రోమా 3:10-26

రోమా 3:10-26 తెలుగు సమకాలీన అనువాదము (TCV)

లేఖనాల్లో ఈ విధంగా వ్రాయబడివున్నది, “నీతిమంతులు ఎవరూ లేరు, ఒక్కరు కూడా లేరు; గ్రహించగలినవారు ఒక్కరు కూడా లేరు; దేవుని వెదకేవారు ఒక్కరు కూడా లేరు. అందరు దారి తప్పిపోయారు, వారందరు కలిసి అప్రయోజకులయ్యారు; మంచిని చేసేవారు ఎవరూ లేరు, ఒక్కరు కూడా లేరు.” “వారి గొంతుకలు తెరచిన సమాధుల్లా ఉన్నాయి; వారి నాలుకలు మోసాన్ని అభ్యాసం చేస్తాయి.” “సర్పాల విషం వారి పెదవుల క్రింద ఉంది.” “వారి నోటి నిండా శపించడం విరోధం ఉన్నాయి.” “వారి పాదాలు రక్తాన్ని చిందించడానికి త్వరపడుతున్నాయి; నాశనం, దుఃఖం వారు వెళ్ళే మార్గాలకు గుర్తుగా ఉన్నాయి, శాంతి మార్గం వారికి తెలియదు.” “వారి కన్నులకు దేవుని భయం లేదు.” ప్రతి నోరు మౌనంగా ఉండునట్లు లోకమంతా దేవునికి లెక్కప్పగించునట్లు ధర్మశాస్త్రం ఏం చెప్పినా, ధర్మశాస్త్రం క్రింద ఉన్నవారికి చెప్తుందని మనం తెలుసుకుంటాము. కనుక ధర్మశాస్త్రంలో చెప్పబడినట్లుగా చేయడం ద్వారా ఎవరూ దేవుని దృష్టిలో నీతిమంతునిగా తీర్పు తీర్చబడరు, కాని ధర్మశాస్త్రం ద్వారా మన పాపాల గురించి మనం తెలుసుకోగలుగుతాం. అయితే ఇప్పుడు ధర్మశాస్త్రం లేకుండానే దేవుని నీతి తెలియపరచబడుతుంది, దానిని గురించి ధర్మశాస్త్రం ప్రవక్తలు సాక్ష్యమిస్తున్నారు. యేసుక్రీస్తులో ఉన్న విశ్వాసం ద్వారా విశ్వసించిన వారందరికి ఈ నీతి ఇవ్వబడుతుంది. యూదులకు యూదేతరులకు భేదం లేదు, అందరు పాపం చేసి దేవుని మహిమను పోగొట్టుకొన్నారు, కనుక విశ్వసించిన వారందరు ఆయన కృప చేత యేసు క్రీస్తు నుండి వచ్చిన విమోచన ద్వారా ఉచితంగా నీతిమంతులుగా తీర్చబడుతున్నారు. దేవుడు క్రీస్తును, ఆయన యొక్క రక్తాన్ని చిందించడం ద్వారా ప్రాయశ్చిత్త బలిగా సమర్పించాడు; విశ్వాసం ద్వారా దానిని పొందుకోవాలి. ఆయన తన నీతిని చూపించడానికి ఇలా చేశారు, ఎందుకంటే ఆయన తన సహనాన్ని బట్టి పూర్వం చేయబడిన పాపాలను శిక్ష విధించకుండా వదిలేసారు. ఆయన ఈ ప్రస్తుత కాలంలో తన నీతిని కనుపరచడానికి, ఆయన నీతిమంతుడై ఉండి యేసులో విశ్వాసముంచిన వారిని నీతిమంతులుగా తీర్చేవానిగా ఉండడానికి ఇలా చేశారు.

షేర్ చేయి
Read రోమా 3

రోమా 3:10-26 ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)

