Logo ng YouVersion
Hanapin ang Icon

ఆదికాండము 11

11
బాబెలు గోపురం
1జలప్రళయం తర్వాత మానవులంతా ఒకే భాష మాట్లాడారు. ప్రజలంతా ఒకే పదజాలం ఉపయోగించారు. 2తూర్పు నుండి ప్రజలు కదిలిపోయారు. షీనారు దేశంలో మైదాన భూమిని వారు కనుగొన్నారు. బ్రతుకుదెరువు కోసం ప్రజలంతా అక్కడే ఉండిపోయారు. 3“మనం ఇటుకలు చేసి, అవి గట్టిపడేందుకు వాటిని కాల్చాలి” అనుకొన్నారు ప్రజలు. ఇళ్లు కట్టుటకు ప్రజలు రాళ్లు కాక ఇటుకలనే ఉపయోగించారు. అలానే అడుసు కాక తారు ఉపయోగించారు.
4అప్పుడు ప్రజలు ఇలా అన్నారు: “మన కోసం మనం ఒక పట్టణం కట్టుకోవాలి. ఆకాశం అంత ఎత్తుగా మనం ఒక గోపుర శిఖరం కట్టుకోవాలి. ఇలా గనుక చేస్తే మనం ప్రఖ్యాతి చెందుతాం. ప్రపంచమంతటా మనం చెల్లా చెదురవకుండా ఒకే చోట మనమంతా కలసి ఉంటాం.”
5ఆ పట్టణాన్ని, ఆ గోపుర శిఖరాన్ని చూచుటకు యెహోవా దిగి వచ్చాడు. వాటిని ప్రజలు నిర్మిస్తూ ఉండటం యెహోవా చూశాడు. 6యెహోవా ఇలా అన్నాడు: “ఈ ప్రజలంతా ఒకే భాష మాట్లాడుతున్నారు. వీళ్లంతా కలసి ఉమ్మడిగా ఈ పని చేస్తున్నట్లు నాకు కనబడుతోంది. వారు చేయగలిగిన దానికి ఇది ప్రారంభం మాత్రమే. త్వరలో వాళ్లు యోచించినదేదైనా చేయ గలుగుతారు. 7అందుచేత మనం క్రిందికి వెళ్లి, వారి భాషను గలిబిలి చేద్దాం. అప్పుడు వాళ్లు ఒకరినొకరు అర్థం చేసుకోలేరు.”
8ఆ ప్రజలు భూలోకం అంతటా చెదిరిపోయేటట్లు యెహోవా చేశాడు. కనుక ఆ పట్టణాన్ని కట్టుకోవటం ఆ ప్రజలు ముగించలేకపోయారు. 9మొత్తం ప్రపంచంలోని భాషను దేవుడు గలిబిలి చేసిన చోటు అదే. కనుక ఆ స్థలం బాబెలు#11:9 బాబెలు లేక బబులోను. దీని అర్థమేమనగా “తారుమారు.” అని పిలువబడింది. కనుక ఆ స్థలం నుండి భూమిమీద ఇతర చోట్లన్నింటికీ ఆ ప్రజలను యెహోవా చెదరగొట్టాడు.
షేము కుటుంబ చరిత్ర
10షేము కుటుంబ చరిత్ర ఇది. జలప్రళయం తర్వాత రెండు సంవత్సరాలకు, షేము 100 సంవత్సరాల వయస్సులో ఉన్నప్పుడు, అతని కుమారుడు అర్పక్షదు పుట్టాడు. 11ఆ తర్వాత షేము 700 సంవత్సరాలు జీవించాడు. అతనికి ఇంకా కుమారులు, కుమార్తెలు ఉన్నారు.
12అర్పక్షదు 35 సంవత్సరాల వయస్సులో ఉన్నప్పుడు, అతని కుమారుడు షేలహు పుట్టాడు. 13షేలహు పుట్టిన తర్వాత అర్పక్షదు 403 సంవత్సరాలు జీవించాడు. ఆ కాలంలో అతనికి ఇంకా కొందరు కుమారులు, కుమార్తెలు పుట్టారు.
14షేలహుకు 30 సంవత్సరాలు నిండిన తర్వాత అతని కుమారుడు ఏబెరు పుట్టాడు. 15ఏబెరు పుట్టిన తర్వాత షేలహు 403 సంవత్సరాలు జీవించాడు. ఆ కాలంలో అతనికి ఇంకా కొందరు కుమారులు, కుమార్తెలు పుట్టారు.
