యోహాను 1

1
శరీరధారి అయిన వాక్యం
1ఆదిలో వాక్యం ఉన్నది. ఆ వాక్యం దేవునితో ఉన్నది, ఆ వాక్యమే దేవుడు. 2ఆయన ఆదిలో దేవునితో ఉన్నారు. 3సృష్టిలో ఉన్నవన్నీ ఆయన ద్వారానే కలిగాయి, కలిగింది ఏదీ ఆయన లేకుండా కలుగలేదు. 4ఆయనలో జీవం ఉన్నది. ఆ జీవం మానవులందరికి వెలుగుగా ఉన్నది. 5ఆ వెలుగు చీకటిలో ప్రకాశించింది కాని, చీకటి ఆ వెలుగును గ్రహించలేదు.
6యోహాను అనే పేరుగల ఒకరిని దేవుడు పంపించారు. 7ప్రజలందరు తన ద్వారా ఆ వెలుగును నమ్మాలని ఆ వెలుగు గురించి ఒక సాక్షిగా అతడు వచ్చాడు. 8అయితే అతడు ఆ వెలుగు కాదు గాని, ఆ వెలుగు గురించి సాక్ష్యం చెప్పడానికి మాత్రమే వచ్చాడు.
9ప్రతి వ్యక్తికి వెలుగునిచ్చే నిజమైన వెలుగు ఈ లోకంలోనికి వస్తూ ఉండేది. 10ఆయన వలననే లోకం రూపించబడినా, ఆయన లోకంలో ఉన్నపుడు లోకం ఆయనను గుర్తించలేదు. 11ఆయన తన సొంత ప్రజల దగ్గరకు వచ్చారు, కాని తన సొంతవారు ఆయనను అంగీకరించలేదు. 12అయినా ఆయనను ఎందరు అంగీకరించారో వారందరికి, అనగా తన పేరును నమ్మిన వారికందరికి దేవుని పిల్లలుగా అయ్యే అధికారాన్ని ఆయన ఇచ్చారు. 13ఈ పిల్లలు శరీర కోరికల వలన, లేక మానవుల నిర్ణయాల వలన లేక భర్త కోరిక వలన పుట్టలేదు, కాని దేవుని మూలంగా పుట్టారు.
14ఆ వాక్యం శరీరాన్ని ధరించుకొని మన మధ్య నివసించింది. మనం ఆయన మహిమను చూశాము, కృపాసత్య సంపూర్ణుడై, తండ్రి దగ్గర నుండి వచ్చిన, ఏకైక కుమారుని మహిమను చూశాము.
15యోహాను ఆయన గురించి సాక్ష్యం చెప్తూ, “నేను చెప్పిన వాడు ఈయనే, ‘నా తర్వాత వచ్చేవాడు నన్ను మించినవాడు ఎందుకంటే ఆయన నాకన్నా ముందు నుండి ఉన్న వాడు’ ” అని బిగ్గరగా కేక వేసి చెప్పాడు. 16ఆయన సంపూర్ణతలో నుండి మనం అందరం కృప వెంబడి కృపను పొందుకొన్నాం. 17ధర్మశాస్త్రం మోషే ద్వారా ఇవ్వబడింది కాని కృప, సత్యం యేసు క్రీస్తు ద్వారా వచ్చాయి. 18ఎవ్వరూ ఎన్నడును దేవుని చూడలేదు, కానీ తానే దేవుడైయుండి, తండ్రితో అత్యంత సమీప సంబంధం కలిగియున్న, ఏకైక కుమారుడే ఆయనను మనకు తెలియపరిచారు.
బాప్తిస్మమిచ్చు యోహాను సాక్ష్యం
19యెరూషలేములోని యూదా అధికారులు అతడు ఎవరో తెలుసుకోవడానికి యాజకులను, లేవీయులను యోహాను దగ్గరకు పంపినప్పుడు అతడు వారికిచ్చిన సాక్ష్యం. 20అతడు, “నేను క్రీస్తును కాను” అని ఒప్పుకోడానికి వెనుకాడలేదు, తడబాటు లేకుండ ధైర్యంగా ఒప్పుకున్నాడు.
