రోమా 9:1-29
రోమా 9:1-29 తెలుగు సమకాలీన అనువాదము (TCV)
నేను క్రీస్తులో సత్యమే చెప్తున్నాను అబద్ధం చెప్పడం లేదు, పరిశుద్ధాత్మ ద్వారా నా మనస్సాక్షి దానిని నిర్ధారిస్తుంది. నా హృదయంలో ఎంతో దుఃఖం తీరని ఆవేదన ఉన్నాయి. నా సొంత జాతి వారైన, ఇశ్రాయేలీయుల కొరకు క్రీస్తు నుండి విడిపోయి శపించబడిన వానిగా ఉండాలని కోరుకుంటాను. వారు ఇశ్రాయేలు ప్రజలు, వారు దత్తపుత్రులుగా చేయబడినవారు; దైవికమైన మహిమ, నిబంధనలు, పొందిన ధర్మశాస్త్రం, దేవాలయంలో ఆరాధన, వాగ్దానాలు వారివే. పితరులు వారి వారే, అందరికి దేవుడైన క్రీస్తు మానవ వంశావళి వారిలో నుండే గుర్తించబడింది. నిత్యం స్తుతింపబడునుగాక! ఆమేన్. దేవుని మాట విఫలమైనదని కాదు. ఇశ్రాయేలు నుండి వచ్చిన సంతతి వారందరు ఇశ్రాయేలీయులు కారు. అబ్రాహాము సంతతి అయినంత మాత్రాన వారు అబ్రాహాముకు పిల్లలు అవ్వరు. అయితే “ఇస్సాకు ద్వారా కలిగినవారే నీకు సంతానంగా లెక్కించబడతారు.” మరో మాటలో చెప్పాలంటే, శరీర సంబంధమైన పిల్లలు దేవుని బిడ్డలు కారు, కాని వాగ్దాన సంబంధమైన పిల్లలు అబ్రాహాము సంతానంగా పరిగణించబడతారు. అందువల్లనే, “నియమించబడిన సమయానికి నేను తిరిగి వస్తాను అప్పటికి శారాకు ఒక కుమారుడు ఉంటాడు” అని వాగ్దానం ఇవ్వబడింది. అది మాత్రమే కాకుండా, మన తండ్రియైన ఇస్సాకు వలన రిబ్కా గర్భాన్ని ధరించిన సమయంలో, కవల పిల్లలు జన్మించి మంచియైన చెడైనా ఏదీ చేయక ముందే, ఏర్పాటు చేయబడిన ప్రకారం దేవుని ఉద్దేశం క్రియలమూలంగా కాకుండా, పిలుచువాని మూలంగా స్థిరంగా నిలబడడానికి “పెద్దవాడు చిన్నవానికి సేవ చేస్తాడు” అని ఆమెతో చెప్పబడింది. “నేను యాకోబును ప్రేమించాను, ఏశావును ద్వేషించాను” అని వ్రాయబడివున్నది. అయితే దీనిని బట్టి మనము ఏమి చెప్పగలం? దేవుడు అన్యాయం చేస్తాడనా? ఎన్నటికి కాదు! ఎందుకంటే ఆయన మోషేతో, “ఎవరి పట్ల నాకు కనికరం కలదో వారి పట్ల నేను కనికరం చూపుతాను, ఎవరి పట్ల నాకు దయ కలదో వారి పట్ల నేను దయ చూపుతాను” అని చెప్పారు. కనుక ఇది మానవుల కోరిక లేదా వారి ప్రయాసపై ఆధారపడి ఉండదు కాని, దేవుని కనికరంపై ఆధారపడి ఉంటుంది. అయితే లేఖనం ఫరోతో ఇలా చెప్తుంది: “నేను నా బలాన్ని నీలో కనబరచడానికి, నా నామం భూలోకమంతా బలంగా ప్రకటించబడాలనే ఉద్దేశంతో నేను నిన్ను లేవనెత్తాను.” కనుక దేవుడు ఎవరిపై తాను కనికరాన్ని చూపదలిచాడో వారిపైన కనికరాన్ని చూపుతాడు, ఎవరి పట్ల కఠినంగా ఉండాలనుకున్నాడో వారి పట్ల కఠినంగా ఉంటాడు. మీలో ఒకరు నాతో: “అప్పుడు ఇంకా ఎందుకు దేవుడు మనల్ని నిందిస్తాడు? ఆయన చిత్తాన్ని అడ్డుకోగలవాడెవడు?” అనవచ్చు, కాని ఓ మానవుడా, దేవుని తిరిగి ప్రశ్నించడానికి నీవు ఎవరు? “నీవు నన్ను ఇలా ఎందుకు