రూతు 2:10-13
రూతు 2:10-13 ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)
అప్పుడు ఆమె బోయజు ముందు సాగిలపడి తన తల నేలకు ఆనించి “పరాయి దేశానికి చెందిన నాపై ఇంత శ్రద్ధ చూపడానికి నీకు నాపై దయ ఎలా కలిగిందో!” అంది. అప్పుడు బోయజు “నీ భర్త చనిపోయిన తరువాత నువ్వు నీ అత్తకు చేసినదంతా నేను విన్నాను. నువ్వు నీ తల్లిదండ్రులనూ, పుట్టిన దేశాన్నీ విడిచిపెట్టి నీకు ఏమాత్రం పరిచయం లేని ప్రజల మధ్యకు వచ్చావు. యెహోవా నువ్వు చేసిన దానికి ప్రతిఫలమిస్తాడు గాక, ఎవరి నీడన నువ్వు క్షేమంగా ఉన్నావో ఆ ఇశ్రాయేలీయుల దేవుడు యెహోవా నీకు నిండైన ప్రతిఫలం ఇస్తాడు గాక!” అన్నాడు. అందుకు ఆమె “అయ్యా, నేను నీ దగ్గర పని చేసేదాన్ని కాకపోయినా, నన్ను ఆదరించారు. నీ దాసినైన నాతో దయగా మాట్లాడారు. నాపై మరింత దయ ఉంచండి” అని చెప్పింది.
రూతు 2:10-13 పవిత్ర బైబిల్ (TERV)
రూతు తల వంచుకొని, నేలవరకు వంగి బోయజుతో ఇలా అన్నది. “పరాయిదాననయిన నేను నీ దృష్ఠిలో పడటం, నీ దయకు పాత్రురాలను కావడం ఆశ్చర్యంగావుంది.” బోయజు ఇలా జవాబిచ్చాడు: “నీ ఆత్తగారు నయోమికి నీవు చేసిన సహాయాన్ని గూర్చి నాకంతా తెలుసు. నీ భర్త చనిపోయిన తర్వాత కూడ నీవు ఆమెకు సహాయము చేశావని నాకు తెలుసు. అంతేకాదు, నీవు నీ తల్లిదండ్రులను నీ స్వదేశాన్ని కూడా విడిచిపెట్టేసి, ఈ దేశము వచ్చేశావు. ఇక్కడి వారెవ్వరూ నీకు తెలియదు. అయినా నయోమితో వచ్చేశావు. నీవు చేసిన ఈ మంచి పనులన్నిటికీ యెహోవా నీకు ప్రతిఫలము ఇస్తాడు. ఏ ఇశ్రాయేలు వారి దేవుని దగ్గర ఆశ్రయము కోరి వచ్చావో ఆ యెహోవా దేవుడు నీకు సకల ఐశ్వర్యాలు ప్రసాదించునుగాక! మరియు ఆయన నిన్ను కాపాడునుగాక.” “అయ్యా! నేను కేవలం ఒక పనిమనిషిని, మీ పని మనుషుల్లో కనీసం ఒకదానితో సమానము కాను నేను. అయినా నన్ను గూర్చి ఎంతో దయగా మాట్లాడి, నన్ను ఆదరించారు. మీ దయ నాకు ఉంటే చాలు” ఆన్నది రూతు.
రూతు 2:10-13 పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI) (TELUBSI)
అందుకు ఆమె సాగిలపడి తల వంచుకొని–ఏమి తెలిసి పరదేశినైన నాయందు లక్ష్యముంచునట్లు నీకు కటాక్షము కలిగెనో అని చెప్పగా బోయజు–నీ పెనిమిటి మరణమైన తరువాత నీవు నీ అత్తకు చేసినదంతయు నాకు తెలియబడెను. నీవు నీ తలి దండ్రులను నీ జన్మభూమిని విడిచి, యింతకుముందు నీవు ఎరుగని జనము నొద్దకు వచ్చితివి. యెహోవా నీవు చేసినదానికి ప్రతిఫలమిచ్చును; ఇశ్రాయేలీయులదేవుడైన యెహోవా రెక్కలక్రింద సురక్షితముగా నుండునట్లు నీవు వచ్చితివి; ఆయన నీకు సంపూర్ణమైన బహుమాన మిచ్చునని ఆమెకుత్తరమిచ్చెను. అందుకు ఆమె–నా యేలినవాడా, నేను నీ పనికత్తెలలో ఒకదానను కాకపోయినను, నీవు నన్నాదరించి నీ దాసురాలినగు నాయందు ప్రేమ గలిగి మాటలాడితివి గనుక నాయెడల నీకు కటాక్షము కలుగనిమ్మని చెప్పెను.
రూతు 2:10-13 Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం (OTSA)
అందుకు ఆమె తలవంచి సాష్టాంగపడి, “నేను పరదేశిని, మీరు నన్ను గమనించేటంత దయ మీ దృష్టిలో ఎలా సంపాదించుకున్నాను?” అని ఆమె అతన్ని అడిగింది. అందుకు బోయజు ఆమెతో అన్నాడు, “నీ భర్త చనిపోయిన తర్వాత నీ అత్తకు నీవు చేసినదంతా అనగా ఎలా నీవు నీ తండ్రిని తల్లిని, నీ కుటుంబాన్ని, నీ స్వదేశాన్ని విడిచి ఇంతకుముందు నీకు తెలియని ఈ ప్రజల మధ్యకు వచ్చావో నేను విన్నాను. యెహోవా నీవు చేసిన దానికి ప్రతిఫలమిచ్చును గాక. ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా రెక్కల క్రింద సురక్షితంగా ఉండునట్లు నీవు వచ్చావు, ఆయన నీకు సంపూర్ణమైన బహుమానమిచ్చును గాక.” అందుకు ఆమె, “నా ప్రభువా, నేను మీ పనివారిలో ఒకదాన్ని కానప్పటికి, మీరు నన్నాదరించి దయతో మాట్లాడారు. నేను మీ దృష్టిలో దయ సంపాదించుకోవడం కొనసాగాలి” అన్నది.