రోమా 7:18-23
రోమా 7:18-23 తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం (TSA)
నాకున్న పాప స్వభావాన్ని బట్టి మంచిది ఏదీ నాలో నివసించదని నాకు తెలుసు కాబట్టి, మంచి చేయాలనే కోరిక నాకు ఉన్నప్పటికీ దానిని నేను చేయలేకపోతున్నాను. నేను చేయాలనుకున్న మంచిని చేయడం లేదు కాని, చేయకూడదని అనుకుంటున్న చెడునే నేను చేస్తున్నాను. అయితే ఇప్పుడు నేను చేయకూడదని అనుకుంటున్న దానిని నేను చేస్తే, అలా చేస్తున్నది నేను కాదు నాలో నివసిస్తున్న పాపమే. కాబట్టి నేను మంచి చేయాలని అనుకుంటున్నప్పటికి నాలో చెడు ఉందనే నియమాన్ని నేను గమనించాను. నా అంతరంగాన్ని బట్టి దేవుని ధర్మశాస్త్రంలో నేను ఆనందిస్తున్నాను. కాని మరొక నియమం నాలో ఉన్నట్లు నాకు కనబడుతుంది. అది నా మనస్సులోని నియమంతో పోరాడుతూ నాలో పని చేస్తున్న పాపనియమానికి నన్ను బందీగా చేస్తుంది.
రోమా 7:18-23 ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)
నాలో, అంటే నా శరీరంలో మంచిదేదీ లేదని నాకు తెలుసు. మంచిని చేయాలనే కోరిక నాకు కలుగుతుంది గాని, దాన్ని చేయడం నా వల్ల కావడం లేదు. నేను చేయాలని కోరే మంచిని చేయకుండా, నేను చేయగోరని చెడును జరిగిస్తున్నాను. నేను కోరని దాన్ని చేస్తే అది నాలోని పాపమే గాని నేను కాదు. అందువల్ల, “నేను మంచి చెయ్యాలని అనుకొన్నప్పుడు చెడు నాలోనే ఉంటుంది” అనే ఈ నియమం నాలో పని చేస్తున్నట్లు గమనిస్తున్నాను. అంతరంగ పురుషుణ్ణి బట్టి దేవుని ధర్మశాస్త్రంలో నేను ఆనందిస్తున్నాను. కానీ వేరొక నియమం నా అవయవాల్లో ఉన్నట్టు నాకు కనబడుతున్నది. అది నా మనసులోని ధర్మశాస్త్రంతో పోరాడుతూ నా అవయవాల్లోని పాప నియమానికి నన్ను బందీగా చేస్తున్నది.
రోమా 7:18-23 పవిత్ర బైబిల్ (TERV)
నా శరీరంలో మంచి అనేది నివసించటం లేదని నాకు తెలుసు. మంచి చెయ్యాలనే కోరిక నాలో ఉంది కాని, అలా చెయ్యలేకపోతున్నాను. చెయ్యాలనుకొన్న మంచిని నేను చెయ్యటం లేదు. దానికి మారుగా చెయ్యరాదనుకొన్న చెడును నేను చేస్తూ పోతున్నాను. చెయ్యకూడదనుకొన్నదాన్ని నేను చేస్తున్నానంటే, దాన్ని చేస్తున్నది నేను కాదు. నాలో నివసిస్తున్న పాపమే అలా చేయిస్తోంది. అందువల్ల, “నేను మంచి చెయ్యాలని అనుకొన్నప్పుడు చెడు నాతో అక్కడే ఉంటుంది” అనే ఈ నియమం నాలో పని చేస్తున్నట్లు గమనిస్తున్నాను. నా అంతరాత్మ దేవుడిచ్చిన ధర్మశాస్త్ర విషయంలో ఆనందం పొందుతోంది. కాని, నా అవయవాల్లో వేరొక నియమం పని చేస్తున్నట్లు గమనిస్తున్నాను. నన్ను పాపాత్మునిగా చేస్తున్న ఈ నియమం నా మెదడులో ఉన్న ధర్మశాస్త్రంతో పోరాడి నన్ను ఖైదీగా చేస్తోంది.
రోమా 7:18-23 పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI) (TELUBSI)
నాయందు, అనగా నా శరీరమందు మంచిది ఏదియు నివసింపదని నేనెరుగుదును. మేలైనది చేయవలెనను కోరిక నాకు కలుగుచున్నది గాని, దానిని చేయుట నాకు కలుగుటలేదు. నేను చేయగోరు మేలుచేయక చేయగోరని కీడుచేయుచున్నాను. నేను కోరని దానిని చేసినయెడల, దానిని చేయునది నాయందు నివసించు పాపమే గాని యికను నేను కాదు. కాబట్టి మేలుచేయగోరు నాకు కీడుచేయుట కలుగుచున్నదను ఒక నియమము నాకు కనబడుచున్నది. అంతరంగపురుషుని బట్టి దేవుని ధర్మశాస్త్రమునందు నేను ఆనందించుచున్నాను గాని వేరొక నియమము నా అవయవములలో ఉన్నట్టు నాకు కనబడుచున్నది. అది నా మనస్సు నందున్న ధర్మశాస్త్రముతో పోరాడుచు నా అవయవములలోనున్న పాపనియమమునకు నన్ను చెరపెట్టి లోబరచుకొనుచున్నది.
రోమా 7:18-23 Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం (OTSA)