రోమా 3:1-18
రోమా 3:1-18 పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI) (TELUBSI)
అట్లయితే యూదునికి కలిగిన గొప్పతనమేమి? సున్నతి వలన ప్రయోజనమేమి? ప్రతివిషయమందును అధికమే. మొదటిది, దేవోక్తులు యూదుల పరము చేయబడెను. కొందరు అవిశ్వాసులైన నేమి? వారు అవిశ్వాసులైనందున దేవుడు నమ్మతగినవాడు కాక పోవునా? అట్లనరాదు. నీ మాటలలో నీవు నీతిమంతుడవుగా తీర్చబడునట్లును నీవు వ్యాజ్యెమాడునప్పుడు గెలుచునట్లును అని వ్రాయబడిన ప్రకారము ప్రతిమనుష్యుడును అబద్ధికుడగును గాని దేవుడు సత్యవంతుడు కాక తీరడు. మన దుర్నీతి దేవుని నీతికి ప్రసిద్ధి కలుగజేసినయెడల ఏమందుము? ఉగ్రతను చూపించు దేవుడు అన్యాయస్థు డగునా? నేను మనుష్యరీతిగా మాటలాడుచున్నాను; అట్లనరాదు. అట్లయినయెడల దేవుడు లోకమునకు ఎట్లు తీర్పు తీర్చును? దేవునికి మహిమ కలుగునట్లు నా అసత్యమువలన దేవుని సత్యము ప్రబలినయెడల నేనికను పాపినైనట్టు తీర్పు పొందనేల? మేలు కలుగుటకు కీడుచేయుదమని మేము చెప్పుచున్నామని, కొందరు మమ్మును దూషించి చెప్పు ప్రకారము మేమెందుకు చెప్పరాదు? అట్టివారికి కలుగు శిక్షావిధి న్యాయమే. ఆలాగైన ఏమందుము? మేము వారికంటె శ్రేష్ఠులమా? తక్కువవారమా? ఎంతమాత్రమును కాము. యూదులేమి గ్రీసుదేశస్థులేమి అందరును పాపమునకు లోనైయున్నారని యింతకుముందు దోషారోపణ చేసియున్నాము. ఇందునుగూర్చి వ్రాయబడినదేమనగా– నీతిమంతుడు లేడు, ఒక్కడును లేడు గ్రహించువాడెవడును లేడు దేవుని వెదకువాడెవడును లేడు అందరును త్రోవ తప్పి యేకముగా పనికిమాలినవారైరి. మేలుచేయువాడు లేడు, ఒక్కడైనను లేడు. వారి గొంతుక తెరచిన సమాధి, తమ నాలుకతో మోసము చేయుదురు; వారి పెదవుల క్రింద సర్పవిషమున్నది వారి నోటినిండ శపించుటయు పగయు ఉన్నవి. రక్తము చిందించుటకు వారి పాదములు పరుగెత్తుచున్నవి. నాశనమును కష్టమును వారి మార్గములలో ఉన్నవి. శాంతిమార్గము వారెరుగరు. వారి కన్నుల యెదుట దేవుని భయము లేదు.
