రూతు 2
2
1నయోమి పెనిమిటికి బంధువు డొకడుండెను. అతడు చాల ఆస్తిపరుడు, అతడు ఎలీమెలెకు వంశపువాడై యుండెను, అతని పేరు బోయజు. 2మోయాబీయు రాలైన రూతు–నీ సెలవైనయెడల నేను పొలములోనికి పోయి, యెవని కటాక్షము పొందగలనో వాని వెనుక పరిగె నేరుకొందునని నయోమితో చెప్పగా ఆమె–నా కుమారీ పొమ్మనెను. 3కాబట్టి ఆమె వెళ్లి పొలములోనికి వచ్చి చేను కోయువారి వెనుక పొలములో ఏరుకొనెను. ఆ పొలములో ఆమె పోయిన భాగము ఎలీమెలెకు వంశపువాడైన బోయజుది. 4బోయజు బేత్లెహేమునుండి వచ్చి–యెహోవా మీకు తోడై యుండునుగాకని చేను కోయువారితో చెప్పగా వారు–యెహోవా నిన్ను ఆశీర్వదించును గాకనిరి. 5అప్పుడు బోయజు కోయువారిమీద ఉంచబడిన తన పనివానిని చూచి–ఈ చిన్నది ఎవరిదని అడుగగా 6కోయువారిమీద నుంచబడిన ఆ పనివాడు– ఈమె మోయాబుదేశమునుండి నయోమితోకూడ తిరిగి వచ్చిన మోయాబీయురాలైన యౌవనురాలు. 7ఆమె–నేను కోయువారి వెనుకకు పనలమధ్యను ఏరుకొని కూర్చుకొనుటకు దయచేసి నాకు సెలవిమ్మని అడిగెను. ఆమె వచ్చి ఉదయము మొదలుకొని యిదివరకు ఏరుకొను చుండెను, కొంతసేపు మాత్రము ఆమె యింట కూర్చుండెనని వాడు చెప్పెను. 8అప్పుడు బోయజు రూతుతో– నా కుమారీ, నా మాట వినుము; వేరొక పొలములో ఏరుకొనుటకు పోవద్దు, దీనిని విడిచి పోవద్దు, ఇచ్చట నా పనికత్తెలయొద్ద నిలకడగా ఉండుము. 9వారు కోయు చేను కనిపెట్టి వారిని వెంబడించుము, నిన్ను ముట్టకూడదని యౌవనస్థులకు ఆజ్ఞాపించియున్నాను, నీకు దాహమగునప్పుడుకుండలయొద్దకు పోయి పనివారు చేదిన నీళ్లు త్రాగుమని చెప్పెను. 10అందుకు ఆమె సాగిలపడి తల వంచుకొని–ఏమి తెలిసి పరదేశినైన నాయందు లక్ష్యముంచునట్లు నీకు కటాక్షము కలిగెనో అని చెప్పగా బోయజు–నీ పెనిమిటి మరణమైన తరువాత నీవు నీ అత్తకు చేసినదంతయు నాకు తెలియబడెను. 11నీవు నీ తలి దండ్రులను నీ జన్మభూమిని విడిచి, యింతకుముందు నీవు ఎరుగని జనము నొద్దకు వచ్చితివి. 12యెహోవా నీవు చేసినదానికి ప్రతిఫలమిచ్చును; ఇశ్రాయేలీయులదేవుడైన యెహోవా రెక్కలక్రింద సురక్షితముగా నుండునట్లు నీవు వచ్చితివి; ఆయన నీకు సంపూర్ణమైన బహుమాన మిచ్చునని ఆమెకుత్తరమిచ్చెను. 13అందుకు ఆమె–నా యేలినవాడా, నేను నీ పనికత్తెలలో ఒకదానను కాకపోయినను, నీవు నన్నాదరించి నీ దాసురాలినగు నాయందు ప్రేమ గలిగి మాటలాడితివి గనుక నాయెడల నీకు కటాక్షము కలుగనిమ్మని చెప్పెను. 