రోమా 15:1-13
రోమా 15:1-13 తెలుగు సమకాలీన అనువాదము (TCV)
బలవంతులమైన మనం మనల్ని మనం సంతోషపరచుకోవడం కాక బలహీనులైన వారి దోషాలను భరించవలసినవారిగా ఉన్నాము మనలో ప్రతీ ఒక్కరు మన పొరుగువారు వృద్ధిచెందేలా, వారి మంచి కొరకు వారిని సంతోషపెట్టాలి. క్రీస్తు కూడా తనను తానే సంతోషపరచుకోలేదు కాని, “నిన్ను అవమానపరిచేవారి అవమానాలు నాపై పడ్డాయి” అని లేఖననాల్లో వ్రాయబడిన ప్రకారం ఆయన వాటిని అనుభవించారు. గతంలో వ్రాయబడిన సంగతులన్ని, లేఖనాల్లో బోధించబడిన ఓర్పు ద్వారా అవి ఇచ్చే ప్రోత్సాహాన్ని బట్టి మనం నిరీక్షణ కలిగి ఉండడం కొరకు మనకు బోధించడానికి వ్రాయబడ్డాయి. మన ప్రభువైన యేసు క్రీస్తు యొక్క తండ్రియైన దేవుణ్ణి మీరు ఒకే మనస్సుతో ఒకే స్వరంతో మహిమపరిచేలా, మనకు ఓర్పును ప్రోత్సాహాన్ని ఇస్తున్న దేవుడు క్రీస్తు యేసు కలిగివున్న మనోవైఖరి మనం ఒకరి పట్ల ఒకరం కలిగివుండేలా మనకు అనుగ్రహించును గాక. క్రీస్తు మిమ్మల్ని అంగీకరించినట్టుగా దేవునికి మహిమ కలిగేలా మీరు కూడా ఒకరిని ఒకరు అంగీకరించండి. దేవుని సత్యం పక్షాన క్రీస్తు యూదుల సేవకుడిగా మారాడు, తద్వారా పితరులకు ఇచ్చిన వాగ్దానాలు ధృవీకరించబడతాయి, అంతేకాక యూదేతరులు ఆయన కనికరాన్ని బట్టి దేవుణ్ణి మహిమపరుస్తారని నేను మీకు చెప్తున్నాను. దీని విషయమై లేఖనాల్లో ఇలా వ్రాయబడి వుంది: “కాబట్టి నేను నిన్ను యూదేతరుల మధ్యలో ఘనపరుస్తాను. నీ నామాన్ని గురించి స్తుతులు పాడతాను.” అలాగే మరొక చోట, “యూదులు కాని వారలారా, ఆయన ప్రజలతో కలిసి సంతోషించండి.” మరియొక చోట, “యూదులు కాని వారలారా, ప్రభువును మహిమపరచండి, ప్రజలందరు ఆయనను కీర్తించుదురు గాక.” మరోచోట యెషయా ఇలా చెప్పాడు, “యెష్షయి వేరు నుండి చిగురు వస్తుంది అంటే జనాల మీద రాజ్యం చేసేవాడు వస్తాడు, యూదేతరులంతా ఆయనలో నిరీక్షణ కలిగివుంటారు.” పరిశుద్ధాత్మ శక్తి చేత మీరు అత్యధికమైన నిరీక్షణను కలిగివుండేలా నిరీక్షణకర్తయైన దేవుడు, మీరు ఆయనలో నమ్మకముంచిన ప్రకారం మిమ్మల్ని సంతోషంతో సమాధానంతో నింపును గాక.
