రూతు 2:1-22
రూతు 2:1-22 తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం (TSA)
నయోమికి తన భర్త ఎలీమెలెకు వంశం యొక్క బంధువు ఉన్నాడు, అతని పేరు బోయజు. మోయాబీయురాలైన రూతు నయోమితో, “నేను పొలాలకు వెళ్లి ఎవరి దృష్టిలో దయ పొందితే అతని వెనుక అతని పొలంలో పరిగె ఏరుకు వస్తాను” అని చెప్పింది. అందుకు నయోమి, “నా కుమారీ, వెళ్లు” అన్నది. కాబట్టి ఆమె వెళ్లి, ఒక పొలంలో కోతకోస్తున్న పనివారి వెనుక పరిగె ఏరుకోవడం ప్రారంభించింది. అలా ఆమె పని చేసిన పొలం ఎలీమెలెకు వంశం వాడైన బోయజుకు చెందినది. అప్పుడే బోయజు బేత్లెహేము నుండి వచ్చి, “యెహోవా మీకు తోడై ఉండును గాక!” అని పనివారితో అన్నాడు. “యెహోవా నిన్ను ఆశీర్వదించును గాక!” అని వారు జవాబిచ్చారు. అప్పుడు బోయజు కోతపనివారి మీద నియమించబడిన తన సేవకునితో, “ఈ యువతి ఎవరికి సంబంధించినది?” అని అడిగాడు. సేవకుడు జవాబిస్తూ అన్నాడు, “ఆమె మోయాబు నుండి నయోమితో కూడ తిరిగివచ్చిన మోయాబీయురాలు. ‘దయచేసి నేను పనివారి వెనుక వెళ్లి పనల మధ్య పరిగెను ఏరుకోనివ్వండి’ అని ఆమె అన్నది. ఉదయం నుండి ఇప్పటివరకు ఏరుకుంటూ ఉన్నది, కొంతసేపు మాత్రమే ఆమె ఇంటి దగ్గర విశ్రాంతి తీసుకుంది.” కాబట్టి బోయజు రూతుతో అన్నాడు, “నా కుమారీ, నా మాట విను. ఏరుకోడానికి వేరే పొలంలోకి వెళ్లకు, దీనిని విడిచి వెళ్లకు. నా కోసం పని చేసే స్త్రీలతో ఉండు. పురుషులు పంట కోస్తున్నప్పుడు కనిపెట్టి స్త్రీల వెంట వెళ్లు. నిన్ను ఇబ్బంది కలిగించవద్దని పురుషులకు చెప్పాను. నీకు దాహం వేస్తే, పురుషులు నింపిన కుండల దగ్గరకు వెళ్లి నీళ్లు త్రాగు.” అందుకు ఆమె తలవంచి సాష్టాంగపడి, “నేను పరదేశిని, మీరు నన్ను గమనించేటంత దయ మీ దృష్టిలో ఎలా సంపాదించుకున్నాను?” అని ఆమె అతన్ని అడిగింది. అందుకు బోయజు ఆమెతో అన్నాడు, “నీ భర్త చనిపోయిన తర్వాత నీ అత్తకు నీవు చేసినదంతా అనగా ఎలా నీవు నీ తండ్రిని తల్లిని, నీ కుటుంబాన్ని, నీ స్వదేశాన్ని విడిచి ఇంతకుముందు నీకు తెలియని ఈ ప్రజల మధ్యకు వచ్చావో నేను విన్నాను. యెహోవా నీవు చేసిన దానికి ప్రతిఫలమిచ్చును గాక. ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా రెక్కల క్రింద సురక్షితంగా ఉండునట్లు నీవు వచ్చావు, ఆయన నీకు సంపూర్ణమైన బహుమానమిచ్చును గాక.” అందుకు ఆమె, “నా ప్రభువా, నేను మీ పనివారిలో ఒకదాన్ని కానప్పటికి, మీరు నన్నాదరించి దయతో మాట్లాడారు. నేను మీ దృష్టిలో దయ సంపాదించుకోవడం కొనసాగాలి” అన్నది. భోజన సమయంలో బోయజు ఆమెతో, “నీవిక్కడికి రా, భోజనం చేసి, పులిసిన ద్రాక్షరసంలో రొట్టె ముంచి తిను” అన్నాడు. ఆమె పనివారితో కూర్చున్నప్పుడు, అతడు ఆమెకు కాల్చిన ధాన్యం కొంత ఇచ్చాడు. ఆమె తృప్తిగా తిని కొంత మిగిల్చింది. ఆమె ఏరుకోడానికి లేచినప్పుడు, బోయజు తన మగ పనివారితో, “ఆమె పనల మధ్య ఏరుకోనివ్వండి, ఆమెను అభ్యంతర పెట్టకండి. ఆమె కోసం కొన్ని కంకులు పనల నుండి పడేయండి, ఆమె వాటిని ఏరుకునేలా విడిచిపెట్టండి, ఆమెను గద్దించకండి” అని అంటూ హెచ్చరించాడు. కాబట్టి రూతు సాయంత్రం వరకు పరిగె ఏరుకుంది. తర్వాత తాను సేకరించుకున్న యవలను దుళ్లగొట్టింది, అది దాదాపు తూమెడు అయ్యింది. ఆమె వాటిని పట్టణానికి తీసుకెళ్లింది, తన అత్త ఆమె ఎంత సేకరించిందో చూసింది. రూతు తాను తృప్తిగా తిన్న తర్వాత మిగిలిన దానిని కూడ తెచ్చి ఆమెకు ఇచ్చింది. ఆమె అత్త ఆమెతో, “ఈ రోజు నీవెక్కడ ఏరుకున్నావు? ఎక్కడ పని చేశావు? నిన్ను గమనించిన మనిషి ధన్యుడు!” అని అన్నది. అప్పుడు రూతు ఆమె ఏ స్థలంలో పని చేస్తూ ఉన్నదో చెప్తూ, “నేను బోయజు అని పేరుగల మనిషి దగ్గర ఈ రోజు పని చేశాను” అన్నది. నయోమి తన కోడలితో, “యెహోవా అతన్ని ఆశీర్వదించును గాక! అతడు బ్రతికి ఉన్నవారికి, చచ్చినవారికి దయ చూపడం మానలేదు” అన్నది. “ఆ మనుష్యుడు మనకు సమీపబంధువు; అతడు మనలను విడిపింపగల వారిలో ఒకడు” అని కూడా చెప్పింది. అప్పుడు మోయాబీయురాలైన రూతు అన్నది, “అతడు నాతో, ‘నా పనివారు పంటంతా కోసే వరకు వారితో ఇక్కడే ఉండు’ అని కూడా అన్నాడు.” నయోమి తన కోడలైన రూతుతో, “నా కుమారీ, అతని పనికత్తెలతోనే వెళ్లడం మంచిది, ఎందుకంటే ఇతరుల పొలంలో నీకు హాని కలుగవచ్చు” అని అన్నది.
రూతు 2:1-22 ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)
నయోమి భర్తకు ఒక బంధువు ఉన్నాడు. అతడు చాలా భాగ్యవంతుడు. అతడు కూడా ఎలీమెలెకు వంశం వాడే. అతని పేరు బోయజు. మోయాబీ స్త్రీ రూతు నయోమితో ఇలా అంది “నువ్వు వెళ్ళమంటే నేను పొలాల్లోకి వెళ్ళి పరిగె ఏరుకుంటాను. నాపై ఎవరు దయ చూపిస్తారో వారి వెనకే వెళ్ళి పరిగె ఏరుకుంటాను.” అప్పుడు నయోమి “అలాగే అమ్మా, వెళ్ళు” అంది. ఆమె పనికి వెళ్ళింది. పంట కోసేవారి పని అయ్యాక వెళ్ళి నేలపై రాలిన పరిగె ఏరుకుంది. ఆమె పరిగె ఏరుకునే ఆ పొలం ఎలీమెలెకు వంశం వాడైన బోయజుది. బోయజు బేత్లెహేము నుండి వచ్చి పంట కోస్తున్న పనివారితో “యెహోవా