YouVersion 標識
搜索圖示

యోహాను 7

7
1అటుతరువాత యూదులు ఆయనను చంప వెదకి నందున యేసు యూదయలో సంచరించనొల్లక గలిలయలో సంచరించుచుండెను. 2యూదుల పర్ణశాలల పండుగ సమీపించెను గనుక 3ఆయన సహోదరులు ఆయనను చూచి–నీవు చేయుచున్న క్రియలు నీ శిష్యు లును చూచునట్లు ఈ స్థలము విడిచి యూదయకు వెళ్లుము. 4బహిరంగమున అంగీకరింపబడ గోరువాడెవడును తన పని రహస్యమున జరిగింపడు. నీవు ఈ కార్యములు చేయుచున్నయెడల నిన్ను నీవే లోకమునకు కనబరచుకొనుమని చెప్పిరి. 5ఆయన సహోదరులైనను ఆయనయందు విశ్వాసముంచలేదు. 6యేసు–నా సమయ మింకను రాలేదు; మీ సమయమెల్లప్పుడును సిద్ధముగానే యున్నది. 7లోకము మిమ్మును ద్వేషింపనేరదుగాని, దాని క్రియలు చెడ్డవని నేను దానినిగూర్చి సాక్ష్యమిచ్చుచున్నాను గనుక అది నన్ను ద్వేషించుచున్నది. 8మీరు పండుగకు వెళ్లుడి; నా సమయమింకనుపరిపూర్ణము కాలేదు గనుక నేను ఈ పండుగకు ఇప్పుడే వెళ్లనని వారితో చెప్పెను. 9ఆయన వారితో ఈలాగున చెప్పి గలిలయలో నిలిచిపోయెను.
10అయితే ఆయన సహోదరులు పండుగకు వెళ్లిపోయిన తరువాత ఆయన కూడ బహిరంగముగా వెళ్లక రహస్యముగా వెళ్లెను. 11పండుగలో యూదులు–ఆయన ఎక్కడ నని ఆయనను వెదకుచుండిరి. 12మరియు జనసమూహములలో ఆయననుగూర్చి గొప్ప సణుగు పుట్టెను; కొంద రాయన మంచివాడనిరి; మరికొందరు–కాడు, ఆయన జనులను మోసపుచ్చువాడనిరి; 13అయితే యూదులకు భయపడి ఆయననుగూర్చి యెవడును బహిరంగముగా మాటలాడలేదు.
14సగము పండుగైనప్పుడు యేసు దేవాలయములోనికి వెళ్లి బోధించుచుండెను. 15యూదులు అందుకు ఆశ్చర్యపడి–చదువుకొనని ఇతనికి ఈ పాండిత్యమెట్లు వచ్చెనని చెప్పుకొనిరి. 16అందుకు యేసు–నేనుచేయు బోధ నాది కాదు; నన్ను పంపినవానిదే. 17ఎవడైనను ఆయన చిత్తము చొప్పున చేయ నిశ్చయించుకొనినయెడల, ఆ బోధ దేవునివలన కలిగినదో, లేక నా యంతట నేనే బోధించుచున్నానో, వాడు తెలిసికొనును. 18తనంతట తానే బోధించువాడు స్వకీయ మహిమను వెదకును గాని తన్ను పంపినవాని మహిమను వెదకువాడు సత్యవంతుడు, ఆయనయందు ఏ దుర్నీతియులేదు. 19మోషే మీకు ధర్మశాస్త్రము ఇయ్యలేదా? అయినను మీలో ఎవడును ఆ ధర్మశాస్త్రమును గైకొనడు; మీరెందుకు నన్ను చంప జూచుచున్నారని వారితో చెప్పెను. 20అందుకు జనసమూహము–నీవు దయ్యము పెట్టినవాడవు, ఎవడు నిన్ను చంప జూచుచున్నాడని అడుగగా 21యేసు వారిని చూచి–నేను ఒక కార్యము చేసితిని; అందుకు మీరందరు ఆశ్చర్యపడుచున్నారు. 22మోషే మీకు సున్నతి సంస్కారమును నియమించెను, ఈ సంస్కారము మోషేవలన కలిగినది కాదు, పితరులవలననే కలిగినది. అయినను విశ్రాంతిదినమున మీరు మనుష్యునికి సున్నతి చేయుచున్నారు. 23మోషే ధర్మశాస్త్రము మీరకుండునట్లు ఒక మనుష్యుడు విశ్రాంతిదినమున సున్నతిపొందును గదా. ఇట్లుండగా నేను విశ్రాంతిదినమున ఒక మనుష్యుని పూర్ణస్వస్థతగల వానిగా చేసినందుకు మీరు నామీద ఆగ్రహపడుచున్నారేమి? 24వెలిచూపునుబట్టి తీర్పు తీర్చక న్యాయమైన తీర్పు తీర్చుడనెను.