రోమా 15:1-13 ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)
కాబట్టి బలమైన విశ్వాసం కలిగిన మనం, మనలను మనమే సంతోషపెట్టుకోకుండా, విశ్వాసంలో బలహీనుల లోపాలను భరించాలి. మన సాటిమనిషికి క్షేమాభివృద్ధి కలిగేలా మనలో ప్రతివాడూ మంచి విషయాల్లో అతణ్ణి సంతోషపరచాలి. క్రీస్తు కూడా తనను తాను సంతోషపరచుకోలేదు. “నిన్ను నిందించే వారి నిందలు నా మీద పడ్డాయి” అని రాసి ఉన్నట్టు ఆయనకు జరిగింది. ఎందుకంటే, గతంలో రాసి ఉన్నవన్నీ మన ఉపదేశం కోసమే ఉన్నాయి. కారణం, ఓర్పు వలనా, దేవుని వాక్కులోని ఆదరణ వలనా, మనలో ఆశాభావం కలగడం కోసం. మీరు ఒకే మనసుతో ఏక స్వరంతో అందరూ కలిసి, మన ప్రభు యేసు క్రీస్తు తండ్రి అయిన దేవుణ్ణి మహిమ పరచడానికి, ఓర్పుకు, ఆదరణకు కర్త అయిన దేవుడు క్రీస్తు యేసును అనుసరించి మీ మధ్య ఐకమత్యం కలుగజేయు గాక. కాబట్టి క్రీస్తు మిమ్మల్ని ఎలాగైతే చేర్చుకున్నాడో అలాగే దేవునికి మహిమ కలిగేలా మీరు ఒకరిని ఒకడు చేర్చుకోండి. నేను చెప్పేదేమిటంటే పితరులకు చేసిన వాగ్దానాల విషయం దేవుడు సత్యవంతుడని నిరూపించడానికీ, యూదేతరులు దేవుని కనికరాన్ని బట్టి దేవుని మహిమపరచడానికీ క్రీస్తు సున్నతి గలవారికి సేవకుడయ్యాడు. దీని గురించి, “ఈ కారణం చేత యూదేతరుల్లో నేను నిన్ను స్తుతిస్తాను. నీ నామ సంకీర్తనం చేస్తాను” అని రాసి ఉంది. ఇంకా ఏమని ఉన్నదంటే, “యూదేతరులారా, ఆయన ప్రజలతో సంతోషించండి” అనీ, “యూదేతరులందరూ ప్రభువును స్తుతించండి. ప్రజలంతా ఆయనను కొనియాడతారు.” యెషయా ఇలా అన్నాడు, “యెష్షయిలో నుండి వేరు చిగురు యూదేతరులను ఏలడానికి వస్తాడు. ఆయనలో యూదేతరులు తమ నమ్మకం పెట్టుకుంటారు.” మీరు పరిశుద్ధాత్మ శక్తి ద్వారా, సమృద్ధి అయిన నిరీక్షణ కలిగి ఉండేలా నిరీక్షణకర్త అయిన దేవుడు పూర్తి ఆనందంతో, సమాధానంతో మిమ్మల్ని నింపు గాక.
రోమా 15:1-13 పవిత్ర బైబిల్ (TERV)
సంపూర్ణ విశ్వాసం గల మనము సంపూర్ణ విశ్వాసం లేనివాళ్ళ బలహీనతల్ని సహించాలి. మనం మన ఆనందం మాత్రమే చూసుకోకూడదు. ప్రతి వ్యక్తి తన సోదరుని మేలు కోసం, అభివృద్ధి కోసం అతనికి అనుగుణంగా నడుచుకోవాలి. క్రీస్తు కూడా తన ఆనందం మాత్రమే చూసుకోలేదు. దీన్ని గురించి ఈ విధంగా వ్రాసారు: “దేవా! నిన్ను అవమానించినవాళ్ళు నన్నూ అవమానించారు.” గతంలో వ్రాసిన లేఖనాలు మనకు బోధించటానికి వ్రాశారు. వాటి ద్వారా సహనము, ప్రోత్సాహము పొంది, రక్షణ లభిస్తుందన్న నమ్మకం మనలో కలగాలని దానిలోని ఉద్దేశ్యం. మనలో సహనము, ప్రోత్సాహము కలుగచేసే దేవుడు, యేసు క్రీస్తు ద్వారా మీ మధ్య ఐకమత్యము కలుగచేయునుగాక! అప్పుడు మనము ఒకే హృదయంతో, ఒకే నాలుకతో మన యేసు క్రీస్తు ప్రభువుకు తండ్రి అయినటువంటి దేవుణ్ణి స్తుతించగలుగుతాము. దేవునికి ఘనత కలగాలని క్రీస్తు మిమ్మల్ని అంగీకరించినట్లే మీరు కూడా ఇతర్లను అంగీకరించండి. మూలపురుషులకు దేవుడు చేసిన వాగ్దానాన్ని నిలబెట్టాలని, దేవుడు సత్యవంతుడని నిరూపించాలని, క్రీస్తు