రూతు 1:6-22

రూతు 1:6-22 పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI) (TELUBSI)

వారికి ఆహారమిచ్చుటకు యెహోవా తన జనులను దర్శించెనని ఆమె మోయాబుదేశములో వినెను గనుక మోయాబు దేశము విడిచి వెళ్లుటకై ఆమెయు ఆమె కోడండ్రును ప్రయాణమైరి. అప్పుడు ఆమెయున్న స్థలమునుండి ఆమెతోకూడ ఆమె యిద్దరు కోడండ్రును బయలుదేరి యూదాదేశమునకు తిరిగి పోవలెనని మార్గమున వెళ్లుచుండగా నయోమి తన యిద్దరు కోడండ్రను చూచి –మీరు మీ తల్లులయిండ్లకు తిరిగి వెళ్లుడి; చనిపోయిన వారి యెడలను నా యెడలను మీరు దయచూపినట్లు యెహోవా మీ యెడల దయచూపునుగాక; మీలో ఒక్కొక్కతె పెండ్లి చేసికొని తన యింట నెమ్మదినొందునట్లు యెహోవా దయచేయును గాక అని వారితో చెప్పి వారిని ముద్దు పెట్టుకొనెను. అంతట వారు ఎలుగెత్తి యేడ్చి–నీ ప్రజలయొద్దకు నీతోకూడ వచ్చెదమని ఆమెతో చెప్పగా నయోమి–నా కుమార్తెలారా, మీరు మరలుడి; నాతోకూడ మీరు రానేల? మిమ్మును పెండ్లి చేసికొనుటకై యింక కుమారులు నా గర్భమున నుందురా? నా కుమార్తెలారా, తిరిగి వెళ్లుడి, నేను పురుషునితో నుండలేని ముసలిదానను; నాకు నమ్మిక కలదని చెప్పి ఈ రాత్రి పురుషునితోనుండి కుమారులను కనినను వారు పెద్ద వారగువరకు వారికొరకు మీరు కనిపెట్టుకొందురా? మీరు వారికొరకు కనిపెట్టుకొని పురుషులు లేక యొంటరి కత్తెలైయుందురా? నా కుమార్తెలారా, అదికూడదు; యెహోవా నాకు విరోధియాయెను; అది మిమ్మును నొప్పించినంతకంటె నన్ను మరి యెక్కువగా నొప్పించినదని వారితో చెప్పెను. వారు ఎలుగెత్తి యేడ్వగా ఓర్పా తన అత్తను ముద్దుపెట్టుకొనెను, రూతు ఆమెను హత్తు కొనెను. ఇట్లుండగా ఆమె–ఇదిగో నీ తోడికోడలు తన జనులయొద్దకును తన దేవునియొద్దకును తిరిగి పోయినదే; నీవును నీ తోడికోడలి వెంబడివెళ్లుమనెను. అందుకు రూతు–నా వెంబడి రావద్దనియు నన్ను విడిచి పెట్టుమనియు నన్ను బ్రతిమాలుకొనవద్దు. నీవు వెళ్లు చోటికే నేను వచ్చెదను, నీవు నివసించుచోటనే నేను నివసించెదను, నీ జనమే నా జనము నీ దేవుడే నా దేవుడు; నీవు మృతి బొందుచోటను నేను మృతిబొందెదను, అక్కడనే పాతిపెట్టబడెదను. మరణము తప్ప మరి ఏదైనను నిన్ను నన్ను ప్రత్యేకించినయెడల యెహోవా నాకు ఎంత కీడైన చేయునుగాక అనెను. తనతోకూడ వచ్చుటకు ఆమెకు మనస్సు కుదిరినదని నయోమి తెలిసి కొనినప్పుడు అందునుగురించి ఆమెతో మాటలాడుట మానెను గనుక వారిద్దరు బేత్లెహేమునకు వచ్చువరకు ప్రయాణము చేసిరి. వారు బేత్లెహేమునకు వచ్చినప్పుడు ఆ ఊరివారందరు వారియొద్దకు గుంపుకూడి వచ్చి–ఈమె నయోమి గదా అని అనుకొనుచుండగా ఆమె–సర్వశక్తుడు నాకు చాలా దుఃఖము కలుగజేసెను గనుక నన్ను నయోమి అనక మారా అనుడి. నేను సమృద్ధిగలదాననై వెళ్లితిని, యెహోవా నన్ను రిక్తురాలినిగా తిరిగి రాజేసెను. మీరు నన్ను నయోమి అనిపిలువనేల? యెహోవా నామీద విరుద్ధముగ సాక్ష్యము పలికెను, సర్వశక్తుడు నన్ను బాధపరచెను అని వారితో చెప్పెను. అట్లు నయోమియు ఆమెతోకూడ మోయాబీయురాలైన రూతు అను ఆమె కోడలును మోయాబుదేశమునుండి తిరిగి వచ్చిరి. వారిద్దరు యవలకోత ఆరంభములో బేత్లెహేము చేరిరి.

