లేఖనాల్లో ఈ విధంగా వ్రాయబడివున్నది, “నీతిమంతులు ఎవరూ లేరు, ఒక్కరు కూడా లేరు; గ్రహించగలినవారు ఒక్కరు కూడా లేరు; దేవుని వెదకేవారు ఒక్కరు కూడా లేరు. అందరు దారి తప్పిపోయారు, వారందరు కలిసి అప్రయోజకులయ్యారు; మంచిని చేసేవారు ఎవరూ లేరు, ఒక్కరు కూడా లేరు.” “వారి గొంతుకలు తెరచిన సమాధుల్లా ఉన్నాయి; వారి నాలుకలు మోసాన్ని అభ్యాసం చేస్తాయి.” “సర్పాల విషం వారి పెదవుల క్రింద ఉంది.” “వారి నోటి నిండా శపించడం విరోధం ఉన్నాయి.” “వారి పాదాలు రక్తాన్ని చిందించడానికి త్వరపడుతున్నాయి; నాశనం, దుఃఖం వారు వెళ్ళే మార్గాలకు గుర్తుగా ఉన్నాయి, శాంతి మార్గం వారికి తెలియదు.” “వారి కన్నులకు దేవుని భయం లేదు.” ప్రతి నోరు మౌనంగా ఉండునట్లు లోకమంతా దేవునికి లెక్కప్పగించునట్లు ధర్మశాస్త్రం ఏం చెప్పినా, ధర్మశాస్త్రం క్రింద ఉన్నవారికి చెప్తుందని మనం తెలుసుకుంటాము. కనుక ధర్మశాస్త్రంలో చెప్పబడినట్లుగా చేయడం ద్వారా ఎవరూ దేవుని దృష్టిలో నీతిమంతునిగా తీర్పు తీర్చబడరు, కాని ధర్మశాస్త్రం ద్వారా మన పాపాల గురించి మనం తెలుసుకోగలుగుతాం. అయితే ఇప్పుడు ధర్మశాస్త్రం లేకుండానే దేవుని నీతి తెలియపరచబడుతుంది, దానిని గురించి ధర్మశాస్త్రం ప్రవక్తలు సాక్ష్యమిస్తున్నారు. యేసుక్రీస్తులో ఉన్న విశ్వాసం ద్వారా విశ్వసించిన వారందరికి ఈ నీతి ఇవ్వబడుతుంది. యూదులకు యూదేతరులకు భేదం లేదు, అందరు పాపం చేసి దేవుని మహిమను పోగొట్టుకొన్నారు, కనుక విశ్వసించిన వారందరు ఆయన కృప చేత యేసు క్రీస్తు నుండి వచ్చిన విమోచన ద్వారా ఉచితంగా నీతిమంతులుగా తీర్చబడుతున్నారు. దేవుడు క్రీస్తును, ఆయన యొక్క రక్తాన్ని చిందించడం ద్వారా ప్రాయశ్చిత్త బలిగా సమర్పించాడు; విశ్వాసం ద్వారా దానిని పొందుకోవాలి. ఆయన తన నీతిని చూపించడానికి ఇలా చేశారు, ఎందుకంటే ఆయన తన సహనాన్ని బట్టి పూర్వం చేయబడిన పాపాలను శిక్ష విధించకుండా వదిలేసారు. ఆయన ఈ ప్రస్తుత కాలంలో తన నీతిని కనుపరచడానికి, ఆయన నీతిమంతుడై ఉండి యేసులో విశ్వాసముంచిన వారిని నీతిమంతులుగా తీర్చేవానిగా ఉండడానికి ఇలా చేశారు.
Read రోమా 3
వినండి రోమా 3
షేర్ చేయి
అన్ని అనువాదాలను సరిపోల్చండి: రోమా 3:10-26
వచనాలను సేవ్ చేయండి, ఆఫ్‌లైన్‌లో చదవండి, బోధన క్లిప్‌లను చూడండి ఇంకా మరెన్నో చేయండి!
హోమ్
బైబిల్
ప్రణాళికలు
వీడియోలు