21అప్పుడు వారు “అయితే నీవెవరవు? నీవు ఏలీయావా?” అని అడిగారు.
అతడు, “కాదు” అని చెప్పాడు.
అయితే “నీవు ప్రవక్తవా?” అని అడిగారు.
అతడు “కాదు” అని జవాబిచ్చాడు.
22చివరికి వారు, “నీవెవరవు? మమ్మల్ని పంపినవారికి మేము సమాధానం చెప్పడానికి నీ గురించి నీవు ఏమి చెప్తావు?” అని అడిగారు.
23అందుకు యోహాను, యెషయా ప్రవక్త చెప్పిన మాటలతో జవాబిచ్చాడు, “ ‘ప్రభువు కొరకు మార్గాన్ని సరాళం చేయండి అని అరణ్యంలో ఎలుగెత్తి చెప్తున్న స్వరం నేనే’ ”#1:23 యెషయా 40:3 అన్నాడు.
24అప్పుడు పంపబడిన పరిసయ్యులు 25“నీవు క్రీస్తువు కాదు, ఏలీయావు కాదు, ప్రవక్తవు కాదు, అలాంటప్పుడు ఎందుకు బాప్తిస్మం ఇస్తున్నావు?” అని అతన్ని ప్రశ్నించారు.
26అందుకు యోహాను, “నేను నీటితో బాప్తిస్మమిస్తున్నాను, కాని మీ మధ్య నిలబడివున్న ఒకరిని మీరు ఎరుగరు. 27నా తర్వాత రానున్నవాడు ఆయనే. ఆయన చెప్పుల వారును విప్పడానికి కూడ నేను యోగ్యున్ని కాదు” అని సమాధానం చెప్పాడు.
28ఇదంతా యోర్దాను నదికి అవతల ఉన్న బేతనియ అనే ఊరిలో, యోహాను బాప్తిస్మం ఇస్తున్న చోట జరిగింది.
యేసు గురించి యోహాను ఇచ్చిన సాక్ష్యం
29మరుసటిరోజు యోహాను యేసు తన దగ్గరకు రావడం చూసి, “చూడండి, లోక పాపాన్ని మోసుకొనిపోయే దేవుని గొర్రెపిల్ల! 30‘నా తర్వాత వచ్చేవాడు నన్ను మించినవాడు ఎందుకంటే ఆయన నాకన్నా ముందు నుండి ఉన్న వాడు’ అని నేను చెప్పింది ఈయన గురించే. 31ఆయన ఎవరో నాకే తెలియదు, కాని ఆయనను ఇశ్రాయేలు ప్రజలకు తెలియచేయడానికి నేను నీళ్ళతో బాప్తిస్మం ఇస్తున్నాను” అన్నాడు.
32అప్పుడు యోహాను ఇలా సాక్ష్యం ఇచ్చాడు: “పరలోకం నుండి ఆత్మ పావురంలా దిగి వచ్చి ఆయనపై నిలిచి ఉండడం నేను చూసాను. 33అయితే నాకే ఆయన తెలియలేదు కానీ, ‘నీవు ఎవరి మీదకి ఆత్మ దిగి వచ్చి ఆయనపై నిలిచియుండడం చూస్తావో, ఆయనే పరిశుద్ధాత్మతో బాప్తిస్మం ఇచ్చేవాడు’ అని నీళ్ళతో బాప్తిస్మం ఇవ్వడానికి నన్ను పంపినవాడు నాతో చెప్పారు. 34నేను చూసాను గనుక ఈయనే దేవుని కుమారుడని సాక్ష్యం ఇస్తున్నాను.”#1:34 యెషయా 42:1
యేసును వెంబడించిన యోహాను శిష్యులు
35మరుసటిరోజు యోహాను తన ఇద్దరి శిష్యులతో ఉన్నాడు. 36అతడు యేసు వెళ్తున్నప్పుడు చూసి “ఇదిగో దేవుని గొర్రెపిల్ల!” అని చెప్పాడు.
37అతడు చెప్పిన మాటలు విన్న ఆ ఇద్దరు శిష్యులు యేసును వెంబడించారు. 38యేసు వెనుకకు తిరిగి, తనని వెంబడిస్తున్న వారిని చూసి, “మీకు ఏమి కావాలి?” అని అడిగారు.