చేసావు? అని రూపించబడింది తనను రూపించినవానితో అంటుందా?” ఒకే మట్టి ముద్ద నుండి కొన్ని ప్రత్యేకమైన పాత్రలను, కొన్ని సాధారణమైన పాత్రలను చేయడానికి కుమ్మరివానికి హక్కు లేదా? దేవుడు తన ఉగ్రతను చూపించడానికి, తమ శక్తిని తెలియజేయడానికి ఏర్పరచుకొన్నప్పటికి, నాశనం కొరకు సిద్ధపరచబడిన ఆయన ఉగ్రతకు పాత్రలైన వారిని ఆయన గొప్ప సహనంతో భరిస్తే ఏంటి? మహిమ కొరకు ముందుగానే ఆయనచే సిద్ధపరచబడి ఆయన కృపకు పాత్రులైన వారికి, అనగా యూదుల నుండి మాత్రమే కాకుండా యూదేతరుల నుండి కూడా ఆయనచే పిలువబడినవారమైన మనకొరకు తన మహిమైశ్వర్యాలను తెలియపరిస్తే ఏంటి? హోషేయ గ్రంథంలో ఆయన చెప్పిన ప్రకారం, “నా ప్రజలు కాని వారిని నా ప్రజలుగా పిలుస్తాను; నా ప్రియం కాని దానిని ‘నా ప్రియమైనదానా’ అని పిలుస్తాను,” ఇంకా, “ ‘మీరు నా ప్రజలు కారు’ అని ఏ స్థలంలో అయితే వారితో చెప్పబడిందో, అదే స్థలంలో వారు ‘సజీవుడైన దేవుని పిల్లలారా’ అని పిలువబడతారు.” ఇశ్రాయేలీయుల గురించి యెషయా ఇలా మొరపెట్టాడు: “ఇశ్రాయేలు ప్రజల సంఖ్య సముద్రపు ఇసుకరేణువు వలె ఉన్నప్పటికి కేవలం వారిలో మిగిలివున్నవారు మాత్రమే రక్షించబడతారు. ప్రభువు తాను చెప్పిన మాటను భూమిపై త్వరగా తప్పక నెరవేరుస్తాడు.” యెషయా గతంలో చెప్పినట్లుగా, “సర్వశక్తిమంతుడైన ప్రభువు మనకు సంతానాన్ని మిగల్చకపోయుంటే మనము సొదొమ వలె మారేవారం, గొమొర్రాను పోలి ఉండేవారం.”
రోమా 9:1-29 ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)
నా హృదయంలో గొప్ప దుఃఖం, తీరని వేదన ఉన్నాయి. నేను అబద్ధమాడడం లేదు, క్రీస్తులో నిజమే చెబుతున్నాను. పరిశుద్ధాత్మలో నా మనస్సాక్షి నాతో కలిసి సాక్షమిస్తున్నది. సాధ్యమైతే, శరీర సంబంధంగా నా సోదరులు, నా సొంత జాతి వారి కోసం, క్రీస్తు నుండి వేరుపడి దేవుని శాపానికి గురి కావడానికి కూడా నేను సిద్ధమే. వీరు ఇశ్రాయేలీయులు. దత్తపుత్రత్వం, మహిమ, నిబంధనలు, ధర్మశాస్త్రం అనే బహుమానం, దైవారాధన ఆచారాలు, వాగ్దానాలు వీరివి. పూర్వీకులు వీరి వారే. శరీరరీతిగా క్రీస్తు వచ్చింది వీరిలో నుండే. ఈయన సర్వాధికారియైన దేవుడు, శాశ్వత కాలం స్తుతిపాత్రుడు, ఆమేన్. అయితే దేవుని మాట భంగమైనట్టు కాదు. ఇశ్రాయేలునుండి వచ్చిన వారంతా ఇశ్రాయేలీయులు కారు. అబ్రాహాముకు పుట్టిన వారంతా నిజమైన వారసులు కాదు, “ఇస్సాకు మూలంగా కలిగే వారినే నీ సంతానం అని పిలుస్తారు.” అంటే శరీర సంబంధులంతా దేవుని పిల్లలు కారు గానీ దేవుని వాగ్దానం ద్వారా పుట్టిన పిల్లలే సంతానమని లెక్కలోకి వస్తారు. ఆ వాగ్దానం గురించిన వాక్యమిదే, “తిరిగి ఇదే కాలంలో వస్తాను. అప్పుడు శారాకు కొడుకు పుడతాడు.” అంతేకాదు, రిబ్కా మన తండ్రి ఇస్సాకు వలన