పరమగీతము 2:4-16

పరమగీతము 2:4-16 తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం (TSA)

నన్ను ఆయన విందుశాలకు నడిపించారు, ఆయన నన్ను ప్రేమతో కప్పివేశారు. ఎండు ద్రాక్షపండ్లతో నన్ను బలోపేతం చేయండి, ఆపిల్ పండ్లతో తినిపించండి. ఎందుకంటే నేను ప్రేమతో మూర్ఛపోయాను. ఆయన ఎడమ చేయి నా తల క్రింద ఉంచాడు, కుడిచేతితో నన్ను కౌగిలించుకున్నాడు. యెరూషలేము కుమార్తెలారా! పొలములోని జింకలను బట్టి లేళ్లను బట్టి మీతో ప్రమాణము చేయిస్తున్నాను: సరియైన సమయం వచ్చేవరకు ప్రేమను లేపకండి, మేల్కొల్పకండి. వినండి! నా ప్రియుడు! చూడండి! ఆయన వచ్చాడు, పర్వతాల మీదుగా గంతులు వేస్తూ, కొండల మీదుగా దూకుతూ. నా ప్రియుడు జింకలాంటి వాడు, లేదా లేడిపిల్ల లాంటివాడు. చూడండి! అక్కడ అతడు మా గోడ వెనుక నిలబడి కిటికీల గుండా చూస్తూ, జాలక గుండా దాచుకుని చూస్తున్నాడు. నా ప్రియుడు మాట్లాడి నాతో అన్నాడు, నా ప్రియురాలా, లే, నా సౌందర్యవతి, నాతో రా. చూడండి! శీతాకాలం గడిచిపోయింది; వర్షాలు అయిపోయాయి. భూమిపై పువ్వులు ప్రత్యక్షమవుతాయి; పాడే రుతువు వచ్చేసింది. మన దేశంలో పావురాల కూత వినిపిస్తూ ఉంది. అంజూర చెట్టు దాని తొలి ఫలాలను కాస్తుంది; ద్రాక్షచెట్లు వికసించి సువాసనను వెదజల్లుతున్నాయి. నా ప్రియురాలా, లేచి, రా, నా సౌందర్యవతి, నాతో రా. బండ సందుల్లో, పర్వత ప్రాంతంలో దాగే స్థలాల్లో ఉన్న నా పావురమా, నీ ముఖాన్ని నాకు చూపించు, నీ స్వరాన్ని విననివ్వు; ఎందుకంటే నీ స్వరం మధురం నీ ముఖం మనోహరము. నక్కలను పట్టుకోండి, గుంట నక్కలను పట్టుకోండి ఎందుకంటే అవి ద్రాక్షతోటలను పాడు చేస్తాయి, మన ద్రాక్షతోట పూతకు వచ్చింది. నా ప్రియుడు నావాడు నేను ఆయన దానను; తామర పువ్వుల మధ్య ఆయన నెమ్మదిగా సంచరిస్తున్నాడు.

పరమగీతము 2:4-16 ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)

