రోమా 5:1-15
రోమా 5:1-15 తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం (TSA)
మనం విశ్వాసం ద్వారా నీతిమంతులుగా తీర్చబడ్డాం కాబట్టి మన ప్రభువైన యేసు క్రీస్తు ద్వారా మనం సమాధానాన్ని కలిగి ఉన్నాము. ఆయన ద్వారానే విశ్వాసం చేత ఇప్పుడు మనం నిలిచి ఉన్న కృపలోనికి రాగలిగాము. దేవుని మహిమను గురించిన నిరీక్షణలో మనం అతిశయిద్దాం. అంతేకాక, శ్రమలు ఓర్పును పుట్టిస్తాయని మనకు తెలుసు; కాబట్టి శ్రమలలో కూడా మనం ఆనందించగలము. ఓర్పు వలన గుణము, గుణము వలన నిరీక్షణ కలుగుతుంది. మనకు అనుగ్రహించబడిన పరిశుద్ధాత్మ ద్వారా దేవుని ప్రేమ మన హృదయాల్లో క్రుమ్మరింపబడుతుంది, కాబట్టి నిరీక్షణ వలన మనకు ఎన్నడూ నిరాశ కలుగదు. మనం ఇంకను బలహీనులమై ఉన్నప్పుడే, సరియైన సమయంలో క్రీస్తు భక్తిహీనుల కోసం మరణించారు. ఒక మంచివాని కోసం ఎవరో ఒకరు చనిపోవడానికి సాహసం చేయవచ్చు, కాని ఒక నీతిమంతుని కోసం ఎవరైనా చనిపోవడం చాలా అరుదు. కాని మనం ఇంకా పాపులుగా ఉండగానే క్రీస్తు మన కోసం మరణించుట ద్వారా దేవునికి మన పట్ల ఉన్న తన ప్రేమను చూపించారు. ఇప్పుడైతే ఆయన రక్తం చేత నీతిమంతులంగా తీర్చబడిన మనం మరింత ఖచ్చితంగా ఆయన ద్వారా దేవుని ఉగ్రత నుండి రక్షించబడతాం! ఎందుకంటే, మనం దేవునికి శత్రువులమై ఉండగానే ఆయన కుమారుని మరణం ద్వారా మనం ఆయనతో తిరిగి సమాధానపరచబడితే ఆయన జీవం ద్వారా మరి అధికంగా రక్షించబడతాము. అంతే కాకుండా మనల్ని సమాధానపరచిన మన ప్రభువైన యేసు క్రీస్తు ద్వారా ఇప్పుడు మనం దేవునిలో అతిశయిస్తున్నాము. ఒక్క మనుష్యుని ద్వారా ఈ లోకంలోనికి పాపం, పాపం ద్వారా మరణం ఎలా ప్రవేశించాయో, అలాగే అందరు పాపం చేశారు కాబట్టి మరణం ప్రజలందరికి వచ్చింది. ధర్మశాస్త్రం ఇవ్వబడక ముందే ఈ లోకంలో పాపం ఉంది కాని, ధర్మశాస్త్రం లేని సమయంలో ఎవరి మీద పాపం మోపబడలేదు. అయితే, ఆదాములా ఆజ్ఞను అతిక్రమించి పాపం చేయకపోయినప్పటికి, ఆదాము మొదలుకొని మోషే కాలం వరకు మరణం పరిపాలించింది. ఆదాము రాబోవుతున్న వానికి మాదిరిగా ఉన్నాడు. అయితే కృపావరమనేది అతిక్రమం వంటిది కాదు. ఒకవేళ ఒకని అతిక్రమాన్ని బట్టి అనేకమంది మరణిస్తే దేవుని కృప, యేసు క్రీస్తు అనే ఒక్క మనుష్యుని కృప చేత వచ్చిన కృపావరం అనేకమందికి విస్తరిస్తుంది కదా!
