ఆది 22
22
అబ్రాహాము పరీక్షించబడ్డాడు
1కొంతకాలం తర్వాత దేవుడు అబ్రాహామును పరీక్షించారు. ఆయన, “అబ్రాహామూ!” అని పిలిచారు.
“చిత్తం! ప్రభువా” అని అతడు జవాబిచ్చాడు.
2అప్పుడు దేవుడు ఇలా అన్నారు, “నీ ఏకైక కుమారున్ని, అంటే నీవు ప్రేమించే ఇస్సాకును మోరీయా ప్రదేశానికి తీసుకెళ్లు. నేను నీకు చూపబోయే పర్వతం మీద అతన్ని దహనబలిగా అర్పించు.”
3మర్నాడు వేకువజామున అబ్రాహాము లేచి గాడిదకు గంతలు కట్టి ఇద్దరు పనివారిని, తన కుమారుడైన ఇస్సాకును తీసుకుని బయలుదేరాడు. దహనబలి కోసం కట్టెలు కొట్టుకుని దేవుడు చూపిన స్థలం వైపు వెళ్లాడు. 4మూడవ రోజు అబ్రాహాము కళ్ళెత్తి దూరం నుండి ఆ స్థలాన్ని చూశాడు. 5అబ్రాహాము తన పనివారితో, “మీరు గాడిదతో ఇక్కడ ఉండండి, నేను, ఈ చిన్నవాడు అక్కడికి వెళ్లి, ఆరాధించి తిరిగి వస్తాం” అని అన్నాడు.
6అబ్రాహాము దహనబలి కోసం కట్టెలు తీసుకుని తన కుమారుడైన ఇస్సాకు మీద పెట్టాడు, అతడు నిప్పును కత్తిని పట్టుకుని వెళ్లాడు. వారిద్దరు కలసి నడిచి వెళ్తున్నప్పుడు, 7ఇస్సాకు తన తండ్రియైన అబ్రాహాముతో, “తండ్రీ” అని పిలిచాడు.
“నా కుమారుడా, ఏంటి?” అని అబ్రాహాము జవాబిచ్చాడు.
ఇస్సాకు, “నిప్పు కట్టెలు ఉన్నాయి. కాని దహనబలి కోసం కావలసిన గొర్రెపిల్ల ఎక్కడ?” అని అడిగాడు.
8“నా కుమారుడా, దేవుడే స్వయంగా దహనబలి కోసం గొర్రెపిల్లను ఇస్తారు” అని అబ్రాహాము జవాబిచ్చాడు. వారిద్దరు కలిసి వెళ్లారు.
9దేవుడు నిర్దేశించిన స్థలం వారు చేరుకున్నాక, అబ్రాహాము అక్కడ ఒక బలిపీఠం కట్టాడు, దాని మీద కట్టెలు పేర్చాడు. తన కుమారుడైన ఇస్సాకును బంధించి, కట్టెల మీద పడుకోబెట్టాడు. 10తర్వాత అబ్రాహాము తన కుమారున్ని బలి ఇవ్వడానికి చేయి చాపి కత్తి పట్టుకున్నాడు. 11అయితే యెహోవా దూత ఆకాశం నుండి, “అబ్రాహామూ! అబ్రాహామూ!” అని పిలిచాడు.
“చిత్తం ప్రభువా” అని అతడు జవాబిచ్చాడు.
12“ఆ బాలుని మీద చేయివేయకు అతన్ని ఏమీ చేయకు. నీవు దేవునికి భయపడతావని ఇప్పుడు నాకు తెలుసు, ఎందుకంటే నీ ఏకైక కుమారున్ని నాకు ఇవ్వడానికి వెనుదీయలేదు!” అని దేవుని దూత మాట్లాడాడు.
13అబ్రాహాము కళ్ళెత్తి చూశాడు, ఆ పొదలో కొమ్ములు చిక్కుకుని ఉన్న పొట్టేలు కనిపించింది. అక్కడికి వెళ్లి ఆ పొట్టేలును తెచ్చి తన కుమారునికి బదులు దహనబలి అర్పించాడు. 14అబ్రాహాము ఆ స్థలానికి, యెహోవా యీరే#22:14 అంటే యెహోవా సమకూరుస్తారు అని పేరు పెట్టాడు. ఇప్పటికీ, “యెహోవా పర్వతం మీద సమకూర్చబడుతుంది” అని చెప్పబడుతుంది.
15యెహోవా దూత రెండవసారి అబ్రాహాముతో ఇలా అన్నాడు, 16“యెహోవా ప్రకటిస్తున్నారు, నా మీద నేను ప్రమాణం చేసి చెప్తున్నాను, నీవిలా నీ ఏకైక కుమారున్ని ఇవ్వడానికి వెనుకాడలేదు కాబట్టి, 17నిశ్చయంగా నేను నిన్ను దీవిస్తాను, నీ సంతానాన్ని లెక్కించలేని ఆకాశ నక్షత్రాల్లా సముద్ర ఒడ్డు మీద ఇసుక రేణువుల్లా విస్తరింపజేస్తాను. నీ సంతతివారు వారి శత్రువుల పట్టణాలను స్వాధీనం చేసుకుంటారు, 18నీ సంతానం ద్వారా భూమి మీద ఉన్న సర్వ దేశాలు దీవించబడతాయి,#22:18 లేదా జనాంగాలన్నీ తమ ఆశీర్వాదాలలో నీ సంతానం పేరు వాడుకుంటారు 48:20చూడండి ఎందుకంటే నీవు నాకు లోబడ్డావు.”
19తర్వాత అబ్రాహాము తన పనివారి దగ్గరకు తిరిగి వెళ్లాడు, వారు కలిసి బెయేర్షేబకు వెళ్లారు. అబ్రాహాము బెయేర్షేబలో నివసించాడు.
నాహోరు కుమారులు
20కొంతకాలం తర్వాత, అబ్రాహాముకు ఇలా చెప్పబడింది, “మిల్కా కూడా తల్లి అయ్యింది; నీ సోదరుడు నాహోరుకు ఆమె జన్మనిచ్చిన కుమారులు:
21మొదటి కుమారుడు ఊజు, అతని తమ్ముడు బూజు,
కెమూయేలు (అరాము ఇతని కుమారుడు),
22కెసెదు, హజో, పిల్దాషు, యిద్లాపు, బెతూయేలు.”
23బెతూయేలు రిబ్కాకు తండ్రి అయ్యాడు.
మిల్కా ఈ ఎనిమిది మంది కుమారులను అబ్రాహాము సోదరుడైన నాహోరుకు కన్నది.
24రయూమా అనే అతని ఉంపుడుగత్తె కూడా కుమారులు కన్నది:
తెబహు, గహము, తహషు, మయకా.
موجودہ انتخاب:
ఆది 22: TSA
سرخی
شئیر
کاپی

کیا آپ جاہتے ہیں کہ آپ کی سرکیاں آپ کی devices پر محفوظ ہوں؟ Sign up or sign in
తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం
ప్రచురణ హక్కులు © 1976, 1990, 2022, 2024 by Biblica, Inc.
అనుమతితో ఉపయోగించబడింది. ప్రపంచవ్యాప్తంగా అన్ని హక్కులు ప్రత్యేకించబడ్డాయి.
Telugu Contemporary Version, Holy Bible
Copyright © 1976, 1990, 2022, 2024 by Biblica, Inc.
Used with permission. All rights reserved worldwide.