రోమా 10:8-15
రోమా 10:8-15 పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI) (TELUBSI)
అదేమని చెప్పుచున్నది? – వాక్యము నీయొద్దను, నీ నోటను నీ హృదయములోను ఉన్నది; అది మేము ప్రకటించు విశ్వాసవాక్యమే. అదేమనగా–యేసు ప్రభువని నీ నోటితో ఒప్పుకొని, దేవుడు మృతులలోనుండి ఆయనను లేపెనని నీ హృదయమందు విశ్వసించినయెడల, నీవు రక్షింపబడుదువు. ఏలయనగా నీతి కలుగునట్లు మనుష్యుడు హృదయములో విశ్వసించును, రక్షణ కలుగునట్లు నోటితో ఒప్పుకొనును. ఏమనగా, ఆయనయందు విశ్వాసముంచు వాడెవడును సిగ్గుపడడని లేఖనము చెప్పుచున్నది. యూదుడని గ్రీసు దేశస్థుడని భేదము లేదు; ఒక్క ప్రభువే అందరికి ప్రభువై యుండి, తనకు ప్రార్థనచేయువారందరియెడల కృప చూపుటకు ఐశ్వర్యవంతుడై యున్నాడు. ఎందుకనగా– ప్రభువు నామమునుబట్టి ప్రార్థనచేయు వాడెవడో వాడు రక్షింపబడును. వారు విశ్వసింపనివానికి ఎట్లు ప్రార్థన చేయుదురు? విననివానిని ఎట్లు విశ్వసించుదురు? ప్రకటించువాడులేకుండ వారెట్లు విందురు? ప్రకటించువారు పంప బడని యెడల ఎట్లు ప్రకటించుదురు? ఇందు విషయమై– ఉత్తమమైనవాటినిగూర్చిన సువార్త ప్రకటించువారి పాదములెంతో సుందరమైనవి అని వ్రాయబడి యున్నది
రోమా 10:8-15 తెలుగు సమకాలీన అనువాదము (TCV)
అయితే ఇది ఏమి చెప్తుంది? “వాక్యం మీకు దగ్గరగా ఉంది, అది మీ నోటిలో, మీ హృదయంలో ఉంది.” అది మేము ప్రకటిస్తున్న విశ్వాస వాక్యము. మీరు మీ నోటితో, “యేసు ప్రభువు” అని ఒప్పుకొని ప్రకటించి మీ హృదయాల్లో “దేవుడు ఆయనను మరణం నుండి లేపాడు” అని నమ్మితే మీరు రక్షించబడతారు. అంటే, మీరు మీ హృదయంలో నమ్మినప్పుడు నీతిమంతులుగా తీర్చబడతారు, మీరు మీ నోటితో మీ విశ్వాసాన్ని ఒప్పుకొన్నప్పుడు రక్షించబడతారు. “ఆయనలో నమ్మకముంచినవారు ఎన్నడు సిగ్గుపరచబడరు” అని లేఖనం చెప్తుంది. యూదులకు, యూదేతరులకు మధ్య తేడా ఏమి లేదు, ప్రభువు అందరికి ప్రభువే, ఆయనకు మొరపెట్టిన వారందరిని ఆయన సమృద్ధిగా దీవిస్తాడు. ఎందుకంటే, “ప్రభువు పేరట మొరపెట్టిన ప్రతి ఒక్కరూ రక్షింపబడతారు.” అయితే, వారు తాము నమ్మని వానికి ఎలా మొరపెడతారు? తాము విననివానిపై ఎలా నమ్ముతారు? వారికి ఎవరూ ప్రకటించకపోతే ఎలా వినగలరు? ప్రకటించేవారు పంపబడక పోతే ఎలా ప్రకటించగలరు? దీని కొరకు ఇలా వ్రాయబడినది: “సువార్తను తెచ్చేవారి పాదాలు ఎంతో అందమైనవి!”
రోమా 10:8-15 ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)
కానీ ఆ నీతి ఏమి చెబుతున్నదో చూడండి, “దేవుని వాక్కు మీకు దగ్గరగా, మీ నోటిలో, మీ హృదయంలో ఉంది.” మేము ప్రకటించే విశ్వాస సంబంధమైన వాక్కు కూడా ఇదే. అదేమంటే యేసును ప్రభువుగా నీ నోటితో ఒప్పుకుని, దేవుడు ఆయనను చనిపోయిన వారిలో నుండి సజీవంగా లేపాడని నీ హృదయంలో నమ్మితే, నీకు రక్షణ కలుగుతుంది. ఎలాగంటే మనిషి నీతి కోసం హృదయంలో నమ్ముతాడు, పాప విమోచన కోసం నోటితో ఒప్పుకుంటాడు. “ఆయనలో నమ్మకం ఉంచిన వారెవరూ సిగ్గుపడరు” అని దేవుని వాక్కు చెబుతున్నది. ఇందులో యూదులూ, గ్రీకులూ అనే వ్యత్యాసం లేదు. ఒక్క ప్రభువే అందరికీ ప్రభువు. ఆయన తనకు ప్రార్థన చేసే వారందరికీ కృప చూపగల సంపన్నుడు. ఎందుకంటే ప్రభువు నామంలో ప్రార్థన చేసే వారందరికీ పాపవిమోచన కలుగుతుంది. నమ్మని వాడికి వారు ఎలా ప్రార్థన చేస్తారు? తాము వినని వాడిపై ఎలా నమ్మకం పెట్టుకుంటారు? ఆయన్ని గురించి ప్రకటించేవాడు లేకుండా వారెలా వింటారు? ప్రకటించే వారిని పంపకపోతే ఎలా ప్రకటిస్తారు? దీన్ని గురించి, “శ్రేష్ఠమైన వాటిని గురించిన శుభ సమాచారం అందించే వారి పాదాలు ఎంతో అందమైనవి” అని రాసి ఉంది.