రోమా 5:1-15 ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)
విశ్వాసం ద్వారా దేవుడు మనలను నీతిమంతులుగా తీర్చాడు కాబట్టి మన ప్రభు యేసు క్రీస్తు ద్వారా దేవునితో సమాధానం కలిగి ఉన్నాము. ఆయన ద్వారా మనం విశ్వాసం వలన ఈ కృపలో ప్రవేశించి, అందులో కొనసాగుతూ దేవుని మహిమ గురించిన నిశ్చయతలో ఆనందిస్తున్నాం. అంతే కాదు, కష్టాలు ఓర్పునూ, ఓర్పు యోగ్యతనూ, యోగ్యత ఆమోదాన్నీ కలిగిస్తాయని తెలిసి మన కష్టాల్లో ఆనందించుదాం. ఈ నమ్మకం మనలను నిరాశపరచదు. ఎందుకంటే దేవుడు మనకు అనుగ్రహించిన పరిశుద్ధాత్మ ద్వారా ఆయన తన ప్రేమను మన హృదయాల్లో కుమ్మరించాడు. ఎందుకంటే మనం బలహీనులుగా ఉండగానే, సరైన సమయంలో క్రీస్తు భక్తిహీనుల కోసం చనిపోయాడు. నీతిపరుని కోసం సైతం ఎవరైనా చనిపోవడం అరుదు. మంచివాడి కోసం ఎవరైనా చనిపోడానికి ఒకవేళ తెగించవచ్చు. అయితే దేవుడు మన మీద తన ప్రేమను వ్యక్తపరిచాడు. ఎలాగంటే మనమింకా పాపులుగా ఉండగానే క్రీస్తు మన కోసం చనిపోయాడు. కాబట్టి ఇప్పుడు ఆయన రక్తం వలన నీతిమంతులుగా తీర్పు పొంది, మరింత నిశ్చయంగా ఆయన ద్వారా ఉగ్రత నుండి తప్పించుకుంటాం. ఎందుకంటే మనం శత్రువులుగా ఉండి, ఆయన కుమారుని మరణం ద్వారా దేవునితో సమాధానపడితే, ఆయన జీవం చేత ఇంకా నిశ్చయంగా రక్షణ పొందుతాము. అంతేకాదు, మన ప్రభువైన యేసు క్రీస్తు ద్వారా ఇప్పుడు సమాధాన స్థితి పొందాము కాబట్టి ఆయన ద్వారా మనం దేవునిలో ఆనందిస్తున్నాం. ఇదిలా ఉండగా, ఒక మనిషి ద్వారా పాపం ఎలా ఈ లోకంలోకి ప్రవేశించిందో, అలాగే పాపం ద్వారా మరణం ప్రవేశించింది. మనుషులంతా పాపం చేయడం వలన చావు అందరికీ దాపురించింది. ఎందుకంటే ధర్మశాస్త్రం రాక ముందు కూడా లోకంలో పాపం ఉంది గాని ధర్మశాస్త్రం లేదు కాబట్టి దేవుడు వారిపై పాపం ఆరోపించలేదు. అయినా, ఆదాము కాలం నుండి మోషే కాలం వరకూ మానవులపై మరణం రాజ్యం చేసింది. ఆదాము దేవుని ఆజ్ఞను అతిక్రమించాడు. కాని అతని వలే పాపం చెయ్యని వాళ్ళపై కూడా మరణం రాజ్యం చేసింది. ఆదాము రాబోయే వాడికి ఒక సూచనగా ఉన్నాడు. కాని దేవుడు ఇచ్చిన వరానికి, ఆదాము చేసిన పాపానికి పోలిక లేదు. ఎలాగంటే ఒకడి అపరాధం వలన చాలా మంది చనిపోయారు. అయితే దేవుని అనుగ్రహం, యేసు క్రీస్తు అనే ఒక మనిషి కృప వలన కలిగిన ఉచిత కృపాదానం మరి నిశ్చయంగా అనేకమందికి సమృద్ధిగా కలిగింది.
