఉపమానము చెప్పెను. ఏమనగా, 12రాజ కుమారుడొక రాజ్యము సంపాదించుకొని మరల రావలెనని దూరదేశమునకు ప్రయాణమై 13తన దాసులను పదిమందిని పిలిచి వారికి పది మినాల#19:13 మినాయించుమించు 50 రూపాయిలు కావచ్చును.నిచ్చి–నేను వచ్చువరకు వ్యాపారము చేయుడని వారితో చెప్పెను. 14అయితే అతని పట్టణస్థులతని ద్వేషించి–ఇతడు మమ్ము నేలుట మా కిష్టము లేదని అతని వెనుక రాయబారము పంపిరి. 15అతడా రాజ్యము సంపాదించుకొని తిరిగి వచ్చినప్పుడు, ప్రతివాడును వ్యాపారమువలన ఏమేమి సంపాదించెనో తెలిసికొనుటకై తాను సొమ్మిచ్చిన దాసులను తనయొద్దకు పిలువుమని ఆజ్ఞాపించెను. 16మొదటివాడాయన యెదుటికి వచ్చి–అయ్యా, నీ మినావలన పది మినాలు లభించెనని చెప్పగా 17అతడు–భళా, మంచి దాసుడా, నీవు ఈ కొంచెములో నమ్మకముగా ఉంటివి గనుక పది పట్టణములమీద అధికారివై యుండుమని వానితో చెప్పెను. 18అంతట రెండవవాడు వచ్చి–అయ్యా, నీ మినావలన అయిదు మినాలు లభించెననగా 19అతడు–నీవును అయిదు పట్టణములమీద ఉండుమని అతనితో చెప్పెను. 20అంతట మరియొకడు వచ్చి–అయ్యా, యిదిగో నీ మినా; 21నీవు పెట్టనిదానిని ఎత్తికొనువాడవును, విత్తనిదానిని కోయువాడవునైన కఠినుడవు గనుక, నీకు భయపడి దీనిని రుమాలున కట్టి ఉంచితినని చెప్పెను. 22అందుకతడుచెడ్డ దాసుడా, నీ నోటి మాటనుబట్టియే నీకు తీర్పు తీర్చుదును; నేను పెట్టనిదానిని ఎత్తువాడను, విత్తనిదానిని కోయు వాడనునైన కఠినుడనని నీకు తెలిసియుండగా 23నీవెందుకు నా సొమ్ము సాహుకారులయొద్ద నుంచలేదు? అట్లు చేసి యుండినయెడల నేను వచ్చి వడ్డితో దానిని తీసికొందునే అని వానితో చెప్పి 24–వీనియొద్దనుండి ఆ మినా తీసివేసి పది మినాలు గలవాని కియ్యుడని దగ్గర నిలిచినవారితో చెప్పెను. 25వారు–అయ్యా, వానికి పది మినాలు కలవే అనిరి. 26అందుకతడు–కలిగిన ప్రతివానికిని ఇయ్యబడును, లేనివానియొద్దనుండి వానికి కలిగినదియు తీసివేయబడునని మీతో చెప్పుచున్నాను. 27మరియు నేను తమ్మును ఏలు టకు ఇష్టములేని నా శత్రువులను ఇక్కడికి తీసికొనివచ్చి నాయెదుట సంహరించుడని చెప్పెను.
28యేసు ఈ మాటలు చెప్పి యెరూషలేమునకు వెళ్ల వలెనని ముందు సాగిపోయెను.