రోమా 3:1-18 తెలుగు సమకాలీన అనువాదము (TCV)
అయితే, యూదునిగా ఉండడం వలన ప్రయోజనమేమిటి, లేదా సున్నతిలో ఉన్న విలువేమిటి? ప్రతీ విషయంలోనూ అధికమే! మొదటిగా, దేవుని మాటలు యూదులకు అప్పగించబడ్డాయి. వారిలో కొందరు అవిశ్వాసంగా ఉంటే ఏంటి? వారి అవిశ్వాసం దేవుని విశ్వసనీయతను నిరర్థకం చేస్తుందా? ఎన్నటికి కాదు; ప్రతి ఒక్క మనిషి అబద్ధికుడు కావచ్చు గాని దేవుడు సత్యవంతుడు. దేవుని గురించి లేఖనంలో ఈ విధంగా వ్రాయబడివున్నది, “మాట్లాడినప్పుడు నీవు నీతిమంతుడవని నిరూపించబడతావు తీర్పు తీర్చునప్పుడు నీవు జయిస్తావు.” అయితే మన దుర్మార్గాన్ని బట్టి దేవుడు నీతిమంతుడని మరింత స్పష్టమవుతుంటే, మనమేమి చెప్పగలం? దేవుడు తన ఉగ్రతను మన మీద చూపితే ఆయన అన్యాయస్థుడు అవుతాడా? నేను మానవుల వాదన చెప్తున్నాను. ఖచ్చితంగా కాదు! ఒకవేళ అలా అయితే, దేవుడు లోకానికి ఎలా తీర్పు తీర్చగలడు? అయితే కొందరు, “ఒకవేళ నా అబద్ధం దేవుని యదార్థతను అధికం చేసినప్పుడు, ఆయన మహిమను పెంచినప్పుడు, నేను పాపిగా ఎందుకు తీర్పు తీర్చబడాలి?” అని వాదిస్తారు. “మంచి జరుగునట్లు చెడు చేద్దాం” అని కొందరు అపవాదుగా అన్నట్లుగా ఎందుకు అనకూడదు? అలాంటి వారికి తీర్చబడిన తీర్పు న్యాయమైనదే! అప్పుడు మనం ఏమని నిర్ధారించాలి? మనకు ఏమైనా ప్రయోజనం ఉందా? ఎంత మాత్రం లేదు! యూదులు, యూదేతరులు అందరు ఒకేలా పాప బంధకాలలో ఉన్నారని మేము ముందుగానే చెప్పాము. లేఖనాల్లో ఈ విధంగా వ్రాయబడివున్నది, “నీతిమంతులు ఎవరూ లేరు, ఒక్కరు కూడా లేరు; గ్రహించగలినవారు ఒక్కరు కూడా లేరు; దేవుని వెదకేవారు ఒక్కరు కూడా లేరు. అందరు దారి తప్పిపోయారు, వారందరు కలిసి అప్రయోజకులయ్యారు; మంచిని చేసేవారు ఎవరూ లేరు, ఒక్కరు కూడా లేరు.” “వారి గొంతుకలు తెరచిన సమాధుల్లా ఉన్నాయి; వారి నాలుకలు మోసాన్ని అభ్యాసం చేస్తాయి.” “సర్పాల విషం వారి పెదవుల క్రింద ఉంది.” “వారి నోటి నిండా శపించడం విరోధం ఉన్నాయి.” “వారి పాదాలు రక్తాన్ని చిందించడానికి త్వరపడుతున్నాయి; నాశనం, దుఃఖం వారు వెళ్ళే మార్గాలకు గుర్తుగా ఉన్నాయి, శాంతి మార్గం వారికి తెలియదు.” “వారి కన్నులకు దేవుని భయం లేదు.”
రోమా 3:1-18 ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)
అలాగైతే యూదుల గొప్పతనం ఏమిటి? సున్నతి వలన ప్రయోజనం ఏమిటి? ప్రతి విషయంలో ఎక్కువే. మొదటిది, దేవుని వాక్కులు యూదులకే అప్పగించబడ్డాయి. కొందరు యూదులు నమ్మదగని వాళ్ళు అయినంత మాత్రాన దేవుడు నమ్మదగినవాడు కాకపోతాడా? కానేకాదు. “నీ మాటల్లో నీవు నీతిమంతుడుగా కనిపించడానికి, నీపై విచారణ జరిగినప్పుడు గెలవడానికి” అని రాసి ఉన్న ప్రకారం మనుషులంతా అబద్ధికులైనా సరే, దేవుడు మాత్రం సత్యవంతుడే. మన దుర్నీతి దేవుని న్యాయాన్ని వెల్లడి చేస్తున్నప్పటికీ కోపం చూపే దేవుడు అన్యాయం చేసేవాడని చెప్పాలా? నేను మానవ వ్యవహార రీతిలో మాట్లాడుతున్నాను. అలా కానే కాదు. అలాగైతే దేవుడు లోకానికి ఎలా తీర్పు తీరుస్తాడు? నా అబద్ధం ద్వారా దేవుని సత్యం విస్తరించి ఆయనకు మహిమ కలిగితే నేను పాపినని తీర్పు పొందడం ఎందుకు? మంచి జరగడం కోసం చెడు జరిగిద్దాం అని మేము బోధిస్తున్నామని ఇప్పటికే కొందరు మాపై నిందారోపణ చేసినట్టు మేము నిజంగానే ఆ ప్రకారం చెప్పవచ్చు కదా? వారి మీదికి వచ్చే శిక్ష న్యాయమైనదే. అలాగని మేము వారికంటే మంచివారమా? ఎంతమాత్రం కాదు. యూదులైనా, యూదేతరులైనా, అందరూ పాపం కింద ఉన్నారని ఇప్పటికే దోషారోపణ చేశాం కదా. దీని విషయంలో ఏమని రాసి ఉన్నదంటే, “నీతిమంతుడు లేడు, ఒక్కడు కూడా లేడు. గ్రహించేవాడెవడూ లేడు, దేవుణ్ణి వెదికే వాడెవడూ లేడు. అందరూ దారి తప్పిపోయారు, అందరూ ఏకంగా పనికిమాలినవారయ్యారు. మంచి జరిగించేవాడు లేడు, ఒక్కడు కూడా లేడు. వారి గొంతుక తెరచి ఉన్న సమాధిలాగా ఉంది. వారు నాలుకతో మోసం చేస్తూ ఉంటారు. వారి పెదవుల కింద పాము విషం ఉంది. వారి నోటినిండా శాపనార్ధాలు, పగ ఉన్నాయి. రక్తం చిందించడానికి వారి పాదాలు పరిగెడుతూ ఉన్నాయి. వారి మార్గాల్లో నాశనం, కష్టం ఉన్నాయి. వారికి శాంతిమార్గం తెలియదు. వారి దృష్టికి దేవుని భయం అంటే తెలియదు.”
