YouVersion 標誌
搜尋圖標

ఆదికాండము 3

3
1దేవుడైన యెహోవా చేసిన సమస్త భూజంతువులలో సర్పము యుక్తిగలదై యుండెను. అది ఆ స్త్రీతో–ఇది నిజమా? ఈ తోట చెట్లలో దేని ఫలములనైనను మీరు తినకూడదని దేవుడు చెప్పెనా? అని అడిగెను. 2అందుకు స్త్రీ–ఈ తోట చెట్ల ఫలములను మేము తినవచ్చును; 3అయితే తోట మధ్యనున్న చెట్టు ఫలములనుగూర్చి దేవుడు–మీరు చావకుండునట్లు వాటిని తిన కూడదనియు, వాటిని ముట్టకూడదనియు చెప్పెనని సర్పముతో అనెను. 4అందుకు సర్పము–మీరు చావనే చావరు; 5ఏలయనగా మీరు వాటిని తిను దినమున మీ కన్నులు తెరవబడుననియు, మీరు మంచి చెడ్డలను ఎరిగిన వారై దేవతలవలె ఉందురనియు దేవునికి తెలియునని స్త్రీతో చెప్పగా 6స్త్రీ ఆ వృక్షము ఆహారమునకు మంచిదియు, కన్నులకు అందమైనదియు, వివేకమిచ్చు రమ్యమై నదియునై యుండుట చూచినప్పుడు ఆమె దాని ఫలములలో కొన్ని తీసికొనితిని తనతోపాటు తన భర్తకును ఇచ్చెను, అతడు కూడ తినెను; 7అప్పుడు వారిద్దరి కన్నులు తెరవబడెను; వారు తాము దిగంబరులమని తెలిసికొని అంజూరపు ఆకులు కుట్టి తమకు కచ్చడములను చేసికొనిరి. 8చల్లపూటను ఆదామును అతని భార్యయు తోటలో సంచరించుచున్న దేవుడైన యెహోవా స్వరమును విని, దేవుడైన యెహోవా ఎదుటికి రాకుండ తోటచెట్లమధ్యను దాగు కొనగా 9దేవుడైన యెహోవా ఆదామును పిలిచి– నీవు ఎక్కడ ఉన్నావనెను. 10అందుకతడు–నేను తోటలో నీ స్వరము వినినప్పుడు దిగంబరినిగా నుంటినిగనుక భయపడి దాగుకొంటిననెను. 11అందుకాయన–నీవు దిగంబరివని నీకు తెలిపినవాడెవడు? నీవు తినకూడదని నేను నీ కాజ్ఞాపించిన వృక్షఫలములు తింటివా? అని అడిగెను. 12అందుకు ఆదాము–నాతో నుండుటకు నీవు నాకిచ్చిన ఈ స్త్రీయే ఆ వృక్షఫలములు కొన్ని నా కియ్యగా నేను తింటిననెను. 13అప్పుడు దేవుడైన యెహోవా స్త్రీతో–నీవు చేసినది యేమిటని అడుగగా స్త్రీ–సర్పము నన్ను మోసపుచ్చి నందున తింటిననెను. 14అందుకు దేవుడైన యెహోవా సర్పముతో నీవు దీని చేసినందున పశువులన్నిటిలోను భూజంతువు లన్నిటిలోను నీవు శపించ బడినదానివై నీ కడుపుతో ప్రాకుచు నీవు బ్రదుకు దినములన్నియు మన్ను తిందువు. 15మరియు నీకును స్త్రీకిని నీ సంతానమునకును ఆమె సంతానమునకును వైరము కలుగజేసెదను. అది#3:15 ఆయన. నిన్ను తలమీద కొట్టును; నీవు దానిని మడిమెమీద కొట్టుదువని చెప్పెను. 16ఆయన స్త్రీతో నీ ప్రయాసమును నీ గర్భవేదనను నేను మిక్కిలి హెచ్చించెదను; వేదనతో పిల్లలను కందువు; నీ భర్తయెడల నీకు వాంఛ కలుగును; అతడు నిన్ను ఏలునని చెప్పెను. 17ఆయన ఆదాముతో–నీవు నీ భార్యమాట విని–తినవద్దని నేను నీ కాజ్ఞాపించిన వృక్షఫలములు తింటివి గనుక నీ నిమిత్తము నేల శపింపబడియున్నది; ప్రయాసముతోనే నీవు బ్రదుకు దినములన్నియు దాని పంట తిందువు; 18అది ముండ్ల తుప్పలను గచ్చపొదలను నీకు మొలిపించును; పొలములోని పంట తిందువు; 19నీవు నేలకు తిరిగి చేరువరకు నీ ముఖపు చెమట కార్చి ఆహారము తిందువు; ఏలయనగా నేలనుండి నీవు తీయబడితివి; నీవు మన్నే గనుక తిరిగి మన్నైపోదువని చెప్పెను. 20ఆదాము తన భార్యకు హవ్వ అని పేరు పెట్టెను. ఏలయనగా ఆమె జీవముగల ప్రతివానికిని తల్లి. 21దేవుడైన యెహోవా ఆదామునకును అతని భార్యకును చర్మపు చొక్కాయిలను చేయించి వారికి తొడిగించెను.
22అప్పుడు దేవుడైన యెహోవా–ఇదిగో మంచి చెడ్డలను ఎరుగునట్లు, ఆదాము మనలో ఒకనివంటివాడాయెను. కాబట్టి అతడు ఒక వేళ తన చెయ్యి చాచి జీవ వృక్షఫలమును కూడ తీసికొనితిని నిరంతరము జీవించునేమో అని 23దేవుడైన యెహోవా అతడు ఏ నేలనుండి తీయబడెనో దాని సేద్యపరచుటకు ఏదెను తోటలోనుండి అతని పంపివేసెను. 24అప్పుడాయన ఆదామును వెళ్లగొట్టి ఏదెను తోటకు తూర్పుదిక్కున కెరూబులను, జీవవృక్షమునకు పోవు మార్గమును కాచుటకు ఇటు అటు తిరుగుచున్న ఖడ్గజ్వాలను నిలువబెట్టెను.

醒目顯示

分享

複製

None

想在你所有裝置上儲存你的醒目顯示?註冊帳戶或登入