రోమా 5:1-15 పవిత్ర బైబిల్ (TERV)
మనలో విశ్వాసము ఉండటం వలన దేవుడు మనము నీతిమంతులమని తీర్పు చెప్పాడు. ఆ కారణంగా, మన యేసు క్రీస్తు ప్రభువు ద్వారా మనకు దేవునితో స్నేహం కలిగింది. మనం ప్రస్తుతం జీవిస్తున్న జీవితం దేవుని అనుగ్రహం వల్ల సంభవించింది. ఇది విశ్వాసంగల మనకు యేసు క్రీస్తు ద్వారా లభించింది. దేవుని తేజస్సులో భాగం పంచుకొంటామనే ఆశ మనలో ఉండటం వల్ల మనకు ఎంతో ఆనందం కలుగుతోంది. అంతేకాదు, కష్టాలు సహనాన్ని పెంపొందింపచేస్తాయని మనకు తెలుసు. కనుక మనము కష్టాలు అనుభవించటంలో కూడా ఆనందాన్ని పొందుతున్నాము. సహనం వల్ల దేవుని మెప్పు, మెప్పువల్ల ఆయన తేజస్సులో భాగం పంచుకొంటామనే నిరీక్షణ కలుగతోంది. దేవుడు మనకిచ్చిన పరిశుద్ధాత్మ ద్వారా తన ప్రేమను మనపై కురిపించాడు. కనుక ఆ ఆశ విషయంలో మనకు నిరాశ కలుగదు. నిజానికి మనలో శక్తి లేని సమయాన భక్తిహీనులమైన మన కోసం క్రీస్తు మరణించాడు. నీతిమంతుల కోసం మరణించటం చాలా అరుదు. మంచి స్నేహితుని కోసం ఒకడు ధైర్యం చేసి, మరణిస్తే మరణించవచ్చు. కాని మనమింకా పాపంలో ఉన్నప్పుడే క్రీస్తు మనకోసం మరణించాడు. ఈ విధంగా దేవుడు తన ప్రేమను మనకోసం వ్యక్తం చేసాడు. దేవుడు యేసు క్రీస్తు రక్తంద్వారా మనము నీతిమంతులమని తీర్పు చెప్పాడు. కనుక మనము దేవుని ఆగ్రహం నుండి తప్పకుండా రక్షింపబడుతాము. ఇది యేసు క్రీస్తు ద్వారా సంభవిస్తుంది. ఒకప్పుడు మనం దేవుని శత్రువులం. అయినా తన కుమారుని మరణంవల్ల మనకు ఆయనతో సమాధానం కలిగింది. కనుక క్రీస్తు జీవితం ద్వారా ఆయన మనల్ని తప్పకుండా రక్షిస్తాడు. పైగా మన యేసుక్రీస్తు ప్రభువు ద్వారా దేవునితో స్నేహం కలిగినందుకు మనం ఇప్పుడు ఆనందిస్తున్నాము. పాపం ఈ ప్రపంచంలోకి ఆదాము ద్వారా ప్రవేశించింది. పాపం ద్వారా మరణం సంభవించింది. అంతేకాక అందరూ పాపం చేసారు కనుక అందరికీ మరణం ప్రాప్తించింది. ధర్మశాస్త్రానికి ముందే పాపం ఈ ప్రపంచంలో ఉండేది. కాని ధర్మశాస్త్రం లేక పోయినట్లైతే పాపం లెక్కలోకి వచ్చేది కాదు. అయినా, ఆదాము కాలంనుండి మోషే కాలం వరకు మానవులపై మరణం రాజ్యం చేసింది. ఆదాము దేవుని ఆజ్ఞను అతిక్రమించాడు. కాని అతనివలే పాపం చెయ్యనివాళ్ళపై కూడా మరణం రాజ్యం చేసింది. ఆదాముకు, రానున్నవానికి కొంత పోలిక ఉంది. కాని దేవుడు ఇచ్చిన వరానికి, ఆదాము చేసిన పాపానికి పోలిక లేదు. ఒకడు చేసిన పాపం వల్ల చాలా మంది మరణించారు. మరొకని అనుగ్రహం వల్ల, అంటే యేసు క్రీస్తు అనుగ్రహంవల్ల, దేవునిలో వరము, ఆయన అనుగ్రహము ఉచితంగా లభించాయి.