మీకు తోడుగా ఉంటాడు గాక” అన్నాడు. అప్పుడు ఆ పనివారు తిరిగి బోయజుతో “యెహోవా నిన్ను ఆశీర్వదిస్తాడు గాక” అన్నారు. అప్పుడు బోయజు పంట కోస్తున్న వాళ్ళపై అజమాయిషీ చేస్తున్న పనివాడితో “ఆ అమ్మాయి ఎవరు?” అని అడిగాడు. అతడు “ఆమె మోయాబు దేశం నుండి నయోమితో కూడా వచ్చిన మోయాబీ యువతి. ఆమె ‘నేను పంట కోత కోసే వాళ్ళ వెనకాలే వెళ్ళి పనల మధ్య నేలపై పడే పరిగె ఏరుకుని పోగు చేసుకోవడానికి అనుమతి నివ్వండి’ అని నన్ను అడిగింది. ఆమె వచ్చి పొద్దుటినుంచి పరిగె ఏరుకుంటూనే ఉంది. కొంచెం సేపు మాత్రం విశ్రాంతి తీసుకుంది” అని చెప్పాడు. అప్పుడు బోయజు రూతుతో “అమ్మాయీ, వింటున్నావా, వేరే పొలంలో పరిగె ఏరుకోడానికి వెళ్ళ వద్దు. ఇక్కడే పనిచేస్తున్న పనికత్తెల దగ్గరే ఉండు. కోత పనివారు పంట కోస్తున్న చేను కనిపెట్టుకుని పనికత్తెల వెనకే వెళ్తూ ఉండు. నిన్ను తాకకూడదని యువకులను ఆదేశించాను. నీకు దాహం వేస్తే నీటికుండల దగ్గరికి వెళ్లి మా పనివాళ్ళు చేదిన నీళ్ళు తాగు” అని చెప్పాడు. అప్పుడు ఆమె బోయజు ముందు సాగిలపడి తన తల నేలకు ఆనించి “పరాయి దేశానికి చెందిన నాపై ఇంత శ్రద్ధ చూపడానికి నీకు నాపై దయ ఎలా కలిగిందో!” అంది. అప్పుడు బోయజు “నీ భర్త చనిపోయిన తరువాత నువ్వు నీ అత్తకు చేసినదంతా నేను విన్నాను. నువ్వు నీ తల్లిదండ్రులనూ, పుట్టిన దేశాన్నీ విడిచిపెట్టి నీకు ఏమాత్రం పరిచయం లేని ప్రజల మధ్యకు వచ్చావు. యెహోవా నువ్వు చేసిన దానికి ప్రతిఫలమిస్తాడు గాక, ఎవరి నీడన నువ్వు క్షేమంగా ఉన్నావో ఆ ఇశ్రాయేలీయుల దేవుడు యెహోవా నీకు నిండైన ప్రతిఫలం ఇస్తాడు గాక!” అన్నాడు. అందుకు ఆమె “అయ్యా, నేను నీ దగ్గర పని చేసేదాన్ని కాకపోయినా, నన్ను ఆదరించారు. నీ దాసినైన నాతో దయగా మాట్లాడారు. నాపై మరింత దయ ఉంచండి” అని చెప్పింది. భోజన సమయంలో బోయజు “నువ్వు ఇక్కడికే వచ్చి భోజనం చెయ్యి. నీ రొట్టెముక్కలను ద్రాక్షారసంలో ముంచుకుని తిను” అని చెప్పాడు. కాబట్టి ఆమె పంట కోసే వాళ్ళ దగ్గర కూర్చుంది. బోయజు ఆమెకు కొన్ని పేలాలు ఇచ్చాడు. ఆమె కొన్ని తృప్తిగా తిని కొన్ని మిగిల్చింది. ఆమె పరిగె ఏరుకోడానికి లేచినప్పుడు బోయజు తన పనివాళ్ళతో “ఆమెను పనల మధ్య ఏరుకోనివ్వండి. ఆమెకు ఇబ్బంది కలిగించవద్దు. అలాగే ఆమె కోసం కొన్ని కంకులు పడవేయండి. ఆమె వాటిని ఏరుకునేలా చూడండి. ఆమెతో ఎవరూ కఠినంగా మాట్లాడవద్దు” అని చెప్పాడు. కాబట్టి ఆమె సాయంకాలం వరకూ అదే పొలంలో ఏరుకుని తాను