రూతు 1:1-9
రూతు 1:1-9 పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI) (TELUBSI)
న్యాయాధిపతులు ఏలిన దినములయందు దేశములో కరవు కలుగగా యూదా బేత్లెహేమునుండి ఒక మనుష్యుడు తన భార్యను తన యిద్దరు కుమారులను వెంట బెట్టుకొని మోయాబుదేశమున కాపురముండుటకు వెళ్లెను. ఆ మనుష్యుని పేరు ఎలీమెలెకు, అతని భార్యపేరు నయోమి; అతని యిద్దరు కుమారుల పేళ్లు మహ్లోను కిల్యోను; వారు యూదా బేత్లెహేమువారైన ఎఫ్రాతీయులు; వారు మోయాబు దేశమునకు వెళ్లి అక్కడ కాపురముండిరి. నయోమి పెనిమిటియైన ఎలీమెలెకు చనిపోయిన తరువాత ఆమెయు ఆమె యిద్దరు కుమాళ్లును నిలిచియుండిరి. వారు మోయాబుస్త్రీలను పెండ్లి చేసికొనిరి. వారిలో ఒకదాని పేరు ఓర్పా రెండవదాని పేరు రూతు. వారు ఇంచుమించు పది సంవత్సరములు అక్కడ నివసించిన తరువాత మహ్లోను కిల్యోనను ఇద్దరును చనిపోయిరి; కాగా ఆ స్త్రీ తాను కనిన యిద్దరు కుమారులును తన పెనిమిటియు లేనిదాయెను. వారికి ఆహారమిచ్చుటకు యెహోవా తన జనులను దర్శించెనని ఆమె మోయాబుదేశములో వినెను గనుక మోయాబు దేశము విడిచి వెళ్లుటకై ఆమెయు ఆమె కోడండ్రును ప్రయాణమైరి. అప్పుడు ఆమెయున్న స్థలమునుండి ఆమెతోకూడ ఆమె యిద్దరు కోడండ్రును బయలుదేరి యూదాదేశమునకు తిరిగి పోవలెనని మార్గమున వెళ్లుచుండగా నయోమి తన యిద్దరు కోడండ్రను చూచి –మీరు మీ తల్లులయిండ్లకు తిరిగి వెళ్లుడి; చనిపోయిన వారి యెడలను నా యెడలను మీరు దయచూపినట్లు యెహోవా మీ యెడల దయచూపునుగాక; మీలో ఒక్కొక్కతె పెండ్లి చేసికొని తన యింట నెమ్మదినొందునట్లు యెహోవా దయచేయును గాక అని వారితో చెప్పి వారిని ముద్దు పెట్టుకొనెను.
రూతు 1:1-9 ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)
న్యాయాధిపతులు పరిపాలించిన కాలంలో దేశంలో కరువు వచ్చింది. అప్పుడు యూదా దేశంలోని బేత్లెహేము నుండి ఒక వ్యక్తి తన భార్య, ఇద్దరు కొడుకులను తనతో తీసుకుని మోయాబు దేశానికి వలస వెళ్ళాడు. అతని పేరు ఎలీమెలెకు, అతని భార్య నయోమి. అతనికి మహ్లోను, కిల్యోను అనే ఇద్దరు కొడుకులు ఉన్నారు. వాళ్ళు యూదా దేశపు బేత్లెహేములో నివసించే ఎఫ్రాతా ప్రాంతం వారు. వాళ్ళు మోయాబు దేశానికి వెళ్లి అక్కడ నివసించారు. నయోమి తన భర్త ఎలీమెలెకు చనిపోయిన తరువాత తన ఇద్దరు కొడుకులతో అక్కడే ఉండిపోయింది. వాళ్ళిద్దరూ మోయాబు స్త్రీలను పెండ్లి చేసుకున్నారు. ఒకామె పేరు ఓర్పా, రెండవ ఆమె పేరు రూతు. సుమారు పదేళ్లు గడచిన తరువాత మహ్లోను, కిల్యోను కూడా చనిపోయారు. నయోమి భర్త, కొడుకులను పోగొట్టుకుని ఒంటరిగా మిగిలింది. బేత్లెహేములో యెహోవా తన ప్రజలపై దయ చూపించి వారికి ఆహారం ఇస్తున్నాడని మోయాబు దేశంలో ఉన్న ఆమె విన్నది. కాబట్టి ఆమె మోయాబు దేశాన్ని విడిచి తన స్వదేశం వెళ్ళిపోవాలని తన కోడళ్ళతో సహా ప్రయాణం కట్టింది. ఆ దేశం నుండి ఆమె తన ఇద్దరు కోడళ్ళతో సహా కాలి నడకన యూదా దేశానికి బయలు దేరింది. అప్పుడు ఆమె తన ఇద్దరు కోడళ్ళతో ఇలా అంది. “మీరు మీ పుట్టిళ్ళకు తిరిగి వెళ్ళండి. చనిపోయిన నా కొడుకుల విషయంలో, నా విషయంలో మీరు నమ్మకంగా ఉన్నట్టే యెహోవా మీ పట్ల నమ్మకంగా ఉండి దయ చూపిస్తాడు గాక. మీరిద్దరూ చక్కగా మళ్ళీ పెళ్ళిళ్ళు చేసుకుని మీ భర్తల ఇళ్ళల్లో సుఖంగా జీవించే స్థితి ప్రభువు దయచేస్తాడు గాక” అని చెప్పి ఆమె తన కోడళ్ళను ముద్దు పెట్టుకుంది.