14బోయజు–భోజనకాలమున నీ విక్కడికి వచ్చి భోజనముచేసి, చిరకలో నీ ముక్క ముంచి, తినుమని ఆమెతో చెప్పగా, చేను కోయువారియొద్ద ఆమె కూర్చుండెను. అతడు ఆమెకు పేలాలు అందియ్యగా ఆమెతిని తృప్తిపొంది కొన్ని మిగిల్చెను. 15ఆమె యేరు కొనుటకు లేచినప్పుడు బోయజు–ఆమె పనలమధ్యను ఏరుకొనవచ్చును, ఆమెను అవమానపరచకుడి 16మరియు ఆమెకొరకు పిడికెళ్లు పడవేసి ఆమె యేరుకొనునట్లు విడిచిపెట్టుడి, ఆమెను గద్దింపవద్దని తన దాసుల కాజ్ఞాపించెను. 17కాబట్టి ఆమె అస్తమయమువరకు ఆ చేనిలో ఏరుకొనుచు, తాను ఏరుకొనిన దానిని దుల్లకొట్టగా అవి దాదాపు తూమెడు యవలాయెను. 18ఆమె వాటిని ఎత్తికొని ఊరిలోనికి వచ్చినప్పుడు ఆమె అత్త ఆమె యేరు కొనిన వాటిని చూచెను. ఆమెతిని తృప్తిపొందిన తరువాత తాను మిగిల్చినదానిని చూపించి ఆమెకిచ్చెను. 19అంతట ఆమె అత్త ఆమెతో–నేడు నీవెక్కడ ఏరు కొంటివి? ఎక్కడ పనిచేసితివి? నీయందు లక్ష్యముంచినవాడు దీవింపబడునుగాక అనగా, ఆమె తాను ఎవనియొద్ద పనిచేసెనో అది తన అత్తకు తెలియచెప్పి–ఎవని యొద్ద నేడు పనిచేసితినో అతనిపేరు బోయజు అనెను. 20నయోమి–బ్రదికియున్నవారికిని చచ్చినవారికిని ఉపకారము చేయుట మానని యితడు యెహోవాచేత ఆశీర్వదింపబడునుగాక అని తన కోడలితో అనెను. మరియు నయోమి–ఆ మనుష్యుడు మనకు సమీపబంధువుడు, అతడు మనలను విడిపింపగల వారిలో ఒకడని చెప్పగా 21మోయాబీయురాలైన రూతు–అంతేకాదు, అతడు నన్ను చూచి, తనకు కలిగిన పంటకోత అంతయు ముగించువరకు తన పనివారియొద్ద నిలకడగా ఉండుమని నాతో చెప్పెననెను. 22అప్పుడు నయోమి తన కోడలైన రూతుతో–నా కుమారీ, అతని పనికత్తెలతోకూడనే బయలుదేరుచు వేరొక చేనిలోనివారికి నీవు కనబడక పోవుట మంచిదనెను. 23కాబట్టి యవలకోతయు గోధు మలకోతయు ముగియువరకు ఆమె యేరుకొనుచు బోయజు పనికత్తెలయొద్ద నిలకడగానుండి తన అత్త యింట నివసించెను.
ప్రస్తుతం ఎంపిక చేయబడింది:
రూతు 2: TELUBSI
హైలైట్
షేర్ చేయి
కాపీ
మీ పరికరాలన్నింటి వ్యాప్తంగా మీ హైలైట్స్ సేవ్ చేయబడాలనుకుంటున్నారా? సైన్ అప్ చేయండి లేదా సైన్ ఇన్ చేయండి
Telugu Old Version Bible - పరిశుద్ధ గ్రంథము O.V. Bible
Copyright © 2016 by The Bible Society of India
Used by permission. All rights reserved worldwide.