రూతు 1:1-9

రూతు 1:1-9 TERV

పూర్వం న్యాయాధిపతులు ఏలిన కాలంలో, తినటానికి చాలినంత ఆహారం దొరకని కరువు రోజులు వచ్చాయి. ఎలీమెలెకు అనే ఒకతను యూదాలోని బేత్లెహేము వదలిపెట్టి, అతను, అతని భార్య, అతని యిద్దరు కుమారులు మోయాబు కొండ ప్రదేశంలో బ్రతకడానికి వెళ్లారు. అతని భార్య పేరు నయోమి, అతని యిద్దరు కుమారుల పేర్లు మహ్లోను, కిల్యోను. వాళ్లు యూదాలోని బేత్లెహేములో ఎఫ్రాతా వంశానికి చెందినవాళ్లు. ఈ కుటుంబం మోయాబులోని కొండ ప్రదేశానికి ప్రయాణము కట్టి అక్కడే ఉండిపోయారు. ఆ తరువాత నయోమి భర్త ఎలీమెలెకు చనిపోయాడు. అందుచేత నయోమి, ఆమె యిద్దరు కుమారులు మాత్రమే మిగిలారు. మోయాబు దేశపు స్త్రీలను ఆమె కుమారులు పెళ్లాడారు. ఒకని భార్య పేరు ఓర్పా, ఇంకొకని భార్య పేరు రూతు. మోయాబులో సుమారు పది సంవత్సరాలు వాళ్లు నిపసించారు. అంతలో మహ్లోను, కిలియోను కూడా చనిపోయారు. అందుచేత నయోమి ఇటు భర్తగాని, అటు కుమారులుగాని లేని ఒంటరిదయిపోయింది దేవుడు తన ప్రజలకు సహాయం చేసినట్టు, ఆయన తన ప్రజలకు (యూదాలో) ఆహారం దయచేసినట్టు మోయాబు కొండదేశంలో నయోమి విన్నది. అందుచేత నయోమి మోయాబు కొండ దేశము విడిచిపెట్టి తిరిగి తన ఇంటికి వెళ్లి పోవాలని తీర్మానించుకుంది. ఆమె కోడళ్లు కూడా ఆమెతోనే వెళ్లిపోయేందుకు తీర్మానించుకున్నారు. అంతవరకు బ్రతుకుతున్న చోటు విడిచిపెట్టేసి మళ్లీ యూదా దేశము పోయేదారి పట్టి ప్రయాణము మొదలు పెట్టారు. అప్పుడు నయోమి తన కోడళ్లు యిద్దరితో ఇలా అన్నది: “మీరు ఎవరి పుట్టింటికి వారు వెళ్లండి. మీరు చనిపోయిన నా ఇద్దరు కుమారులపైన, నాపైన ఎంతో దయ చూపెట్టారు. అలాగే యెహోవా మీపైన దయ చూపెట్టాలని కోరుకుంటున్నాను. మీరు ఇద్దరూ మళ్లీ పెళ్లాడి మీ భర్తలతో సుఖంగా ఉండేందుకు ఆ దేవుడే మీకు సహాయం చేయాలనేదే నా ప్రార్థన.” నయోమి తన యిద్దరు కోడళ్లను ముద్దు పెట్టుకుంది. దానితో అందరూ ఏడ్వటం మోదలు పెట్టారు.

చదువండి రూతు 1