YouVersion 標誌
搜尋圖標

యోహాను 2

2
1మూడవదినమున గలిలయలోని కానా అను ఊరిలో ఒక వివాహము జరిగెను. 2యేసు తల్లి అక్కడ ఉండెను; యేసును ఆయన శిష్యులును ఆ వివాహమునకు పిలువ బడిరి. 3ద్రాక్షారసమైపోయినప్పుడు యేసు తల్లి–వారికి ద్రాక్షారసము లేదని ఆయనతో చెప్పగా 4యేసు ఆమెతో–అమ్మా, నాతో నీకేమి (పని)? నా సమయ మింకను రాలేదనెను. 5ఆయన తల్లి పరిచారకులను చూచి –ఆయన మీతో చెప్పునది చేయుడనెను. 6యూదుల శుద్ధీకరణాచారప్రకారము రెండేసి మూడేసి తూములు పట్టు ఆరు రాతిబానలు అక్కడ ఉంచబడియుండెను. 7యేసు–ఆ బానలు నీళ్లతో నింపుడని వారితో చెప్పగా వారు వాటిని అంచులమట్టుకు నింపిరి. 8అప్పుడాయన వారితో–మీరిప్పుడు ముంచి, విందు ప్రధానియొద్దకు తీసికొనిపొండని చెప్పగా, వారు తీసికొనిపోయిరి. 9ఆ ద్రాక్షారసము ఎక్కడనుండి వచ్చెనో ఆ నీళ్లు ముంచి తీసికొనిపోయిన పరిచారకులకే తెలిసినదిగాని విందు ప్రధానికి తెలియక పోయెను గనుక ద్రాక్షారసమైన ఆ నీళ్లు రుచిచూచినప్పుడు ఆ విందు ప్రధాని పెండ్లికుమారుని పిలిచి 10–ప్రతివాడును మొదట మంచి ద్రాక్షారసమును పోసి, జనులు మత్తుగా ఉన్నప్పుడు జబ్బురసము పోయును; నీవైతే ఇదివరకును మంచి ద్రాక్షారసము ఉంచుకొని యున్నావని అతనితో చెప్పెను. 11గలిలయలోని కానాలో, యేసు ఈ మొదటి సూచకక్రియను చేసి తన మహిమను బయలుపరచెను; అందువలన ఆయన శిష్యులు ఆయనయందు విశ్వాసముంచిరి.
12అటుతరువాత ఆయనయు ఆయన తల్లియు ఆయన సహోదరులును ఆయన శిష్యులును కపెర్నహూమునకు వెళ్లి అక్కడ కొన్ని దినములుండిరి.
13యూదుల పస్కాపండుగ సమీపింపగా యేసు యెరూషలేమునకు వెళ్లి 14దేవాలయములో ఎడ్లను గొఱ్ఱెలను పావురములను అమ్మువారును రూకలు మార్చువారును కూర్చుండుట చూచి 15త్రాళ్లతో కొరడాలుచేసి, గొఱ్ఱెలను ఎడ్లనన్నిటిని దేవాలయములోనుండి తోలివేసి, రూకలు మార్చువారి రూకలు చల్లివేసి, వారి బల్లలు పడ ద్రోసి 16పావురములు అమ్మువారితో–వీటిని ఇక్కడ నుండి తీసికొనిపొండి; నా తండ్రి యిల్లు వ్యాపారపు టిల్లుగా చేయకుడని చెప్పెను. 17ఆయన శిష్యులు–
నీ యింటినిగూర్చిన ఆసక్తి నన్ను భక్షించునని వ్రాయ బడియున్నట్టు జ్ఞాపకము చేసికొనిరి. 18కాబట్టి యూదులు –నీవు ఈ కార్యములు చేయుచున్నావే; యే సూచక క్రియను మాకు చూపెదవని ఆయనను అడుగగా 19యేసు –ఈ దేవాలయమును పడగొట్టుడి, మూడుదినములలో దాని లేపుదునని వారితో చెప్పెను. 20యూదులు–ఈ దేవాలయము నలువదియారు సంవత్సరములు కట్టిరే; నీవు మూడుదినములలో దానిని లేపుదువా అనిరి. 21అయితే ఆయన తన శరీరమను దేవాలయమునుగూర్చి యీ మాట చెప్పెను. 22ఆయన మృతులలోనుండి లేచిన తరువాత ఆయన ఈ మాట చెప్పెనని ఆయన శిష్యులు జ్ఞాపకము చేసికొని, లేఖనమును యేసు చెప్పిన మాటను నమ్మిరి.
23ఆయన పస్కా (పండుగ) సమయమున యెరూషలేములో ఉండగా, ఆ పండుగలో అనేకులు ఆయన చేసిన సూచకక్రియలను చూచి ఆయన నామమందు విశ్వాసముంచిరి. 24అయితే యేసు అందరిని ఎరిగినవాడు గనుక ఆయన తన్ను వారి వశము చేసికొనలేదు. ఆయన మనుష్యుని ఆంతర్యమును ఎరిగినవాడు 25గనుక ఎవడును మనుష్యునిగూర్చి ఆయనకు సాక్ష్యమియ్య నక్కరలేదు.

醒目顯示

分享

複製

None

想在你所有裝置上儲存你的醒目顯示?註冊帳戶或登入