గర్భం దాల్చినప్పుడు, దేవుని ఎన్నిక ప్రకారమైన ఆయన సంకల్పం, చేసే పనుల మూలంగా కాక వారిని పిలిచినవాడి మూలంగానే నెరవేరడం కోసం, పిల్లలు ఇంకా పుట్టి మంచీ చెడూ ఏమీ చేయక ముందే, “పెద్దవాడు చిన్నవాడికి సేవకుడు అవుతాడు” అని ఆమెతో చెప్పాడు. దీన్ని గురించి, “నేను యాకోబును ప్రేమించాను, ఏశావును ద్వేషించాను” అని రాసి ఉంది. కాబట్టి ఏమంటాము? దేవుడు అన్యాయం చేశాడనా? కానే కాదు. అందుకు దేవుడు మోషేతో ఇలా చెప్పాడు, “నేను ఎవరిపై కనికరం చూపాలనుకుంటానో వారిపై కనికరం చూపిస్తాను. ఎవరిపై జాలి చూపాలనుకుంటానో వారిపై జాలి చూపిస్తాను.” కాబట్టి ఒకరు ఆశించడం వలన గానీ, ఒకరు ప్రయాస పడడం వలన గానీ కాదు, దేవుడు కనికరం చూపడం వల్లనే అవుతుంది. దేవుని వాక్కు ఫరోతో చెప్పిందేమంటే, “నేను నీలో నా బలాన్ని ప్రదర్శించాలి, నా పేరు భూలోకమంతా ప్రచురం కావాలి. ఈ ఉద్దేశం కోసమే నిన్ను హెచ్చించాను.” కాబట్టి ఆయన ఎవరిని కనికరించాలి అనుకుంటాడో వారిని కనికరిస్తాడు, ఎవరిని కఠినపరచాలి అనుకుంటాడో వారిని కఠినపరుస్తాడు. అలాగైతే, “ఆయన సంకల్పాన్ని ఎదిరించి నిలిచేదెవరు? ఇంకా ఆయన మనలను తప్పు పట్టడమెందుకు?” అని నీవు నాతో అనవచ్చు. అది సరే గానీ, ఓ మనిషీ, దేవుణ్ణి ఎదురు ప్రశ్నించడానికి నీ వెవరివి? నన్నెందుకిలా చేశావు అని తయారైనది తనను తయారు చేసిన వానితో చెప్పగలదా? ఒకే మట్టి ముద్దలో నుండి ఒక పాత్రను ప్రత్యేకమైన వాడకం కోసం, ఇంకొకటి రోజువారీ వాడకం కోసం చేయడానికి కుమ్మరికి అధికారం లేదా? ఆ విధంగా దేవుడు తన కోపాన్ని చూపాలనీ తన ప్రభావాన్ని వెల్లడి పరచాలనీ కోరుకుని, నాశనానికి నిర్ణయమై, కోపానికి గురైన పాత్రలను ఎంతో సహనంతో ఓర్చుకొంటే ఏమిటి? తద్వారా మహిమ పొందాలని ఆయన ముందుగా సిద్ధం చేసిన ఆ కరుణ పొందిన పాత్రల పట్ల, అంటే యూదులపై మాత్రమే కాక, యూదేతరుల్లో నుండి ఆయన పిలిచిన మనపై, తన మహిమైశ్వర్యాన్ని చూపాలని సంకల్పిస్తే ఏమిటి? దీని గురించి హోషేయ గ్రంథంలో ఆయన ఇలా చెబుతున్నాడు, “నా ప్రజలు కాని వారికి నా ప్రజలనీ, ప్రేయసి కాని దానికి ప్రేయసి అనీ, పేరు పెడతాను. మీరు నా ప్రజలు కారని వారితో ఎక్కడ చెప్పారో అక్కడే ‘జీవం గల దేవుని కుమారులు’ అని వారికి పేరు పెట్టడం జరుగుతుంది.” “ఇశ్రాయేలు కుమారుల సంఖ్య సముద్రపు ఇసుకలాగా విస్తారంగా ఉన్నప్పటికీ శేషమే రక్షణ పొందుతుంది. ఎందుకంటే ప్రభువు తన మాటను ఈ భూలోకంలో త్వరితంగా, సంపూర్తిగా నెరవేరుస్తాడు” అని యెషయా కూడా ఇశ్రాయేలు గురించి పెద్ద స్వరంతో చెబుతున్నాడు. యెషయా ముందుగానే చెప్పిన ప్రకారం, “సైన్యాలకు అధిపతి అయిన ప్రభువు, మనకు పిల్లలను మిగిల్చి ఉండకపోతే సొదొమలా అయ్యేవాళ్ళం, గొమొర్రాలాగా ఉండే వాళ్ళం.”
