ఆది 13

13
అబ్రాము లోతు విడిపోవుట
1అబ్రాము తన భార్యను తనకున్న అంతటిని తీసుకుని ఈజిప్టు నుండి దక్షిణ దేశానికి వెళ్లాడు, లోతు అతనితో పాటు వెళ్లాడు. 2అబ్రాము పశువులు, వెండి బంగారాలతో ఎంతో ధనవంతుడయ్యాడు.
3దక్షిణం నుండి బయలుదేరి బేతేలుకు వచ్చేవరకు, అంటే బేతేలుకు హాయికి మధ్యలో తాను మొదట గుడారం వేసుకున్న చోటికి వెళ్లి, 4తాను మొదట బలిపీఠం కట్టిన చోటుకు చేరుకున్నాడు. అక్కడ అబ్రాము యెహోవాకు ప్రార్థన చేశాడు.
5అబ్రాముతో కలిసి ప్రయాణిస్తున్న లోతుకు కూడా గొర్రెలు, మందలు, గుడారాలు ఉన్నాయి. 6వీరిద్దరి ఆస్తులు ఎంతో అధికంగా ఉండడం వల్ల వీరు కలిసి ఉండడానికి ఆ స్థలం సహకరించలేదు. 7అబ్రాము కాపరులకు లోతు కాపరులకు మధ్య వివాదం మొదలైంది. ఆ సమయంలో కనానీయులు, పెరిజ్జీయులు కూడా ఆ దేశంలో నివసిస్తున్నారు.
8కాబట్టి అబ్రాము లోతుతో, “మనం సమీప బంధువులం కాబట్టి నీ కాపరులకు నా కాపరులకు మధ్య వైరం కలిగి ఉండడం మంచిది కాదు. 9ఈ దేశమంతా నీ ముందు లేదా? మనం విడిపోదాము. నీవు ఈ భూభాగంలో ఎడమ వైపుకు వెళ్తే నేను కుడి వైపుకు వెళ్తాను; నీవు కుడి వైపుకు వెళ్తే నేను ఎడమ వైపుకు వెళ్తాను” అని అన్నాడు.
10లోతు కళ్ళెత్తి సోయరు వైపు యొర్దాను మైదాన ప్రాంతమంతా యెహోవా తోటలా, ఈజిప్టులా, సస్యశ్యామలమై ఉన్నట్లు చూశాడు. (ఇది యెహోవా సొదొమ గొమొర్రాలను నాశనం చేయక ముందు అలా ఉంది.) 11కాబట్టి లోతు యొర్దాను మైదాన ప్రాంతమంతా తన కోసం ఎంచుకుని తూర్పు వైపు వెళ్లిపోయాడు. వారు ఒకరి నుండి ఒకరు విడిపోయారు: 12అబ్రాము కనాను దేశంలో నివసించాడు, లోతు మైదాన పట్టణాల మధ్య నివసిస్తూ, సొదొమ దగ్గర గుడారాలు వేసుకున్నాడు. 13అయితే, సొదొమ ప్రజలు దుర్మార్గులు, యెహోవాకు విరోధంగా ఘోరంగా పాపం చేస్తూ ఉండేవారు.
14లోతు అబ్రాము నుండి విడిపోయిన తర్వాత యెహోవా అబ్రాముతో, “నీవున్న చోట నుండి ఉత్తర దక్షిణ తూర్పు పడమర దిశలు చూడు. 15నీవు చూస్తున్న భూమంతా నీకు, నీ సంతానానికి#13:15 లేదా విత్తనం; 16 వచనంలో కూడా శాశ్వతంగా ఇస్తాను. 16నీ సంతానాన్ని భూమి మీద ఉన్న ఇసుక రేణువుల్లా అంటే ఒకవేళ ఎవరైనా లెక్కించాలనుకున్నా లెక్కించలేనంత విస్తారంగా చేస్తాను. 17నీవు లేచి దేశం యొక్క అన్ని దిక్కులకు వెళ్లు, అదంతా నేను నీకు ఇస్తున్నాను” అని అన్నారు.
18కాబట్టి అబ్రాము హెబ్రోనులో మమ్రే అనే చోట సింధూర వృక్షాల దగ్గర నివసించడానికి వెళ్లాడు. అక్కడ తన గుడారాలు వేసుకున్నాడు. అక్కడ యెహోవాకు బలిపీఠం కట్టాడు.

Seçili Olanlar:

ఆది 13: TSA

Vurgu

Paylaş

Kopyala

None

Önemli anlarınızın tüm cihazlarınıza kaydedilmesini mi istiyorsunuz? Kayıt olun ya da giriş yapın