రూతు 2:17-23
రూతు 2:17-23 పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI) (TELUBSI)
కాబట్టి ఆమె అస్తమయమువరకు ఆ చేనిలో ఏరుకొనుచు, తాను ఏరుకొనిన దానిని దుల్లకొట్టగా అవి దాదాపు తూమెడు యవలాయెను. ఆమె వాటిని ఎత్తికొని ఊరిలోనికి వచ్చినప్పుడు ఆమె అత్త ఆమె యేరు కొనిన వాటిని చూచెను. ఆమెతిని తృప్తిపొందిన తరువాత తాను మిగిల్చినదానిని చూపించి ఆమెకిచ్చెను. అంతట ఆమె అత్త ఆమెతో–నేడు నీవెక్కడ ఏరు కొంటివి? ఎక్కడ పనిచేసితివి? నీయందు లక్ష్యముంచినవాడు దీవింపబడునుగాక అనగా, ఆమె తాను ఎవనియొద్ద పనిచేసెనో అది తన అత్తకు తెలియచెప్పి–ఎవని యొద్ద నేడు పనిచేసితినో అతనిపేరు బోయజు అనెను. నయోమి–బ్రదికియున్నవారికిని చచ్చినవారికిని ఉపకారము చేయుట మానని యితడు యెహోవాచేత ఆశీర్వదింపబడునుగాక అని తన కోడలితో అనెను. మరియు నయోమి–ఆ మనుష్యుడు మనకు సమీపబంధువుడు, అతడు మనలను విడిపింపగల వారిలో ఒకడని చెప్పగా మోయాబీయురాలైన రూతు–అంతేకాదు, అతడు నన్ను చూచి, తనకు కలిగిన పంటకోత అంతయు ముగించువరకు తన పనివారియొద్ద నిలకడగా ఉండుమని నాతో చెప్పెననెను. అప్పుడు నయోమి తన కోడలైన రూతుతో–నా కుమారీ, అతని పనికత్తెలతోకూడనే బయలుదేరుచు వేరొక చేనిలోనివారికి నీవు కనబడక పోవుట మంచిదనెను. కాబట్టి యవలకోతయు గోధు మలకోతయు ముగియువరకు ఆమె యేరుకొనుచు బోయజు పనికత్తెలయొద్ద నిలకడగానుండి తన అత్త యింట నివసించెను.
రూతు 2:17-23 ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)
కాబట్టి ఆమె సాయంకాలం వరకూ అదే పొలంలో ఏరుకుని తాను ఏరుకున్న వాటిని దుళ్ళగొట్టింది. అవి దాదాపు తూమెడు బార్లీ గింజలు అయ్యాయి. ఆమె వాటిని తీసుకుని ఊళ్ళోకి వచ్చింది. ఇంటి దగ్గర తన అత్త నయోమికి తాను ఏరిన వాటిని చూపించింది. తరువాత తాను తిన్న తరువాత మిగిల్చిన పేలాలు అత్తకు ఇచ్చింది. అప్పుడు రూతుతో ఆమె అత్త “నువ్వు ఈ రోజు ఎక్కడ పరిగె ఏరుకున్నావు? ఎక్కడ పని చేశావు? నీకు సహాయం చేసినవాణ్ణి దేవుడు దీవిస్తాడు గాక” అంది. అప్పుడు రూతు తాను ఎవరి పొలంలో పని చేసిందో ఆ వ్యక్తిని గూర్చి తన అత్తకు చెప్పింది. “అతని పేరు బోయజు” అని చెప్పింది. దానికి నయోమి “యెహోవా అతణ్ణి ఆశీర్వదిస్తాడు గాక! ఆయన బ్రతికి ఉన్నవారికీ, చనిపోయినవారికీ మేలు చేయడం మానలేదు” అని తన కోడలితో అంది. నయోమి ఇంకా “ఆ వ్యక్తి మనకు దగ్గర చుట్టం. మనలను అతడు ఆదుకొంటాడు” అని చెప్పింది. దానికి మోయాబీయురాలైన రూతు “అంతేకాదు, అతడు పంటకోత అంతా ముగిసే వరకూ తన పని వాళ్ళ దగ్గరే ఉండమని నాతో చెప్పాడు” అంది. అప్పుడు నయోమి తన కోడలు రూతుతో “అమ్మా, అతని పనిపిల్లలతో కలసి ఉండటమే మంచిది. వేరొకరి చేలోకి వెళ్తే ఏదైనా కీడు జరుగవచ్చు” అంది. రూతు అప్పటినుండి బార్లీ పంట కోత, గోదుమ పంట కోత ముగిసే వరకూ బోయజు పనికత్తెల దగ్గరే ఉండి పరిగె ఏరుకుంటూ, తన అత్తతోనే నివసించింది.