రోమా 9:1-29 పవిత్ర బైబిల్ (TERV)
క్రీస్తు పేరట నేను నిజం చెపుతున్నాను. నేను అసత్యమాడటం లేదు. నా అంతరాత్మ పవిత్రాత్మ ద్వారా ఇది నిజమని సాక్ష్యం చెబుతోంది. నాలో చాలా దుఃఖం ఉంది. అంతంగాని ఆవేదన నా హృదయంలో ఉంది. నా జాతికి చెందిన నా సోదరుల కోసం దేవుడు నన్ను శపించినా, క్రీస్తు నుండి నన్ను వేరు చేసినా నాకు సంతోషమే. ఈ నా సోదరులు ఇశ్రాయేలు వంశానికి చెందిన వాళ్ళు. దేవుడు వాళ్ళను తన పుత్రులుగా చేసుకొని మహిమను, ఒడంబడికలను, ధర్మశాస్త్రాన్ని, ఆరాధనా విధానాన్ని ఇచ్చి వాగ్దానాలు చేసాడు. మూల పురుషులు వీళ్ళ వంశానికి చెందినవాళ్ళు. క్రీస్తు వీళ్ళ వంశంలో జన్మించాడు. క్రీస్తు అందరికీ దేవుడు. ఆయన్ని చిరకాలం అందరూ స్తుతించుగాక! ఆమేన్! ఇశ్రాయేలు జాతికి చెందిన వాళ్ళందర్ని దేవుడు తన ప్రజలుగా ఎన్నుకోలేదు. కాబట్టి దేవుని మాట పరాజయం పొందిందని మనమనకూడదు. లేక అబ్రాహాము సంతానమందరూ నిజంగా అబ్రాహాము సంతానమని మనమనలేము. కాని ఈ విషయంపై ఈ విధంగా వ్రాయబడి ఉంది: “ఇస్సాకు వల్ల మాత్రమే నీ సంతానం గుర్తింపబడుతుంది.” ఇంకొక రీతిగా చెప్పాలంటే అబ్రాహాముకు ప్రకృతి సహజంగా జన్మించినంత మాత్రాన దేవుని సంతానంగా పరిగణింపబడరు. కాని దేవుని వాగ్దానం మూలంగా అతనికి కలిగిన సంతానం అబ్రాహాము సంతానంగా పరిగణింపబడుతుంది. ఈ వాగ్దానం ఈ విధంగా వ్రాయబడి ఉంది: “నియమిత సమయానికి నేను తిరిగి వస్తాను, శారాకు పుత్రుడు జన్మిస్తాడు.” అంతేకాదు. రిబ్కాకు, మన మూలపురుషుడైన ఇస్సాకు ద్వారా ఇద్దరు పుత్రులు కలిగారు. కాని దేవుడు ఒక్కణ్ణే ఎన్నుకోవాలని, తద్వారా తన ఉద్దేశ్యం సంపూర్ణంగా నెరవేరాలని, రిబ్కాతో, “పెద్దవాడు, చిన్నవానికి సేవ చేస్తాడు” అని అన్నాడు. అప్పటికింకా ఈ కవలలు జన్మించలేదు కనుక వాళ్ళు మంచి, చెడు, చేసే ప్రశ్నే రాదు. అంటే దేవుడు తన ఇష్ట ప్రకారం పిలిచాడు. కాని, ఈ పిలుపు వాళ్ళు చేసిన పనులపై ఆధారపడలేదన్న మాట. ఈ విషయంపై ఈ విధంగా వ్రాయబడి ఉంది: “నేను యాకోబును ప్రేమించాను, కాని ఏశావును ద్వేషించాను.” మరి, మనమేమనాలి? దేవుడు అన్యాయం చేసాడా? లేదు. ఎందుకంటే ఆయన మోషేతో ఈ విధంగా అన్నాడు: “నాకిష్టం వచ్చిన వాళ్ళను కరుణిస్తాను, నాకిష్టం వచ్చిన వాళ్ళపై దయ చూపిస్తాను.” అందువల్ల ఇది మానవుని అభీష్టంపై కాని, లేక అతని శ్రమపై కాని ఆధారపడింది కాదు. ఇది దేవుని కనికరంపై ఆధారపడింది. లేఖనము ఫరోతో