లూకా 5

5
1జనసమూహము దేవుని వాక్యము వినుచు ఆయనమీద పడుచుండగా ఆయన గెన్నేసరెతు సరస్సుతీరమున నిలిచి, 2ఆ సరస్సు తీరముననున్న రెండుదోనెలను చూచెను; జాలరులు వాటిలోనుండి దిగి తమ వలలు కడుగుచుండిరి. 3ఆయన ఆ దోనెలలో సీమోనుదైన యొక దోనె యెక్కి– దరినుండి కొంచెము త్రోయుమని అతని నడిగి, కూర్చుండి దోనెలోనుండి జనసమూహములకు బోధించుచుండెను. 4ఆయన బోధించుట చాలించిన తరువాత–నీవు దోనెను లోతునకు నడిపించి, చేపలు పట్టుటకు మీ వలలు వేయుడని సీమోనుతో చెప్పగా 5సీమోను – ఏలినవాడా, రాత్రి అంతయు మేము ప్రయాసపడితిమి గాని మాకేమియు దొరకలేదు; అయినను నీ మాటచొప్పున వలలు వేతునని ఆయనతో చెప్పెను. 6వారాలాగు చేసి విస్తారమైన చేపలు పెట్టిరి, అందుచేత వారి వలలు పిగిలిపోవుచుండగా 7వారు వేరొక దోనెలోనున్న తమ పాలివారు వచ్చి తమకు సహాయము చేయవలెనని వారికి సంజ్ఞలు చేసిరి; వారు వచ్చి రెండు దోనెలుమునుగునట్లు నింపిరి. 8సీమోను పేతురు అది చూచి, యేసు మోకాళ్లయెదుట సాగిలపడి ప్రభువా, నన్ను విడిచిపొమ్ము, నేను పాపాత్ముడనని చెప్పెను. 9ఏలయనగా వారు పట్టిన చేపల రాశికి అతడును అతనితోకూడనున్నవారందరును విస్మయమొందిరి. 10ఆలాగున సీమోనుతోకూడ పాలివారైన జెబెదయి కుమారులగు యాకోబును యోహానును (విస్మయ మొందిరి). అందుకు యేసు–భయపడకుము, ఇప్పటి నుండి నీవు మనుష్యులను పట్టువాడవై యుందువని సీమోనుతో చెప్పెను. 11వారు దోనెలను దరికిచేర్చి, సమస్తమును విడిచిపెట్టి ఆయనను వెంబడించిరి.
12ఆయన యొక పట్టణములోనున్నప్పుడు ఇదిగో కుష్ఠ రోగముతో నిండిన యొక మనుష్యుడుండెను. వాడు యేసును చూచి, సాగిలపడి–ప్రభువా, నీ కిష్టమైతే నన్ను శుద్ధునిగా చేయగలవని ఆయనను వేడుకొనెను. 13అప్పుడాయన చెయ్యిచాపి వానిని ముట్టి–నాకిష్టమే; నీవు శుద్ధుడవుకమ్మని అనగానే, కుష్ఠరోగము వానిని విడిచెను. 14అప్పుడాయన–నీవు ఎవనితోను చెప్పక వెళ్లి, వారికి సాక్ష్యార్థమై నీ దేహమును యాజకునికి కనుపరచుకొని, నీవు శుద్ధుడవైనందుకు మోషే నియమించినట్టు కానుకలను సమర్పించుమని ఆజ్ఞాపించెను. 15అయితే ఆయననుగూర్చిన సమాచారము మరి ఎక్కువగా వ్యాపించెను. బహుజన సమూహములు ఆయన మాట వినుటకును తమ రోగములను కుదుర్చుకొనుటకును కూడివచ్చుచుండెను. 16ఆయన ప్రార్థన చేయుటకు అరణ్యములోనికి వెళ్లుచుండెను.
17ఒకనాడాయన బోధించుచుండగా, గలిలయ యూదయదేశముల ప్రతి గ్రామమునుండియు యెరూషలేమునుండియు వచ్చిన పరిసయ్యులును ధర్మశాస్త్రోపదేశ కులును కూర్చుండియుండగా, ఆయన స్వస్థపరచునట్లు ప్రభువు శక్తి ఆయనకుండెను. 18ఇదిగో కొందరు మనుష్యులు పక్షవాయువుగల యొక మనుష్యుని మంచముమీద మోసికొని, వానిని లోపలికి తెచ్చి, ఆయన యెదుట ఉంచుటకు ప్రయత్నము చేసిరి గాని 19జనులు గుంపుకూడి యుండి నందున, వానిని లోపలికి తెచ్చుటకు వల్లపడక పోయెను గనుక, ఇంటిమీది కెక్కి పెంకులు విప్పి, మంచముతోకూడ యేసు ఎదుట వారిమధ్యను వానిని దించిరి. 