రోమా 10:8-15 పవిత్ర బైబిల్ (TERV)
మరి వాక్యమేమంటున్నది! “దైవసందేశం మీకు దగ్గరగా ఉంది. అది మీ నోటిలో ఉంది, మీ హృదయాల్లో ఉంది.” ఇది విశ్వాసానికి సంబంధించిన సందేశము. దీన్ని మేము ప్రకటిస్తున్నాము. యేసు, ప్రభువని మీ నోటితో బహిరంగంగా ఒప్పుకొని చనిపోయినవారిలో నుండి దేవుడాయన్ని బ్రతికించాడని మీ హృదయాల్లో విశ్వసిస్తే మీరు రక్షింపబడుతారు. ఎందుకంటే మనము, మన హృదయాలతో విశ్వసిస్తాము కనుక నీతిమంతులుగా పరిగణింపబడుతాము. నోటితో ఒప్పుకొంటాము కనుక రక్షణను పొందుతాము. లేఖనాల్లో ఈ విధంగా వ్రాసారు: “ఆయన్ని నమ్మినవానికి ఆశాభంగం కలుగదు.” యూదులకు, యూదులు కానివాళ్ళకు వ్యత్యాసం లేదు. ప్రభువు ఒక్కడే. ఆయనే అందరికి ప్రభువు. ఆయన, తనను ప్రార్థించిన వాళ్ళందరికీ అడిగినంత ఇస్తాడు. దీన్ని గురించి, “ప్రభువును ప్రార్థించిన ప్రతి ఒక్కడూ రక్షింపబడతాడు” అని వ్రాయబడి ఉంది. మరి, విశ్వసించకుండా ఎలా ప్రార్థించగలరు? ఆయన్ని గురించి వినకుండా వాళ్ళు ఆయన్ని ఏ విధంగా విశ్వసించగలరు? వాళ్ళకు ఎవరో ఒకరు చెప్పకుంటే వాళ్ళు ఏ విధంగా వినగలరు? ఎవరైనా పంపందే వాళ్ళు వచ్చి ఎలా చెపుతారు? దీన్ని గురించి ఈ విధంగా వ్రాసారు: “సువార్తను తెచ్చేవాళ్ళ పాదాలు ఎంత అందంగా ఉన్నాయి!”
రోమా 10:8-15 Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం (OTSA)
అయితే ఇది ఏమి చెప్తుంది? “వాక్యం మీకు దగ్గరగా ఉంది, అది మీ నోటిలో, మీ హృదయంలో ఉంది.” అది మేము ప్రకటిస్తున్న విశ్వాస వాక్యమే. మీరు మీ నోటితో “యేసు ప్రభువు” అని ఒప్పుకుని, మీ హృదయాల్లో “దేవుడు ఆయనను మరణం నుండి లేపాడు” అని నమ్మితే మీరు రక్షించబడతారు. అంటే, మీరు మీ హృదయంలో నమ్మినప్పుడు నీతిమంతులుగా తీర్చబడతారు. మీరు మీ నోటితో మీ విశ్వాసాన్ని ఒప్పుకున్నప్పుడు రక్షించబడతారు. “ఆయనలో నమ్మకం ఉంచేవారు ఎన్నడూ సిగ్గుపరచబడరు” అని లేఖనం చెప్తుంది. యూదులకు, యూదేతరులకు భేదం లేదు. ఒక్క ప్రభువే అందరికి ప్రభువై ఆయనకు మొరపెట్టిన వారందరిని ఆయన సమృద్ధిగా దీవిస్తాడు. ఎందుకంటే, “ప్రభువు పేరట మొరపెట్టిన ప్రతి ఒక్కరూ రక్షింపబడతారు.” అయితే, వారు తాము నమ్మని వానికి ఎలా మొరపెడతారు? తాము విననివానిని ఎలా నమ్ముతారు? వారికి ఎవరూ ప్రకటించకపోతే ఎలా వినగలరు? ప్రకటించేవారిని పంపకపోతే ఎలా ప్రకటించగలరు? దీని గురించి, “సువార్తను తెచ్చేవారి పాదాలు ఎంతో అందమైనవి!” అని వ్రాయబడి ఉంది.