దీని విషయంలో ఏమని రాసి ఉన్నదంటే, “నీతిమంతుడు లేడు, ఒక్కడు కూడా లేడు. గ్రహించేవాడెవడూ లేడు, దేవుణ్ణి వెదికే వాడెవడూ లేడు. అందరూ దారి తప్పిపోయారు, అందరూ ఏకంగా పనికిమాలినవారయ్యారు. మంచి జరిగించేవాడు లేడు, ఒక్కడు కూడా లేడు. వారి గొంతుక తెరచి ఉన్న సమాధిలాగా ఉంది. వారు నాలుకతో మోసం చేస్తూ ఉంటారు. వారి పెదవుల కింద పాము విషం ఉంది. వారి నోటినిండా శాపనార్ధాలు, పగ ఉన్నాయి. రక్తం చిందించడానికి వారి పాదాలు పరిగెడుతూ ఉన్నాయి. వారి మార్గాల్లో నాశనం, కష్టం ఉన్నాయి. వారికి శాంతిమార్గం తెలియదు. వారి దృష్టికి దేవుని భయం అంటే తెలియదు.” ప్రతి నోటికీ మూతపడాలనీ, లోకమంతా దేవుని తీర్పు కిందికి రావాలనీ ధర్మశాస్త్రం చెప్పే మాటలన్నీ దానికి లోబడి ఉన్నవారితోనే చెబుతున్నదని మనకు తెలుసు. ఎందుకంటే ధర్మశాస్త్రాన్ని పాటించడం ద్వారా ఏ మనిషీ దేవుని దృష్టికి నీతిమంతుడు కాలేడు. ధర్మశాస్త్రం వలన పాపమంటే ఏమిటో తెలుస్తున్నది. ఇదిలా ఉంటే ధర్మశాస్త్రంతో సంబంధం లేకుండా దేవుని న్యాయం వెల్లడైంది. ధర్మశాస్త్రమూ ప్రవక్తలూ రాసింది దానికి సాక్ష్యంగా ఉన్నాయి. అది యేసు క్రీస్తులో విశ్వాసమూలంగా నమ్మే వారందరికీ కలిగే దేవుని నీతి. భేదమేమీ లేదు. అందరూ పాపం చేసి దేవుడు ఇవ్వజూపిన మహిమను అందుకోలేక పోతున్నారు. నమ్మేవారు దేవుని కృప చేతా, క్రీస్తు యేసులోని విమోచన ద్వారా, ఉచితంగా నీతిమంతులని తీర్పు పొందుతున్నారు. క్రీస్తు యేసు రక్తంలో విశ్వాసం ద్వారా పాప పరిహారం పొందేలా దేవుడు తన కోపాగ్నిని తొలగించే పాప పరిహారార్ధ బలిగా ఆయనను కనుపరిచాడు. అందులో దేవుని ఉద్దేశం తన న్యాయాన్ని ప్రదర్శించడమే. ఎందుకంటే, గతంలోని పాపాలను దేవుడు సహనంతో దాటిపోయాడు. ప్రస్తుత కాలంలో తన న్యాయాన్ని కనబరిచే నిమిత్తం తాను న్యాయవంతుడుగా, యేసులో విశ్వాసంగల వాణ్ణి న్యాయవంతుని తీర్చే వాడుగా ఉండడానికి దేవుడు ఇలా చేశాడు.

షేర్ చేయి
Read రోమా 3

రోమా 3:10-26 పవిత్ర బైబిల్ (TERV)