ఏరుకున్న వాటిని దుళ్ళగొట్టింది. అవి దాదాపు తూమెడు బార్లీ గింజలు అయ్యాయి. ఆమె వాటిని తీసుకుని ఊళ్ళోకి వచ్చింది. ఇంటి దగ్గర తన అత్త నయోమికి తాను ఏరిన వాటిని చూపించింది. తరువాత తాను తిన్న తరువాత మిగిల్చిన పేలాలు అత్తకు ఇచ్చింది. అప్పుడు రూతుతో ఆమె అత్త “నువ్వు ఈ రోజు ఎక్కడ పరిగె ఏరుకున్నావు? ఎక్కడ పని చేశావు? నీకు సహాయం చేసినవాణ్ణి దేవుడు దీవిస్తాడు గాక” అంది. అప్పుడు రూతు తాను ఎవరి పొలంలో పని చేసిందో ఆ వ్యక్తిని గూర్చి తన అత్తకు చెప్పింది. “అతని పేరు బోయజు” అని చెప్పింది. దానికి నయోమి “యెహోవా అతణ్ణి ఆశీర్వదిస్తాడు గాక! ఆయన బ్రతికి ఉన్నవారికీ, చనిపోయినవారికీ మేలు చేయడం మానలేదు” అని తన కోడలితో అంది. నయోమి ఇంకా “ఆ వ్యక్తి మనకు దగ్గర చుట్టం. మనలను అతడు ఆదుకొంటాడు” అని చెప్పింది. దానికి మోయాబీయురాలైన రూతు “అంతేకాదు, అతడు పంటకోత అంతా ముగిసే వరకూ తన పని వాళ్ళ దగ్గరే ఉండమని నాతో చెప్పాడు” అంది. అప్పుడు నయోమి తన కోడలు రూతుతో “అమ్మా, అతని పనిపిల్లలతో కలసి ఉండటమే మంచిది. వేరొకరి చేలోకి వెళ్తే ఏదైనా కీడు జరుగవచ్చు” అంది.
రూతు 2:1-22 పవిత్ర బైబిల్ (TERV)
బేత్లెహేములో నయోమి భర్త ఎలీమెలెకు వంశపు వాడైన బోయజు అనే దగ్గర బంధువు ఒకతను ఉండేవాడు. అతడు గొప్ప శక్తిసంపన్నుడు. ఒక రోజు రూతు నయోమితో, “నేను పొలాల్లోకి వెళితే బాగుంటుంది. ఒకవేళ ఎవరైనా నామీద జాలిపడి తన పొలంలో తన వెనుక పరిగె ఏరుకోనిస్తారేమో.” అన్నది. “సరే మంచిది బిడ్డా, అలాగే వెళ్లిరా” అన్నది నయోమి. రూతు పొలం వెళ్లి, పంట కోస్తున్న పనివాళ్ల వెనకాల తిరుగుతూ, వాళ్లు విడిచిపెట్టే పరిగె ఏరు కుంటుంది. ఆ పొలము ఎలీమెలెకు వంశపువాడైన బోయజుకు చెందినది. బోయజు బేత్లెహేమునుండి అప్పుడే పొలముకు వచ్చాడు. “దేవుడే మీకు తోడుగా వుండును గాక!” అంటూ తన పనివాళ్లను అభినందించాడు. పనివాళ్లు “యెహోవా నిన్ను ఆశీర్వదించును గాక!” అంటూ జవాబిచ్చారు. అప్పుడు ఆయన రూతును చూసి పనివాళ్లపైన నియమించబడ్డ పెద్ద సేవకునితో, “ఎవరి అమ్మాయి ఈమె?” అని అడిగాడు బోయజు. “ఆమె మోయాబు కొండదేశము నుండి నయోమితో పాటు వచ్చిన మోయాబు స్త్రీ. పనివాళ్ల వెనక తిరుగుతూ అక్కడక్కడ మిగిలిపోయిన కంకులను (పరిగె) ఏరుకోనిమ్మని ప్రొద్దున్నే వచ్చి నన్ను ఆడిగింది. అప్పట్నిండి ఆమె ఎడతెరిపి లేకుండా పని చేస్తూనే వుంది. అదిగో ఆ కనబడేదే ఆమె ఇల్లు. కాసేపు మాత్రము అక్కడ విశ్రాంతి