20ఆయన వారి విశ్వాసము చూచి–మనుష్యుడా, నీ పాపములు క్షమింపబడియున్నవని వానితో చెప్పగా, 21శాస్త్రులును పరిసయ్యులును–దేవదూషణ చేయుచున్న యితడెవడు? దేవుడొక్కడే తప్ప మరి ఎవడు పాపములు క్షమింపగలడని ఆలోచించుకొనసాగిరి. 22యేసు వారి ఆలోచన లెరిగి–మీరు మీ హృదయములలో ఏమి ఆలోచించుచున్నారు? 23–నీ పాపములు క్షమింపబడి యున్నవని చెప్పుట సులభమా? –నీవు లేచి నడువుమని చెప్పుట సులభమా? 24అయితే పాపములు క్షమించుటకు భూమి మీద మనుష్యకుమారునికి అధికారము కలదని మీరు తెలిసికొనవలెను అని వారితో చెప్పి, పక్షవాయువు గల వాని చూచి–నీవు లేచి, నీ మంచమెత్తికొని, నీ యింటికి వెళ్లుమని నీతో చెప్పుచున్నాననెను. 25వెంటనే వాడు వారియెదుట లేచి, తాను పండుకొనియున్న మంచము ఎత్తికొని, దేవుని మహిమపరచుచు తన యింటికి వెళ్లెను. 26అందరును విస్మయమొంది–నేడు గొప్ప వింతలు చూచితి మని దేవుని మహిమపరచుచు భయముతో నిండుకొనిరి.
27అటుపిమ్మట ఆయన బయలుదేరి, లేవి యను ఒక సుంకరి, సుంకపు మెట్టునొద్ద కూర్చుండియుండుట చూచి –నన్ను వెంబడించుమని అతనితో చెప్పగా 28అతడు సమస్తమును విడిచిపెట్టి, లేచి, ఆయనను వెంబడించెను. 29ఆ లేవి, తన యింట ఆయనకు గొప్ప విందు చేసెను. సుంకరులును ఇతరులు అనేకులును వారితోకూడ భోజనమునకు కూర్చుండిరి. 30పరిసయ్యులును వారి శాస్త్రులును ఇది చూచి–సుంకరులతోను పాపులతోను మీరేల తిని త్రాగుచున్నారని ఆయన శిష్యులమీద సణిగిరి. 31అందుకు యేసు – రోగులకే గాని ఆరోగ్యముగలవారికి వైద్యుడక్కరలేదు. 32మారుమనస్సు పొందుటకై నేను పాపులను పిలువవచ్చితిని గాని నీతిమంతులను పిలువరాలేదని వారితో చెప్పెను. 33వారాయనను చూచి–యోహాను శిష్యులు తరచుగా ఉపవాసప్రార్థనలు చేయుదురు; ఆలాగే పరి సయ్యుల శిష్యులును చేయుదురు గాని, నీ శిష్యులు తిని త్రాగుచున్నారే అని చెప్పిరి. 34అందుకు యేసు–పెండ్లికుమారుడు తమతో ఉన్నంతకాలము పెండ్లి ఇంటి వారి చేత మీరు ఉపవాసము చేయింపగలరా? 35పెండ్లికుమారుడు వారియొద్దనుండి కొనిపోబడు దినములు వచ్చును; ఆ దినములలో వారు ఉపవాసము చేతురని వారితో చెప్పెను. 36ఆయన వారితో ఒక ఉపమానము చెప్పెను. ఎట్లనగా– ఎవడును పాతబట్టకు క్రొత్తగుడ్డ మాసికవేయడు; వేసినయెడల క్రొత్తది దానిని చింపివేయును; అదియునుగాక క్రొత్తదానిలోనుండి తీసిన ముక్క పాతదానితో కలియదు. 37ఎవడును పాత తిత్తులలో క్రొత్త ద్రాక్షారసము పోయడు; పోసినయెడల క్రొత్త ద్రాక్షారసము తిత్తులను పిగుల్చును, రసము కారిపోవును, తిత్తులును పాడగును. 38అయితే క్రొత్త ద్రాక్షారసము కొత్త తిత్తులలో పోయవలెను. 39పాత ద్రాక్షారసము త్రాగి వెంటనే క్రొత్త దానిని కోరువాడెవడును లేడు; పాతదే మంచిదనునని చెప్పెను.

醒目顯示

分享

複製

None

想在你所有裝置上儲存你的醒目顯示?註冊帳戶或登入