16ఏబెరుకు 34 సంవత్సరాలు నిండిన తర్వాత అతని కుమారుడు పెలెగు పుట్టాడు. 17పెలెగు పుట్టిన తర్వాత ఏబెరు 430 సంవత్సరాలు జీవించాడు. ఆ కాలంలో అతనికి ఇంకా కుమారులు, కుమార్తెలు పుట్టారు.
18పెలెగుకు 30 సంవత్సరాలు నిండినప్పుడు అతని కుమారుడు రయూ పుట్టాడు. 19రయూ పుట్టిన తర్వాత, పెలెగు ఇంకా 209 సంవత్సరాలు జీవించాడు. ఆ కాలంలో అతనికి ఇంకా కొందరు కుమారులు, కుమార్తెలు పుట్టారు.
20రయూకు 32 సంవత్సరాలు నిండినప్పుడు, అతని కుమారుడు సెరూగు పుట్టాడు. 21సెరూగు పుట్టిన తర్వాత రయూ 207 సంవత్సరాలు బ్రతికాడు. ఆ కాలంలో అతనికి ఇంకా కుమార్తెలు, కుమారులు పుట్టారు.
22సెరూగుకు 30 సంవత్సరాలు నిండినప్పుడు అతని కుమారుడు నాహోరు పుట్టాడు. 23నాహోరు పుట్టిన తర్వాత, సెరూగు 200 సంవత్సరాలు జీవించాడు. ఆ కాలంలో అతనికి ఇంకా కుమారులు, కుమార్తెలు పుట్టారు.
24నాహోరుకు 29 సంవత్సరాలు నిండినప్పుడు అతని కుమారుడు తెరహు పుట్టాడు. 25తెరహు పుట్టిన తర్వాత నాహోరు 119 సంవత్సరాలు జీవించాడు. ఆ కాలంలో అతనికి ఇంకా కుమారులు, కుమార్తెలు పుట్టారు.
26తెరహుకు 70 సంవత్సరాలు నిండినప్పుడు, అతని కుమారులు అబ్రాము, నాహోరు, హారాను పుట్టారు.
తెరహు కుటుంబ చరిత్ర
27తెరహు కుటుంబ చరిత్ర ఇది. అబ్రాము, నాహోరు, హారానులకు తండ్రి తెరహు. లోతుకు హారాను తండ్రి. 28కల్దీయుల ఊరు అనే తన స్వగ్రామంలో హారాను మరణించాడు. తన తండ్రి తెరహు బ్రతికి ఉన్నప్పుడే హారాను చనిపోయాడు. 29అబ్రాము, నాహోరు పెళ్లి చేసుకొన్నారు. అబ్రాము భార్యకు శారయి అని పేరు పెట్టబడింది. నాహోరు భార్యకు మిల్కా అని పేరు పెట్టబడింది. మిల్కా హారాను కుమార్తె. మిల్కా, ఇస్కాలకు హారాను తండ్రి. 30శారయికి పిల్లలను కనే అవకాశం లేనందువల్ల ఆమెకు పిల్లలు లేరు.
31తెరహు తన కుటుంబముతోబాటు కల్దీయుల ఊరు అను పట్టణమును విడచిపెట్టేశాడు. కనానుకు ప్రయాణం చేయాలని వారు ఏర్పాటు చేసుకొన్నారు. తన కుమారుడు అబ్రామును, మనుమడు లోతును (హారాను కుమారుడు), కోడలు శారయిని తెరహు తన వెంట తీసుకు వెళ్లాడు. వారు హారాను పట్టణం వరకు ప్రయాణం చేసి, అక్కడ ఉండిపోవాలని నిర్ణయించుకొన్నారు. 32తెరహు 205 సంవత్సరాలు జీవించాడు. తర్వాత అతడు హారానులో మరణించాడు.

Haylayt

Ibahagi

Kopyahin

None

Gusto mo bang ma-save ang iyong mga hinaylayt sa lahat ng iyong device? Mag-sign up o mag-sign in