ఈ విధంగా అంటుంది: “నీ ద్వారా నా శక్తి వ్యక్తం చెయ్యాలనీ, ప్రపంచమంతా నా పేరు ప్రకటింపబడాలనీ, నేను నిన్ను రాజుగా చేసాను.” అంటే, దేవుడు తనకిష్టమున్న వాళ్ళపై కనికరం చూపిస్తాడు, తనకిష్టమున్న వాళ్ళపై కఠినత్వం చూపిస్తాడు. మీరు నాతో, “మరి, దేవుడు మమ్ముల్ని ఎందుకు ఇంకా నిందిస్తున్నాడు? ఆయన ఇష్టాన్ని ఎవరు కాదనగలరు?” అని అనవచ్చు. కాని, ఓ మనిషీ! దేవునితో ఎదురు తిరిగి మాట్లాడటానికి నీవెవరవు? సృష్టింపబడింది సృష్టికర్తతో, “నన్నీవిధంగా ఎందుకు సృష్టించావు?” అని అడగవచ్చా? కుమ్మరి ఒకే మట్టి ముద్దతో కొన్ని కుండల్ని మంచి పనులకోసం, మరి కొన్నిటిని మామూలుగా ఉపయోగించుకోవటానికి చేస్తాడు. అలా చెయ్యటానికి అతనికి అధికారం లేదా? భవిష్యత్తులో దేవుడు తన కోపాన్ని చూపాలని, తన శక్తిని తెలియచెయ్యాలని, నాశనం చెయ్యతగిన దుర్మార్గుల పట్ల సహనం వహించాడంటే మనమేమనగలము? దేవుడు తన తేజస్సులోని గొప్పతనాన్ని తెలియచెయ్యాలని తన మహిమను పంచుకోవటానికి దయతో ఇతర్లను సృష్టించాడంటే మనం ఏమనగలం? యూదుల నుండే కాక, యూదులు కానివాళ్ళ నుండి కూడా దేవుడు ప్రజల్ని పిలిచాడు. ఆయన పిలిచింది మనల్నే. హోషేయ గ్రంథంలో దేవుడు ఈ విధంగా చెప్పాడు: “నా ప్రజలు కాని వాళ్ళను నా ప్రజలని పిలుస్తాను. నా ప్రియురాలు కాని జనాన్ని నా ప్రియురాలా అని పిలుస్తాను.” “మీరు నా ప్రజలు కారు అని అన్న చోటనే మీరు సజీవంగా ఉండే దేవుని పుత్రులు అని అనటం సంభవిస్తుంది.” యెషయా ప్రవక్త ఇశ్రాయేలు వంశాన్ని గురించి ఇలా అన్నాడు: “ఇశ్రాయేలు పుత్రుల సంఖ్య సముద్ర తీరంపై ఉన్న ఇసుక రేణువుల్లా ఉన్నా, కొందరు మాత్రమే రక్షింపబడతారు. ఎందుకంటే, ప్రపంచానికి విధించిన శిక్షను ప్రభువు త్వరలోనే నెరవేరుస్తాడు.” యెషయా జరుగుతుందని చెప్పినట్లు
రోమా 9:1-29 పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI) (TELUBSI)
నాకు బహు దుఃఖమును, నా హృదయములో మానని వేదనయు కలవు. క్రీస్తునందు నిజమే చెప్పు చున్నాను, అబద్ధమాడుట లేదు. పరిశుద్ధాత్మయందు నా మనస్సాక్షి నాతోకూడ సాక్ష్యమిచ్చుచున్నది. సాధ్యమైనయెడల, దేహసంబంధులైన నా సహోదరుల కొరకు నేను క్రీస్తునుండి వేరై శాపగ్రస్తుడనై యుండ గోరుదును. వీరు ఇశ్రాయేలీయులు; దత్తపుత్రత్వమును మహిమయు నిబంధనలును ధర్మశాస్త్ర ప్రధానమును అర్చనాచారాదులును వాగ్దానములును వీరివి. పితరులు వీరివారు; శరీరమునుబట్టి క్రీస్తు