యోహాను 3

3
నికోదేముతో యేసు: నూతన జన్మ
1నికోదేము అనే పేరు గల ఒక పరిసయ్యుడు ఉన్నాడు. అతడు యూదుల చట్ట సభలో సభ్యుడు. 2అతడు రాత్రి వేళ యేసు దగ్గరికి వచ్చాడు. ఆయనతో, “బోధకా, నువ్వు దేవుని దగ్గర నుండి వచ్చిన బోధకుడివి అని మాకు తెలుసు. దేవుడు తోడు లేకపోతే ఎవరూ నువ్వు చేసే అద్భుతాలు చేయలేరని మాకు తెలుసు” అన్నాడు. 3దానికి జవాబుగా యేసు అతనితో, “ఎవరైనా కొత్తగా జన్మించకపోతే దేవుని రాజ్యాన్ని చూడలేరని కచ్చితంగా చెబుతున్నాను” అన్నాడు.
4అందుకు నికోదేము, “మనిషి ముసలివాడయ్యాక మళ్ళీ ఎలా పుడతాడు? రెండవ సారి పుట్టడానికి మళ్ళీ తల్లి గర్భంలో ప్రవేశించలేడు గదా! అలా ప్రవేశిస్తాడా?” అని ఆయనను అడిగాడు.
5అప్పుడు యేసు ఇలా జవాబిచ్చాడు, “కచ్చితంగా చెబుతున్నాను. నీళ్ళ మూలంగా ఆత్మ మూలంగా తిరిగి పుట్టకుండా ఎవరూ దేవుని రాజ్యంలో ప్రవేశించలేరు. 6శరీర మూలంగా పుట్టింది శరీరం, ఆత్మ మూలంగా పుట్టింది ఆత్మ. 7నువ్వు కొత్తగా పుట్టాలని చెప్పినందుకు అదొక విడ్డూరంగా భావించవద్దు. 8గాలి తనకిష్టమైన వైపుకు వీస్తుంది. నువ్వు దాని శబ్దాన్ని మాత్రం వినగలవు, కానీ అది ఎక్కడి నుండి వస్తుందో ఎక్కడికి వెళ్తుందో నీకు తెలియదు. ఆత్మ మూలంగా పుట్టినవాడు అలాగే ఉన్నాడు.”
9దానికి జవాబుగా నికోదేము, “ఈ విషయాలు ఎలా సాధ్యం?” అన్నాడు. 10యేసు ఇలా అన్నాడు, “నువ్వు ఇశ్రాయేలు ప్రజలకు బోధకుడివై ఉండీ ఈ సంగతులు అర్థం చేసుకోలేవా? 11మాకు తెలిసిన సంగతులను చెబుతున్నాం, మేము చూసిన వాటి గురించి వివరిస్తున్నాం. అయినా మీరు మా సాక్షాన్ని ఒప్పుకోరని కచ్చితంగా చెబుతున్నాను. 12భూసంబంధమైన సంగతులు నేను మీకు చెప్పినప్పుడు నమ్మని వారు ఇక నేను పరలోక సంబంధమైన సంగతులు చెప్పినప్పుడు ఎలా నమ్ముతారు? 13పరలోకం నుండి దిగి వచ్చిన మనుష్య కుమారుడు తప్ప పరలోకానికి ఎక్కి వెళ్ళిన వాడు ఎవడూ లేడు.
14 అరణ్యంలో మోషే సర్పాన్ని ఎలా పైకి ఎత్తాడో, 15అలాగే విశ్వసించే ప్రతి ఒక్కరూ నశించకుండా ఆయన వల్ల నిత్యజీవం పొందడానికి మనుష్య కుమారుడు కూడా పైకి ఎత్తబడాలి.
16“దేవుడు లోకాన్ని ఎంతో ప్రేమించాడు. అందుకే ఆయన తన ఏకైక కుమారుణ్ణి ఈ లోకానికి ఇచ్చాడు. తద్వారా ఆయనలో విశ్వాసం ఉంచే ప్రతి వాడూ నశించకుండా నిత్యజీవం పొందుతాడు. 17తన కుమారుడి వల్ల లోకం రక్షణ పొందడానికే దేవుడు ఆయనను పంపాడు గానీ లోకానికి శిక్ష విధించడానికి కాదు.
18ఆయనలో విశ్వాసం ఉంచిన వాడికి శిక్ష ఉండదు. ఆయనలో విశ్వాసం ఉంచని వాడికి ఇదివరకే శిక్ష విధించడం జరిగింది. ఎందుకంటే వాడు దేవుని ఏకైక కుమారుడి నామంలో విశ్వాసం ఉంచలేదు. 19ఆ శిక్ష విధించడానికి కారణం ఇది, ఈ లోకంలోకి వెలుగు వచ్చింది. వారు చేసే పనులు దుర్మార్గమైనవి కాబట్టి మనుషులు వెలుగును కాకుండా చీకటిని ప్రేమించారు. 20దుర్మార్గకార్యాలు చేసే వాడు వెలుగు దగ్గరికి రాడు. వెలుగులో వాడు చేసే దుర్మార్గం అంతా తెలిసిపోతుంది కాబట్టి అలాటివి చేసే ప్రతి వాడూ వెలుగును ద్వేషిస్తాడు.