29ఆయన ఒలీవలకొండదగ్గరనున్న బేత్పగే బేతనియ అను గ్రామముల సమీపమునకు వచ్చినప్పుడు, తన శిష్యుల నిద్దరిని పిలిచి 30–మీరు ఎదుటనున్న గ్రామమునకు వెళ్లుడి; అందులో మీరు ప్రవేశింపగానే కట్టబడియున్న ఒక గాడిద పిల్ల మీకు కనబడును; దానిమీద ఏ మనుష్యుడును ఎన్నడు కూర్చుండలేదు; దానిని విప్పి తోలుకొని రండి. 31ఎవరైననుమీరెందుకు దీని విప్పుచున్నారని మిమ్ము నడిగినయెడల–ఇది ప్రభువునకు కావలసియున్నదని అతనితో చెప్పుడని చెప్పి వారిని పంపెను. 32పంపబడినవారు వెళ్లి, ఆయన తమతో చెప్పినట్టే కనుగొని 33ఆ గాడిదపిల్లను విప్పుచుండగా దాని యజమానులు–మీరు, గాడిద పిల్లను ఎందుకు విప్పుచున్నారని వారి నడిగిరి. 34అందుకు వారు–ఇది ప్రభువునకు కావలసియున్నదనిరి. 35తరువాత వారు యేసునొద్దకు దానిని తోలుకొని వచ్చి, ఆ గాడిదపిల్లమీద తమ బట్టలువేసి, యేసును దానిమీద ఎక్కించి, 36ఆయన వెళ్లుచుండగా తమ బట్టలు దారిపొడుగునపరచిరి. 37ఒలీవలకొండనుండి దిగుచోటికి ఆయన సమీపించు చున్నప్పుడు శిష్యుల సమూహమంతయు సంతోషించుచు
38 –ప్రభువు పేరట వచ్చు రాజు స్తుతింపబడునుగాక పరలోకమందు సమాధానమును సర్వోన్నతమైన స్థలములలో మహిమయు ఉండునుగాక
అని తాము చూచిన అద్భుతములన్నిటినిగూర్చి మహా శబ్దముతో దేవుని స్తోత్రము చేయసాగిరి. 39ఆ సమూహములో ఉన్న కొందరు పరిసయ్యులు–బోధకుడా, నీ శిష్యులను గద్దింపుమని ఆయనతో చెప్పగా 40ఆయన వారిని చూచి–వీరు ఊరకుండినయెడల ఈ రాళ్లు కేకలు వేయునని మీతో చెప్పుచున్నాననెను.
41ఆయన పట్టణమునకు సమీపించినప్పుడు దానిని చూచి దాని విషయమై యేడ్చి 42–నీవును ఈ నీ దినమందైనను సమాధానసంబంధమైన సంగతులను తెలిసికొనినయెడల నీకెంతో మేలు; గాని యిప్పుడవి నీ కన్నులకు మరుగు చేయబడియున్నవి. 43(ప్రభువు) నిన్ను దర్శించిన కాలము నీవు ఎరుగకుంటివి గనుక నీ శత్రువులు నీ చుట్టు గట్టు కట్టి ముట్టడివేసి, అన్ని ప్రక్కలను నిన్ను అరికట్టి, నీలోనున్న నీ పిల్లలతోకూడ నిన్ను నేల కలిపి 44నీలో రాతిమీద రాయి నిలిచియుండ నియ్యని దినములు వచ్చునని చెప్పెను.
45-46ఆయన దేవాలయములో ప్రవేశించి అందులో విక్ర యము చేయువారితో
–నా మందిరము ప్రార్థన మందిరము
అని వ్రాయబడియున్నది.
అయితే మీరు దానిని దొంగల గుహగా చేసితిరని చెప్పి వారిని వెళ్లగొట్ట నారంభించెను.
47ఆయన ప్రతిదినమును దేవాలయములో బోధించు చున్నప్పుడు, ప్రధానయాజకులును శాస్త్రులును ప్రజలలో ప్రధానులును ఆయనను నాశనముచేయ జూచుచుండిరి గాని 48ప్రజలందరు ఆయన వాక్యమును వినుటకు ఆయనను హత్తుకొని యుండిరి గనుక ఏమి చేయవలెనో వారికి తోచలేదు.

醒目顯示

分享

複製

None

想要在所有設備上保存你的醒目顯示嗎? 註冊或登入