రూతు 1:6-22

రూతు 1:6-22 OTSA

యెహోవా తన ప్రజలకు ఆహారం ఇవ్వడానికి వారిని దర్శించారని నయోమి విన్నప్పుడు, ఆమె, తన ఇద్దరు కోడళ్ళతో కలిసి మోయాబు విడిచి స్వదేశానికి వెళ్లడానికి సిద్ధపడింది. తన ఇద్దరు కోడళ్ళతో కలిసి తాను ఉంటున్న స్థలం విడిచి యూదా దేశానికి వెళ్లే మార్గంలో బయలుదేరింది. అయితే దారిలో నయోమి తన ఇద్దరు కోడళ్ళతో, “మీరు మీ పుట్టిళ్ళకు తిరిగి వెళ్లండి. నా మీద, చనిపోయిన మీ భర్తల మీద మీరు దయ చూపించినట్లు యెహోవా మీమీద దయ చూపును గాక. మీరు మళ్ళీ పెళ్ళి చేసుకుని మీ భర్తల ఇండ్లలో నెమ్మది పొందేలా యెహోవా దయచేయును గాక” అన్నది. తర్వాత వారికి ముద్దు పెట్టింది, వారు బిగ్గరగా ఏడ్చి, ఆమెతో, “మేము నీతో నీ ప్రజల దగ్గరకు వస్తాం” అని అన్నారు. కాని నయోమి, “నా కుమార్తెలారా, మీ ఇళ్ళకు తిరిగి వెళ్లండి, నాతో ఎందుకు వస్తారు? మీకు భర్తలుగా ఉండడానికి నేను ఇంకా కుమారులను కనగలనా? నా బిడ్డలారా, ఇళ్ళకు తిరిగి వెళ్లండి; నేను వృద్ధురాలిని, నేను మళ్ళీ పెళ్ళి చేసుకునే వయస్సులో లేను, ఒకవేళ అది సాధ్యమే అని ఆశించి, ఈ రాత్రి నేను పెళ్ళి చేసుకుని, కుమారులను కన్నా, వారు ఎదిగే వరకు మీరు వేచి ఉంటారా? వారి కోసం పెళ్ళి చేసుకోకుండ ఉంటారా? వద్దు, నా బిడ్డలారా, యెహోవా హస్తం నాకు వ్యతిరేకంగా ఉంది కాబట్టి మీకంటే ఎక్కువ బాధ నాకు ఉంది!” అని జవాబిచ్చింది. అలా అనగానే వారు బిగ్గరగా ఏడ్చారు. అప్పుడు ఓర్పా తన అత్తను ముద్దు పెట్టుకొని వెళ్లిపోయింది, కాని రూతు తన అత్తను అంటిపెట్టుకునే ఉంది. నయోమి రూతుతో, “చూడు, నీ తోడి కోడలు తన ప్రజల దగ్గరకు, తన దేవుళ్ళ దగ్గరకు తిరిగి వెళ్తుంది. నీవు తనతో వెళ్లు” అన్నది. అందుకు రూతు, “నిన్ను విడవమని లేదా తిరిగి వెళ్లిపొమ్మని నన్ను బలవంతం చేయకు. నీవు ఎక్కడికి వెళ్తే నేను అక్కడికి వెళ్తాను, నీవు ఎక్కడ నివసిస్తే నేను అక్కడ నివసిస్తాను, నీ ప్రజలే నా ప్రజలు, నీ దేవుడే నా దేవుడు. నీవు ఎక్కడ చనిపోతే నేను అక్కడ చనిపోతాను, అక్కడే పాతిపెట్టబడతాను. చావు తప్ప మరి ఏదైనా నిన్ను నన్ను విడదీస్తే యెహోవా నన్ను తీవ్రంగా శిక్షించును గాక.” రూతు తనతో కూడ వెళ్లడానికి నిశ్చయించుకుందని నయోమి గ్రహించి, ఆమెను బలవంత పెట్టడం మానేసింది. కాబట్టి ఆ ఇద్దరు స్త్రీలు వారు బేత్లెహేము వరకు ప్రయాణించి బేత్లెహేముకు చేరినప్పుడు, ఆ పట్టణమంతా వారిని చూసి అక్కడికి వచ్చి, “ఈమె నయోమి కదా?” అని స్త్రీలు ఆశ్చర్యం వ్యక్తపరిచారు. ఆమె వారితో, “నన్ను నయోమి అని పిలువకండి, మారా అని పిలువండి, ఎందుకంటే సర్వశక్తుడు నాకు జీవితాన్ని చాలా చేదుగా మార్చారు. నేను సమృద్ధి కలదానిగా వెళ్లాను, అయితే యెహోవా నన్ను ఏమి లేనిదానిగా తీసుకువచ్చారు. ఎందుకు నన్ను నయోమి అని పిలుస్తారు? యెహోవా నాకు శ్రమ కలుగజేశారు; సర్వశక్తుడు నాకు బాధ కలిగించారు” అన్నది. అలా నయోమి మోయాబీయురాలైన తన కోడలు రూతుతో మోయాబు నుండి యవల కోత ఆరంభంలో బేత్లెహేముకు చేరుకుంది.

Read రూతు 1

Free Reading Plans and Devotionals related to రూతు 1:6-22