21అయితే సత్యాన్ని అనుసరించే వాడు తన పనులు మరింత స్పష్టంగా కనిపించడానికీ దేవుని పట్ల విధేయతలో అవి జరిగాయని వెల్లడి చేయడానికీ వెలుగు దగ్గరికి వస్తాడు.”
బాప్తిసమిచ్చే యోహాను చివరి సాక్ష్యం
22ఇదయ్యాక యేసు తన శిష్యులతో కూడా యూదయ ప్రాంతానికి వెళ్ళాడు. అక్కడ బాప్తిసం ఇస్తూ, తన శిష్యులతో కాలం గడుపుతూ ఉన్నాడు. 23సలీము అనే ప్రాంతం దగ్గర ఉన్న ఐనోను అనే స్చోట నీళ్ళు పుష్కలంగా ఉన్నాయి కాబట్టి యోహాను అక్కడ బాప్తిసం ఇస్తున్నాడు. ప్రజలు అక్కడికి వెళ్ళి బాప్తిసం తీసుకుంటూ ఉన్నారు. 24అప్పటికి యోహానును ఇంకా చెరసాల్లో వేయలేదు.
25అప్పుడు శుద్ధి ఆచారాల గురించి యోహాను శిష్యులకీ ఒక యూదుడికీ వివాదం పుట్టింది. 26వారు యోహాను దగ్గరికి వచ్చారు. “బోధకా, యొర్దాను నది అవతల నీతో ఒక వ్యక్తి ఉన్నాడే, ఆయన గురించి నువ్వు సాక్ష్యం కూడా చెప్పావు. చూడు, ప్రస్తుతం ఆయన కూడా బాప్తిసం ఇస్తున్నాడు. అందరూ ఆయన దగ్గరకే వెళ్తున్నారు” అని చెప్పారు. 27అందుకు యోహాను ఇలా అన్నాడు, “పరలోకం నుండి ఇస్తేనే గానీ ఎవరూ ఏదీ పొందలేరు.
28నేను క్రీస్తును కాననీ ఆయన కంటే ముందుగా నన్ను పంపడం జరిగిందనీ నేను చెప్పాను. దానికి మీరే సాక్షులు. 29పెళ్ళి కొడుక్కే పెళ్ళి కూతురు ఉంటుంది. అయితే పెళ్ళి కొడుకు స్నేహితుడు నిలబడి పెళ్ళికొడుకు స్వరం వింటూ ఎంతో సంతోషిస్తాడు. అందుకే నా సంతోషం సంపూర్ణం అయింది. 30ఆయన హెచ్చాలి, నేను తగ్గాలి.”
యేసుక్రీస్తు గురించిన అమోఘ ప్రకటన
31పై నుండి వచ్చిన వాడు అందరికంటే పైవాడే. భూమి నుండి వచ్చిన వాడు భూసంబంధి గనక భూ సంబంధమైన సంగతులే మాట్లాడతాడు. పరలోకం నుండి వచ్చినవాడు అందరికీ పైనున్నవాడు. 32ఆయన తాను చూసిన వాటిని గురించీ విన్నవాటిని గురించీ సాక్ష్యం ఇస్తాడు కానీ ఎవరూ ఆయన సాక్షాన్ని అంగీకరించరు. 33ఆయన సాక్షాన్ని అంగీకరించిన వాడు దేవుడు సత్యవంతుడని నిరూపిస్తున్నాడు. 34దేవుడు పంపిన వ్యక్తి దేవుని మాటలు పలుకుతాడు. ఎందుకంటే తాను పంపిన వ్యక్తికి ఆయన అపరిమితంగా ఆత్మను దయ చేస్తాడు. 35తండ్రి కుమారుణ్ణి ప్రేమిస్తున్నాడు. సమస్తాన్నీ ఆయన చేతులకు అప్పగించాడు.
36కుమారుడిలో విశ్వాసం ఉంచేవాడికి నిత్యజీవం ఉంటుంది. అయితే కుమారుడికి విధేయుడు కాని వాడు జీవాన్ని చూడడు. వాడి పైన దేవుని మహా కోపం నిలిచి ఉంటుంది.”

Àwon tá yàn lọ́wọ́lọ́wọ́ báyìí:

యోహాను 3: IRVTel

Ìsàmì-sí

Pín

Daako

None

Ṣé o fẹ́ fi àwọn ohun pàtàkì pamọ́ sórí gbogbo àwọn ẹ̀rọ rẹ? Wọlé pẹ̀lú àkántì tuntun tàbí wọlé pẹ̀lú àkántì tí tẹ́lẹ̀

Àwọn fídíò fún యోహాను 3