రోమా 3:1-18

రోమా 3:1-18 TCV

అయితే, యూదునిగా ఉండడం వలన ప్రయోజనమేమిటి, లేదా సున్నతిలో ఉన్న విలువేమిటి? ప్రతీ విషయంలోనూ అధికమే! మొదటిగా, దేవుని మాటలు యూదులకు అప్పగించబడ్డాయి. వారిలో కొందరు అవిశ్వాసంగా ఉంటే ఏంటి? వారి అవిశ్వాసం దేవుని విశ్వసనీయతను నిరర్థకం చేస్తుందా? ఎన్నటికి కాదు; ప్రతి ఒక్క మనిషి అబద్ధికుడు కావచ్చు గాని దేవుడు సత్యవంతుడు. దేవుని గురించి లేఖనంలో ఈ విధంగా వ్రాయబడివున్నది, “మాట్లాడినప్పుడు నీవు నీతిమంతుడవని నిరూపించబడతావు తీర్పు తీర్చునప్పుడు నీవు జయిస్తావు.” అయితే మన దుర్మార్గాన్ని బట్టి దేవుడు నీతిమంతుడని మరింత స్పష్టమవుతుంటే, మనమేమి చెప్పగలం? దేవుడు తన ఉగ్రతను మన మీద చూపితే ఆయన అన్యాయస్థుడు అవుతాడా? నేను మానవుల వాదన చెప్తున్నాను. ఖచ్చితంగా కాదు! ఒకవేళ అలా అయితే, దేవుడు లోకానికి ఎలా తీర్పు తీర్చగలడు? అయితే కొందరు, “ఒకవేళ నా అబద్ధం దేవుని యదార్థతను అధికం చేసినప్పుడు, ఆయన మహిమను పెంచినప్పుడు, నేను పాపిగా ఎందుకు తీర్పు తీర్చబడాలి?” అని వాదిస్తారు. “మంచి జరుగునట్లు చెడు చేద్దాం” అని కొందరు అపవాదుగా అన్నట్లుగా ఎందుకు అనకూడదు? అలాంటి వారికి తీర్చబడిన తీర్పు న్యాయమైనదే! అప్పుడు మనం ఏమని నిర్ధారించాలి? మనకు ఏమైనా ప్రయోజనం ఉందా? ఎంత మాత్రం లేదు! యూదులు, యూదేతరులు అందరు ఒకేలా పాప బంధకాలలో ఉన్నారని మేము ముందుగానే చెప్పాము. లేఖనాల్లో ఈ విధంగా వ్రాయబడివున్నది, “నీతిమంతులు ఎవరూ లేరు, ఒక్కరు కూడా లేరు; గ్రహించగలినవారు ఒక్కరు కూడా లేరు; దేవుని వెదకేవారు ఒక్కరు కూడా లేరు. అందరు దారి తప్పిపోయారు, వారందరు కలిసి అప్రయోజకులయ్యారు; మంచిని చేసేవారు ఎవరూ లేరు, ఒక్కరు కూడా లేరు.” “వారి గొంతుకలు తెరచిన సమాధుల్లా ఉన్నాయి; వారి నాలుకలు మోసాన్ని అభ్యాసం చేస్తాయి.” “సర్పాల విషం వారి పెదవుల క్రింద ఉంది.” “వారి నోటి నిండా శపించడం విరోధం ఉన్నాయి.” “వారి పాదాలు రక్తాన్ని చిందించడానికి త్వరపడుతున్నాయి; నాశనం, దుఃఖం వారు వెళ్ళే మార్గాలకు గుర్తుగా ఉన్నాయి, శాంతి మార్గం వారికి తెలియదు.” “వారి కన్నులకు దేవుని భయం లేదు.”

రోమా 3:1-18 కోసం వీడియో