రూతు 1:1-9 పవిత్ర బైబిల్ (TERV)
పూర్వం న్యాయాధిపతులు ఏలిన కాలంలో, తినటానికి చాలినంత ఆహారం దొరకని కరువు రోజులు వచ్చాయి. ఎలీమెలెకు అనే ఒకతను యూదాలోని బేత్లెహేము వదలిపెట్టి, అతను, అతని భార్య, అతని యిద్దరు కుమారులు మోయాబు కొండ ప్రదేశంలో బ్రతకడానికి వెళ్లారు. అతని భార్య పేరు నయోమి, అతని యిద్దరు కుమారుల పేర్లు మహ్లోను, కిల్యోను. వాళ్లు యూదాలోని బేత్లెహేములో ఎఫ్రాతా వంశానికి చెందినవాళ్లు. ఈ కుటుంబం మోయాబులోని కొండ ప్రదేశానికి ప్రయాణము కట్టి అక్కడే ఉండిపోయారు. ఆ తరువాత నయోమి భర్త ఎలీమెలెకు చనిపోయాడు. అందుచేత నయోమి, ఆమె యిద్దరు కుమారులు మాత్రమే మిగిలారు. మోయాబు దేశపు స్త్రీలను ఆమె కుమారులు పెళ్లాడారు. ఒకని భార్య పేరు ఓర్పా, ఇంకొకని భార్య పేరు రూతు. మోయాబులో సుమారు పది సంవత్సరాలు వాళ్లు నిపసించారు. అంతలో మహ్లోను, కిలియోను కూడా చనిపోయారు. అందుచేత నయోమి ఇటు భర్తగాని, అటు కుమారులుగాని లేని ఒంటరిదయిపోయింది దేవుడు తన ప్రజలకు సహాయం చేసినట్టు, ఆయన తన ప్రజలకు (యూదాలో) ఆహారం దయచేసినట్టు మోయాబు కొండదేశంలో నయోమి విన్నది. అందుచేత నయోమి మోయాబు కొండ దేశము విడిచిపెట్టి తిరిగి తన ఇంటికి వెళ్లి పోవాలని తీర్మానించుకుంది. ఆమె కోడళ్లు కూడా ఆమెతోనే వెళ్లిపోయేందుకు తీర్మానించుకున్నారు. అంతవరకు బ్రతుకుతున్న చోటు విడిచిపెట్టేసి మళ్లీ యూదా దేశము పోయేదారి పట్టి ప్రయాణము మొదలు పెట్టారు. అప్పుడు నయోమి తన కోడళ్లు యిద్దరితో ఇలా అన్నది: “మీరు ఎవరి పుట్టింటికి వారు వెళ్లండి. మీరు చనిపోయిన నా ఇద్దరు కుమారులపైన, నాపైన ఎంతో దయ చూపెట్టారు. అలాగే యెహోవా మీపైన దయ చూపెట్టాలని కోరుకుంటున్నాను. మీరు ఇద్దరూ మళ్లీ పెళ్లాడి మీ భర్తలతో సుఖంగా ఉండేందుకు ఆ దేవుడే మీకు సహాయం చేయాలనేదే నా ప్రార్థన.” నయోమి తన యిద్దరు కోడళ్లను ముద్దు పెట్టుకుంది. దానితో అందరూ ఏడ్వటం మోదలు పెట్టారు.
రూతు 1:1-9 Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం (OTSA)
న్యాయాధిపతులు పరిపాలించిన రోజుల్లో దేశంలో కరువు వచ్చింది. కాబట్టి యూదాలోని బేత్లెహేము నుండి ఒక వ్యక్తి తన భార్యను, తన ఇద్దరు కుమారులను తీసుకుని, మోయాబు దేశంలో కొంతకాలం ఉండడానికి వెళ్లాడు. అతని పేరు ఎలీమెలెకు, అతని భార్యపేరు నయోమి, అతని ఇద్దరు కుమారుల పేర్లు మహ్లోను, కిల్యోను. వారు యూదాలోని బేత్లెహేము వాసులైన ఎఫ్రాతీయులు. వారు మోయాబుకు వెళ్లి అక్కడ నివసించారు. కొంతకాలం తర్వాత నయోమి భర్త ఎలీమెలెకు చనిపోయాడు. ఆమె, తన ఇద్దరు కుమారులు మిగిలారు. వారు మోయాబు స్త్రీలను పెళ్ళి చేసుకున్నారు, వారిలో ఒకామె పేరు ఓర్పా, మరో ఆమె పేరు రూతు. వారు దాదాపు పది సంవత్సరాలు అక్కడ నివసించిన తర్వాత, మహ్లోను కిల్యోను ఇద్దరు చనిపోయారు. నయోమి, తన భర్తను ఇద్దరు కుమారులను కోల్పోయి ఒంటరిగా మిగిలిపోయింది. యెహోవా తన ప్రజలకు ఆహారం ఇవ్వడానికి వారిని దర్శించారని నయోమి విన్నప్పుడు, ఆమె, తన ఇద్దరు కోడళ్ళతో కలిసి మోయాబు విడిచి స్వదేశానికి వెళ్లడానికి సిద్ధపడింది. తన ఇద్దరు కోడళ్ళతో కలిసి తాను ఉంటున్న స్థలం విడిచి యూదా దేశానికి వెళ్లే మార్గంలో బయలుదేరింది. అయితే దారిలో నయోమి తన ఇద్దరు కోడళ్ళతో, “మీరు మీ పుట్టిళ్ళకు తిరిగి వెళ్లండి. నా మీద, చనిపోయిన మీ భర్తల మీద మీరు దయ చూపించినట్లు యెహోవా మీమీద దయ చూపును గాక. మీరు మళ్ళీ పెళ్ళి చేసుకుని మీ భర్తల ఇండ్లలో నెమ్మది పొందేలా యెహోవా దయచేయును గాక” అన్నది. తర్వాత వారికి ముద్దు పెట్టింది, వారు బిగ్గరగా ఏడ్చి