తీసుకుంది” అన్నాడు ఆ పెద్ద సేవకుడు. అప్పుడు బోయజు రూతుతో ఇలా అన్నాడు: “నా కుమారీ వినుము. నీవు ఇక్కడే నా పొలంలోనే వుండి పరిగె ఏరుకో. ఇంకెవ్వరి పొలానికీ వెళ్లాల్సిన పనిలేదు. నా ఆడ కూలీలవెనకే పోతూవుండు. మగ వాళ్లు ఏ పొలములో కోత కోస్తుంటారో గమనిస్తూ ఆక్కడ ఆడకూలీల వెనకే ఉండు. నిన్నేమి గొడవ పెట్టొద్దని కుర్రాళ్లతో చెబుతాలే. దాహమైతే నా మనుషులు త్రాగే పాత్రలోని నీళ్లే త్రాగు.” రూతు తల వంచుకొని, నేలవరకు వంగి బోయజుతో ఇలా అన్నది. “పరాయిదాననయిన నేను నీ దృష్ఠిలో పడటం, నీ దయకు పాత్రురాలను కావడం ఆశ్చర్యంగావుంది.” బోయజు ఇలా జవాబిచ్చాడు: “నీ ఆత్తగారు నయోమికి నీవు చేసిన సహాయాన్ని గూర్చి నాకంతా తెలుసు. నీ భర్త చనిపోయిన తర్వాత కూడ నీవు ఆమెకు సహాయము చేశావని నాకు తెలుసు. అంతేకాదు, నీవు నీ తల్లిదండ్రులను నీ స్వదేశాన్ని కూడా విడిచిపెట్టేసి, ఈ దేశము వచ్చేశావు. ఇక్కడి వారెవ్వరూ నీకు తెలియదు. అయినా నయోమితో వచ్చేశావు. నీవు చేసిన ఈ మంచి పనులన్నిటికీ యెహోవా నీకు ప్రతిఫలము ఇస్తాడు. ఏ ఇశ్రాయేలు వారి దేవుని దగ్గర ఆశ్రయము కోరి వచ్చావో ఆ యెహోవా దేవుడు నీకు సకల ఐశ్వర్యాలు ప్రసాదించునుగాక! మరియు ఆయన నిన్ను కాపాడునుగాక.” “అయ్యా! నేను కేవలం ఒక పనిమనిషిని, మీ పని మనుషుల్లో కనీసం ఒకదానితో సమానము కాను నేను. అయినా నన్ను గూర్చి ఎంతో దయగా మాట్లాడి, నన్ను ఆదరించారు. మీ దయ నాకు ఉంటే చాలు” ఆన్నది రూతు. మధ్యాహ్న భోజనము వేళ బోయజు, “ఇక్కడికి రా! మా భోజనము తిను. రొట్టెను ద్రాక్షారసములో ముంచుకో” అన్నాడు రూతుతో. కనుక రూతు పనివాళ్లతో కలిసి కూర్చుంది. బోయజు ఆమెకు కోన్ని పేలాలు పెట్టాడు. రూతు తృప్తిగా భోజనము చేసిన తర్వాత ఇంకా కొంచెము మిగిలాయి. తరువాత రూతు లేచి మళ్లీ పనికి వెళ్లింది. బోయజు తన పనివారితో, “పనల మధ్యకూడ ఆమెను ఏరుకోనివ్వండి. ఆమెను అభ్యంతర పెట్టకండి. ఆమె కోసం కొన్ని కంకులు పనల్లోనుంచి జారవిడుస్తూ, ఆమె ఏరుకొనేందుకు వాటిని విడిచిపెట్టండి, అలా ఆమె పనిని సులభం చేయండి.” అని చెప్పాడు. సాయంత్రంవరకు రూతు పొలాల్లో పని చేసింది. తర్వాత ఆమె ఆ కంకులను దుళ్లగొట్టింది. అవి సుమారు ఒక తూమెడు యవలయ్యాయి. రూతు తాను ఏరుకొన్న గింజలను తన అత్తకు చూపెట్టేందుకని ఊరిలోనికి మోసుకొనిపోయింది. ఆ మధ్యాహ్న భోజనములో మిగిలినదానిని కూడ ఆమెకు ఇచ్చింది. ఆమె అత్త ఇలా అన్నది: “ఈ గింజలన్నీ ఎక్కడ ఏరుకున్నావు? నీవు ఎక్కడ పని