షేర్ చేయి
Read రూతు 1

రూతు 1:6-22 ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)

బేత్లెహేములో యెహోవా తన ప్రజలపై దయ చూపించి వారికి ఆహారం ఇస్తున్నాడని మోయాబు దేశంలో ఉన్న ఆమె విన్నది. కాబట్టి ఆమె మోయాబు దేశాన్ని విడిచి తన స్వదేశం వెళ్ళిపోవాలని తన కోడళ్ళతో సహా ప్రయాణం కట్టింది. ఆ దేశం నుండి ఆమె తన ఇద్దరు కోడళ్ళతో సహా కాలి నడకన యూదా దేశానికి బయలు దేరింది. అప్పుడు ఆమె తన ఇద్దరు కోడళ్ళతో ఇలా అంది. “మీరు మీ పుట్టిళ్ళకు తిరిగి వెళ్ళండి. చనిపోయిన నా కొడుకుల విషయంలో, నా విషయంలో మీరు నమ్మకంగా ఉన్నట్టే యెహోవా మీ పట్ల నమ్మకంగా ఉండి దయ చూపిస్తాడు గాక. మీరిద్దరూ చక్కగా మళ్ళీ పెళ్ళిళ్ళు చేసుకుని మీ భర్తల ఇళ్ళల్లో సుఖంగా జీవించే స్థితి ప్రభువు దయచేస్తాడు గాక” అని చెప్పి ఆమె తన కోడళ్ళను ముద్దు పెట్టుకుంది. అప్పుడు వాళ్ళు గట్టిగా ఏడ్చి “మేము నీతో కూడా నీ ప్రజల దగ్గరకే వస్తాం” అన్నారు. అప్పుడు నయోమి “నా బిడ్డలారా, మీరు వెనక్కి మళ్ళండి. మిమ్మల్ని పెళ్ళి చేసుకోడానికి ఇప్పుడు నా కడుపున కొడుకులు పుట్టరు గదా. అమ్మాయిలూ, తిరిగి వెళ్ళండి. నేను ముసలిదాన్ని. మగ వాడితో ఇప్పుడు కాపురం చెయ్యలేను. ఒక వేళ నేను నమ్మకంతో ఈ రాత్రి నేను ఒక మగ వాడితో గడిపి కొడుకులను కనినప్పటికీ వాళ్ళు పెద్దవాళ్లయ్యే వరకూ మీరు వేచి ఉంటారా? పెళ్లి చేసుకోకుండా వాళ్ళకోసం ఎదురు చూస్తూ ఉంటారా? నా బిడ్డలారా, అలా వద్దు. అలాంటి పరిస్థితి మీకంటే నాకే ఎక్కువ వేదన కలిగిస్తుంది, ఎందుకంటే యెహోవా నాకు విరోధి అయ్యాడు” అని వాళ్ళతో అంది. వాళ్ళు మళ్ళీ గట్టిగా ఏడ్చారు. అప్పుడు ఓర్పా తన అత్తను ముద్దు పెట్టుకుంది, రూతు ఆమెను అంటి పెట్టుకునే ఉంది. అప్పుడు నయోమి “చూడు, నీ తోడికోడలు తిరిగి తన ప్రజల దగ్గరికీ తన దేవుళ్ళ దగ్గరికీ వెళ్ళిపోయింది. నువ్వు కూడా నీ తోడికోడలి వెంటే వెళ్ళు” అని రూతుతో చెప్పింది. అందుకు రూతు “నీతో రావద్దనీ, నిన్ను విడిచిపొమ్మనీ నాకు చెప్పొద్దు. నువ్వు ఎక్కడికి వెళ్తావో నేనూ అక్కడికే వస్తాను. నువ్వు ఎక్కడ ఉంటావో నేనూ అక్కడే ఉంటాను. ఇకనుండి నీ ప్రజలే నా ప్రజలు. నీ దేవుడే నా దేవుడు. నువ్వు ఎక్కడ చనిపోతావో నేనూ అక్కడే చనిపోతాను. అక్కడే నా సమాధి కూడా ఉంటుంది. చావు తప్ప ఇంకేదీ నన్ను నీ నుండి దూరం చేస్తే యెహోవా నన్ను శిక్షిస్తాడు గాక” అంది. తనతో రావడానికే ఆమె నిశ్చయించుకున్నదని నయోమి గ్రహించినప్పుడు ఇక ఆమెతో ఆ విషయం మాట్లాడటం మానుకుంది. కాబట్టి వాళ్ళిద్దరూ బేత్లెహేముకు ప్రయాణం సాగించారు. వాళ్ళు బేత్లెహేముకు వచ్చినప్పుడు ఆ ఊరు ఊరంతా ఎంతో ఆసక్తిగా గుమిగూడారు. ఊరి స్త్రీలు “ఈమె నయోమి కదా” అని చెప్పుకున్నారు. అప్పుడు నయోమి “నన్ను నయోమి అని పిలవకండి, మారా అని పిలవండి. అమిత శక్తిశాలి నాకు చాలా వేదన కలిగించాడు. నేను బాగా ఉన్న స్థితిలో ఇక్కడినుండి వెళ్ళాను. యెహోవా నన్ను ఖాళీ చేతులతో తిరిగి తీసుకువచ్చాడు. యెహోవా నాకు వ్యతిరేక సాక్షిగా నిలిచాడు. సర్వ శక్తిశాలి నన్ను బాధ పెట్టాడు. ఇదంతా చూసి కూడా నన్ను నయోమి అని పిలుస్తారెందుకు?” అని వారితో అంది. ఆ విధంగా నయోమి, మోయాబీయురాలైన ఆమె కోడలు రూతు తిరిగి వచ్చారు. వారిద్దరూ బార్లీ పంట కోసే కాలం ఆరంభంలో బేత్లెహేము చేరుకున్నారు.