యూదుల సేవకుడు అయ్యాడు. యూదులు కానివాళ్ళు దేవుని అనుగ్రహం కోసం ఆయన్ని స్తుతించాలని క్రీస్తు ఉద్దేశ్యం. ఈ సందర్భాన్ని గురించి ఈ విధంగా వ్రాయబడి ఉంది: “ఈ కారణంగానే యూదులు కాని వాళ్ళతో కలిసి నిన్ను స్తుతిస్తాను. నీ పేరిట భక్తి గీతాలు పాడతాను.” మరొక చోట: “యూదులు కాని ప్రజలారా! మీరు కూడా దేవుని ప్రజలతో ఆనందించండి.” ఇంకొక చోట ఇలా వ్రాయబడి వుంది: “యూదులు కాని ప్రజలారా! ప్రభువును స్తుతించండి. ఆయన్ని స్తుతిస్తూ గీతాలు పాడండి!” యెషయా ఒక చోట ఈ విధంగా అన్నాడు: “యెష్షయి వంశ వృక్షం యొక్క వేరు చిగురిస్తుంది. ఆయన దేశాలను పాలిస్తాడు. యూదులు కానివాళ్ళు ఆయనలో నిరీక్షిస్తారు.” రక్షణ లభిస్తుందని నిరీక్షణ కలిగించే ఆ దేవుడు మీలో ఉన్న విశ్వాసం ద్వారా మీకు సంపూర్ణమైన ఆనందాన్ని, శాంతిని కలుగ చేయుగాక! అప్పుడు మీలో ఉన్న నిరీక్షణ పరిశుద్ధాత్మ శక్తి ద్వారా పొంగి పొర్లుతుంది.
రోమా 15:1-13 పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI) (TELUBSI)
కాగా బలవంతులమైన మనము, మనలను మనమే సంతోషపరచుకొనక, బలహీనుల దౌర్బల్యములను భరించుటకు బద్ధులమై యున్నాము. తన పొరుగువానికి క్షేమాభివృద్ధి కలుగునట్లు మనలో ప్రతివాడును మేలైన దానియందు అతనిని సంతోషపరచవలెను. క్రీస్తు కూడ తన్ను తాను సంతోషపరచుకొనలేదు గాని– నిన్ను నిందించువారి నిందలు నామీద పడెను. అని వ్రాయబడియున్నట్లు ఆయనకు సంభవించెను. ఏలయనగా ఓర్పువలనను, లేఖనములవలని ఆదరణవలనను మనకు నిరీక్షణ కలుగుటకై పూర్వమందు వ్రాయబడిన వన్నియు మనకు బోధ కలుగు నిమిత్తము వ్రాయబడి యున్నవి. మీరేకభావము గలవారై యేకగ్రీవముగా మన ప్రభువైన యేసుక్రీస్తు తండ్రియగు దేవుని మహిమ పరచు నిమిత్తము, క్రీస్తుయేసు చిత్తప్రకారము ఒకనితో నొకడు మనస్సు కలిసినవారై యుండునట్లు ఓర్పునకును ఆదరణకును కర్తయగు దేవుడు మీకు అనుగ్రహించును గాక. కాబట్టి క్రీస్తు మిమ్మును చేర్చుకొనిన ప్రకారము దేవునికి మహిమ కలుగునట్లు మీరును ఒకనినొకడు చేర్చు కొనుడి. నేను చెప్పునదేమనగా, పితరులకు చేయబడిన వాగ్దానముల విషయములో దేవుడు సత్యవంతుడని సాప్థిచుటకును, అన్యజనులు ఆయన కనికరమునుగూర్చి దేవుని మహిమపరచుటకును క్రీస్తు సున్నతి గలవారికి పరిచారకుడాయెను. అందు విషయమై– ఈ హేతువుచేతను అన్యజనులలో నేను నిన్ను స్తుతింతును; నీ నామసంకీర్తనము చేయుదును అని వ్రాయబడియున్నది. మరియు అన్యజనులారా, ఆయన ప్రజలతో సంతోషించుడి అనియు మరియు సమస్త అన్యజనులారా, ప్రభువు ను స్తుతించుడి సకల ప్రజలు ఆయనను కొనియాడుదురు గాక అనియు చెప్పియున్నది. మరియు యెషయా యీలాగు చెప్పుచున్నాడు– యెష్షయిలోనుండి వేరు చిగురు, అనగా అన్యజనుల నేలుటకు లేచువాడు వచ్చును; ఆయనయందు అన్యజనులు నిరీక్షణ యుంచుదురు. కాగా మీరు పరిశుద్ధాత్మశక్తి పొంది, విస్తారముగా నిరీక్షణ గలవారగుటకు నిరీక్షణకర్తయగు దేవుడు విశ్వాసము ద్వారా సమస్తానందముతోను సమాధానముతోను మిమ్మును నింపునుగాక.