చేశావు? నిన్ను గమనించినవాడిని దేవుడు దీవించునుగాక.” రూతు తన అత్తతో, “ఈ వేళ బోయజు అనే ఆయన దగ్గర నేను పని చేశాను” అని చెప్పింది. “యెహోవా అతనిని ఆశీర్వదించునుగాక! బ్రతికిన వాళ్లకు, చచ్చినవాళ్లకు అందరికి దేవుడు దయ చూపెడుతూనేవుంటాడు.” అని తన కోడలితో చెప్పింది నయోమి. “బోయజు మన బంధువే, మనలను కాపాడేవాళ్లలో బోయజు ఒకడు” అని తన కోడలితో చెప్పింది నయోమి. అప్పుడు, “మళ్లీ వచ్చి పని చేసుకోమని, కోత పూర్తి అయ్యేవరకు తన పనివాళ్లతో కలిసే పని చేసుకోమన్నాడు బోయజు” అని చెప్పింది రూతు. దానికి నయోమి తన కోడలు రూతుతో ఇలా చెప్పింది: “అతని ఆడ కూలీలతోనే కలిసి పని చేసుకోవటం మంచిది నీకు. ఇంకేదైనా పొలంలో పనిచేస్తే మరే మగాడైనా నిన్ను బాధించవచ్చు.”
రూతు 2:1-22 పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI) (TELUBSI)
నయోమి పెనిమిటికి బంధువు డొకడుండెను. అతడు చాల ఆస్తిపరుడు, అతడు ఎలీమెలెకు వంశపువాడై యుండెను, అతని పేరు బోయజు. మోయాబీయు రాలైన రూతు–నీ సెలవైనయెడల నేను పొలములోనికి పోయి, యెవని కటాక్షము పొందగలనో వాని వెనుక పరిగె నేరుకొందునని నయోమితో చెప్పగా ఆమె–నా కుమారీ పొమ్మనెను. కాబట్టి ఆమె వెళ్లి పొలములోనికి వచ్చి చేను కోయువారి వెనుక పొలములో ఏరుకొనెను. ఆ పొలములో ఆమె పోయిన భాగము ఎలీమెలెకు వంశపువాడైన బోయజుది. బోయజు బేత్లెహేమునుండి వచ్చి–యెహోవా మీకు తోడై యుండునుగాకని చేను కోయువారితో చెప్పగా వారు–యెహోవా నిన్ను ఆశీర్వదించును గాకనిరి. అప్పుడు బోయజు కోయువారిమీద ఉంచబడిన తన పనివానిని చూచి–ఈ చిన్నది ఎవరిదని అడుగగా కోయువారిమీద నుంచబడిన ఆ పనివాడు– ఈమె మోయాబుదేశమునుండి నయోమితోకూడ తిరిగి వచ్చిన మోయాబీయురాలైన యౌవనురాలు. ఆమె–నేను కోయువారి వెనుకకు పనలమధ్యను ఏరుకొని కూర్చుకొనుటకు దయచేసి నాకు సెలవిమ్మని అడిగెను. ఆమె వచ్చి ఉదయము మొదలుకొని యిదివరకు ఏరుకొను చుండెను, కొంతసేపు మాత్రము ఆమె యింట కూర్చుండెనని వాడు చెప్పెను. అప్పుడు బోయజు రూతుతో– నా కుమారీ, నా మాట వినుము; వేరొక పొలములో ఏరుకొనుటకు పోవద్దు, దీనిని విడిచి పోవద్దు, ఇచ్చట నా పనికత్తెలయొద్ద నిలకడగా ఉండుము. వారు కోయు చేను కనిపెట్టి వారిని వెంబడించుము, నిన్ను ముట్టకూడదని యౌవనస్థులకు ఆజ్ఞాపించియున్నాను, నీకు దాహమగునప్పుడుకుండలయొద్దకు పోయి పనివారు చేదిన నీళ్లు త్రాగుమని చెప్పెను. అందుకు ఆమె సాగిలపడి తల వంచుకొని–ఏమి తెలిసి పరదేశినైన నాయందు