నేను క్రీస్తులో సత్యమే చెప్తున్నాను అబద్ధం చెప్పడం లేదు, పరిశుద్ధాత్మ ద్వారా నా మనస్సాక్షి దానిని నిర్ధారిస్తుంది. నా హృదయంలో ఎంతో దుఃఖం తీరని ఆవేదన ఉన్నాయి. నా సొంత జాతి వారైన, ఇశ్రాయేలీయుల కొరకు క్రీస్తు నుండి విడిపోయి శపించబడిన వానిగా ఉండాలని కోరుకుంటాను. వారు ఇశ్రాయేలు ప్రజలు, వారు దత్తపుత్రులుగా చేయబడినవారు; దైవికమైన మహిమ, నిబంధనలు, పొందిన ధర్మశాస్త్రం, దేవాలయంలో ఆరాధన, వాగ్దానాలు వారివే. పితరులు వారి వారే, అందరికి దేవుడైన క్రీస్తు మానవ వంశావళి వారిలో నుండే గుర్తించబడింది. నిత్యం స్తుతింపబడునుగాక! ఆమేన్.
దేవుని మాట విఫలమైనదని కాదు. ఇశ్రాయేలు నుండి వచ్చిన సంతతి వారందరు ఇశ్రాయేలీయులు కారు. అబ్రాహాము సంతతి అయినంత మాత్రాన వారు అబ్రాహాముకు పిల్లలు అవ్వరు. అయితే “ఇస్సాకు ద్వారా కలిగినవారే నీకు సంతానంగా లెక్కించబడతారు.” మరో మాటలో చెప్పాలంటే, శరీర సంబంధమైన పిల్లలు దేవుని బిడ్డలు కారు, కాని వాగ్దాన సంబంధమైన పిల్లలు అబ్రాహాము సంతానంగా పరిగణించబడతారు. అందువల్లనే, “నియమించబడిన సమయానికి నేను తిరిగి వస్తాను అప్పటికి శారాకు ఒక కుమారుడు ఉంటాడు” అని వాగ్దానం ఇవ్వబడింది.
అది మాత్రమే కాకుండా, మన తండ్రియైన ఇస్సాకు వలన రిబ్కా గర్భాన్ని ధరించిన సమయంలో, కవల పిల్లలు జన్మించి మంచియైన చెడైనా ఏదీ చేయక ముందే, ఏర్పాటు చేయబడిన ప్రకారం దేవుని ఉద్దేశం క్రియలమూలంగా కాకుండా, పిలుచువాని మూలంగా స్థిరంగా నిలబడడానికి “పెద్దవాడు చిన్నవానికి సేవ చేస్తాడు” అని ఆమెతో చెప్పబడింది. “నేను యాకోబును ప్రేమించాను, ఏశావును ద్వేషించాను” అని వ్రాయబడివున్నది.
అయితే దీనిని బట్టి మనము ఏమి చెప్పగలం? దేవుడు అన్యాయం చేస్తాడనా? ఎన్నటికి కాదు! ఎందుకంటే ఆయన మోషేతో,
“ఎవరి పట్ల నాకు కనికరం కలదో వారి పట్ల నేను కనికరం చూపుతాను,
ఎవరి పట్ల నాకు దయ కలదో వారి పట్ల నేను దయ చూపుతాను”
అని చెప్పారు. కనుక ఇది మానవుల కోరిక లేదా వారి ప్రయాసపై ఆధారపడి ఉండదు కాని, దేవుని కనికరంపై ఆధారపడి ఉంటుంది. అయితే లేఖనం ఫరోతో ఇలా చెప్తుంది: “నేను నా బలాన్ని నీలో కనబరచడానికి, నా నామం భూలోకమంతా బలంగా ప్రకటించబడాలనే ఉద్దేశంతో నేను నిన్ను లేవనెత్తాను.” కనుక దేవుడు ఎవరిపై తాను కనికరాన్ని చూపదలిచాడో వారిపైన కనికరాన్ని చూపుతాడు, ఎవరి పట్ల కఠినంగా ఉండాలనుకున్నాడో వారి పట్ల కఠినంగా ఉంటాడు.
మీలో ఒకరు నాతో: “అప్పుడు ఇంకా ఎందుకు దేవుడు మనల్ని నిందిస్తాడు? ఆయన చిత్తాన్ని అడ్డుకోగలవాడెవడు?” అనవచ్చు, కాని ఓ మానవుడా, దేవుని తిరిగి ప్రశ్నించడానికి నీవు ఎవరు? “నీవు నన్ను ఇలా ఎందుకు చేసావు? అని రూపించబడింది తనను రూపించినవానితో అంటుందా?” ఒకే మట్టి ముద్ద నుండి కొన్ని ప్రత్యేకమైన పాత్రలను, కొన్ని సాధారణమైన పాత్రలను చేయడానికి కుమ్మరివానికి హక్కు లేదా?
దేవుడు తన ఉగ్రతను చూపించడానికి, తమ శక్తిని తెలియజేయడానికి ఏర్పరచుకొన్నప్పటికి, నాశనం కొరకు సిద్ధపరచబడిన ఆయన ఉగ్రతకు పాత్రలైన వారిని ఆయన గొప్ప సహనంతో భరిస్తే ఏంటి? మహిమ కొరకు ముందుగానే ఆయనచే సిద్ధపరచబడి ఆయన కృపకు పాత్రులైన వారికి, అనగా యూదుల నుండి మాత్రమే కాకుండా యూదేతరుల నుండి కూడా ఆయనచే పిలువబడినవారమైన మనకొరకు తన మహిమైశ్వర్యాలను తెలియపరిస్తే ఏంటి? హోషేయ గ్రంథంలో ఆయన చెప్పిన ప్రకారం,
“నా ప్రజలు కాని వారిని నా ప్రజలుగా పిలుస్తాను;
నా ప్రియం కాని దానిని ‘నా ప్రియమైనదానా’ అని పిలుస్తాను,”
ఇంకా,
“ ‘మీరు నా ప్రజలు కారు’ అని ఏ స్థలంలో అయితే వారితో చెప్పబడిందో,
అదే స్థలంలో వారు
‘సజీవుడైన దేవుని పిల్లలారా’ అని పిలువబడతారు.”
ఇశ్రాయేలీయుల గురించి యెషయా ఇలా మొరపెట్టాడు:
“ఇశ్రాయేలు ప్రజల సంఖ్య సముద్రపు ఇసుకరేణువు వలె ఉన్నప్పటికి
కేవలం వారిలో మిగిలివున్నవారు మాత్రమే రక్షించబడతారు.
ప్రభువు తాను చెప్పిన మాటను
భూమిపై త్వరగా తప్పక నెరవేరుస్తాడు.”
యెషయా గతంలో చెప్పినట్లుగా,
“సర్వశక్తిమంతుడైన ప్రభువు
మనకు సంతానాన్ని మిగల్చకపోయుంటే
మనము సొదొమ వలె మారేవారం,
గొమొర్రాను పోలి ఉండేవారం.”