వీరిలో పుట్టెను. ఈయన సర్వాధికారియైన దేవుడైయుండి నిరంతరము స్తోత్రార్హుడై యున్నాడు. ఆమేన్. అయితే దేవునిమాట తప్పిపోయినట్టు కాదు; ఇశ్రాయేలు సంబంధులందరును ఇశ్రాయేలీయులు కారు. అబ్రాహాము సంతానమైనంత మాత్రముచేత అందరును పిల్లలు కారు గాని ఇస్సాకువల్లనైనది నీ సంతానము అనబడును, అనగా శరీరసంబంధులైన పిల్లలు దేవుని పిల్లలు కారు గాని వాగ్దాన సంబంధులైన పిల్లలు సంతానమని యెంచబడుదురు. వాగ్దానరూపమైన వాక్యమిదే– మీదటికి ఈ సమయమునకు వచ్చెదను; అప్పుడు శారాకు కుమారుడు కలుగును. అంతేకాదు; రిబ్కా మన తండ్రియైన ఇస్సాకు అను ఒకనివలన గర్భవతియైనప్పుడు, ఏర్పాటును అనుసరించిన దేవుని సంకల్పము, క్రియల మూలముగా కాక పిలుచు వాని మూలముగానే నిలుకడగాఉండు నిమిత్తము, పిల్ల లింక పుట్టి మేలైనను కీడైనను చేయక ముందే పెద్దవాడు చిన్నవానికి దాసుడగును అని ఆమెతో చెప్పబడెను. ఇందునుగూర్చి నేను యాకోబును ప్రేమించితిని, ఏశావును ద్వేషించితిని అని వ్రాయబడి యున్నది. కాబట్టి యేమందుము? దేవునియందు అన్యాయము కలదా? అట్లనరాదు. అందుకు మోషేతో ఈలాగు చెప్పుచున్నాడు– ఎవనిని కరుణింతునో వానిని కరుణింతును; ఎవనియెడల జాలి చూపుదునో వానియెడల జాలి చూపుదును. కాగా పొందగోరువానివలననైనను, ప్రయాసపడువాని వలననైనను కాదు గాని, కరుణించు దేవునివలననే అగును. మరియు లేఖనము ఫరోతో ఈలాగు చెప్పెను– నేను నీయందు నా బలము చూపుటకును, నా నామము భూలోకమందంతట ప్రచురమగుటకును, అందు నిమిత్తమే నిన్ను నియమించితిని. కావున ఆయన ఎవనిని కనికరింపగోరునో వానిని కనికరించును; ఎవని కఠినపరచగోరునో వాని కఠిన పరచును. అట్లయితే ఆయన చిత్తమును ఎదిరించిన వాడెవడు? ఆయన ఇకను నేరముమోపనేల అని నీవు నాతో చెప్పుదువు. అవును గాని ఓ మనుష్యుడా, దేవునికి ఎదురు చెప్పుటకు నీ వెవడవు? నన్నెందు కీలాగు చేసితివని రూపింపబడినది రూపించినవానితో చెప్పునా? ఒక ముద్దలోనుండియే యొక ఘటము ఘనతకును ఒకటి ఘనహీనతకును చేయుటకు మంటిమీద కుమ్మరివానికి అధికారము లేదా? ఆలాగు దేవుడు తన ఉగ్రతను అగపరచుటకును, తన ప్రభావమును చూపుటకును, ఇచ్ఛ యించినవాడై, నాశనమునకు సిద్ధపడి ఉగ్రతాపాత్రమైన ఘటములను ఆయన బహు దీర్ఘశాంతముతో సహించిన నేమి? మరియు మహిమ పొందుటకు ఆయన ముందుగా సిద్ధపరచిన కరుణాపాత్ర ఘటములయెడల, అనగా యూదులలోనుండి మాత్రము కాక, అన్యజనములలోనుండియు ఆయన పిలిచిన మనయెడల, తన మహిమై శ్వర్యము