ఈ విషయమై ఇలా వ్రాయబడి ఉంది: “నీతిమంతుడు లేడు. ఒక్కడు కూడా లేడు! అర్థం చేసుకొనేవాడొక్కడూ లేడు. దేవుణ్ణి అన్వేషించే వాడెవ్వడూ లేడు. అందరూ వెనక్కు తిరిగి వెళ్ళిపోయారు. అందరూ కలిసి పనికిరానివాళ్ళైపోయారు. మంచి చేసే వాడొక్కడూ లేడు. ఒక్కడు కూడా లేడు!” “వాళ్ళ నోళ్ళు తెరుచుకొన్న సమాధుల్లా ఉన్నాయి. వాళ్ళ నాలుకలు మోసాలు పలుకుతూ ఉంటాయి.” “వాళ్ళ పెదాలపై పాము విషం ఉంటుంది!” “వాళ్ళ నోటినిండా తిట్లూ, ద్వేషంతో కూడుకొన్న మాటలు ఉంటాయి!” “వాళ్ళ పాదాలు రక్తాన్ని చిందించటానికి తొందరపడ్తుంటాయి. వాళ్ళు తాము నడిచిన దారుల్లో వినాశనాన్ని, దుఃఖాన్ని వదులుతుంటారు. వాళ్ళకు శాంతి మార్గమేదో తెలియదు!” “వాళ్ళ కళ్ళలో దైవభీతి కనిపించదు.” ధర్మశాస్త్ర నియమాలు ధర్మశాస్త్రాన్ని అనుసరించవలసినవారికి వర్తిస్తాయని మనకు తెలుసు. తద్వారా ప్రపంచంలో ఉన్నవాళ్ళందరూ, అంటే యూదులు కానివాళ్ళేకాక, యూదులు కూడా దేవునికి లెక్క చెప్పవలసి ఉంటుంది. ఎవ్వరూ తప్పించుకోలేరు. ధర్మశాస్త్రం తెలిస్తే పాపాన్ని గురించి జ్ఞానం కలుగుతుంది. అంతేకాని, ధర్మశాస్త్రాన్ని అనుసరించినంత మాత్రాన దేవుని దృష్టిలో నీతిమంతులం కాలేము. కాని దేవుడు ఇప్పుడు ధర్మశాస్త్రం ఉపయోగించకుండా నీతిమంతులయ్యే విధానం మనకు తెలియచేసాడు. ఈ విధానాన్ని ప్రవక్తలు ముందే చెప్పారు. ఇది ధర్మశాస్త్రంలోనూ ఉంది. దీని ప్రకారం యేసు క్రీస్తులో మనకున్న విశ్వాసంవల్ల దేవుడు మనల్ని నిర్దోషులుగా పరిగణిస్తున్నాడని విదితమౌతుంది. ఆయనను విశ్వసించిన ప్రతి ఒక్కనికి ఈ విధానం వర్తిస్తుంది. అందరూ పాపం చేసారు, కనుక దేవుని తేజస్సు పంచుకోవటానికి ఎవ్వరికీ అర్హత లేదు. అందువల్ల ఈ విధానం అందరికీ వర్తిస్తుంది. వ్యత్యాసం లేదు. కాని, దేవుడు వాళ్ళను తన ఉచితమైన కృపవల్ల నీతిమంతులుగా చేస్తున్నాడు. ఇది యేసు క్రీస్తు వల్ల కలిగే విముక్తి ద్వారా సంభవిస్తుంది. దేవుడు ఇదివరలో ప్రజలు చేసిన పాపాల్ని లెక్క చెయ్యకుండా సహనం వహించాడు. ఆయన తన నీతిని నిరూపించాలని యేసు క్రీస్తు రక్తాన్ని విశ్వసించే ప్రజలకోసం ఆయనను కరుణాపీఠంగా చేసాడు. అలా చేసి ఇప్పుడు తన నీతిని ప్రదర్శిస్తున్నాడు. ప్రజలు తనను నీతిమంతునిగా పరిగణించాలని, యేసును విశ్వసించే ప్రజలను నీతిమంతులుగా చెయ్యాలని ఆయన ఉద్దేశ్యం.

షేర్ చేయి
Read రోమా 3

రోమా 3:10-26 పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI) (TELUBSI)

ఇందునుగూర్చి వ్రాయబడినదేమనగా– నీతిమంతుడు లేడు, ఒక్కడును లేడు గ్రహించువాడెవడును లేడు దేవుని వెదకువాడెవడును లేడు అందరును త్రోవ తప్పి యేకముగా పనికిమాలినవారైరి. మేలుచేయువాడు లేడు, ఒక్కడైనను లేడు. వారి గొంతుక తెరచిన సమాధి, తమ నాలుకతో మోసము చేయుదురు; వారి పెదవుల క్రింద సర్పవిషమున్నది వారి నోటినిండ శపించుటయు పగయు ఉన్నవి. రక్తము చిందించుటకు వారి పాదములు పరుగెత్తుచున్నవి. నాశనమును కష్టమును వారి మార్గములలో ఉన్నవి. శాంతిమార్గము వారెరుగరు. వారి కన్నుల యెదుట దేవుని భయము లేదు. ప్రతి నోరు మూయబడునట్లును, సర్వలోకము దేవుని శిక్షకు పాత్రమగునట్లును, ధర్మశాస్త్రము చెప్పుచున్న వాటినన్నిటిని ధర్మశాస్త్రమునకు లోనైనవారితో చెప్పు చున్నదని యెరుగుదుము. ఏలయనగా ధర్మశాస్త్రసంబంధమైన క్రియలమూలముగా ఏ మనుష్యుడును ఆయన దృష్టికి నీతిమంతుడని తీర్చబడడు; ధర్మశాస్త్రమువలన పాపమనగా ఎట్టిదో తెలియబడుచున్నది. ఇట్లుండగా ధర్మశాస్త్రమునకు వేరుగా దేవుని నీతిబయలుపడుచున్నది; దానికి ధర్మశాస్త్రమును ప్రవక్తలును సాక్ష్యమిచ్చుచున్నారు. అది యేసుక్రీస్తునందలి విశ్వాసమూలమైనదై, నమ్ము వారందరికి కలుగు దేవుని నీతియైయున్నది. ఏ భేదమును లేదు; అందరును పాపముచేసి దేవుడు అను గ్రహించు మహిమను పొందలేక పోవుచున్నారు. కాబట్టి నమ్మువారు ఆయన కృపచేతనే, క్రీస్తుయేసునందలి విమోచనము ద్వారా ఉచితముగా నీతిమంతులని తీర్చబడుచున్నారు. పూర్వము చేయబడిన పాపములను దేవుడు తన ఓరిమివలన ఉపేక్షించినందున, ఆయన తన నీతిని కనువరచవలెనని క్రీస్తుయేసు రక్తమునందలి విశ్వాసము ద్వారా ఆయనను కరుణాధారముగా బయలుపరచెను. దేవుడిప్పటి కాలమందు తన నీతిని కనబరచునిమిత్తము, తాను నీతిమంతుడును యేసునందు విశ్వాసముగలవానిని నీతిమంతునిగా తీర్చువాడునై యుండుటకు ఆయన ఆలాగు చేసెను.