రూతు 2:17-23 పవిత్ర బైబిల్ (TERV)
సాయంత్రంవరకు రూతు పొలాల్లో పని చేసింది. తర్వాత ఆమె ఆ కంకులను దుళ్లగొట్టింది. అవి సుమారు ఒక తూమెడు యవలయ్యాయి. రూతు తాను ఏరుకొన్న గింజలను తన అత్తకు చూపెట్టేందుకని ఊరిలోనికి మోసుకొనిపోయింది. ఆ మధ్యాహ్న భోజనములో మిగిలినదానిని కూడ ఆమెకు ఇచ్చింది. ఆమె అత్త ఇలా అన్నది: “ఈ గింజలన్నీ ఎక్కడ ఏరుకున్నావు? నీవు ఎక్కడ పని చేశావు? నిన్ను గమనించినవాడిని దేవుడు దీవించునుగాక.” రూతు తన అత్తతో, “ఈ వేళ బోయజు అనే ఆయన దగ్గర నేను పని చేశాను” అని చెప్పింది. “యెహోవా అతనిని ఆశీర్వదించునుగాక! బ్రతికిన వాళ్లకు, చచ్చినవాళ్లకు అందరికి దేవుడు దయ చూపెడుతూనేవుంటాడు.” అని తన కోడలితో చెప్పింది నయోమి. “బోయజు మన బంధువే, మనలను కాపాడేవాళ్లలో బోయజు ఒకడు” అని తన కోడలితో చెప్పింది నయోమి. అప్పుడు, “మళ్లీ వచ్చి పని చేసుకోమని, కోత పూర్తి అయ్యేవరకు తన పనివాళ్లతో కలిసే పని చేసుకోమన్నాడు బోయజు” అని చెప్పింది రూతు. దానికి నయోమి తన కోడలు రూతుతో ఇలా చెప్పింది: “అతని ఆడ కూలీలతోనే కలిసి పని చేసుకోవటం మంచిది నీకు. ఇంకేదైనా పొలంలో పనిచేస్తే మరే మగాడైనా నిన్ను బాధించవచ్చు.” అందుచేత రూతు బోయజురి ఆడ కూలీలనే సన్నిహితంగా వెంబడిస్తూ, పనిచేసుకొంటూ పోయింది. యవలకోత పూర్తయ్యేవరకు ఆమె పరిగె ఏరుకొంది. గోధుమ కోత అయ్యేంతవరకు కూడ ఆమె అక్కడే పనిచేసింది. రూతు తన అత్తగారు నయోమితో బాటే కలిసి వుంటోంది.
రూతు 2:17-23 Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం (OTSA)
కాబట్టి రూతు సాయంత్రం వరకు పరిగె ఏరుకుంది. తర్వాత తాను సేకరించుకున్న యవలను దుళ్లగొట్టింది, అది దాదాపు తూమెడు అయ్యింది. ఆమె వాటిని పట్టణానికి తీసుకెళ్లింది, తన అత్త ఆమె ఎంత సేకరించిందో చూసింది. రూతు తాను తృప్తిగా తిన్న తర్వాత మిగిలిన దానిని కూడ తెచ్చి ఆమెకు ఇచ్చింది. ఆమె అత్త ఆమెతో, “ఈ రోజు నీవెక్కడ ఏరుకున్నావు? ఎక్కడ పని చేశావు? నిన్ను గమనించిన మనిషి ధన్యుడు!” అని అన్నది. అప్పుడు రూతు ఆమె ఏ స్థలంలో పని చేస్తూ ఉన్నదో చెప్తూ, “నేను బోయజు అని పేరుగల మనిషి దగ్గర ఈ రోజు పని చేశాను” అన్నది. నయోమి తన కోడలితో, “యెహోవా అతన్ని ఆశీర్వదించును గాక! అతడు బ్రతికి ఉన్నవారికి, చచ్చినవారికి దయ చూపడం మానలేదు” అన్నది. “ఆ మనుష్యుడు మనకు సమీపబంధువు; అతడు మనలను విడిపింపగల వారిలో ఒకడు” అని కూడా చెప్పింది. అప్పుడు మోయాబీయురాలైన రూతు అన్నది, “అతడు నాతో, ‘నా పనివారు పంటంతా కోసే వరకు వారితో ఇక్కడే ఉండు’ అని కూడా అన్నాడు.” నయోమి తన కోడలైన రూతుతో, “నా కుమారీ, అతని పనికత్తెలతోనే వెళ్లడం మంచిది, ఎందుకంటే ఇతరుల పొలంలో నీకు హాని కలుగవచ్చు” అని అన్నది. కాబట్టి రూతు పరిగె ఏరుకోడానికి, యవల కోత గోధుమల కోత ముగిసేవరకు బోయజు పనికత్తెలకు దగ్గరగా ఉంది. ఆమె తన అత్తతో నివసించింది.