కనుపరచవలెననియున్న నేమి? ఆప్రకారము– నా ప్రజలు కానివారికి నా ప్రజలనియు, ప్రియు రాలు కానిదానికి ప్రియురాలనియు, పేరు పెట్టుదును. మరియు జరుగునదేమనగా, మీరు నా ప్రజలు కారని యేచోటను వారితో చెప్ప బడెనో, ఆ చోటనే జీవముగల దేవుని కుమారులనివారికి పేరుపెట్టబడును అని హోషేయలో ఆయన చెప్పుచున్నాడు. మరియు ప్రభువు తన మాట సమాప్తము చేసి, క్లుప్తపరచి భూలోకమునందు దానిని నెరవేర్చును గనుక ఇశ్రాయేలు కుమారుల సంఖ్య సముద్రపు ఇసుకవలె ఉండినను శేషమే రక్షింపబడునని యెషయాయు ఇశ్రాయేలునుగూర్చి బిగ్గరగా పలుకుచున్నాడు. మరియు యెషయా ముందు చెప్పినప్రకారము– సైన్యములకు అధిపతియగు ప్రభువు, మనకు సంతా నము శేషింపచేయకపోయినయెడల సొదొమవలె నగుదుము, గొమొఱ్ఱాను పోలియుందుము.
రోమా 9:1-29 Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం (OTSA)
నేను క్రీస్తులో సత్యమే చెప్తున్నాను అబద్ధం చెప్పడం లేదు, పరిశుద్ధాత్మ ద్వారా నా మనస్సాక్షి దానిని నిర్ధారిస్తుంది. నా హృదయంలో ఎంతో దుఃఖం తీరని ఆవేదన ఉన్నాయి. నా సొంత జాతి వారైన ఇశ్రాయేలీయుల కోసం క్రీస్తు నుండి విడిపోయి శపించబడిన వానిగా ఉండాలని కోరుకుంటాను. వారు ఇశ్రాయేలు ప్రజలు, వారు దత్తపుత్రులుగా చేయబడినవారు; దైవికమైన మహిమ, నిబంధనలు, పొందిన ధర్మశాస్త్రం, దేవాలయంలో ఆరాధన, వాగ్దానాలు వారివే. పితరులు వారి వారే, అందరికి దేవుడైన క్రీస్తు మానవునిగా వారిలోనే పుట్టారు. ఆయన నిత్యం స్తోత్రార్హుడు! ఆమేన్. దేవుని మాట విఫలమైనదని కాదు. ఇశ్రాయేలు నుండి వచ్చిన వారందరు ఇశ్రాయేలీయులు కారు. అబ్రాహాము సంతతి అయినంత మాత్రాన వారు అబ్రాహాముకు పిల్లలు అవ్వరు. అయితే, “ఎందుకంటే ఇస్సాకు మూలంగా కలిగిన వారిగానే నీ సంతానం లెక్కించబడుతుంది.” మరో మాటలో చెప్పాలంటే, శరీర సంబంధమైన పిల్లలు దేవుని బిడ్డలు కారు, కాని వాగ్దాన సంబంధమైన పిల్లలే అబ్రాహాము సంతానంగా పరిగణించబడతారు. అందువల్లనే, “నియమించబడిన సమయానికి నేను తిరిగి వస్తాను, అప్పటికి శారాకు ఒక కుమారుడు పుడతాడు” అని వాగ్దానం ఇవ్వబడింది. అది మాత్రమే కాకుండా, మన తండ్రియైన ఇస్సాకు వలన రిబ్కా గర్భవతియైన సమయంలో, కవలలు ఇంకా పుట్టి మంచి చెడు ఏదీ చేయక ముందే, ఏర్పాటు చేయబడిన ప్రకారం, దేవుని ఉద్దేశం, క్రియలమూలంగా కాకుండా, పిలుచువాని మూలంగా స్థిరంగా నిలబడడానికి, “పెద్దవాడు చిన్నవానికి సేవ చేస్తాడు” అని ఆమెతో