రూతు 2:1-3
రూతు 2:1-3 ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)
నయోమి భర్తకు ఒక బంధువు ఉన్నాడు. అతడు చాలా భాగ్యవంతుడు. అతడు కూడా ఎలీమెలెకు వంశం వాడే. అతని పేరు బోయజు. మోయాబీ స్త్రీ రూతు నయోమితో ఇలా అంది “నువ్వు వెళ్ళమంటే నేను పొలాల్లోకి వెళ్ళి పరిగె ఏరుకుంటాను. నాపై ఎవరు దయ చూపిస్తారో వారి వెనకే వెళ్ళి పరిగె ఏరుకుంటాను.” అప్పుడు నయోమి “అలాగే అమ్మా, వెళ్ళు” అంది. ఆమె పనికి వెళ్ళింది. పంట కోసేవారి పని అయ్యాక వెళ్ళి నేలపై రాలిన పరిగె ఏరుకుంది. ఆమె పరిగె ఏరుకునే ఆ పొలం ఎలీమెలెకు వంశం వాడైన బోయజుది.
రూతు 2:1-3 పవిత్ర బైబిల్ (TERV)
బేత్లెహేములో నయోమి భర్త ఎలీమెలెకు వంశపు వాడైన బోయజు అనే దగ్గర బంధువు ఒకతను ఉండేవాడు. అతడు గొప్ప శక్తిసంపన్నుడు. ఒక రోజు రూతు నయోమితో, “నేను పొలాల్లోకి వెళితే బాగుంటుంది. ఒకవేళ ఎవరైనా నామీద జాలిపడి తన పొలంలో తన వెనుక పరిగె ఏరుకోనిస్తారేమో.” అన్నది. “సరే మంచిది బిడ్డా, అలాగే వెళ్లిరా” అన్నది నయోమి. రూతు పొలం వెళ్లి, పంట కోస్తున్న పనివాళ్ల వెనకాల తిరుగుతూ, వాళ్లు విడిచిపెట్టే పరిగె ఏరు కుంటుంది. ఆ పొలము ఎలీమెలెకు వంశపువాడైన బోయజుకు చెందినది.
రూతు 2:1-3 పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI) (TELUBSI)
నయోమి పెనిమిటికి బంధువు డొకడుండెను. అతడు చాల ఆస్తిపరుడు, అతడు ఎలీమెలెకు వంశపువాడై యుండెను, అతని పేరు బోయజు. మోయాబీయు రాలైన రూతు–నీ సెలవైనయెడల నేను పొలములోనికి పోయి, యెవని కటాక్షము పొందగలనో వాని వెనుక పరిగె నేరుకొందునని నయోమితో చెప్పగా ఆమె–నా కుమారీ పొమ్మనెను. కాబట్టి ఆమె వెళ్లి పొలములోనికి వచ్చి చేను కోయువారి వెనుక పొలములో ఏరుకొనెను. ఆ పొలములో ఆమె పోయిన భాగము ఎలీమెలెకు వంశపువాడైన బోయజుది.
రూతు 2:1-3 Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం (OTSA)
నయోమికి తన భర్త ఎలీమెలెకు వంశం యొక్క బంధువు ఉన్నాడు, అతని పేరు బోయజు. మోయాబీయురాలైన రూతు నయోమితో, “నేను పొలాలకు వెళ్లి ఎవరి దృష్టిలో దయ పొందితే అతని వెనుక అతని పొలంలో పరిగె ఏరుకు వస్తాను” అని చెప్పింది. అందుకు నయోమి, “నా కుమారీ, వెళ్లు” అన్నది. కాబట్టి ఆమె వెళ్లి, ఒక పొలంలో కోతకోస్తున్న పనివారి వెనుక పరిగె ఏరుకోవడం ప్రారంభించింది. అలా ఆమె పని చేసిన పొలం ఎలీమెలెకు వంశం వాడైన బోయజుకు చెందినది.