రోమా 5:1-15 పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI) (TELUBSI)
కాబట్టి విశ్వాసమూలమున మనము నీతిమంతులముగా తీర్చబడి, మన ప్రభువైన యేసుక్రీస్తుద్వారా దేవునితో సమాధానము కలిగియుందము మరియు ఆయనద్వారా మనము విశ్వాసమువలన ఈ కృపయందు ప్రవేశముగలవారమై, అందులో నిలిచియుండి, దేవుని మహిమనుగూర్చిన నిరీక్షణనుబట్టి అతిశయపడుచున్నాము. అంతే కాదు; శ్రమ ఓర్పును, ఓర్పు పరీక్షను, పరీక్ష నిరీక్షణను కలుగజేయునని యెరిగి శ్రమలయందును అతిశయపడు దము. ఎందుకనగా ఈ నిరీక్షణ మనలను సిగ్గుపరచదు. మనకు అనుగ్రహింపబడిన పరిశుద్ధాత్మద్వారా దేవుని ప్రేమ మన హృదయములలో కుమ్మరింపబడియున్నది. ఏలయనగా మనమింక బలహీనులమై యుండగా, క్రీస్తు యుక్తకాలమున భక్తిహీనులకొరకు చనిపోయెను. నీతిమంతునికొరకు సహితము ఒకడు చనిపోవుట అరుదు; మంచివానికొరకు ఎవడైన ఒకవేళ చనిపోవ తెగింప వచ్చును. అయితే దేవుడు మనయెడల తన ప్రేమను వెల్లడిపరచుచున్నాడు; ఎట్లనగా మనమింకను పాపులమై యుండగానే క్రీస్తు మనకొరకు చనిపోయెను. కాబట్టి ఆయన రక్తమువలన ఇప్పుడు నీతిమంతులముగా తీర్చబడి, మరింత నిశ్చయముగా ఆయన ద్వారా ఉగ్రతనుండి రక్షింపబడుదుము. ఏలయనగా శత్రువులమై యుండగా, ఆయన కుమారుని మరణముద్వారా మనము దేవునితో సమాధానపరచబడినయెడల సమాధానపరచబడిన వారమై, ఆయన జీవించుటచేత మరి నిశ్చయముగా రక్షింపబడు దుము. అంతేకాదు; మన ప్రభువైన యేసు క్రీస్తుద్వారా మనము దేవునియందు అతిశయపడుచున్నాము; ఆయన ద్వారానే మనము ఇప్పుడు సమాధానస్థితి పొంది యున్నాము. ఇట్లుండగా ఒక మనుష్యునిద్వారా పాపమును పాపము ద్వారా మరణమును లోకములో ఏలాగు ప్రవేశించెనో, ఆలాగుననే మనుష్యులందరు పాపము చేసినందున మరణము అందరికిని సంప్రాప్తమాయెను. ఏలయనగా ధర్మశాస్త్రము వచ్చినదనుక పాపము లోకములో ఉండెను గాని ధర్మశాస్త్రము లేనప్పుడు పాపము ఆరోపింపబడదు. అయినను ఆదాముచేసిన అతిక్రమమును బోలి పాపము చేయని వారిమీదకూడ, ఆదాము మొదలుకొని మోషేవరకు మరణమేలెను; ఆదాము రాబోవువానికి గురుతై యుండెను, అయితే అపరాధము కలిగినట్టు కృపావరము కలుగలేదు. ఎట్లనగా ఒకని అపరాధమువలన అనేకులు చనిపోయినయెడల మరి యెక్కువగా దేవుని కృపయు, యేసుక్రీస్తను ఒక మనుష్యుని కృపచేతనైన దానమును, అనేకులకు విస్తరించెను.
రోమా 5:1-15 Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం (OTSA)