చెప్పబడింది. “నేను యాకోబును ప్రేమించాను, ఏశావును ద్వేషించాను” అని వ్రాయబడి ఉన్నది. అయితే మనం ఏమనాలి? దేవుడు అన్యాయం చేస్తాడనా? ఎన్నటికి కాదు! ఎందుకంటే ఆయన మోషేతో, “నాకు ఎవరి మీద కనికరం కలుగుతుందో వారిని కనికరిస్తాను, నాకు ఎవరి మీద దయ కలుగుతుందో వారికి నేను దయ చూపిస్తాను” అని చెప్పారు. కాబట్టి ఇది ఒకరి కోరిక మీద గాని ప్రయాస మీద గాని ఆధారపడి ఉండదు కాని, దేవుని కనికరం వలనే అవుతుంది. అయితే లేఖనం ఫరోతో ఇలా చెప్తుంది: “నేను నా బలాన్ని నీలో చూపించాలని, భూలోకమంతా నా నామం ప్రకటించబడాలనే ఉద్దేశంతో నేను నిన్ను నియమించాను.” కాబట్టి దేవుడు ఎవరిని కనికరించాలనుకుంటే వారిని కనికరిస్తారు, ఎవరి పట్ల కఠినంగా ఉండాలనుకున్నారో వారి పట్ల కఠినంగా ఉంటారు. మీరు నాతో, “అలాగైతే ఇంకా ఎందుకు దేవుడు మనల్ని నిందిస్తాడు? ఆయన చిత్తాన్ని ఎవరు అడ్డుకోగలరు?” అనవచ్చు, కాని ఓ మానవుడా, దేవుని తిరిగి ప్రశ్నించడానికి నీవు ఎవరు? “నీవు నన్ను ఇలా ఎందుకు చేశావు? అని రూపించబడింది తనను రూపించినవానితో అంటుందా?” ఒకే మట్టి ముద్ద నుండి కొన్ని ప్రత్యేకమైన పాత్రలను, కొన్ని సాధారణమైన పాత్రలను చేయడానికి కుమ్మరివానికి అధికారం లేదా? దేవుడు తన ఉగ్రతను చూపించడానికి, తమ శక్తిని తెలియజేయడానికి కోరుకున్నప్పటికి, నాశనం కోసం సిద్ధపరచబడిన ఆయన ఉగ్రతకు పాత్రలైన వారిని ఆయన గొప్ప సహనంతో భరిస్తే ఏంటి? మహిమ కోసం ముందుగానే ఆయనచే సిద్ధపరచబడి ఆయన కృపకు పాత్రులైన వారికి, అనగా యూదులలో నుండి మాత్రమే కాక యూదేతరులలో నుండి ఆయన పిలిచిన మన కోసం తన మహిమైశ్వర్యాలను తెలియపరిస్తే ఏంటి? హోషేయ గ్రంథంలో ఆయన చెప్పిన ప్రకారం, “నా ప్రజలు కాని వారిని ‘నా ప్రజలు’ అని పిలుస్తాను; నాకు ప్రియురాలు కాని దానిని ‘నా ప్రియురాలు’ అని పిలుస్తాను,” ఇంకా, “ ‘మీరు నా ప్రజలు కారు’ అని ఏ స్థలంలో అయితే వారితో చెప్పబడిందో, అదే స్థలంలో వారు ‘సజీవుడైన దేవుని పిల్లలు’ అని పిలువబడతారు.” ఇశ్రాయేలీయుల గురించి యెషయా ఇలా మొరపెట్టాడు: “ఇశ్రాయేలు ప్రజల సంఖ్య సముద్రపు ఇసుకంత విస్తారంగా ఉన్నా, వారిలో మిగిలి ఉన్నవారే రక్షించబడతారు. ప్రభువు తాను చెప్పిన మాటను భూమిపై త్వరగా తప్పక నెరవేరుస్తారు.” యెషయా గతంలో చెప్పినట్లుగా, “సైన్యాల ప్రభువు మనకు సంతానాన్ని మిగల్చకపోయుంటే మనం సొదొమలా మారేవారం, గొమొర్రాను పోలి ఉండేవారము.”