షేర్ చేయి
Read రూతు 1

రూతు 1:6-22 పవిత్ర బైబిల్ (TERV)

దేవుడు తన ప్రజలకు సహాయం చేసినట్టు, ఆయన తన ప్రజలకు (యూదాలో) ఆహారం దయచేసినట్టు మోయాబు కొండదేశంలో నయోమి విన్నది. అందుచేత నయోమి మోయాబు కొండ దేశము విడిచిపెట్టి తిరిగి తన ఇంటికి వెళ్లి పోవాలని తీర్మానించుకుంది. ఆమె కోడళ్లు కూడా ఆమెతోనే వెళ్లిపోయేందుకు తీర్మానించుకున్నారు. అంతవరకు బ్రతుకుతున్న చోటు విడిచిపెట్టేసి మళ్లీ యూదా దేశము పోయేదారి పట్టి ప్రయాణము మొదలు పెట్టారు. అప్పుడు నయోమి తన కోడళ్లు యిద్దరితో ఇలా అన్నది: “మీరు ఎవరి పుట్టింటికి వారు వెళ్లండి. మీరు చనిపోయిన నా ఇద్దరు కుమారులపైన, నాపైన ఎంతో దయ చూపెట్టారు. అలాగే యెహోవా మీపైన దయ చూపెట్టాలని కోరుకుంటున్నాను. మీరు ఇద్దరూ మళ్లీ పెళ్లాడి మీ భర్తలతో సుఖంగా ఉండేందుకు ఆ దేవుడే మీకు సహాయం చేయాలనేదే నా ప్రార్థన.” నయోమి తన యిద్దరు కోడళ్లను ముద్దు పెట్టుకుంది. దానితో అందరూ ఏడ్వటం మోదలు పెట్టారు. ఆ కోడళ్లు, “మేమూ నీతోనే వచ్చేస్తాము. నీ కుటుంబంలోనే ఉంటాము” అన్నారు. కాని నయోమి ఇలా అన్నది: “నా కుమార్తెలారా! మీ పుట్టిళ్లకు వెళ్లిపొండి. మీరు నాతో రావడం దేనికి? మిమ్మల్ని పెళ్లిచేసుకునేందుకు నా దగ్గర ఇంకెవరూ కుమారులు లేరు. ఇంటికి వెళ్లిపోండి. ఇంకో భర్తను కట్టుకునేందుకు నేను మరీ ముసలిదానను, ఒకవేళ నాకు మళ్లీ పెళ్లవుతుందని నేను అనుకున్నా లాభం లేదు. ఎందుచేతనంటే ఒకవేళ నేను ఈ రాత్రికి రాత్రే గర్భవతినై నాకు ఇద్దరు కుమారులు పుట్టినా మీరు వారిని పెండ్లాడాలంటే వాళ్లు పెద్ద వాళ్లయ్యేంతవరకు మీరు వాళ్లకోసం వేచి ఉండాలి. అన్నాళ్లూ మీరు పెళ్లి చేసుకోకుండా ఆపుజేయడం నాకు మరీ విచారం. ఎందుకంటే, యెహోవా హస్తము నాకు విరోధముగా ఎన్నో పనులు చేసింది.” అప్పుడు ఆ స్త్రీలు మరింతగా