రోమా 3:1-18 పవిత్ర బైబిల్ (TERV)
సున్నతి పొందినవాళ్ళలో ఏదైనా ప్రత్యేకత ఉందా? లేదు. మరి అలాంటప్పుడు యూదులుగా ఉండటంవల్ల వచ్చిన లాభమేమిటి? ఎంతో లాభం ఉంది. అన్నిటికన్నా ముఖ్యమేమిటంటే దేవుడు వాళ్ళకు తన సందేశాన్ని అప్పగించాడు. మరి వాళ్ళల్లో కొందరు నమ్మతగనివాళ్ళున్నంత మాత్రాన దేవుడు నమ్మతగనివాడని అనగలమా? అలా అనలేము. ప్రతి ఒక్కడూ అసత్యం చెప్పినా సరే, దేవుడు మాత్రం సత్యవంతుడుగా ఉంటాడు! ఈ విషయమై ఇలా వ్రాయబడి ఉంది: “నీవు మాట్లాడినప్పుడు నిజం చెప్పావని రుజువౌతుంది. నీపై విచారణ జరిగినప్పుడు నీవు గెలుస్తావు!” మనం అధర్మంగా ఉన్నాము కనుకనే దేవునిలో ఉన్న ధర్మం స్పష్టంగా కనిపిస్తోందంటే ఏమనగలము? దేవుడు మనల్ని శిక్షించి తప్పు చేస్తున్నాడనగలమా? నేను మానవ నైజం ప్రకారం తర్కిస్తున్నాను. ఎన్నటికీ కాదు. అలాగైనట్లైతే దేవుడు ప్రపంచంపై ఎలా తీర్పు చెప్పగలడు? “నేను అసత్యవంతునిగా ఉండటం వల్ల దేవుడు సత్యవంతుడనే కీర్తి పెరుగుతున్నట్లైతే, నేను పాపినని ఇంకా ఎందుకంటున్నారు? మంచి కలగటానికి మనం పాపంచేద్దాం” అని అనకూడదు. మేమీవిధంగా బోధించినట్లు కొందరు మమ్మల్ని నిందించి అవమానిస్తున్నారు. వాళ్ళకు తగిన శిక్ష లభిస్తుంది. మరి ఇంతకూ ఏమని నిర్ణయం చేద్దాం? మనం వాళ్ళకంటే ఉత్తమమైనవాళ్ళమనా? ఎన్నటికి కాదు. యూదులు, యూదులుకానివాళ్ళు, అందరూ సమానంగా పాపం చేసారు. దీన్ని నేనిదివరకే రుజువు చేసాను. ఈ విషయమై ఇలా వ్రాయబడి ఉంది: “నీతిమంతుడు లేడు. ఒక్కడు కూడా లేడు! అర్థం చేసుకొనేవాడొక్కడూ లేడు. దేవుణ్ణి అన్వేషించే వాడెవ్వడూ లేడు. అందరూ వెనక్కు తిరిగి వెళ్ళిపోయారు. అందరూ కలిసి పనికిరానివాళ్ళైపోయారు. మంచి చేసే వాడొక్కడూ లేడు. ఒక్కడు కూడా లేడు!” “వాళ్ళ నోళ్ళు తెరుచుకొన్న సమాధుల్లా ఉన్నాయి. వాళ్ళ నాలుకలు మోసాలు పలుకుతూ ఉంటాయి.” “వాళ్ళ పెదాలపై పాము విషం ఉంటుంది!” “వాళ్ళ నోటినిండా తిట్లూ, ద్వేషంతో కూడుకొన్న మాటలు ఉంటాయి!” “వాళ్ళ పాదాలు రక్తాన్ని చిందించటానికి తొందరపడ్తుంటాయి. వాళ్ళు తాము నడిచిన దారుల్లో వినాశనాన్ని, దుఃఖాన్ని వదులుతుంటారు. వాళ్ళకు శాంతి మార్గమేదో తెలియదు!” “వాళ్ళ కళ్ళలో దైవభీతి కనిపించదు.”