షేర్ చేయి
Read రోమా 3

రోమా 3:10-26 Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం (OTSA)

దీని గురించి లేఖనాల్లో ఈ విధంగా, “నీతిమంతులు ఎవరూ లేరు, ఒక్కరు కూడా లేరు; గ్రహించగలినవారు ఒక్కరు కూడా లేరు; దేవుని వెదకేవారు ఒక్కరు కూడా లేరు. అందరు దారి తప్పి చెడిపోయారు, వారందరు కలిసి అప్రయోజకులయ్యారు; మేలు చేసేవారు ఒక్కరు కూడా లేరు, ఒక్కరు కూడా లేరు.” “వారి గొంతుకలు తెరచిన సమాధుల్లా ఉన్నాయి; వారు నాలుకలతో మోసం చేస్తారు.” “వారి పెదవుల క్రింద సర్పాల విషం ఉంది.” “వారి నోటి నిండా శాపాలు, పగ ఉన్నాయి.” “వారి పాదాలు రక్తాన్ని చిందించడానికి త్వరపడుతున్నాయి; వారి మార్గాల్లో నాశనం, కష్టం ఉన్నాయి, సమాధాన మార్గం వారికి తెలియదు.” “వారి కళ్లలో దేవుని భయం లేదు.” ప్రతి నోరు మౌనంగా ఉండేలా, లోకమంతా దేవునికి లెక్క అప్పగించేలా ధర్మశాస్త్రం చెప్పేవన్నీ ధర్మశాస్త్రానికి లోబడేవారికి చెప్తుందని మనం తెలుసు. కాబట్టి ధర్మశాస్త్ర క్రియల ద్వారా ఎవరూ దేవుని దృష్టిలో నీతిమంతునిగా తీర్పు తీర్చబడరు, కాని ధర్మశాస్త్రం ద్వారా మన పాపాల గురించి మనం తెలుసుకుంటాము. అయితే ఇప్పుడు ధర్మశాస్త్రం లేకుండానే దేవుని నీతి తెలియజేయబడుతుంది. దానిని గురించి ధర్మశాస్త్రం, ప్రవక్తలు సాక్ష్యమిస్తున్నారు. యేసు క్రీస్తులో ఉన్న విశ్వాసం ద్వారా నమ్మిన వారందరికి ఈ నీతి ఇవ్వబడుతుంది. యూదులకు యూదేతరులకు మధ్య ఏ భేదం లేదు. అందరు పాపం చేసి దేవుని మహిమను పోగొట్టుకుంటున్నారు. కాబట్టి విశ్వసించిన వారందరు ఆయన కృప చేత యేసు క్రీస్తు నుండి వచ్చిన విమోచన ద్వారా ఉచితంగా నీతిమంతులుగా తీర్చబడుతున్నారు. క్రీస్తు రక్తాన్ని చిందించడం ద్వారా దేవుడు ఆయనను ప్రాయశ్చిత్త బలిగా సమర్పించారు; విశ్వాసం ద్వారా దానిని పొందుకోవాలి. ఆయన తన నీతిని చూపించడానికి ఇలా చేశారు, ఎందుకంటే ఆయన సహనంతో పూర్వం చేసిన పాపాలను శిక్ష విధించకుండా వదిలేశారు. ఆయన ఈ ప్రస్తుత కాలంలో తన నీతిని కనుపరచడానికి, ఆయన నీతిమంతుడై ఉండి యేసులో విశ్వాసముంచిన వారిని నీతిమంతులుగా తీర్చేవానిగా ఉండడానికి ఇలా చేశారు.

షేర్ చేయి
Read రోమా 3