ఏడ్చేశారు. ఓర్పా నయోమిని ముద్దు పెట్టుకుని వెళ్లిపోయింది. కాని రూతు ఆమెను హత్తుకుని ఉండిపోయింది. నయోమి అన్నది: “చూడమ్మా! నీ తోడికోడలు తన సొంతవారి దగ్గరకు, వారి దేవుళ్ల దగ్గరకు తిరిగి వెళ్లిపోయినది. నీవు కూడా అలానే చేయి.” కానీ రూతు, “నిన్ను విడిచి నా స్వంతవాళ్ల దగ్గరకు వెళ్లి పొమ్మని నన్ను బలవంతం చేయవద్దు. నేను నీతోనే వస్తాను. నీవు ఎక్కడికి వెళ్తే, నేనూ అక్కడికి వెళ్తాను. నీవు ఎక్కడవుంటే, నేనూ అక్కడే ఉంటాను. నీవారే నావారు, నీ దేవుడే నా దేవుడు. నీవు ఎక్కడ చస్తే నేనూ అక్కడే చస్తాను. అక్కడే సమాధి చేయబడతాను. నేను ఈ మాట నిలబెట్టు కోలేకపోతే, దేవుడే నన్ను శిక్షిస్తాడు. చావుతప్ప ఇంకేది మనలను విడదీయ లేదు.” రూతు తనతోనే రావాలనే పట్టుదలతో ఉన్నట్టు గ్రహించి, నయోమి ఆమెతో వాదించడం మానివేసింది. నయోమి, రూతు కలసి బేత్లెహేము పురము వరకు ప్రయాణము చేశారు. వారిద్దరూ బేత్లెహేము చేరగానే ఆ ఊరివారంతా సంబరపడిపోయి. “ఈమె నయోమి కదూ?” అని చెప్పుకున్నారు. “నన్ను (మధురము) నయోమి అని పిలవకండి. నన్ను మారా అని పిలవండి. ఎందుచేతనంటే, సర్వశక్తిమంతుడైన దేవుడు నా బ్రతుకును చాలా దుఃఖమయం చేశాడు. నేను వెళ్లినప్పుడు నాకు కావాల్సింది అంతా ఉండేది. కాని, దేవుడు ఇప్పుడు నన్నుఏమీ లేనిదానిగా ఇంటికి తీసుకొచ్చాడు. ఆయన నన్ను దుఃఖమయినిగా చేస్తే, మీరు నన్ను సంతోషం అని పిలవడం దేనికి? సర్వశక్తిమంతుడైన దేవుడు నన్ను చాలా బాధపెట్టాడు” అని నయోమి వారితో అన్నది. అలా నయోమి, ఆమె కోడలు రూతు (మోయాబు స్త్రీ) మోయాబు దేశమునుండి తిరిగి వచ్చేశారు. యవల పంటకోత మొదలవుతున్న రోజుల్లో వీరిద్దరూ యూదాలోని బేత్లెహేము పురము చేరుకున్నారు.

షేర్ చేయి
Read రూతు 1

రూతు 1:6-22 Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం (OTSA)