అతడు నన్ను విందుశాలకు తెచ్చాడు. అతని ప్రేమ పతాక స్థాయిలో ఉంది. (యువతి తన ప్రియునితో మాట్లాడుతూ ఉంది) ప్రేమ కోసం నేను ఆకలిగా ఉన్నాను. ఎండు ద్రాక్షపళ్ళతో నన్ను తెప్పరిల్లజేయండి, ఆపిల్ పళ్ళతో నన్ను ఉత్తేజ పరచండి. (ఆ యువతి తనలో తాను మాట్లాడుకుంటూ ఉంది) అతని ఎడమ చెయ్యి నా తల కింద ఉంది. కుడిచేత్తో అతడు నన్ను కౌగిలించుకున్నాడు. (ఆ యువతి మిగతా స్త్రీలతో మాట్లాడుతూ ఉంది) యెరూషలేము ఆడపడుచులారా, పొలాల్లోని జింకల మీద, లేళ్ల మీద ఒట్టు పెట్టి చెప్పండి. మా ప్రేమ పని ముగిసేంత వరకూ మీరు మమ్మల్ని ఆటంకపరచవద్దు. [రెండవ భాగం] (ఆ యువతి తనలో తాను మాట్లాడుకుంటూ ఉంది) నా ప్రియుని స్వరం అదుగో! చూడు, అతడు వస్తున్నాడు. పర్వతాల మీద గంతులేస్తూ కొండల మీద దూకుతూ వస్తున్నాడు. నా ప్రియుడు జింకలాగా, లేడిపిల్లలాగా ఉన్నాడు. చూడు, మన గోడ వెనక నిలబడి ఉన్నాడు. కిటికీలోనుంచి చూస్తున్నాడు. అల్లిక తడికె గుండా తొంగి చూస్తున్నాడు. నా ప్రియుడు నాతో మాట్లాడి ఇలా అన్నాడు, “ప్రియా, లే. సుందరీ, నాతో వచ్చెయ్యి. చలికాలం పోయింది. వానలు పడి వెళ్ళిపోయాయి. దేశమంతా పూలు పూశాయి. కొమ్మలను కత్తిరించే కాలం, పక్షులు కోలాహలం చేసే కాలం వచ్చింది. కోకిల కూతలు మన ప్రాంతాల్లో వినబడుతున్నాయి. అంజూరు పళ్ళు పక్వానికి వచ్చాయి. ద్రాక్షచెట్లు పూతపట్టాయి. అవి సువాసన ఇస్తున్నాయి. ప్రియా, లే. సుందరీ, నాతో వచ్చెయ్యి. బండసందుల్లోని నా పావురమా, కొండ మరుగు చరియల్లోని పావురమా, నీ ముఖం నన్ను చూడ నివ్వు. నీ స్వరం వినిపించు. నీ స్వరం మధురం, నీ ముఖం ఎంత ముద్దుగా ఉంది.” (యువతి తన ప్రియునితో మాట్లాడుతూ ఉంది) మన ద్రాక్షతోటలు పూతకు వచ్చాయి. తోడేళ్ళను పట్టుకో. ద్రాక్షతోటలను పాడుచేసే గుంట నక్కలను పట్టుకో. (ఆ యువతి తనలో తాను మాట్లాడుకుంటూ ఉంది) నా ప్రియుడు నా వాడు. నేను అతని దాన్ని. లిల్లీలు ఉన్నతావుల్లో అతడు మందను చక్కగా మేపుతున్నాడు.

పరమగీతము 2:4-16 పవిత్ర బైబిల్ (TERV)

నా ప్రియుడు నన్ను ద్రాక్షారసశాలకు తీసుకుని వచ్చాడు, నా మీద అతని ఉద్దేశం ప్రేమ. ఎండు ద్రాక్షాలతో నాకు బలాన్నివ్వండి, జల్దరు పండ్లతో నా అలసట తీర్చండి, ఎందుకంటే నేను ప్రేమతో బలహీనమయ్యాను. నా ప్రియుని ఎడమ చేయి నా తల క్రింద ఉంది, అతని కుడి చేయి నన్ను కౌగలించుకొంది. యెరూషలేము స్త్రీలారా, దుప్పులమీద, అడవి లేళ్ల మీద ఒట్టేసి నాకు వాగ్దానం చెయ్యండి, నేను సిద్ధపడేవరకూ. ప్రేమను లేపవద్దు, ప్రేమను పురికొల్పవద్దు. నా ప్రియుని గొంతు వింటున్నాను. అదిగో అతడు వస్తున్నాడు. పర్వతాల మీది నుంచి దూకుతూ కొండల మీది నుంచి వస్తున్నాడు. నా ప్రియుడు దుప్పిలా ఉన్నాడు లేదా లేడి పిల్లలా ఉన్నాడు. మన గోడ వెనుక నిలబడివున్న అతన్ని చూడు, కిటికీలోనుంచి తేరి పార చూస్తూ, అల్లిక కిటికీలోనుంచి చూస్తూ నా ప్రియుడు నాతో అంటున్నాడు, “నా ప్రియురాలా, లెమ్ము, నా సుందరవతీ, రా, వెళ్లిపోదాం! చూడు, శీతాకాలం వెళ్లిపోయింది, వర్షాలు వచ్చి వెళ్లిపోయాయి. పొలాల్లో పూలు వికసిస్తున్నాయి ఇది పాడే సమయం! విను, పావురాలు తిరిగి వచ్చాయి. అంజూర చెట్లమీద చిన్న పండ్లు ఎదుగుతున్నాయి. పూస్తున్న ద్రాక్షా పూల సువాసన చూడు. నా ప్రియురాలా, సుందరవతీ, లేచిరా, మనం వెళ్లిపోదాం!” కనపడని ఎత్తైన శిఖరంమీద గుహల్లో దాక్కొన్న నా పావురమా! నిన్ను చూడనిమ్ము, నీ గొంతు విననిమ్ము, నీ గొంతు ఎంతో మధురం, నువ్వెంతో సుందరం! మాకోసం గుంటనక్కల్ని ద్రాక్షాతోటల్ని పాడుచేసే చిన్న గుంటనక్కల్ని పట్టుకోండి! మా ద్రాక్షాతోట ఇప్పుడు పూతమీద ఉంది. నా ప్రియుడు నావాడు, నేను అతని దానను! అతడు సుగంధ పుష్పాల పద్మాల నడుమ గొర్రెలను మేపుతున్నాడు!