లక్ష్యముంచునట్లు నీకు కటాక్షము కలిగెనో అని చెప్పగా బోయజు–నీ పెనిమిటి మరణమైన తరువాత నీవు నీ అత్తకు చేసినదంతయు నాకు తెలియబడెను. నీవు నీ తలి దండ్రులను నీ జన్మభూమిని విడిచి, యింతకుముందు నీవు ఎరుగని జనము నొద్దకు వచ్చితివి. యెహోవా నీవు చేసినదానికి ప్రతిఫలమిచ్చును; ఇశ్రాయేలీయులదేవుడైన యెహోవా రెక్కలక్రింద సురక్షితముగా నుండునట్లు నీవు వచ్చితివి; ఆయన నీకు సంపూర్ణమైన బహుమాన మిచ్చునని ఆమెకుత్తరమిచ్చెను. అందుకు ఆమె–నా యేలినవాడా, నేను నీ పనికత్తెలలో ఒకదానను కాకపోయినను, నీవు నన్నాదరించి నీ దాసురాలినగు నాయందు ప్రేమ గలిగి మాటలాడితివి గనుక నాయెడల నీకు కటాక్షము కలుగనిమ్మని చెప్పెను. బోయజు–భోజనకాలమున నీ విక్కడికి వచ్చి భోజనముచేసి, చిరకలో నీ ముక్క ముంచి, తినుమని ఆమెతో చెప్పగా, చేను కోయువారియొద్ద ఆమె కూర్చుండెను. అతడు ఆమెకు పేలాలు అందియ్యగా ఆమెతిని తృప్తిపొంది కొన్ని మిగిల్చెను. ఆమె యేరు కొనుటకు లేచినప్పుడు బోయజు–ఆమె పనలమధ్యను ఏరుకొనవచ్చును, ఆమెను అవమానపరచకుడి మరియు ఆమెకొరకు పిడికెళ్లు పడవేసి ఆమె యేరుకొనునట్లు విడిచిపెట్టుడి, ఆమెను గద్దింపవద్దని తన దాసుల కాజ్ఞాపించెను. కాబట్టి ఆమె అస్తమయమువరకు ఆ చేనిలో ఏరుకొనుచు, తాను ఏరుకొనిన దానిని దుల్లకొట్టగా అవి దాదాపు తూమెడు యవలాయెను. ఆమె వాటిని ఎత్తికొని ఊరిలోనికి వచ్చినప్పుడు ఆమె అత్త ఆమె యేరు కొనిన వాటిని చూచెను. ఆమెతిని తృప్తిపొందిన తరువాత తాను మిగిల్చినదానిని చూపించి ఆమెకిచ్చెను. అంతట ఆమె అత్త ఆమెతో–నేడు నీవెక్కడ ఏరు కొంటివి? ఎక్కడ పనిచేసితివి? నీయందు లక్ష్యముంచినవాడు దీవింపబడునుగాక అనగా, ఆమె తాను ఎవనియొద్ద పనిచేసెనో అది తన అత్తకు తెలియచెప్పి–ఎవని యొద్ద నేడు పనిచేసితినో అతనిపేరు బోయజు అనెను. నయోమి–బ్రదికియున్నవారికిని చచ్చినవారికిని ఉపకారము చేయుట మానని యితడు యెహోవాచేత ఆశీర్వదింపబడునుగాక అని తన కోడలితో అనెను. మరియు నయోమి–ఆ మనుష్యుడు మనకు సమీపబంధువుడు, అతడు మనలను విడిపింపగల వారిలో ఒకడని చెప్పగా మోయాబీయురాలైన రూతు–అంతేకాదు, అతడు నన్ను చూచి, తనకు కలిగిన పంటకోత అంతయు ముగించువరకు తన పనివారియొద్ద నిలకడగా ఉండుమని నాతో చెప్పెననెను. అప్పుడు నయోమి తన కోడలైన రూతుతో–నా కుమారీ, అతని పనికత్తెలతోకూడనే బయలుదేరుచు వేరొక చేనిలోనివారికి నీవు కనబడక పోవుట మంచిదనెను.
రూతు 2:1-22 Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం (OTSA)