రోమా 15:1-13 Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం (OTSA)
బలవంతులమైన మనం, మనల్ని మనం సంతోషపరచుకోవడం కాక బలహీనులైన వారి దోషాలను భరించవలసినవారిగా ఉన్నాము. మనలో ప్రతి ఒక్కరూ తన పొరుగువారు వృద్ధిచెందేలా, వారి మంచి కోసం వారిని సంతోషపెట్టాలి. క్రీస్తు కూడా తనను తానే సంతోషపరచుకోలేదు కాని, “నిన్ను అవమానపరిచేవారి అవమానాలు నాపై పడ్డాయి” అని లేఖననాల్లో వ్రాయబడిన ప్రకారం ఆయన వాటిని అనుభవించారు. గతంలో వ్రాయబడిన సంగతులన్ని, లేఖనాల్లో బోధించబడిన ఓర్పు ద్వారా అవి ఇచ్చే ప్రోత్సాహాన్ని బట్టి మనం నిరీక్షణ కలిగి ఉండడం కోసం మనకు బోధించడానికి వ్రాయబడ్డాయి. మన ప్రభువైన యేసు క్రీస్తు తండ్రియైన దేవున్ని మీరు ఒకే మనస్సుతో ఒకే స్వరంతో మహిమపరిచేలా, మనకు ఓర్పును ప్రోత్సాహాన్ని ఇస్తున్న దేవుడు క్రీస్తు యేసు కలిగి ఉన్న వైఖరి మనం ఒకరిపట్ల ఒకరం కలిగి ఉండేలా మనకు అనుగ్రహించును గాక. క్రీస్తు మిమ్మల్ని అంగీకరించినట్టుగా దేవునికి మహిమ కలిగేలా మీరు కూడా ఒకరిని ఒకరు అంగీకరించండి. పితరులకు ఇచ్చిన వాగ్దానాల విషయంలో దేవుడు సత్యవంతుడని నిరూపించడానికి, యూదేతరులు దేవుని కనికరాన్ని బట్టి ఆయనను మహిమపరచడానికి, క్రీస్తు యూదుల సేవకుడిగా మారారని నేను మీకు చెప్తున్నాను. దీని విషయమై లేఖనాల్లో ఇలా వ్రాయబడి ఉంది: “కాబట్టి నేను నిన్ను యూదేతరుల మధ్యలో ఘనపరుస్తాను. నీ నామాన్ని గురించి స్తుతులు పాడతాను.” అలాగే మరొక చోట, “యూదేతరులారా, ఆయన ప్రజలతో కలిసి సంతోషించండి.” మరియొక చోట, “యూదేతరులారా, ప్రభువును స్తుతించండి; సర్వ జనులు ఆయనను కీర్తించుదురు గాక.” మరోచోట యెషయా ఇలా చెప్పాడు, “యెష్షయి వేరు నుండి చిగురు వస్తుంది అంటే జనాల మీద రాజ్యం చేసేవాడు వస్తాడు, యూదేతరులంతా ఆయనలో నిరీక్షణ కలిగి ఉంటారు.” పరిశుద్ధాత్మ శక్తిచేత మీరు అత్యధికమైన నిరీక్షణను కలిగి ఉండేలా నిరీక్షణకర్తయైన దేవుడు, మీరు ఆయనలో నమ్మకముంచిన ప్రకారం మిమ్మల్ని సంతోషంతో సమాధానంతో నింపును గాక.