అందుకు వారు “రబ్బీ, నీవు ఎక్కడ నివసిస్తున్నావు?” అని అడిగారు. రబ్బీ అనగా బోధకుడు అని అర్థం.
39ఆయన, “వచ్చి చూడండి” అని చెప్పారు.
కనుక వారు వెళ్లి ఆయన ఉన్నచోటును చూసి, ఆ రోజంతా ఆయనతో గడిపారు. అప్పటికి సాయంకాలం సుమారు నాలుగు గంటలైంది.
40యోహాను మాటలు విని యేసును వెంబడించిన ఇద్దరిలో ఒకడు అంద్రెయ అతడు సీమోను పేతురుకు సోదరుడు. 41అంద్రెయ మొదట తన సహోదరుడైన సీమోనును కలిసి, “మేము క్రీస్తును#1:41 క్రీస్తును అనగా మెస్సీయ కనుగొన్నాం” అని చెప్పి, 42అతన్ని యేసు దగ్గరకు తీసుకొనివచ్చాడు.
యేసు అతన్ని చూసి, “నీవు యోహాను కుమారుడవైన సీమోనువు. నీవు కేఫా#1:42 కేఫా అనగా రాయి అని అర్థం అని పిలువబడతావు” అని చెప్పారు.
ఫిలిప్పును నతనయేలును పిలిచిన యేసు
43మరుసటిరోజు యేసు గలిలయకు వెళ్లాలని నిర్ణయించుకున్నారు. ఆయన ఫిలిప్పును చూసి, “నన్ను వెంబడించు” అని చెప్పారు.
44ఫిలిప్పు కూడా పేతురు, అంద్రెయల పట్టణమైన బేత్సయిదాకు చెందినవాడు. 45ఫిలిప్పు, నతనయేలును చూసి అతనితో, “ధర్మశాస్త్రంలో మోషే, ప్రవక్తలు ఎవరి గురించి వ్రాసారో ఆయనను మేము కనుగొన్నాం. ఆయనే యోసేపు కుమారుడైన, నజరేయుడైన యేసు” అని చెప్పాడు.
46“నజరేతా! ఆ ఊరి నుండి మంచిది ఏదైనా రాగలదా?” అని నతనయేలు అడిగాడు.
అందుకు ఫిలిప్పు “వచ్చి చూడు” అన్నాడు.
47నతనయేలు తన దగ్గరకు రావడం చూసిన యేసు, “ఇతడు ఏ కపటం లేని నిజమైన ఇశ్రాయేలీయుడు” అన్నారు.
48అందుకు నతనయేలు, “నేను నీకెలా తెలుసు?” అని అడిగాడు.
అందుకు యేసు, “ఫిలిప్పు నిన్ను పిలువక ముందే నీవు ఆ అంజూరపుచెట్టు క్రింద ఉన్నప్పుడే నేను నిన్ను చూసాను” అని చెప్పారు.
49అప్పుడు నతనయేలు, “రబ్బీ, నీవు దేవుని కుమారుడవు; నీవు ఇశ్రాయేలుకు రాజువు” అని సమాధానం ఇచ్చాడు.
50అందుకు యేసు “నీవు ఆ అంజూరపుచెట్టు క్రింద ఉన్నప్పుడే నేను చూసానని చెప్పినందుకు నీవు నమ్మావు. దీని కంటే గొప్ప కార్యాలను నీవు చూస్తావు” అని అతనితో చెప్పారు. 51తర్వాత యేసు, “ఆకాశం తెరువబడి, దేవదూతలు మనుష్యకుమారుని మీద ఎక్కడం, దిగడం మీరు చూస్తారని నేను మీతో ఖచ్చితంగా చెప్తున్నాను”#1:51 ఆది 28:12 అన్నారు.

Vurgu

Paylaş

Kopyala

None

Önemli anlarınızın tüm cihazlarınıza kaydedilmesini mi istiyorsunuz? Kayıt olun ya da giriş yapın