పరమగీతము 2:4-16 పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI) (TELUBSI)

అతడు నన్ను విందుశాలకు తోడుకొనిపోయెను నామీద ప్రేమను ధ్వజముగా ఎత్తెను. ప్రేమాతిశయముచేత నేను మూర్ఛిల్లుచున్నాను ద్రాక్షపండ్ల యడలుపెట్టి నన్ను బలపరచుడి జల్దరు పండ్లుపెట్టి నన్నాదరించుడి అతని యెడమచెయ్యి నా తలక్రిందనున్నది కుడిచేత అతడు నన్ను కౌగిలించుచున్నాడు. యెరూషలేము కుమార్తెలారా, పొలములోని యిఱ్ఱులనుబట్టియు లేళ్లనుబట్టియు మీచేత ప్రమాణము చేయించుకొని ప్రేమకు ఇష్టమగువరకు మీరు లేపకయు కలతపరచకయు నుండుడని మిమ్మును బతిమాలుకొనుచున్నాను. ఆలకించుడి; నా ప్రియుని స్వరము వినబడుచున్నది ఇదిగో అతడు వచ్చుచున్నాడు గంతులువేయుచు కొండలమీదను ఎగసిదాటుచు మెట్టలమీదను అతడు వచ్చుచున్నాడు. నా ప్రియుడు ఇఱ్ఱివలె నున్నాడు లేడిపిల్లవలె నున్నాడు అదిగో మన గోడకు వెలిగా నతడు నిలుచుచున్నాడు కిటికీగుండ చూచుచున్నాడు కిటికీకంతగుండ తొంగి చూచుచున్నాడు ఇప్పుడు నా ప్రియుడు నాతో మాటలాడు చున్నాడు నా ప్రియురాలా, సుందరవతీ, లెమ్ము రమ్ము చలికాలము గడిచిపోయెను వర్షకాలము తీరిపోయెను వర్షమిక రాదు. దేశమంతట పువ్వులు పూసియున్నవి పిట్టలు కోలాహలముచేయు కాలము వచ్చెను పావుర స్వరము మన దేశములో వినబడుచున్నది. అంజూరపుకాయలు పక్వమగుచున్నవి ద్రాక్షచెట్లు పూతపెట్టి సువాసన నిచ్చుచున్నవి నా ప్రియురాలా, సుందరవతీ, లెమ్ము రమ్ము బండసందులలో ఎగురు నా పావురమా, పేటుబీటల నాశ్రయించు నా పావురమా, నీ స్వరము మధురము నీ ముఖము మనోహరము నీ ముఖము నాకు కనబడనిమ్ము నీ స్వరము నాకు వినబడనిమ్ము. మన ద్రాక్షతోటలు పూతపెట్టియున్నవి ద్రాక్షతోటలను చెరుపు నక్కలను పట్టుకొనుడి సహాయము చేసి గుంటనక్కలను పట్టుకొనుడి. నా ప్రియుడు నా వాడు నేను అతనిదానను పద్మములున్నచోట అతడు మందను మేపుచున్నాడు