రోమా 3:1-18 Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం (OTSA)
అయితే యూదునిగా ఉండడం వల్ల ప్రయోజనమేమిటి? సున్నతిలో ఉన్న విలువేమిటి? ప్రతీ విషయంలోను ఎక్కువే! మొదటిగా, దేవుని మాటలు యూదులకు అప్పగించబడ్డాయి. వారిలో కొందరు అవిశ్వాసంగా ఉన్నంత మాత్రాన వారి అవిశ్వాసం దేవుని విశ్వసనీయతను నిరర్థకం చేస్తుందా? ఎన్నటికి కాదు; ప్రతి ఒక్క మనిషి అబద్ధికుడు కావచ్చు కాని దేవుడు సత్యవంతుడు. దేవుని గురించి లేఖనంలో ఇలా వ్రాయబడి ఉన్నది, “మాట్లాడినప్పుడు నీవు నీతిమంతుడవని నిరూపించబడతావు తీర్పు తీర్చునప్పుడు నీవు జయిస్తావు.” అయితే మన దుర్మార్గాన్ని బట్టి దేవుడు నీతిమంతుడని మరింత స్పష్టమవుతుంటే, మనమేమి చెప్పగలం? దేవుడు తన ఉగ్రతను మనమీద చూపితే ఆయన అన్యాయస్థులు అవుతారా? నేను మానవరీతిగా మాట్లాడుతున్నాను. ఖచ్చితంగా కాదు! ఒకవేళ అలా అయితే, దేవుడు లోకానికి ఎలా తీర్పు తీర్చగలరు? అయితే కొందరు, “ఒకవేళ నా అబద్ధం వలన దేవుని సత్యం వ్యాపించి ఆయనకు మహిమ కలిగితే నేను పాపిగా ఎందుకు తీర్పు తీర్చబడాలి?” అని వాదిస్తారు. “మంచి జరగడానికి చెడు చేద్దాం” అని మేము చెప్తున్నామని కొందరు దూషిస్తున్నట్లుగా మేమెందుకు చెప్పకూడదు? అలాంటి వారికి వచ్చే శిక్ష న్యాయమైనదే! అప్పుడు మనం ఏమని నిర్ధారించాలి? మనకు ఏమైనా ప్రయోజనం ఉందా? ఎంత మాత్రం లేదు! యూదులు, యూదేతరులు ఒకేలా పాప బంధకాలలో ఉన్నారని మేము ముందుగానే చెప్పాము. దీని గురించి లేఖనాల్లో ఈ విధంగా, “నీతిమంతులు ఎవరూ లేరు, ఒక్కరు కూడా లేరు; గ్రహించగలినవారు ఒక్కరు కూడా లేరు; దేవుని వెదకేవారు ఒక్కరు కూడా లేరు. అందరు దారి తప్పి చెడిపోయారు, వారందరు కలిసి అప్రయోజకులయ్యారు; మేలు చేసేవారు ఒక్కరు కూడా లేరు, ఒక్కరు కూడా లేరు.” “వారి గొంతుకలు తెరచిన సమాధుల్లా ఉన్నాయి; వారు నాలుకలతో మోసం చేస్తారు.” “వారి పెదవుల క్రింద సర్పాల విషం ఉంది.” “వారి నోటి నిండా శాపాలు, పగ ఉన్నాయి.” “వారి పాదాలు రక్తాన్ని చిందించడానికి త్వరపడుతున్నాయి; వారి మార్గాల్లో నాశనం, కష్టం ఉన్నాయి, సమాధాన మార్గం వారికి తెలియదు.” “వారి కళ్లలో దేవుని భయం లేదు.”