25యెరూషలేమువారిలో కొందరు–వారు చంప వెదకు వాడు ఈయనే కాడా? 26ఇదిగో ఈయన బహిరంగముగా మాటలాడుచున్నను ఈయనను ఏమనరు; ఈయన క్రీస్తని అధికారులు నిజముగా తెలిసికొనియుందురా? 27అయినను ఈయన ఎక్కడి వాడో యెరుగుదుము; క్రీస్తు వచ్చు నప్పుడు ఆయన యెక్కడివాడో యెవడును ఎరుగడని చెప్పుకొనిరి. 28కాగా యేసు దేవాలయములో బోధించుచు–మీరు నన్నెరుగుదురు; నేనెక్కడివాడనో యెరుగుదురు; నా యంతట నేనే రాలేదు, నన్ను పంపినవాడు సత్యవంతుడు, ఆయనను మీరెరుగరు. 29నేను ఆయన యొద్దనుండి వచ్చితిని; ఆయన నన్ను పంపెను గనుక నేను ఆయనను ఎరుగుదునని బిగ్గరగా చెప్పెను. 30అందుకు వారాయనను పట్టుకొన యత్నముచేసిరి గాని ఆయన గడియ యింకను రాలేదు గనుక ఎవడును ఆయనను పట్టుకొనలేదు.#7:30 మూలభాషలోఆయన మీద చేతులు వేయలేదు. 31మరియు జనసమూహములో అనేకులు ఆయనయందు విశ్వాసముంచి–క్రీస్తు వచ్చునప్పుడు ఈయన చేసినవాటికంటె ఎక్కువైన సూచక క్రియలు చేయునా అని చెప్పుకొనిరి. 32జనసమూహము ఆయననుగూర్చి యీలాగు సణుగుకొనుట పరిసయ్యులు వినినప్పుడు, ప్రధానయాజకులును పరిసయ్యులును ఆయనను పట్టుకొనుటకు బంట్రౌతులను పంపిరి. 33యేసు–ఇంక కొంతకాలము నేను మీతోకూడ నుందును; తరువాత నన్ను పంపినవానియొద్దకు వెళ్లుదును; 34మీరు నన్ను వెదకుదురు గాని నన్ను కనుగొనరు, నేనెక్కడ ఉందునో అక్కడికి మీరు రాలేరనెను. 35అందుకు యూదులు– మనము ఈయనను కనుగొనకుండునట్లు ఈయన ఎక్కడికి వెళ్లబోవుచున్నాడు? గ్రీసుదేశస్థులలో చెదరిపోయిన వారియొద్దకు వెళ్లి గ్రీసుదేశస్థులకు బోధించునా? 36–నన్ను వెదకుదురు గాని కనుగొనరు, నేనెక్కడ ఉందునో అక్కడికి మీరు రాలేరని ఆయన చెప్పిన యీ మాట ఏమిటో అని తమలోతాము చెప్పుకొనుచుండిరి.
37ఆ పండుగలో మహాదినమైన అంత్యదినమున యేసు నిలిచి–ఎవడైనను దప్పిగొనినయెడల నాయొద్దకు వచ్చి దప్పి తీర్చుకొనవలెను. 38నాయందు విశ్వాసముంచు వాడెవడో లేఖనము చెప్పినట్టు వాని కడుపులోనుండి జీవ జల నదులు పారునని బిగ్గరగా చెప్పెను. 39తనయందు విశ్వాసముంచువారు పొందబోవు ఆత్మనుగూర్చి ఆయన ఈ మాట చెప్పెను. యేసు ఇంకను మహిమపరచబడ లేదు గనుక ఆత్మ ఇంకను అనుగ్రహింపబడియుండలేదు. 40జనసమూహములో కొందరు ఈ మాటలు విని–నిజముగా ఈయన ఆ ప్రవక్తయే అనిరి; 41మరికొందరు–ఈయన క్రీస్తే అనిరి; మరికొందరు–ఏమి? క్రీస్తు గలిలయలోనుండి వచ్చునా? 42క్రీస్తు దావీదు సంతానములో పుట్టి దావీదు ఉండిన బేత్లెహేమను గ్రామములోనుండి వచ్చునని లేఖనము చెప్పుటలేదా అనిరి. 43కాబట్టి ఆయననుగూర్చి జనసమూహములో భేదము పుట్టెను. 44వారిలో కొందరు ఆయనను పట్టుకొన దలచిరి గాని యెవడును ఆయనను పట్టుకొనలేదు.
45ఆ బంట్రౌతులు ప్రధానయాజకులయొద్దకును పరి సయ్యులయొద్దకును వచ్చినప్పుడు వారు–ఎందుకు మీరాయనను తీసికొని రాలేదని అడుగగా 46ఆ బంట్రౌతులు–ఆ మనుష్యుడు మాటలాడినట్లు ఎవడును ఎన్నడును మాటలాడలేదనిరి. 47అందుకు పరిసయ్యులు–మీరు కూడ మోస పోతిరా? 48అధికారులలో గాని పరిసయ్యులలో గాని యెవడైనను ఆయనయందు విశ్వాసముంచెనా? 49అయితే ధర్మశాస్త్ర మెరుగని యీ జనసమూహము శాపగ్రస్తమైనదని వారితో అనిరి. 50అంతకుమునుపు ఆయనయొద్దకు వచ్చిన నీకొదేము వారిలో ఒకడు. 51అతడు–ఒక మనుష్యుని మాట వినకమునుపును, వాడు చేసినది తెలిసికొనకమునుపును, మన ధర్మశాస్త్రము అతనికి తీర్పు తీర్చునా అని అడుగగా 52వారు–నీవును గలిలయుడవా? విచారించి చూడుము, గలిలయలో ఏ ప్రవక్తయు పుట్టడనిరి. 53అంతట ఎవరి యింటికి వారు వెళ్లిరి.

醒目顯示

分享

複製

None

想要在所有設備上保存你的醒目顯示嗎? 註冊或登入

YouVersion 使用 cookie 來個性化你的體驗。透過使用我們的網站,你即接受我們按照我們的 隱私政策所述來使用 cookie。