యెహోవా తన ప్రజలకు ఆహారం ఇవ్వడానికి వారిని దర్శించారని నయోమి విన్నప్పుడు, ఆమె, తన ఇద్దరు కోడళ్ళతో కలిసి మోయాబు విడిచి స్వదేశానికి వెళ్లడానికి సిద్ధపడింది. తన ఇద్దరు కోడళ్ళతో కలిసి తాను ఉంటున్న స్థలం విడిచి యూదా దేశానికి వెళ్లే మార్గంలో బయలుదేరింది. అయితే దారిలో నయోమి తన ఇద్దరు కోడళ్ళతో, “మీరు మీ పుట్టిళ్ళకు తిరిగి వెళ్లండి. నా మీద, చనిపోయిన మీ భర్తల మీద మీరు దయ చూపించినట్లు యెహోవా మీమీద దయ చూపును గాక. మీరు మళ్ళీ పెళ్ళి చేసుకుని మీ భర్తల ఇండ్లలో నెమ్మది పొందేలా యెహోవా దయచేయును గాక” అన్నది. తర్వాత వారికి ముద్దు పెట్టింది, వారు బిగ్గరగా ఏడ్చి, ఆమెతో, “మేము నీతో నీ ప్రజల దగ్గరకు వస్తాం” అని అన్నారు. కాని నయోమి, “నా కుమార్తెలారా, మీ ఇళ్ళకు తిరిగి వెళ్లండి, నాతో ఎందుకు వస్తారు? మీకు భర్తలుగా ఉండడానికి నేను ఇంకా కుమారులను కనగలనా? నా బిడ్డలారా, ఇళ్ళకు తిరిగి వెళ్లండి; నేను వృద్ధురాలిని, నేను మళ్ళీ పెళ్ళి చేసుకునే వయస్సులో లేను, ఒకవేళ అది సాధ్యమే అని ఆశించి, ఈ రాత్రి నేను పెళ్ళి చేసుకుని, కుమారులను కన్నా, వారు ఎదిగే వరకు మీరు వేచి ఉంటారా? వారి కోసం పెళ్ళి చేసుకోకుండ ఉంటారా? వద్దు, నా బిడ్డలారా, యెహోవా హస్తం నాకు వ్యతిరేకంగా ఉంది కాబట్టి మీకంటే ఎక్కువ బాధ నాకు ఉంది!” అని జవాబిచ్చింది. అలా అనగానే వారు బిగ్గరగా ఏడ్చారు. అప్పుడు ఓర్పా తన అత్తను ముద్దు పెట్టుకొని వెళ్లిపోయింది, కాని రూతు తన అత్తను అంటిపెట్టుకునే ఉంది. నయోమి రూతుతో, “చూడు, నీ తోడి కోడలు తన ప్రజల దగ్గరకు, తన దేవుళ్ళ దగ్గరకు తిరిగి వెళ్తుంది. నీవు తనతో వెళ్లు” అన్నది. అందుకు రూతు, “నిన్ను విడవమని లేదా తిరిగి వెళ్లిపొమ్మని నన్ను బలవంతం చేయకు. నీవు ఎక్కడికి వెళ్తే నేను అక్కడికి వెళ్తాను, నీవు ఎక్కడ నివసిస్తే నేను అక్కడ నివసిస్తాను, నీ ప్రజలే నా ప్రజలు, నీ దేవుడే నా దేవుడు. నీవు ఎక్కడ చనిపోతే నేను అక్కడ చనిపోతాను, అక్కడే పాతిపెట్టబడతాను. చావు తప్ప మరి ఏదైనా నిన్ను నన్ను విడదీస్తే యెహోవా నన్ను తీవ్రంగా శిక్షించును గాక.” రూతు తనతో కూడ వెళ్లడానికి నిశ్చయించుకుందని నయోమి గ్రహించి, ఆమెను బలవంత పెట్టడం మానేసింది. కాబట్టి ఆ ఇద్దరు స్త్రీలు వారు బేత్లెహేము వరకు ప్రయాణించి బేత్లెహేముకు చేరినప్పుడు, ఆ పట్టణమంతా వారిని చూసి అక్కడికి వచ్చి, “ఈమె నయోమి కదా?” అని స్త్రీలు ఆశ్చర్యం వ్యక్తపరిచారు. ఆమె వారితో, “నన్ను నయోమి అని పిలువకండి, మారా అని పిలువండి, ఎందుకంటే సర్వశక్తుడు నాకు జీవితాన్ని చాలా చేదుగా మార్చారు. నేను సమృద్ధి కలదానిగా వెళ్లాను, అయితే యెహోవా నన్ను ఏమి లేనిదానిగా తీసుకువచ్చారు. ఎందుకు నన్ను నయోమి అని పిలుస్తారు? యెహోవా నాకు శ్రమ కలుగజేశారు; సర్వశక్తుడు నాకు బాధ కలిగించారు” అన్నది. అలా నయోమి మోయాబీయురాలైన తన కోడలు రూతుతో మోయాబు నుండి యవల కోత ఆరంభంలో బేత్లెహేముకు చేరుకుంది.

షేర్ చేయి
Read రూతు 1