ఆది 7

7
1అప్పుడు యెహోవా నోవహుతో, “నీవు, నీ కుటుంబం ఓడలో ప్రవేశించండి, ఎందుకంటే ఈ తరంలో నీవు మాత్రమే నాకు నీతిమంతునిగా కనిపించావు. 2నీతో పాటు పవిత్రమైన జంతువుల్లో జంటల చొప్పున ఏడు మగవాటిని, ఏడు ఆడవాటిని, అపవిత్రమైన వాటిలో ఒక మగదానిని, 3అలాగే పక్షిజాతులన్నిటిలో నుండి ఏడు మగవాటిని ఏడు ఆడవాటిని భూమిపై వాటి జాతులు సజీవంగా ఉంచడానికి ఓడలోకి తీసుకెళ్లు. 4ఇంకా ఏడు రోజుల్లో భూమి మీద నలభై రాత్రింబగళ్ళు నేను వర్షం కురిపిస్తాను, నేను చేసిన ప్రతి ప్రాణిని భూమి మీద నుండి తుడిచివేస్తాను” అని అన్నారు.
5యెహోవా తనకు ఆజ్ఞాపించిన ప్రకారమే నోవహు అంతా చేశాడు.
6భూమి మీదికి జలప్రళయం వచ్చినప్పుడు నోవహుకు 600 సంవత్సరాలు. 7జలప్రళయం నుండి తప్పించుకోడానికి నోవహు, అతని భార్య, కుమారులు, వారి భార్యలు ఓడలోనికి ప్రవేశించారు. 8పవిత్రమైన, అపవిత్రమైన జంతువుల్లో, పక్షుల్లో, నేలపై ప్రాకే జీవులన్నిటిలో, 9దేవుడు నోవహుకు ఆజ్ఞాపించిన ప్రకారమే మగవి ఆడవి, జతలుగా నోవహు దగ్గరకు వచ్చి ఓడలో ప్రవేశించాయి. 10ఏడు రోజుల తర్వాత భూమి మీదికి జలప్రళయం వచ్చింది.
11నోవహుకు 600 సంవత్సరాల రెండు నెలల పదిహేడవ రోజున గొప్ప అగాధంలోని ఊటలన్నీ ఉప్పొంగాయి, ఆకాశ తూములు ద్వారాలు తెరుచుకున్నాయి. 12నలభై రాత్రింబగళ్ళు భూమిపై వర్షం కురిసింది.
13ఆ రోజే నోవహు, అతని కుమారులు షేము, హాము, యాపెతు, నోవహు భార్య, అతని ముగ్గురు కుమారుల భార్యలు ఓడలోనికి వెళ్లారు. 14ప్రతి జాతి ప్రకారం అడవి జంతువులు, వాటి వాటి జాతుల ప్రకారం అన్ని రకాల పశువులు, ఆయా జాతుల ప్రకారం నేలపై ప్రాకే జీవులు, వాటి వాటి జాతుల ప్రకారం పక్షులు, రెక్కలు గల ప్రతిదీ వారితో ఉన్నాయి. 15జీవపు ఊపిరి ఉన్న అన్ని జీవుల జతలు నోవహు దగ్గరకు వచ్చి ఓడలోకి ప్రవేశించాయి. 16దేవుడు నోవహుకు ఆజ్ఞాపించిన ప్రకారమే అన్ని జీవులలో ఆడవి మగవి జతలుగా ఓడలోకి వెళ్లాయి. అప్పుడు యెహోవా ఓడ తలుపు మూసివేశారు.
17నలభై రోజులు భూమిపై జలప్రళయం ముంచెత్తింది, నీళ్లు నిండిన కొలది ఓడ నీటిపై తేలుతూ ఉంది. 18భూమిపై జలాలు అధికంగా విస్తరించాయి, ఆ ఓడ నీటిపై తేలింది. 19నీరు ఎక్కువై భూమిని కప్పివేశాయి, ఆకాశాల క్రింద ఉన్న అన్ని ఎత్తైన పర్వతాలు నీటిలో మునిగిపోయాయి. 20నీరు పర్వతాల కన్నా పదిహేను మూరల#7:20 అంటే సుమారు 23 అడుగులు లేదా 6.8 మీటర్లు ఎత్తు లేచి వాటిని కప్పివేశాయి. 21భూమి మీద ఉన్న జీవరాశులన్నీ అంటే పక్షులు, పశువులు, అడవి జంతువులు, భూమి మీద సంచరించే సమస్త ప్రాణులు చనిపోయాయి, మనుష్యులు కూడా అందరు చనిపోయారు. 22పొడి నేలపై నాసికారంధ్రాలలో జీవం కలిగి ఉన్న ప్రతి ప్రాణి చనిపోయింది. 23నేల మీద ఉన్న జీవరాశులన్నీ తుడిచివేయబడ్డాయి; మనుష్యులు, పశువులు, నేల మీద తిరిగే జీవులు, పక్షులు తుడిచివేయబడ్డాయి. కేవలం నోవహు, అతనితో ఓడలో ఉన్నవారు మిగిలారు.
24వరదనీరు భూమిని నూట యాభై రోజులు ముంచెత్తాయి.

目前选定:

ఆది 7: OTSA

高亮显示

分享

复制

None

想要在所有设备上保存你的高亮显示吗? 注册或登录